
మనిషి భూమి మీద పడినప్పటినుంచి చేసే ఎన్నో సంస్కారాలు ఉన్నాయి మన సంస్కృతిలో. అవి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా సాగుతూ ఉంటాయి. ఉదాహరణకి బారసాల, నామకరణం, పుట్టినరోజు, అక్షరాభ్యాసం, కొందరికి ఉపనయనం లాంటి సంస్కారాలు చేస్తూ ఉంటారు. అందులో యుక్త వయస్సు వచ్చేటప్పటికి చేసేది వివాహం లేత పెండ్లి. పై సంస్కారాలు అవన్నీ వారి ఒక్కరికే జరుగుతాయి. కానీ పెండ్లి అనేసరికి జండర్ మార్పుతో అబ్బాయి అయితే అమ్మాయి తోను, అమ్మాయి అయితే అబ్బాయితోను మానసికంగానూ,శారీరకంగానూ కలపడం. వారి ద్వారా వంశాభివృద్ధి చేసుకోవడం ఇది ప్రక్రియ. దీని ద్వారా వారిద్దరి మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. అటవీకుల నుండి నాగరికుల వరకు ఈ వివాహ వ్యవస్థ జరుగుతూనే ఉంది. మతాలు వేరైనా, భాషలు వేరైనా, ఖండాలు వేరైనా పెళ్లికి కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే వివాహం అనేది ఒక సాంస్కృతికంగా, సర్వజనికమైన కార్యం.
మ్యారేజ్ అని , షాదీ అని , వివాహము అని ఒక్కొక్క భాషకు ఒక పేరు ఉంది దీనికి. నిజానికి ఒక ఆడ మగను చివరి వరకు కలిసి జీవించటానికి చేసిన ఏర్పాటు. మన జీవిత గమనంలో మనకు అత్యవసర సహకారం కావలసిన స్థితులు చాలా ఉన్నాయి. పెళ్లి ఉత్సవం కాదు ఒక తోడు కోసం. బంధువులు,స్నేహితులు, ఆఖరికి తోడబుట్టిన వారైనా అన్నివేళలా మనతో కలిసి ఉండలేరు కదా… ఎదిగిన తర్వాత ఎవరి జీవితాలు వారివి. అప్పుడు కూడా ఉండేది భాగస్వామి మాత్రమే. అందుకే” లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కమిట్మెంట్స్ ఉండవు ” ప్రేమ,బాధ్యత మాత్రమే. అన్నిచోట్ల ఒకే ప్రామాణిక వివాహ వేడుక లేదు. ప్రాంతీయ వైవిధ్యం, కుటుంబ సాంప్రదాయాలు, కుటుంబ వనరులు వీటి మీద ఆధారపడి ఉంటాయి. ముస్లిం మతాచారం ప్రకారము పెద్దల మధ్య వివాహం ఒక ఒప్పంద రూపంలో ఉంటుంది. తర్వాత నిఖా చేస్తారు అది స్త్రీ పురుషుల మధ్య మత సమ్మతి పొందిన ఒక ఒప్పందం. సంతానోత్పత్తి, సంతానాన్ని చట్టబద్ధం చేయడం వివాహలక్ష్యంగా ముస్లింలు భావిస్తారు. ఇక క్రైస్తవ వివాహం వారికి అన్ని విషయాల కంటే “ఘనమైనది” అని బైబిల్– హెబ్రీయుల పుస్తకంలో 13వ అధ్యాయం నాలుగో వచనం గా వ్రాయబడింది.
ఇక హిందూ వివాహ వ్యవస్థ గురించి చర్చించుకుందాం :– మన సనాతన ధర్మం ప్రకారం వివాహం అనేది ధర్మ( కర్తవ్యం) అర్థ( సంపదలు) కామ ( భౌతిక మరియు ఇతర కోరికలు ) మరియు మోక్షము ( శాశ్వత ముక్తి )లను ఒక్కరిగా కొనసాగించే కట్టుబాట్లతో కూడిన పురుషుల మరియు స్త్రీల మధ్య కలయిక. ఈ నాలుగు దశల యందు ఒకరికొకరు సహాయకులై దంపతులు నిలవాలి అని అగ్నిసాక్షిగా వివాహం జరిపిస్తారు. మనుస్మృతి ప్రకారము హైందవ సమాజంలో 8 రకాల వివాహాలు ఉన్నాయి1 బ్రహ్మ వివాహం 2 దైవ వివాహం3 ఆర్ష వివాహం 4 ప్రజాపత్య వివాహం 5 గాంధర్వ వివాహం6 అసుర వివాహం 7 రాక్షస వివాహం 8 పైశాచిక వివాహం.కాలానుసారం వీటిలోచాలావరకు మరుగున పడిపోయాయి.
ఇప్పుడు కొద్దిగా ఆ 8 వివాహాల గురించి తెలుసుకుందాం
1 బ్రహ్మ వివాహం :– ప్రతిఫలం రహితంగా వేదం చదివిన సచ్చీలుని పూజించి కన్యాదానం చేయడం
2 దైవ వివాహం:– యజ్ఞయాగాదులను జరిపించిన రుతు క్వినికి( పురోహితుని) ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యను దానం చేయండం
3 ఆర్య వివాహం :– కొన్ని ఉపకరణాలుగా ఒక జత ఆవు- ఎద్దులను వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేయడం
4 ప్రజాపత్య వివాహం :– మీరిద్దరూ కలిసి ధర్మాచరణ చేయండని వరుని పూజించి కన్యాదానం చేయడం ( వంశాభివృద్ధికి చేసే వివాహం )
5 ఆసుర వివాహం :– వరుడు కన్యకు తన శక్తి మేరకు డబ్బు ఇచ్చి వివాహం చేసుకుంటే అది ఆసుర వివాహం ( కన్యాశుల్కం)
6 గాంధర్వ వివాహం :– పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకోవడం( ప్రేమ వివాహం )
7 రాక్షస వివాహం :– బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకోవడం
8 పైశాచిక వివాహం:– నిద్రలో ఉన్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో రహస్యంగా సంగమించి ఆపై వివాహమాడటం.
ఈ పద్ధతేలే కాక స్వయంవర పద్ధతి కూడా ఉండేది. వచ్చిన రాజులలో తనకిష్టమైన వారిని వరించడం. సీతారాముల కళ్యాణం,, దమయంతి స్వయంవరం, ద్రౌపతి స్వయంవరం అలాంటివే
మన వివాహాలలో పెద్దలు కుదిర్చి చేసేవే ఎక్కువ. వారు అనుభవజ్ఞులు కనుక, పిల్లల మీద ఎంతో ప్రేమ అనురాగాలు ఉంటాయి కనుక ఒకటికి పది సార్లు ఆలోచించి సంబంధాలు కుదిరిచ్చే వారు. అటు తరాలను,ఇటు తరాలను కూడా పరిశీలించుకునేవారు. వారు చేసినట్లుగానే ఆ వివాహాలు సుస్థిరంగా ఉండేవి. ఏవో కొన్ని తప్ప…. నేడు భారతీయ సమాజం మొత్తం సంస్కృతి సాంప్రదాయాలను వదిలి లౌకిక స్థితికి మారుతోంది. డబ్బే అన్నిటికీ ప్రధాన లక్ష్యంగా మారినాయి రోజులు. దీనివలన వైవాహిక జీవితాల్లో స్థిరత్వం లోపిస్తోంది . అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రేమ పెళ్లిళ్లు,కులాంతర వివాహాలు ఎక్కువైపోయాయి. నేడు భార్యాభర్తలిద్దరూ విద్యాధికులు అవటం వలన ఈగో సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీని వలన వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎవరో ఒకరు తగ్గటం జీవితం సాఫీగా సాగడానికి పునాది వంటిది. క్షణిక మైన ఆవేశాలు కాస్త తగ్గించుకుని,సమస్యకు పూర్వపరాలు ఆలోచించుకుని, మంచి చెడ్డలు తెలుసుకోవాలి.
పూర్వం రోజుల్లో ఎవరు ఏ స్థాయిలో బతికినా ఇతరులతో పోల్చుకునే మనస్తత్వాలు ఉండేవి కావు. నేడు అన్నిటికీ పోటీయే. దానికి తోడు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. సంపాదనలు ఎక్కువ. ఆశలు కూడా గుర్రాలై పరిగెడు తున్నాయి. దానితో సుఖం మాట దేవుడెరుగు మానసిక సంఘర్షణలు ఎక్కువైపోయాయి.. అత్యాశలకు డాంబికాలకు అలవాటు పడిపోతున్నారు. ప్రాదేశిక పరిస్థితులను బట్టి తిండి బట్ట నివాసాలలో ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మనకి తగినవి మనం అనుసరించాలి.అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఆర్థికంగానూ,ఆరోగ్యపరంగారు కుటుంబ విషయంలో భార్యాభర్తలిద్దరూ ముందు చూపు కలిగి ఉండాలి. కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ లేని రోజుల్లో దగ్గర సంబందాలనే చేసుకునేవారు. నేడు ‘మ్యాట్రిమోనియల్స్” వచ్చి వధూవరుల వెతుకులాట సులభతరం చేశాయి. వాటి యందు కూడా మంచి చెడులు చూసుకోవాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది.
ప్రేమ యవ్వన దశలో ఆపోజిట్ జండర్ మధ్య జరిగే ఒక రసాయనిక చర్య యొక్క ప్రకంపన మాత్రమే. ఇది మన పెద్దలకి తెలుసు. అందుకే యవ్వనవయసులో ఎక్కువ జాగ్రత్తలు చెప్పేవారు. నేడు ప్రపంచం ఒక కుగ్రామం అవడంతో వేషభాషలలో కూడాచాలా మార్పులు చోటు చేసుకుంటున్నా. కానీ ఒకటి గమనించండి. ఆయా దేశాల శీతోష్ణస్థితులను బట్టి వారి వేషభాషలందు, ఆహార విహారాలందు మార్పులు ఉంటాయి. అది అన్నివేళలా అందరికీ నప్పవు సంస్కృతల పరంగా కూడా.” పులిని చూసి నక్క వాత పెట్టుకున్న ‘వైనంలా ఉంటుంది. నేడు విదేశీ పోకడలైన డేటింగ్,సహజీవనం,పబ్బు కల్చర్ ఎక్కువైపోయి యువతి యువకులు తప్పు త్రోవ పడుతున్నారు. అందులో ఫెయిల్ అయితే ఆ జంట డడిప్రెషన్ కి లోనవ్వడమో, ఆత్మహత్యలకు పాల్పడం చేస్తున్నారు. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్లను అనాధలను చేస్తున్నారు. విడాకులు తీసుకుని విడిపోయినా కూడా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది. తల్లితండ్రుల ప్రేమకుదూరమై డిప్రెస్ అవడంమేకాక తిరుగుబాటుదారుడిగా నైనా తయారవుతాడు. అదే అర్జునుడు గీతలో కూడా చెప్తాడు.
విద్యావంతులైన ఓ యువతి యువకుల్లారా…. అనుభవజ్ఞులైన మీ తల్లిదండ్రుల మాటలును వినండి లేక మీ విజ్ఞతతో మీరే అనాలసిస్ చేసుకోండి, లేదా కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళండి. మీకు మీరే నిర్ణయాలు తీసుకోవద్దు వివాహ విషయంలో. అది నూరేళ్లపంట. ఎవరినో చూసి పోల్చుకోవద్దు. ఎవరి జీవితం ఒకేలా ఉండదు. ఎక్కడో ఒకచోట చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. అక్కడితో ఆగిపోవద్దు. వెతికితే బయటపడే మార్గం దొరుకుతుంది. దాని కాస్త ఓరిమి , ఓపిక అవసరం. మనకి జీవితం ఎవరితో గడపాలో ఆ సృష్టికర్త ముందే రాసి ఉంచాడు. అందుకే” marriages made in heaven”, అని పాశ్చాత్య దేశస్థులు కూడా తలవంచారు. పెద్దలు కుదిర్చిన లేక మీకు నచ్చిన యువతిని కానీ యువకుని కానీ స్వీకరించి లోపాలుంటే సవరించుకుంటూ, సర్దుకుపోతూ జీవితాన్ని గడపండి. ” తా వలచింది రంభ లేక ప్రవరాఖ్యుడు” అని మనస్ఫూర్తిగా అనుకోండి. ఈ జీవితాలు శాశ్వతం కాదు కదా. మనకు తెలియకుండానే సగం జీవితం నిద్రలో గడిచిపోతుంది. మిగిలిన సగ జీవితం మన చేతిలోనే ఉంది. జాగ్రత్తగా వాడుకోండి.