శ్రావణమాసం గురువారంనాడు మరుసటి రోజు, వరలక్ష్మీ పూజకి అంతా సిద్ధం చేసుకుంటున్నది లత.ఇంతలో ఎవరో బెల్ కొట్టారు. తీరా చూస్తేఎవరో కాదు, లతకు బాగా పరిచయం ఉన్న, ఇంచు మించు ఆమె వయసే అయిన అపర్ణ సాక్షాత్కరించింది. హలో చెప్పి లోపలికి ఆహ్వానించగానే , వస్తూనే సోఫాలో కూలబడింది.
ఆమె ముఖకవళికలనుబట్టి ఏదో ముఖ్యమైన, ఉత్కంఠభరితమైన వార్తే మోసుకొచ్చి ఉంటుందని గ్రహించింది లత . ఏమిటన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసేసరికి ఆమె జవాబు ఈ విధంగా సాగింది……
“యావండీ లతగారూ మీకీ విషయం తెలుసా? జయలక్ష్మిగారు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారుట!
మిమ్మల్ని ఇంకా పిలిచారో లేదోగానీ, నన్ను మాత్రం పిలిచారు పేరంటానికి రమ్మని. ఇంకా మన ప్రెండ్స్ సర్కిల్లో అందరినీ పిలుస్తారుట! అయినా ఇదేం విడ్డూరమండీ? వితంతువులు ఎక్కడైనా వరలక్ష్మీ వ్రతం చేయడం మనం చూసామా?ఎప్పుడైనా కనీ వినీ ఎరుగుదుమా చెప్పండీ? నేనైతే వెళ్ళనబ్బా…మీరుకూడ వెళ్ళకండి ఓ ఉచిత సలహా పారేసింది.”
లత అవాక్కయ్యింది. “ ఏం వితంతువులు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకోకూడదూ? అలా అని ఎక్కడైనా రాసుందా?”అనడిందిలత. తను ఏదో సమాధానం చెప్పే లోపల మళ్ళీ , “అసలు అపర్ణా వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు? నానావిధ సంపదలూ అనుగ్రహించమని ఆ సిరుల తల్లిని వేడుకోవటానికే కదా? ఆమె భర్త చనిపోయినా ఆమె కు సంతానం ఉన్నది కదా . కొడుకులో కూతుర్లో ఉన్నారనుకో, మనుమలు, మనుమరాలు అలా ఉన్నవాళ్లు తమ కుటుంబ సంక్షేమం కోసం ఎప్పటి లాగే వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమౌతుంది? పాపం ఎన్నో ఏళ్లుగా పూజిస్తున్నది కదా ! ఇప్పుడు మానేస్తే ఎంతో కోల్పోయిన వారిలా అయిపోయి డిప్రెషన్ లకు లోనవుతారు. వితంతువులకు లక్ష్మీదేవిని సిరి సంపదలకోసం పూజించే, సేవించే హక్కుగానీ, అర్హతగానీ లేవా? అలా అని బల్లగుద్ది చెప్పగలరా? ఇంకా మంగళ గౌరీ వ్రతం అంటే కొంత అర్ధం ఉంది. ఎందుకంటే అది భర్త క్షేమంకోసం, ఆయురారోగ్యాలకోసం చేసేది కాబట్టి. ఏది ఏమైనా ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను. అంతేకాదు ససేమిరా ఒప్పుకోనుగాక ఒప్పుకోను. మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అపర్ణా “ అని అన్నది లత కాస్త తీవ్రంగానే!
“ అబ్భ మీరెప్పుడూ ఇంతే! మీకున్నటువంటి విశాల భావాలు నాకు లేవు బాబూ….వస్తా!” అంటూ విసురుగా వెళ్ళి పోయింది.
చూసారా మహిళలూ! ఇలాంటి వి చూసినా విన్నా అసలు స్త్రీకి స్త్రీయే శత్రువు అని అంటున్నమాటను నిజం చేసినవాళ్లమవుతానము. అది కాదండీ నాకు తెలీక అడుగుతాను, భర్త పోగానే ఆడదానికి అన్ని అర్హతలూ పోతాయా? మన సమాజం అసలే వెనకబడిన సమాజం. అందుకు అగ్నికి ఆజ్యం పోసినట్లు, ఈ రకమైన వనితల వల్ల మరింత వెనకబడ్డవాళ్ళం అవుతున్నాం! స్త్రీలకు ఎవరో అపకారం చేయడం కాదు, స్త్రీలకు స్త్రీలే అపకారం చేసుకుంటున్నారు. ఇంకా నా ఉద్దేశ్యంలో ఆవిడ ఎవరోగానీ వరలక్ష్మీ వ్రతం చేసిన వితంతువు ఎంతో అభినందనీయురాలు… సందేహంలేదు! ఆవిడ ధైర్య సాహసాలకు జోహార్లు చెప్పక తప్పదు. ఇలాంటి మార్పే అందరుమహిళలలోనూ రావాలి.
వితంతువులందరూ కూడ పూలూ, బొట్టూ, రంగు చీరలూ వదిలేయనవసరం లేదని చాలామంది ఈ తరం మహిళలు తెలుసుకున్నారు. ఎందుకంటే అవి మనకు పుట్టుకతో వచ్చినవి. భర్తతో వచ్చినవి కేవలం మంగళ సూత్రాలు, నల్ల పూసలూ మరియు మట్టెలు మాత్రమే నని అతివలు తెలుసుకున్నారు. ఏదో గుడ్డిలో మెల్లన్నట్లు ఇదొక శుభపరిణామమే! కానీ ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంది.
వితంతువులు ఎదురొస్తే అశుభం అనీ , సింగినాదం, జీలకర్ర అనీ ఇహ అడక్కండి ఇలాంటి మూఢ నమ్మకాలు ఒకటా రెండా ఇలాంటివి ఎన్నో,ఎన్నెన్నో!!! ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పాశ్చాత్య దేశాల ప్రభావం వల్ల పునిస్త్రీలే మంగళ సూత్రాలు నల్ల పూసలూ తీసేసి తిరుగుతున్న ఈ రోజులలో వితంతువులను సూత్రాలు తీసేయమనటానికి మనమెవరం? మంగళ సూత్రాలు తీసేసి తిరుగుతున్న మహిళలను(ద సో కాల్డ ముత్తైదువులను) మనం ఏమైనా అనగలుగుతున్నామా? ఎవరో అన్నట్లు ఈ రోజులలో పునిస్త్రీ ఎవరో వితంతువు ఎవరో తెలుసుకోలేకపోతున్నామంటే అతిశయోక్తి కాదు.
ఇంకో ముఖ్య విషయం, పూర్వం వితంతువులకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు గంగాభాగీరథీ సమానురాలైన పిన్నిగారికి అని సంభోదించేవారు. అంటే గంగ మరియు భాగీరథీ లతో సమానమైన స్థానాన్ని ఆపాదించారని మనకు తెలుస్తోంది. కానీ మనమిప్పుడు ఏం చేస్తున్నాం?
వారిని చీదరించుకుంటున్నాం……ఒక అంట రాని వాళ్ళలాగా చూస్తున్నాం……అన్ని శుభకార్యాలనుంచీ బహిష్కరిస్తున్నాం! ఇది ఎంతవరకూ న్యాయమో, ఉచితమో, మనస్సాక్షి ఉన్నవాళ్ళందరూ గుండెలమీద చేయి వేసుకుని చెప్పాలి! మరో విషయం, ఓ సారి నాలాంటివారే ఒకరన్నారు…..యావండీ లతగారూ వితంతువులు కూడ మంగళ సూత్రాలు, మట్టెలూ , నల్లపూసలూ వగైరా, ఒంటరిగా దూర ప్రయాణాలూ అవీ చేస్తున్నప్పుడు అవీ ధరిస్తే మృగాళ్ల నుండి రక్షణగా ఉంటుందేమో ఎందుకంటే పురుషులు వివాహితలను గౌరవంగా చూస్తారు కదా అన్నది. నాకు ఆవిడ మాటలు నవ్వుని తెప్పించాయి. ఎందుకంటే స్తీలమీద అత్యాచారం చేసే వాళ్ళు ఇవన్నీ చూసి చేస్తారా మన పిచ్చిగానీ …..వాళ్ళకి కావలసిందల్లా ఎవరో ఓ ఆడది అంతే! అందుకని ఆ ట్రిక్కులేవీ ఇక్కడ పనిచేయవు. జెంట్లిమెన్లవల్ల మనకు ఎటువంటి ప్రమాదము ఎలాగైనా ఉండదు. కాబట్టి మనని కాపాడేది మన మనో నిబ్బరం, మనస్థైర్యమేగానీ మరోటి కాదు.ఇక చివరగా,నేను చెప్పదలుచుకున్నదేంటంటే, రోజులు మారాయి. దాంతోపాటు స్త్రీల ఆలోచనా సరళి మరియు వస్త్రధారణ కూడ మారాలి.
జయలక్ష్మిగారిలాంటి అభ్యుదయవాదుల సంఖ్య ఇంకా ఇంకా పెరగాలి. అంతేకాదు వనితలు సంకుచిత భావాలు విడనాడాలి. విడో రీమ్యారేజస్సే చట్టబద్దమై దశాబ్దాలు గడిచినా స్త్రీల ఆలోచనలలోఇంకా మార్పు రాకపోవడం హాస్యాస్పదమేకాదు, బాధాకరంకూడఏమంటారు?
మాధవపెద్ది ఉష
This post was created with our nice and easy submission form. Create your post!
అసలు వింతంతువులు ఏమీ మానేయటము లేదు కానీ పక్కవాళ్ళు సొంత వాళ్ళే అసలు ముందు బొట్టుపెట్టటమే చాలా ఈజీగా మానేస్తారు ఏమాత్రం ఆలోచించకుండా. ఫంక్షన్స్ లల్లో కానీ, ఇంటికి వస్తే కానీ అప్పటి వరకూ బొట్టుపెట్టినవాళ్ళే! ఇక ఫంక్షన్స్ లల్లో అందరికీ పెడుతూ వీళ్ళను తప్పుకొని పక్కకు వెళి ఆ పైవాళ్ళకు పెడ్తారు. ఇంకా ఎన్ని ఆచారాలో! దానికి ఈ కాలం, ఆ కాలం అనిలేదు అమెరికా ఐనా అంతరిక్షమైనా ఎక్కడైనా ఒక్కటే!