వెన్నెలేరు

కథ

ఎం. ఆర్ అరుణకుమారి

“ఈ వేసంగి రానన్నా వస్తది గానీ మన ప్రానాలు  తోడేస్తుందత్తా! ” నీల భుజానికి ఉన్న బరువైన బట్టల మూటను కింద దబ్బుమని పడేస్తూ అంది. నడుం చుట్టూ దోపుకున్న కొంగు తీసి విదిల్చి మొహాన పట్టిన చెమట తుడుచుకొంది.
“అవునే కోడలా!  శివరాత్తిరి అట్టా  ఎళ్లిందో లేదో… ఇట్టా ఎండలు ముదిరిపోనాయి గాదూ!  అందుకే చీకటి కాడ్నే  రేవుకొచ్చేయాల! ఎండ పొద్దెక్కే యాలకు  బట్టలుతుకుడు అవగొట్టాల ” వెంకమ్మ తన బండ దగ్గర బట్టలు ఉతుకుతూ అంది.
“అంతే కాదత్తా!  వేసంగి లో ఉతుకుడు బట్టలు కూడా దండిగా పడతాయనీ”  మూట విప్పుతూ అంది నీల. “బళ్లకు సెలవలిస్తారు కదా!  సుట్టాలు, ఇంటి ఆడపడుచులు పిల్లా పీచుతో ….అమ్మగారిండ్లకు రావటాలూ ! పెద రెడ్డమ్మ ఇంటి నిండా  సుట్టాలే ! ఇదో ఈ బట్టలన్నీ  ఆల్లవే !   గుంజ లేక గూడలు గుల్ల బారుతుండాయనుకో!”  ఉసూరుమంది నీల.
” ఏం చేస్తామమ్మీ !  మన బతుకు రాత  అట్టా రాసినాడు మరి శివయ్య.”  నిర్లిప్తంగా అంది వెంకమ్మ.
“లోకాన  నువ్వొకతివే  గుంజుతుండావులే గూడలు పోయేనట్టు ! అంత బాదెందుకూ!  ఏ కలెట్టరు నో         మనువాడాల్సిందీ  మహారానీ గారు!”  అప్పుడే వచ్చిన సీనప్ప వెక్కిరింతగా అన్నాడు తన భుజం మీద నుండి మూట దించుతూ.
“ఓయబ్బా!  మా చెప్పొచ్చాడు కలెట్టరు. నువు చెప్పినా చెప్పకపోయినా మా పుట్టింట నేను రానీ  మాదిరే బతికినా!”  మూతి మూడు వంకర్లు తిప్పింది నీల .
“మల్లయితే నన్నెందుకు మనువాడినావే బాంఛోత్ ముండా!”  సీనప్ప చేతిలో బట్టలు కింద పడేసి వచ్చి నీల జుట్టు పట్టుకొని లాగాడు ఆవేశంగా .
“ఓలమ్మో!  ఓలమ్మో!  మాట మాటాడితే  సాలు కొట్టి కొట్టి  సంపేస్తాడు ముదనష్టపోడు!  నన్నీ మొరటోడి మొగాన యేసినాడు మా యబ్బ ”  నీల లబలబ లాడింది.
”  ఏందిరా సీనూ!  పొద్దస్తమానవూ  ఉప్పు… నిప్పు మల్లె దెబ్బలాటలేనట్రా! ” వెంకమ్మ గబగబా వచ్చి సీనప్ప చేతిలోనుండి నీల జుట్టు విడిపించింది మందలిస్తూ.  “ముందు బట్టల ఉతుకుడు  పని  సూడండి. సూరీడు ఎంత పొద్దుకు ఎగబాకినాడో చూసినారా?”
తమ తమ బండల దగ్గర బట్టలు ఉతుకుతున్న మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. రోజూ చచ్చే వాడికి ఏడ్చే వాడెవరన్నట్టుగా… దిన్నమూ ఉండే బాగోతమేగా అనుకున్నారు.
ఒకరివైపు ఒకరు చూపుల కారాలు మిరియాలు నూరు కుంటూ బట్టలుతికే పనిలో పడ్డారు సీనప్ప, నీల.
పొద్దున్నే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో సద్ది తాగి …వాడుక ఇండ్ల దగ్గరకు వెళ్లి బట్టలు తీసుకోవడం, చాకిబండ కు వెళ్లి ఉతికి ఆరేసాక… తెచ్చుకున్న అన్నంలోకి ఇండ్ల దగ్గర బట్టలతో పాటు తెచ్చుకున్న కూరో.. పచ్చడో వేసుకుని తినడం… కాసేపు చెట్ల కింద సేద తీరి బట్టలన్నీ  తీసి మడతలేస్తూ  ఉతుకుడివి, ఇస్త్రీ చేసేటివి వేరు వేరుగా  మూటలు కట్టుకోవటం చేస్తారు .ఇస్త్రీ చేయాల్సిన బట్టలు తీసుకొని సీనప్ప ఇంటికి వెళతాడు.  ఉతికుడు బట్టలు తీసుకొని నీల ఇండ్ల దగ్గరకు వెళ్లి ఎవరివి  వాళ్లకు ఇచ్చేసి వస్తుంది.
మునిమాపు వేళ పెద్ద దబరా పట్టుకుని నీల అత్త వాడుక ఇళ్ళ దగ్గరకు వెళ్లి అన్నం ,కూరలు తెస్తుంది. ఓపిక ఉన్నంతవరకు మామ కొన్ని బట్టలు ఇస్త్రీ చేస్తాడు. మిగిలినవి, గంజి పెట్టినవి సీనప్ప, నీల  కలిసి చేసి …పొద్దున్నే వెళ్లి అవి ఇచ్చేసి ఉతుకుడు బట్టలు తెచ్చుకుంటారు.
” రెడ్డమ్మ గోరూ!  బట్టలు తెచ్చినా!”  అరుగుమీద బట్టల మూట దించుతూ గట్టిగా కేకేసింది నీల.
” ఇదిగో.. వస్తున్నా!”  పెదరెడ్డెమ్మ ఇంట్లో నుండి వచ్చింది.
” పిల్లలు వస్తే పనులే తెమలవు కదా!  ఇవాళ నువ్వే దండ కట్టేసుకోవే!”  కాగితంలో పొట్లం కట్టుకుని వచ్చిన మల్లెపూలు ఇచ్చింది.
నీలకు పూలంటే ఇష్టమని… పూలు  పూసినన్ని రోజులూ….మల్లెలో …సన్నజాజులో… రోజూ దండ కట్టి  ఇస్తుంది నీలకు పెద్ద రెడ్డమ్మ.  ఆమెకు నీల నల్లటి పొడవాటి జడ అంటే చాలా ఇష్టం .
“మందార నూనెలు,  శీకాయలు,  కుంకుళ్ళూ… ఎన్ని వాడినా మా పిల్లల జుట్టు నీలాగా ఒత్తుగా, పొడవుగా పెరగదే!  అయినా  ముసల్దాన్లా ఎప్పుడూ ఆ కొప్పేమిటే? ఎంచక్కా జడేస్కొని  పూలు పెట్టుకో.”  అంది అమ్మలా ఆప్యాయంగా.
” సరేనమ్మ గోరూ”  అన్నపూర్ణమ్మ ప్రసాదంలా రెండు చేతులతో పూల పొట్లం అందుకని భద్రంగా కొంగు మడతల్లో పెట్టుకొని కొంగు చివరలు నడుములో దోపుకొంది నీల.
ఇంటికి రాగానే ఆ పూలను ఓ చిన్న గుడ్డముక్కలో మూటగట్టి నీళ్లు చల్లింది . భోజనాలు.. పనంతా ముగించుకుని.. సీనప్ప ,నీల కృష్ణమ్మ ఒడ్డుకు చేరారు .అది పున్నమి కానీ అమావాస్య కానీ ప్రతిరేయి కృష్ణమ్మ దగ్గరకు వెళ్లాల్సిందే. కృష్ణమ్మ నుండి తేలి వచ్చే చల్లని గాలుల సేద తీరుతూ ఊసులాడుకోవాల్సిందే.
ఆ రోజు శుక్రవారమని తల స్నానం చేసింది నీల. ఒత్తుగా ఉన్న వెంట్రుకలు తడి ఆరాలని జడ అల్లకుండా చివర ముడేసి వదిలేసింది. గాలికి ఆమె జుట్టు కృష్ణవేణమ్మ అలల్లా గాలికి అలల్లాడుతోంది .
ఇసుకలో కూర్చొని పూల గుడ్డ మూట విప్పింది. విచ్చిన మల్లెల గుబాళింపులు గుప్పుమన్నాయి. ఒక్కొక్క పువ్వే తీసి జంటగా చేసి దండ కడుతోంది నీల.
“ఇన్ని పూలల్లో ఏ పువ్వు ఏ పువ్వుకు జత పడాలని రాసిపెట్టుంటాదో…ఆ పువ్వే  చేతికందుతాది కదా మావా!”
”  అంతే కదా మరి!” ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకున్న సీనప్ప కొన్ని పువ్వులు తీసి ఆమె తలపై వేస్తూ నవ్వాడు మురిపంగా చూస్తూ.
” ఉండు మావా! దండ కట్టనీ!”  ముద్దుగా అంది నీల ముసి ముసి గా నవ్వుతూ.
” దండగా ఉన్నా.. విడిగా ఉన్నా ..పూలన్నీ మన కోసమే కాదుటే! ”  సీనప్ప గట్టిగా వాటేసుకున్నాడు నీలను ఆగలేనట్లు.
గాలే దూరని వాళ్ల కౌగిలిలో మల్లెపూలు నలిగిపోతూ మరింత పరిమళాలు వెదజల్లుతూ నీల నవ్వులా  కిలకిల మంటున్నాయి.
ఉదయం వాళ్ల కీచులాటల కసుర్లు ఇంకా తన దగ్గరే ఉండటం గమనించి వాటి నెత్తిన మొట్టుతూ, పద పదమని తోసేస్తూ… పౌర్ణమి వెన్నెల నీటి తరగల మీద పడి చల్లగా తెల్లగా తళతళలాడే వెన్నెలేరు గా మారిపోతూ గ సాగుతోంది కృష్ణమ్మ .
“భార్యాభర్తల బంధం అంటే ఇది కాదూ”  అన్నట్లుగా శివాలయం ధ్వజస్తంభం చిరుగంటలు దీవిస్తున్నట్లు సందడి చేస్తున్నాయి.

Written by Aruna kumari

యం.ఆర్.అరుణకుమారి
BMR APARTMENTS
FLAT NO. 502
BMR GARDENS
GANGANAPALLI
CHITTOOR-517004
ఫోన్ 8121523835

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రభాత కమలం

నెలసరి సెలవులు