రమక్క తో ముచ్చుట్లు -23

పప్పన్నం…!

“ఏందే అమ్మా.. మీ పిన్నికి పనిలేదా పప్పన్నం తినబుద్దయితుందంట జెర ఒండిపెట్టు. ఏడ గనవడ్తె ఆడ నా దిమాఖ్ తినకుమను ” కోపంగ అర్సుకుంట బయటికి పోయిండు మా ఇంటిపక్క పిల్లగాడు. పిల్లగాడు అంటే… బడికి పోయే పోరడు అనుకునేరు. ముప్పై అయిదేండ్ల ముదురు బెండకాయ!
ముచ్చట ఏందో మీకు అర్థమైయ్యుంటది ఈ కాడికే. మగ పిల్లలనే కాదు, ఆడపిల్లలు కూడా మస్తు సంపాదిస్తున్నరు. సంపాదించుట్లకు ఏమ్ ఫికర్ లేదు, కానీ లగ్గం అంటే చాలు వద్దంటరు. అది ఎందుకు అన్నది అర్థం అయితలేదు.
ఇప్పటి సమాజంల 35-40 ఏండ్ల వయస్సుకు వచ్చినా పెండ్లి వద్దనుకునుడు అలవాటు అయ్యింది. ఇది ఆడ, మగ అని తేడా లేకుండ అందరూ ఒక్కతీర్గనే తయారయ్యిన్రు. ట్రెండ్‌ అంట గిది .
ఇంగ కొందరికి లగ్గం చేసుకుందామంటే పిల్ల దొర్కదు. నెత్తిమీద ఎకరం పొలం ఖాళి అయిపాయె, గుండు ఏర్పడే. ముందుకేమో బొజ్జ తన్నుక వస్తది. లచ్చలు లచ్చలు బ్యాంకుల వడ్డంక లగ్గం జెస్కుంటా అనుకునే టోళ్లు కొందరు తయారయ్యిన్రు. గప్పుడు పిల్ల దొరుకుతదా చెప్పుండి. రైతు బజార్ల పొద్దుగాల పోతే కూరగాయలు దొరుకుతయి. సాయంత్రం పొతే ఏమ్ దొరుకుతయి. గంతే మరి ఇంగ.
ఏ వయసుల ముచ్చట, ఆ వయసుల జరగాలి అంటరు పెద్దోళ్ళు! ‘ పప్పన్నం’ పెట్టాలి కొడుకా అంటే..’కావాలంటే నువ్వు వండుకోని తిను’ అంటే ఏమన్నట్టు?!
పప్పన్నం ఒక శుభకార్యానికి సూచిక.
గంతే గని, టమాట పప్పు, పాలకూర పప్పు వండుకోని తినుడు కాదు బిడ్యా!
ఈ కాలంల శానమంది పిల్లలు పెండ్లికి పెద్ద ఇజ్జత్ ఇస్తలేరు. నాకు ఫర్క్ పడదు అంటరు. అది తప్పు.
కుటుంబం లేకుంటే ఎట్ల? ఏడుంటము? కుటుంబ వ్యవస్థ సమాజానికి పునాది. కుటుంబము అనేది పెండ్లి అనే బంధం తోనే కదా ఏర్పడేది.
పిల్ల – పిల్లగాడు ఇద్దరూ సమానమే. ఇద్దరు గూడ రెండు వేరే వేరే కుటుంబంలకెల్లి వచ్చినోళ్లే…తిండి తిప్పలు అలవాట్లు అన్నీ అలగ్ అలగ్ ఉంటయి. ఇద్దరు ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకోవాలే. ఇద్దరి దిక్కు, అమ్మా నాయినలను కుటుంబాలను గౌరవంగా సూడాలే. ప్రేమను అందించాలి. అప్పుడు యే లొల్లులు రావు. నాది నేనే గొప్ప అనుకుంటేనే లొల్లి ఉంటది. చిన్న మాటనే కానీ పెద్దకత దీనిది.
నాకు అనిపిస్తుంది ఏంది అంటే
మన సమాజం మెల్లగ సంప్రదాయ పరిమితుల నుండి వ్యక్తిగత స్వేచ్ఛ దిక్కుకు పోతుంది. ప్రతి వాళ్ళూ నా జీవితం మీద పూర్తి హక్కు నాదే ఎవ్వల్ల మాట ఇనేది లేదు. ఎవ్వరికి లొంగేది లేదు అనుకుంటున్రు. ఇది సరికాదు. ఒకలను గౌరవించుడు అంటే.. మనం తగ్గిపోయినట్టు కాదు. అది మన సంస్కారం, మనిషికి మనం ఇచ్చే ఇజ్జత్ ఇది.చిన్న చిన్న సర్దుబాట్లు పెద్ద పెద్ద విజయాలకు, ఆనందకరమైన జీవితానికి దారి సూపుతది.
ప్రస్తుతం ఆడవాళ్ళు, మగవాళ్లు ఇద్దరూ ఆర్థికంగా స్వతంత్రతను సాధిస్తున్నరు. సంపాదించగలిగే స్థితికి వచ్చిన తర్వాత, ఎవల్ల జీవితం వాల్లే నిర్ణయించుకోవాలనే ఆలోచన జెస్తున్రు. “ఇప్పటికే నా జీవితాన్ని నేను ఆనందంగా గడుపుతున్న, ఇగ నాకు పెళ్లి ఎందుకు?” అనే ప్రశ్న వస్తుంది వాల్లకు.
ఒకప్పుడు సమాజం పెళ్లిని ఒక బాధ్యతగ, తప్పనిసరి ఘట్టంగ భావించింది. కానీ ఇప్పుడు అట్లలేదు. పెళ్లి చేయకపోతే సిగ్గు అనిపించుకునే పరిస్థితి క్రమంగ తగ్గిపోతుంది. పెండ్లి లేకుంటే జీవితం అసంపూర్ణం అనే భావన జెర తగ్గింది. ఒక మనిషిని మాటలతో పొడిశి పొడిశి సంపుడు తగ్గుతది. ఇది మంచిదే ఒక కాడికి. కాకపోతే పెండ్లి వ్యవస్థ మీద నమ్మకం పొతే సమాజం కుదేలైపోతది. కొంత కాడికి నీతి గూడ తప్పే అవుకాశం ఉంటది.
కొంతమందికి శానా ఏండ్లు కలిసి ఉండుడు అనే స్థిరత్వం మీదనే నమ్మకం పోతుంది. విడాకులు పెరుగుతున్నయి. అసలు విడాకులు అల్కగై పోయినయ్ ఈ కాలంల, దీనికి ఒక ముఖ్య కారణం ఏందంటే పెండ్లి జేసుకునే టప్పుడే ఆగమాగం ఉంటరు. ఆడికెల్లే సమస్యలు శురువైతయి. పెండ్లి ఆగమే, విడాకులు ఆగమే! గిది కాదు కదా సదువు, విజ్ఞత ఆధునికత అంటె. జీవిత భాగస్వామిని ఎన్నుకునుడు శానా ముఖ్యమైన పని జీవితంల ఆలోచించుండి బాగా..!
మీకు మీరు జేసుకున్నా సరే, మీ అమ్మా నాయినలకు అప్పజెప్పినా సరే. పైలం అని మాత్రం జెప్తున్న నేను.

35-40 ఏండ్ల వయస్సు వచ్చినా పెండ్లి వద్దనుకునుడు వ్యక్తిగత నిర్ణయమే అయినా, పెండ్లి ఒక వ్యక్తిగత జీవితానికే కాదు, సమాజ శ్రేయస్సుకూ కీలకం అనే మాట మనం ఏ మాత్రం కాదనలేము.

పెండ్లి హృదయంల అనుబంధాన్ని పెంచి, జీవితంల ఒక భావోద్వేగ సమతుల్యతను ఇస్తది. జీవితంల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఒక మానసిక ధైర్యాన్ని, తోడుగా ఉండే ఒక వ్యక్తిని పెండ్లి ఇస్తది. అహంకారము, స్వార్థము, కోపము ఉన్నోళ్లు మాత్రమే పెండ్లి తరువాత జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నరు.

పిల్లల పెంపకంల కుటుంబం కీలకపాత్ర పోషిస్తుంది.పెండ్లి అనే బంధం వల్ల పిల్లలకు సమాజంల నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం అందించగల సుస్థిర వాతావరణం లభిస్తది. కుటుంబం సమాజానికి మూలస్థంభం; ఉన్నతమైన భావాలు, సంస్కృతి తరతరాలుగ ముందుకు సాగుతయి.

పెండ్లి వ్యక్తులకు కేవలం వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, ఒకరిపై ఒకరు బాధ్యత తీసుకునే బాధ్యతా భావాన్ని కలిగిస్తది. సమాజంల ఒక రకమైన భద్రతా వ్యవస్థగ నిలుస్తది. జీవితంల ఒంటరితనం, వృద్ధాప్యంల నిరాశ వంటి సమస్యలకు పెండ్లి ఒక పరిష్కార మార్గం.

అందుకే… జెర ఆలోచించుండి చెల్లెండ్లు-తమ్ముండ్లు ఓకరినొకరు అర్థం చేసుకోని, అండగా ఉండుండి. పెండ్లి అనే బంధం ద్వారా..! జెర్ర ఒక్కళ్ళను ఒక్కల్లు అర్థం చేస్కోండి. గంతే..! మంచిగ సంపాదిస్తున్నరు ఈ కాలంల. కలిసి మంచిగ బతుకుండి. ఇంట్లనే ఒక మంచి దోస్తును తయ్యారు జెస్కోండి.
పెండ్లి అంటే కేవలం సంప్రదాయ పరమైన అనుభవం మాత్రమే కాదు, అది జీవితాన్ని సమతుల్యంగ, ఆనందంగ నడిపించే ఒక మూలస్తంభం. మనిషికి ఒక భరోసా! పెండ్లి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేది కాదు, భద్రతను, నమ్మకాన్ని, సమాజ శ్రేయస్సును బలపరిచే నిజమైన బంధం. దాని విలువను తెలుసుకోండి.దానిని నిలబెట్టుకోండి.

ఉంట మరి పైలం
మీ
రమక్క
8985613123

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆనంద

తొలి ఆత్మకథా రచయిత్రి