ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదురాలు ,స్త్రీవాది, , సామాజికవేత్త ఐన వీరు ,మహిళల హక్కుల కోసం అహరహం శ్రమించిన ప్రముఖ మహిళల్లోఒకరు .జనవరి 4 , 1923 న పశ్చిమ బెంగాల్లోని ఉన్నత కుటుంబంలో జన్మించారు. భారతీయ ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన సర్. ధీరేన్ మిత్రా వీరి తండ్రి . లోటికాసర్కార్ అత్యంత స్నేహశీలి, చతుర భాషిణి .
శ్రీమతి సర్కార్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా ,ఢిల్లీ యూనివర్సిటీలో క్రిమినల్ లా బోధించిన తొలి మహిళా అధ్యాపకురాలిగా రికార్డ్ కెక్కారు.
అత్యాచార చట్టాల సంస్కరణపై భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన బహిరంగ లేఖపై సంతకం చేసిన వారిలో ఈమె ఒకరు. ‘అమ్నియోటిక్ ద్రవపరీక్షల ‘ద్వారా భ్రూణహత్యాచారాన్ని బహిర్గతం చేయడం పై పోరాడినవారిలో
ఈమె ముఖ్యులు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ‘న్యూన్హామ్’ కళాశాలలో న్యాయవిద్య అభ్యసించి అక్కడి నుండే పీహెచ్డీ చేశారు .హార్వర్డ్ లో అంతర్జాతీయ న్యాయ విద్యను అభ్యసించిన నలుగురు భారతీయులలో వీరొకరు.
1951 లో కేంబ్రిడ్జ్ సహవిద్యార్థి ఐన చంచల్ సర్కార్ తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి 1957లో వివాహ బంధానికి దారితీసింది .చంచల్ సర్కార్ ప్రముఖ జర్నలిస్టు ,ద స్టేట్స్మెన్ లో అసిస్టెంట్ ఎడిటర్ మరియు ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ .
శ్రీమతి లోటికా1951 లో ఢిల్లీ యూనివర్సిటీలోని లా ఫాకల్టీలో క్రిమినల్ లా బోధకురాలిగా మొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం పది మంది మాత్రమే మహిళా విద్యార్థినులుండగా , 1960 నాటికి వీరి సంఖ్య 80 -100 మధ్యకు పెరిగిందని గుర్తుచేసుకుంటారు . 1951 నుండి 83 వరకు ఉద్యోగ నిర్వహణగావించి తదనంతరం ‘ఇండియన్ లా ఇన్ట్యూట్ ‘ లో అధ్యాపకురాలిగా సేవలందించిన ఈ న్యాయ శాస్త్రవేత్త సమాజసేవలో క్రియాశీల పాత్ర పోషించారు.
మహిళా సమానత్వం ,సాధికార తలపై వీణామజుందార్ 1980లో స్థాపించిన సెంటర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ (సీడబ్ల్యుడిఎస్) ఇంకా 1982లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ స్టడీస్ లో సహ వ్యవస్థాపక సభ్యురాలుగా కొనసాగారు. ప్రొఫెసర్గా తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో విద్యారంగంలో విశేష కృషి చేసారు.
“తరగతి గదిలో విద్యార్థులకు స్ఫూర్తివంతంగా పాఠాలు బోధించడం ఒక గురువు ప్రధాన కర్తవ్యం, బాధ్యత అని ఆమె అభిప్రాయం” యూనివర్సిటీ వెలుపల సైతం తన కలివిడిదనంతో సమాజంలో అందరితో గౌరవమర్యాద పొందిన స్త్రీ మూర్తి .
1979లో మధుర అత్యాచార కేసులో బాంబే హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ , భారత సుప్రీం కోర్టు తీర్పు నివ్వగా , అత్యాచారం చేసిన ఇద్దరు పోలీసులు శిక్షకు గురయ్యారు.
1979 వరకు ఈ కేసు పై పెద్దగా ప్రభావం కనిపించకపోయినప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉపేంద్ర బాక్సీ, రఘునాథ్ కేల్కర్ ,శ్రీమతి లోటికాసర్కార్, పూణేకు చెందిన వసుధా దగంవర్లు సుప్రీంకోర్టుకు అత్యాచార తీర్పులోని ‘సమ్మతి భావన’కు వ్యతిరేకంగా లేఖ రాసి’ఫోరం అగైనస్ట్ రేప్’ కమిటీని 1980 లో ఏర్పాటు చేశారు. సభలు,సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించగా చివరికి భారత శిక్షాస్మృతిని సవరించారు.
శ్రీ చంచల్ సర్కార్ దివంగతులయ్యాక ఒంటరిగా నివసిస్తున్న శ్రీమతి సర్కార్ ‘హౌస్ ఆఫ్ ఖాన్’ ఇంటి లావాదేవీల విషయంలో ఇబ్బందికి గురై ఇల్లు విడిచివెళ్ళాల్సిన పరిస్థితి రాగా ఆమెకు సభ్యసమాజం, మీడియారంగం ,మేధావి వర్గం సంపూర్ణ మద్దతును ప్రకటించాయి .దానితో ‘తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ నిర్వహణ మరియు సంక్షేమ చట్టం’ 2007 క్రింద ఏర్పాటైన న్యూ ఢిల్లీ జిల్లా ట్పైబ్యునల్ ముందు హాజరై హౌస్ ఆఫ్ ఖాన్ ఇంటి విషయంలో తనకు సత్వర న్యాయం జరిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీమతి లోటికాసర్కార్ వయోభారంతో 23 ఫిబ్రవరి 2013న న్యాయదేవత పాదాలు చెంత దీర్ఘనిద్రలోకి జారుకున్నారు. మహిళాహితైషిణి న్యాయమూర్తి, స్ఫూర్తి ప్రదాత ఐన ఈ మహిళాశక్తికి అక్షరాంజలి ఘటిస్తూ –
