
తనకో రూపాన్ని ఇచ్చి గోడకో చేతికో
తగిలించినప్పుడు
తీయగా నవ్వుకునే వుంటుంది
తన ఉనికి స్పృహ బాగానే ఉందని!..
వేగుచుక్క కంటే ముందే లేచేందుకు
అలారం పెట్టుకొన్నప్పుడు ఆనందించే ఉంటుంది
పెదవి విప్పి హెచ్చరించకుండానే
తన విలువ తెలిసుకున్నందుకు…
విధి నిర్వహణ విజయ వంతంగా నిర్వహిస్తున్నప్పుడు
ఉప్పొంగి పోయే వుంటుంది
సమయపాలన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నందుకు…
ఆలోచనా లోచనాలతో చూసినప్పుడు
కనిపించే కాలపు రంగుల్లో
ఎన్ని హొయలో మరెన్ని లయలో..
మన నెత్తిపైన ఆకాశం
కాళ్ళ కింద భూగోళం మధ్యలో
ఉదయించిన
జీవితపు మొగ్గను చూసి
లోలోన సంబుర పడి పోతోంది..
తాతల కాలం నాటి వెన్నెల కబుర్లు
మాంధాత పురుకుత్సుడు నాటి
సామాజిక ఆర్థిక విషయాలు
పూస గుచ్చినట్లు చెప్పుకుంటుంటే…
కాలమెంతగా ప్రేమతో హత్తుకునేది
అంతరాత్మకు అంతర్నేత్రం తగిలిస్తేనే అవగతం అవుతుంది!
కాలం బామ్మంత హితైషియై
అప్రమత్తంగా ఉండమంటుంది!
కాలమొకో సారి కఠిన పాషాణం
ఎంత వేడుకున్నా
కరుణ దయా లేకుండా
కదిలిపోతూనే ఉంటుంది!
కాలమొక అమ్మ
అనుభవాల ఒడిలో ఊయలూపి
అవరోధాల గాయాలకు ఓదార్పు లేపనమవుతుంది!
కాలమొక కన్నతండ్రి
చిటికెన వేలు పట్టుకుని
కాల సంద్రాన్ని ఎలా ఈదాలో నేర్పిస్తుంది!
కాలమొక గురువు
బతుకు తీరాన్ని చేరేందుకు
వీరగాధలతో ప్రేరణ కలిగిస్తుంది!
వినే ఓపిక ఉంటే …
కాలం ఏం మాట్లాడుతుందో
ఎన్నెన్ని పాత్రలను ఆవాహన చేసుకుని
ఉన్నత శిల్పంగా మార్చాలని తపిస్తుందో అవగతమవుతుంది!
వురిమళ్ల సునంద, ఖమ్మం
చాలా చక్కగా రాశారు. పేరు తప్పుగా వేశారు.
Purimalla Sunanda కాదు Vurimalla Sunanda వుండాలి.