జీవుని వేదన
దేవుని వేదనైన రోజులు
ఓ బుద్ధ దేవా!
కదలని నిశ్శబ్దం
పిచ్చుకల రొదలు మరచిన చెట్టు చేమలు
సహనం వదిలిన మనుష్య జాతి
అనురాగ హననం చేస్తున్న రీతి
ఒకటేదో అయోమయ
అసందర్భ ప్రేలాపనలలో

ప్రేమ వికసనం ఎప్పుడు జరగాలో!
క్రియామాన కర్మల
సంచిత కర్మల
బుద్ధి వికసన ఎప్పుడు జరగాలో
చిగుళ్ళు తినే కోకిల
గానామృతాన్ని అందిస్తే
పళ్ళు తినే మనుషులు జ్ఞానామృతాన్ని ఎప్పుడు అందిస్తారో!
దేవుడు పండులో రసాన్ని నింపితే
జీవుడు పండు రసాన్ని గ్రోలుతాడు
చావు బతుకుల మధ్య
శ్రేష్టారామాలు వెలిసేదెపుడో!
గౌతమ బుద్ధదేవా
ఇంటింటా బోధి వృక్షాలు మొలిపించవూ
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు