విలువ

సుష్మాశ్రీనివాస్.మెరుగు

గీసందెందుకొ మాయింటి మీద జీవ్వడ్డది…
“మస్తు రొజులైతుంది ఒకపారి ఒచ్చిపొ అవ్వ’… అని మా అమ్మ….
ఇల్లంత శీకటి శీకటి ఐతుంది … ఎప్పుడొస్తవవ్వా … మా బాపు…
యేమన్నగాని… గీసారి ఇంటిక్వోవాలని తీర్కజెస్కొన్మరి వొయ్న.
గూటిక్వోతనన్న ముర్పెంల నిద్ర గూడవట్టలే సక్కగ…
ఎప్పట్లెక్కనే పొద్దుగల్లనే లేష్నా…. గిన్ని పాలబోట్లు దాగి బైలెల్లిన.
ఎర్రబాసెక్కుడే ఎర్కలేదు మా బాపే తోల్కపోతుండే.. బండి మీద..
యేం శితం జనం….
ఉష్కెవోస్త రాల్నంత మంది..!!! యిండ్లల్ల ఓల్లుంటలేరా అన్పిచ్చింది….
గప్పట్ల చర్చికి వోయ్నప్పుడు జూష్నది యాదికోచ్చింది.
‌‌గీ ఫ్రీ బస్సు పుణ్యమేందో గానీ… ” స్త్రీలను గౌరవించాలి ” అన్నమాటకే కర్వైపోయింది…

యెట్లనో గట్ల తిప్పల్వడి మా పల్లెకు జెర్కున్న…. అమ్మయ్య…!!! పానమేంత నిమ్మలమైందో…
అచ్ఛేటప్పట్సంది బస్సు దిగకముందె మా బాపు ఫోన్ల మీద ఫోన్లు జేస్తుండు…. నేనెక్కిచ్కస్తనవ్వా….. ఏం నడుస్తవని…! నేన్జెప్పలే ఇగ, మస్తు రొజులైంది గట్ల గట్ల శేన్లల్లకెంచి సూస్కుంటొద్దామని ఇక్మత్ జేశ్న…!
……గిది మావూరేనా….!!? పక్కూర్ల దిగిన్న…?!!
గిదేందీ గిట్లుంది…
బండి దిగంగనె శెట్లన్నీ ఆర్తిచ్చినట్లన్పిచ్చు….గిడ కాన్గ శెట్లు, బూర్గుబుడ్ల శెట్లు ఉంటుండే… ఎవ్వి గన్పిస్తలే… కొట్టేశ్నట్టున్రు…. గప్పట్ల ఉస్కూల్కేంచి ఒస్తుంటే గా బూర్గు బుడ్డెలు ఎర్కోని మంచిగ ఎండవెట్టి , ఎల్దుర్తి ల లచ్చింపతి దుకాన్ల అమ్ముతుంటిమి…. షేటాక్కు ఐదు రూపాలిస్తుండే… గవ్వే గల్లగుర్గిలల్ల ఎస్కోని పైసల్ జమాజేసుకుంటుట్టిమి.
…..మస్తెండ
గొడుతుంది..బాపుకు జెప్పిన అయిపోవు అన్పిచ్చింది.
“నిండ మున్గినంక సలేంది’…. ఓచ్చిన ఒడ్షిపోయింది.. గీయింత దూరం నడ్వలేనా…
శిన్నగున్నప్పుడు నాకంటె బర్వుండే బ్యాగేస్కొని ఇస్కుల్కు గింత కంటె ఎక్వ దూరమే నడ్షి పోతుంటిమి గిదెంత…!!
గొర్ల కొట్టాలు దాటంగనె….మా మామొల్ల పొలము…,ఆడనే కోల్ల పారముంటుందే మాడి శెట్టుంటుండే….,
పారముంది గని మాడి శెట్టు లేదు.. అయ్య!!..గది గూడ కొట్టేశిన్రా….
మాడితొక్కు ఎట్ల పెట్కుంటున్నరో యెమొమరి.. పిఠాన పిరమునయీడ్కె బైట!!
ఒక్క పిట్ట కానోస్తలే.. కాకులు గూడ లేవు… గూల్లల్ల వన్నయేమో తియ్ ఎండమస్తు కొడ్తుంది…
కుస్తోల్లిండ్లల్లకచ్చిన…. మా తాతోలిల్లొచ్చింది గాళ్లనట్కాంచి మా ఆడకట్టుకు జెర్కున్న ఇగ….
మా శిన్నమ్మ… మయింటిపొంటి అత్తమ్మ అందర్గుసోని బీడీలు జేస్తుండ్రు…
“గిప్పుడే ఆస్తున్నవా… ఎట్లున్నవు.. ” యేమమ్మ గట్ల ఒట్టిశాపోలయినవు… కూడు సక్కగ తింటలేవా’…?? అనుకుంట అడిగిన్రు .. ఇంకిత సేపుంటే మల్లేడ లగ్గం గిగ్గం అనంటరేమొనని జెల్ది ఇంట్లక్వొయ్న!!!!
” మావ్వ రానే ఓచ్చింది… మావ్వ మావ్వ…!!! ఎండలోచ్చినవు…. షెప్పొద్దావ్వా….?!!నేనస్తుంటి గదా….
“ఓచ్చిన గదనే…! నాక్మనూరు దెల్వకనా…
యేమ్మా …?!! అనిగ మామ్మను మా బాపు ను మస్తుగ్గగాలిచ్చకున్న…
యెప్పుడెల్లినవో… బుక్కేడు మెత్కులు ఎస్కున్నవొ లేదో… నీకిష్టమని పప్షార్వెట్టిన ‘
ఇగ ఇంట్లక్వోయి కాల్జెతులు గడ్కొని పప్షార్తొటి ఇన్ని మెత్కులల్లిన…
తిని గట్ల ఒర్గిన .. గప్పుడే నా సప్పుడిని మా పెద్దమ్మొచ్చింది… మా పెద్దయ్యకు… పెద్దమ్మకు..మస్తిష్టం నెను… పానం జేస్తరు నన్ను…
ఇగ సాయింత్రం ఆలు కల్లు తెచ్చుకుండ్రు… తాగుతున్నరు సీరియల్ జూస్కుంటా…
“మా పెద్దమ్మంటుంది..
“గిప్పుడు గింత షానిగున్నవు గని.. నువ్వు శిన్నగన్నప్పుడు కప్పను పట్కొని పిస్కుటుంటివి.. బాపులతోనే కల్దుకాన్లకు వోతుంటివి..బజ్జీలు ఇప్పిచ్చేదాకా ఊకుంటుట్వ బిడ్డా…..
ఆన్కుంట నౌతుండ్రు….!!

అంబటాళ్లకు లేష్న… మంచిగ… అమ్మగూడ లేపలే…
లేవంగనే బంగ్లమీద్కి వోయి తిర్గుకుంట పండ్లు తోముకుంటున్న …
మెట్లెక్కంగనే… సక్కగ సూస్తే.. మా మల్లన్న గుట్ట కన్పిస్తది… పక్కకే శేన్లు ఉంటయి…
మంచిగ పిట్టల సప్పుడ్కే లేస్తుండే…. గిప్పుడు ఒక్క పిట్టె కానొస్తలే…
బాపు పొలం కాడికి పొయ్యోస్తా అన్నడు…
నెంగూడ ఒస్తాని బోయ్న…
మా బాయికాడికి పోతుంటే రెండు కొబ్బరిశెట్లుంటుండే ఒక్కొపారి గా బొండాలు కొట్కొని పోతుంటిమి… గాడా బీడుంటుండే గిప్పుడాడా నాట్లేశినరు…
మా బాయి పక్కకే మా శెను..మాది పొత్తుల బూమి…. మాగమామసకు ఒంటలక్వోతుంటిమి ఆడ్కే …
మాబర్రెలు గట్టేశే కాన్గ
శెట్టుకుయ్యాల కట్కున్నము…అదింక గట్లనే ఉంది….
మా శేన్లల్లకు పోతుంటే మస్తు శెట్లుంటుండే… గవన్నీ లేనేలేవ్…
గప్పట్ల పొలం కాడికి పోవాల్నంటె‌మస్తు బుగులైతుండే …పాములు…ముంగీసలు పారం కాడ
కుక్కలుంటుండే…
మస్తు పిట్టెలుంటుండే
యేమన్నా ఒరిల శిన్న పుర్గు పుట్రున్నా గవ్వే తింటుండే…
గిప్పుడట్ల లేనట్లుంది…
…గప్పుడే మా బాపొచ్చిండు…
” యేముందవ్వ మా నాయ్ననలందరున్నప్డే మంచిగుండే…
ఎవుసం నమ్ముకుంటే ఎమస్తుందని.. గందుకే అందర్వోయిండ్రు…
మనమే ఐదిండ్లోల్లమ్ మిగ్లినం…
ఔమరి…. గప్పుడే మంచిగుంటుండే…
మంచిగ సేంద్రియ ఎర్వులెస్కొని పండించుకున్నోళ్లే మంచిగుండే.. పంట మంచిగొస్తుండే…. గిప్పుడన్ని… గా మందు సంచులేనాయే…. ఏమేమో స్ప్రే లు కొట్టవట్టే…..దాన్కి తోడు గీ ఫైజీ నెట్వర్కులంట… అవ్విటి రెడియేషనూ… పిట్టెల పాణం దీశే… ఇగ పంటేడిది పక్కులేడియి…
” రాన్రానూ రాజు గుర్రం గాడ్దైదట ‘ మనం యేమ్ గావాల్నొ మర్శి యెంత ఇల్వైనయి పొడగొట్కుంటున్నమో మనకెర్కైతలే… మనముంగటోల్లు మనకెంత మంచిగ ఆరసత్వపు సొత్తుంచిండ్రో… మనమూ మన తర్వాత తరాన్కుంచుడు మరుస్తున్నం.
ఎంతకైనా ఓల్డ్ ఇస్ గోల్ద్ అన్నట్లు… గప్పుడే మంచిగుంటుండే…!!!

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమయం ఆసన్నమైంది

దొరసాని -67 వ భాగం