వస్తువు, విషయం – subject and content

24- 3-2024 తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక సంపాదకులు

ఒక సంఘటనను చూడగానే ఒక అభిప్రాయానికి వస్తాం. బాగుందనో, బాగాలేదనో, అయ్యో అనో,ఆహా అనో అనుకుంటుంటాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది ఒక spontaneous feeling . దీనితోనే,ఈ భావాల కే కొన్ని మాటలను పేర్చుకుంటూ పోతాం. మనదైన ఓ అభిప్రాయాన్ని ఎవరు అడగకున్నా చెప్తుంటాం .ఇది దర్శనానికి, అభివ్యక్తికి మధ్య ఉండే దశగా చెప్పవచ్చు. చూసింది విషయం , సబ్జెక్టు అయితే అభిప్రాయ వ్యక్తీకరణ అనేది వస్తువు అంటే కంటెంట్ అవుతుంది. ఈ విమర్శ ఈ వివేచన కవిత్వానికి,కథకు వర్తిస్తుంది.ఇటువంటి సాహిత్య విశ్లేషణ జీవితాలకు అన్వయించాలి.మనుషుల భావనశక్తికి అంతులేదు. ఇక్కడెక్కడో ఉండి హిమాలయాల్లో విహరించవచ్చు, సహారా ఎడారి కి వెళ్ళవచ్చు, అమెజాన్ అడవులను దర్శించవచ్చు. మనసుకు అంత శక్తి ఉన్నది. అందుకే కదా వాయువేగం కంటే ధ్వని వేగం కంటే కాంతి వేగం కంటే కూడా మనోవేగం చాలా గొప్పదని అన్నారు!

      అనుభూతి ఆలోచన భావన శక్తితో కలిసి విన్నదానిపై కన్నదానిపై అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని తడవలు imagination  తోడవుతుంది దీనికి కొందరిలో తాత్వికత కొందరిలో నిర్లిప్తత కొందరిలో ఉద్విగ్నత బలంగా నిలుస్తాయి. కళ్ళ ముందు లేకున్నా ఊహించే విషయాలకే ఇంతటి శక్తి ఇంతటి ప్రాధాన్యత ఉంటే నిత్య జీవితంలో నీతో ప్రయాణించే నీతో జీవించే విషయాలపై ఎందుకు దృష్టి పెట్టవు అని ఒక ప్రశ్న వేసుకోవాలి!నా జీవన సహచరి పై పట్ల నా వైఖరి ఏంటి అని ప్రశ్న వేసుకోవాలి. ఎదురుగా భర్తను, భార్యను, పిల్లలు ,అత్తమామలో తల్లిదండ్రులో ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి తెలిసి ఉండి ఎందుకు సాత్వికంగా, సహృదయతతో ఆప్యాయంగా ఉండరు?

ఈ దేశంలో ఉన్నవాళ్లందరికీ మనమే అండగా ఉన్నామని మనమే జీవితాన్ని ఇస్తున్నామని చెప్పే అంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు కదా! ఇంటి వాళ్ళనే పట్టించుకోనప్పుడు పక్క వాళ్ళని, ఊరి వాళ్ళని, దేశాన్ని ఎలా పట్టించుకుంటాం? ఎందుకు పట్టించుకోవాలి అని అంటారా ఇదే ప్రశ్న మన గురించి మన పక్క వాళ్ళు కూడా అడిగితే మనకు ఎలా ఉంటుంది ఇటువంటి విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు మనకు మనమే వేసుకోవడం చాలా అవసరం ఓ ప్రపంచాన్నే ఉద్ధరించేస్తున్నారబ్బా అని కూడా ఎవరైనా నిందాత్మకంగా, వ్యంగ్యాత్మకంగా మాట్లాడవచ్చు కానీ, వ్యంగ్యాలకేంటి అసూయలకేంటి, అసహనతకేంటి చాలా అవకాశాలు ఉంటాయి లెండి! ఇవి వద్దన్నా వచ్చి చేరుతాయి. డబ్బిచ్చి కొనేవి కావుగా !కష్టపడి సంపాదించేవి అసలే కావుగా !ఒంట్లో పుట్టిన అరిషడ్వర్గాలలోంచి వాటంతటవే పెల్లుబికి వచ్చే గుణాలు. ఏవైనా కాస్త కష్టపడి సాధించుకోవాలి, సంపాదించుకోవాలి అంటే అటువంటి మంచి గుణాలు మాత్రమే కాస్త సమయాన్ని కాస్త మనసును కాస్త ఓపికను ఖర్చుపెట్టి సంపాదించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈ దాష్ఠీకమైన రోజులలో మంచితనమూ మానవత్వమూ మన రెండు భుజాలుగా ఉండాలి. అప్పుడే ఒక ఉజ్వలమైన మానవ సౌధాన్ని నిర్మించబడిన వాళ్లమవుతాం. ఏం ఈ అద్భుతాలు అన్ని నేనే చేయాలా అనే ఒక విరక్తితో కూడిన మాట అనేసి మనంతట మనం కూపస్థకు మండూకాలలా ఉంటే ఏమీ లాభం ఉండదు.

    ప్రపంచాన్ని చూడండి. ఇక్కడైతే కుటుంబ సభ్యులతో అరమరికలు లేకుండా చెడుకుతావీయకుండా ప్రేమాస్పదంగా ఉంటారు వాళ్లే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లనే గమనించాం. ఎలాగూ లోకాన్ని ఉద్ధరించే శక్తి లేదు కనీసం కుటుంబంతో నైనా మంచిగా ఉంటే పోయేదేం లేదు. గతం గతః ఎప్పుడో పాత కక్షలు ఓ పాత బాధలో, పాత కోపాలు మనసులో పెట్టుకొని ఈ మనసు అనే పువ్వు ను వాడనీయకుండా,పండును కుళ్ళి కుళ్ళిపోయేలా చేయకుండా, నాలుగు మంచి పనులు చేసి ఆ సువాసనలు పదిమందికి పంచేలా చేయాలి. ఆ ఫలాలు అందరికీ సమతూకంగా అందేలా చేయాలి. ఇప్పుడే జీవితానికి సార్ధకత. చూడండి !మనసుపెట్టి ఓసారి ఆలోచించండి!! Subject and content… విషయము,వస్తువు రెండు మీకే అర్థమౌతాయి!!!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పురుష పుంగవులారా….!

మన మహిళామణులు