అందరికీ శనార్థులు.
“సోయి లేదా..సూస్కొని నడువ్ ” తిడుతుంది అవ్వ పడబోతున్న పిల్లగాడిని.
” సోయే లేదు… ఫోన్ యాడ పెట్టిండో ఏమో…!” నాయిన కోపమయితుండు కొడుకును.. ఇట్ల సోయి అనే మాట మనం వింటనే ఉంటం! కానీ సోయి మీద సోయి ఉండదు.
మన బతుకు బండి సక్కగ ముందుకు సాగనీకి సోయి ఉండాలి తమ్మీ! దాని ముచ్చట సూద్దాం ఇగ.
“సోయి లేని కర్మ, నిలువని వృక్షం!”
సోయి లేకుంట జేసిన యే పనీ గూడ నిల్వదు. కూలిపోతది.
సోయితో సాగితే, అడ్డుగోడలైన తలొంచుకుంటయి.
సదువులో సోయి లేకుంటే.. ఫలితాలు రావు. ఆ సదువు ఉపయోగమే రాదు. మొద్దువారిన కత్తి లెక్క అది.
సోయి అంటే.. జాగ్రత్రగ ఉండుడు. ఇది అన్నిట్ల ఉండాలె కదా!
సోయి ఉన్నోడు చిన్న అవకాశాన్ని గూడ ఉపయోగించుకుంటడు, లేనోడు బంగారం మూట దొరికినా గుర్తువట్టడు.
మన జీవితంల అన్నింటి మీద సోయి ఉండాలె. ఇది ప్రతి రంగంల మన విజయానికి మార్గదర్శిగా ఉంటది.
సోయి తోటి నిర్ణయాలు తీసుకునుడు వలన మనకు ప్రతి పనిల ఇగురం ఉంటది.
ఒక పల్లెటూరిల పిల్లలు ఒక ఆట ఆడుతున్నరు. కళ్లకు గంతలు కట్టుకొని ఒకర్నొకరు ముట్టిచ్చుకునుడు ఆట.
రమ్య సుట్టూ ఉన్నోళ్లను సక్కగ సూడకుండ ఊరుక్కుంట పోయి ఒక పెద్ద రాయిపై పడ్డది.దెబ్బతగిలింది. కండ్లకు కట్టుకున్నోడేమో.. మెల్లగ నడుసుకుంట జాగ్రత్తగ పోయిండు.
రాజేశంకు ఒక చిన్న దుకాణం ఉన్నది స్కూల్ పిల్లగాళ్ళందరూ పప్పులు, పుట్నాలు, చాక్లెట్లు కొంటరు. చిన్నపిల్లలందరు ఎగబడే వరకు రాజేశం కి సోయి ఉండదు. ఎవ్వలెన్ని తీసుకపోతున్నరు గూడ సోయి పెట్టడు. ఏముంది ఇగ నెలతిరిగే వరకల్ల నష్టాలే రావట్టె!
ఇంక కొందరికి తిండి తినుట్ల, దానం చేసుట్ల, మాట్లాడుట్ల… గిట్ల సోయే ఉండదు. ఒక్క తావుల అని కాదు అన్నిట్ల మనిషికి సోయి ఉండాలి. సోయి ఉంటే నిమ్మతంగ ఉంటం. లేకుంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటరు.దీని వలన చానా సమస్యలు వస్తయి . జాగ్రత్తగా ఆలోచించి, అన్నివిధాలా పరిశీలన జేసి గప్పుడు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును బాగుపరుస్తయి కదా!
పనులను కచ్చితంగ, తప్పులేకుండ చేస్తం. ఏ పని జేసినా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మంచి ఫలితాలు వస్తయి. సైన్స్, ఇంజినీరింగ్, వైద్యం గిట్ల అన్ని రంగాలల్ల సోయి లేకపోతే ప్రమాదాలు సంభవిస్తయి. ఏముంటరు జెప్పుండి.
మనం మాటలు, పనులు జాగ్రత్తగ సోయితోని చూసుకుంటే, మనస్పర్థలు తక్కువగ ఉంటయి. అర్థం చేసుకుని మాట్లాడితే, కుటుంబం, స్నేహితుల మధ్య అనుబంధం బలపడుతుది.
ఆర్థిక పరంగా కూడ స్థిరత్వం వస్తది.
ఖర్చులు, ఆదాయాన్ని సోయితోని ప్లాన్ చేసుకుంటే గొప్పలకు పోకుండ అప్పులు గాకుండ, మంచి ఆర్థిక భద్రత ఉంటది.
అట్లనే అన్నింటికన్న ముఖ్యమైన ఆరోగ్యం విషయంల కూడా మస్తు సోయి ఉండాలె!
మన ఆహారం, నిద్ర, వ్యాయామంపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా జీవించగలం. నిర్లక్ష్యంగ ఉంటే అనారోగ్యం వచ్చి, జీవిత నాణ్యత తగ్గిపోతది. ఎన్నున్నా ఆరోగ్యం లేకుంటే సున్నా. అందుకనే ఇక్కడ సోయి మస్తు ఉండాలి.
సోయి ఉన్నోడు సమయం విలువను అర్థం చేసుకుంటడు.
పనులను ప్లాన్ చేసుకుని చేస్తే, సమయం ఖరాబ్ గాకుండ, ఎక్కువ పనులు పూర్తి చేసుకోవచ్చు. సమయం అంటే దేవుని లెక్క. పోయిన ఒక్క నిమిషం కూడా వెనుక తేలేము. అందుకనే సోయి తోని మెలగాలే.
సోయి ఉంటే పానం దక్కుతది:
డ్రైవింగ్ చేస్తుంటే.. ఎంత హుషారు ఉండాలే, ఎంత సొయితోని ఉండాలే లేకుంటే వాళ్ల పానమే కాదు.. ముందర వచ్చేటోళ్ల పానం సుత కష్టంల పెడ్తరు. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతుంటము, చిన్నపిల్లలు ఉంటరు, గ్యాస్ కాడ వంటలు చేస్తుంటరు, రోజు జేసే పనులల్ల సోయి లేకపోతే ప్రమాదాలు అయితయి. పానం హైబత్ల పడ్తది.
సోయి అనేది రెండక్షరాల పెద్ద ముచ్చట ఇది. మన జీవితాన్ని మెరుగుపరిచే గొప్ప గుణం సోయిది. ఇది విజయానికి నాంది. “సోయితో జీవితం సాగితే, ఎదుగుదల కూడా సహజమే!”
యాదుండని మరి తమ్ముండ్లకు చెల్లెండ్లకు.
ప్రేమతో
మీ
రమక్క