వడ్లగింజ లోబియ్యం గింజ …!

కథ

మాలాకుమార్

ఐదైంది ఇంకా మానస కాలేజ్ నుంచి రాలేదేమా అని కూతురి కోసం ఎదురుచూస్తోంది గాయత్రి.గాయత్రి,శ్యామ్ ల గారాల పట్టి మానస.ఆ సంవత్సరమే బీటెక్ లో చేరింది.గాయత్రి సన్నగా నాజుకుగా,పొడవాటి జడతో అందంగా ఉంటుంది.మానస తండ్రి పోలికలో కాస్త బొద్దుగా ఉంటుంది.పైగా గాయత్రికి మానస పందొమ్మిదో సంవత్సరము లోనే పుట్టటం వలన ఎక్కువ వయసు తేడా లేక తెలీనివాళ్ళకు తల్లీకూతుర్లలా కాక ఇద్దరూ అక్కచెళ్ళెళ్ళలా అనిపిస్తారు.అలాగే ఇద్దరూ స్నేహితుల్లానే ఉంటారు.కాలేజీ లో చేరిన కొద్ది రోజులకే జడ కత్తిరించుకుంటాన్న మానస కోరికకు శ్యామ్ ముందు గుణిసినా, కాలేజీకి వెళుతున్న పిల్ల కాస్త ఫాషన్ గా ఉండటములో తప్పేమీ లేదని గాయత్రి నచ్చచెప్పటము తో ఒప్పుకున్నాడు.జుట్టు కత్తిరించటము తో మొదలైన మార్పు చిన్నచిన్నగా డ్రెస్సింగ్ లో, మాట్లల్లో కూడా తేడాను ఈ మధ్య గమనిస్తోంది గాయత్రి.అది అంతగా పట్టించుకోకున్నా ఈ మధ్య కొంచం ఆలశ్యంగా రావటము కూడా మొదలయ్యే సరికి కాస్త కంగారు పడుతోంది. కాసేపు బైటకీ లోపలికి తిరిగి,డాబా మీదకెళ్ళి సందు చివర దాకా చూసింది.ఎక్కడా కనిపించలేదు.అసలు అనవసరంగా కంగారు పడుతున్నానేమో అని తనకు తానే నచ్చ చెప్పుకొని ఆరేసి ఉన్న బట్టలు తీసిమడతపెట్టి ,కిందకు వచ్చి అవి పెడదామని మానస గదిలోకి వెళ్ళింది.ఎప్పుడు వచ్చిందో మరి మానస మంచం మీద బోర్లా పడుకొని చిన్నగా ఏడుస్తోంది.అది చూడగానే గాభరా పడి బట్టలు పక్కన పడేసి, మానస పక్కన కూర్చొని “ఏమైంది బంగారూ ?” అని అనునయంగా అడిగింది.

సమాధానం చెప్పకుండా ఇంకా ఎక్కిళ్ళు పెడుతున్న మానసను చూసి అనునయించి,బుజ్జగించి అడిగింది.

అమ్మ ఓదార్పుతో కొంచం తేరుకున్న మానస “అది కాదమ్మా ఈ మధ్య మా క్లాస్ కు ఓ కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాను గుర్తుందా?”అని అడిగింది.

“అవును చెప్పావు.ఆ అమ్మాయిని చూడగానే నీకు చాలా నచ్చిందని, నీ అంతట నువ్వే తనను మాట్లాడించానని చెప్పావు.నేను కూడా అసలు నీకు కొత్తవాళ్ళతో మాట్లాడాలంటేనే మొహమాటం.మేము ఎంతో పోరుతేనే కాని మాట్లాడవు.అట్లాంటిది ఓ అమ్మాయిని ఫ్రెండ్ చేసుకుందామనుకొని నువ్వే మాట్లాడించావు అని సంతోషపడ్డాను.ఇప్పుడేమయ్యింది?”అని అడిగింది గాయత్రి.

“నేను తనను పరిచయం చేసుకొని,నిన్ను చూడగానే నాకు నీతో స్నేహం చేసుకోవాలనిపించింది అనగానే సంతోషం గా ఒప్పుకుంది. చాలాచనువుగా స్నేహంగా ఉండేది.నన్ను ఇంత పొడుగు జడతో ఉంటే అబ్బాయిలు ఏడిపిస్తారంటే జుట్టు కూడా కట్ చేసుకున్నానా? తను రమ్మంటే కాఫీ హౌస్ కూడా వెళ్ళి,బిల్ కూడా నేనే కట్టేదానిని.ఆలశ్యం అవుతే నువ్వు గాభరా పడతావన్నా,నువ్వేమైనా చిన్నపిల్లవా అమ్మకు భయపడటానికి కూర్చో అనేది.నాకూ ఎందుకో తనంటే ఇష్టంగా ఉండేది.అవునా? ఐనా  ఎందుకో రెండు రోజుల నుంచి నేను మాట్లాడించినా ముక్తసరిగా జవాబు చెప్పి వెళ్ళిపోతోంది.మా ఇంకో ఫ్రెండ్ తో ఎవరితోనో అందిట, మానస నేనేమి చెప్పినా వినటము లేదు తనని వదిలేసాను అని.ఆ అమ్మాయి మీద్దరికి ఏమైందే అని అడిగింది.నాకు అర్ధం కాలేదు.అసలు తను నాకేమి చెప్పింది నేనేమి వినలేదు? ఈ రోజు లంచ్ టైం లో అడుగుతే ఏమిటేమిటో చాలా రూడ్ గా మాట్లాడింది.నేను నాకు తెలీకుండానే సారీ సారీ అని చెప్పాను.కాని తను వినిపించుకోలేదు.నేను ఏడుస్తూ వచ్చేసాను.అమ్మా నువ్వు చెప్పు నేనేమి తప్పు చేసాను?”కన్నీళ్ళతో అడిగింది మానస.

ఏదీ తట్టుకోలేదు.మరీ సున్నితమనస్కురాలైనా మానస ఎంత బాధపడుతోందో అనుకొని చిన్నగా”కొంత మంది అట్లాగే ఉంటారు.నువ్వు తనకు లేనిపోని గొప్ప అంటగట్టేసరికి తనేదో తెలివికలదానిని,నువ్వేదో తెలివి తక్కువదానివి అనుకొని నీ మీద డామినేషన్ చేయబోయింది.తను మాట్లాడకపోతే ఏంపోయింది.నీకింకా వేరే ఫ్రెండ్స్ లేరా?అవన్నీ పట్టించుకోకూడదు. ఇంటి నుంచి బయటకు అడుగు వేసావు. ఇంట్లో ఉన్నట్లుగా బయట ఉండదు. బయటప్రపంచములో రకరకాల మనస్తత్వాలవారు ఎదురవుతారు. ఎవరితో ఎట్లా మెలగాలో తెలుసుకోని మెలగాలి. ఎవరికీ అతి చనువు ఇవ్వకు. అసలు నువ్వు ఏమి తప్పు చేసావని తనకు సారీ చెప్పావు?  ఇట్లా అనవసరమైన వాటికి దిగులు పడి, మాటిమాటికి  సారీ చెపితే నీ ఆత్మస్తైర్యం కోల్పోతావు. మన డిగ్నిటీ మనం నిలుపుకోవాలి. ధైర్యంగా పరిస్తితులు ఎదుర్కోవాలి. పోనీలే జరిగిందేదో జరిగిపోయింది.తను నిన్ను వదిలేసేదేమిటి నువ్వే తనను వదిలేసేయి.ఇక తనతో మాట్లాడకు.ఇదీ ఒక అనుభవం అనుకో.లే కాఫీ తాగుదాము”అని కూతురితో అనునయంగా చెప్పి,మనసులో ఓస్ ఇంతేనా తను ఇంకేమిటో అనుకుంది.వడ్లగింజలోబియ్యం గింజ …కూతురికి ఇంకా చిన్నతనం పోలేదు అని చిన్నగా నవ్వుకుంటూ లేచింది.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు part-11

రాపోలు శ్రీదేవి పేయింటింగ్స్