“ఏంరా సైదులు బర్త్డే పార్టీ ఏడ ఇస్తున్నవ్ రా ఈపాలి ” అడిగిండు బద్రి సైదులును.
” ఆ.. ఏందిరా ప్రతి యాడాదంటే అయితాది. పోయిన యాడాది చిట్టి లేపినుంటి అందుకని దావత్ ఇచ్చిన. ఇంట్ల సౌదల్ సుత లెవ్వురా. రెండు వేలు బదులిత్తావ్ రా బద్రిగా “అడిగిండు సైదులు.
“ఇస్తగని… చిట్టి ఎంతది లేపినవ్ రా..”
” పెద్దదేనే ఐదులచ్చలు… ”
“వార్నీ… ఐదు లక్షలా.. ఏం జేసినవ్ రా..
ఏమోరా బద్రిగా సమజయితలేదు కర్సయిపోయినయ్’ దిగులుగా అన్నాడు సైదులు.
” దిమాఖ్ ఉన్నాదిరా.. నీకు? నెలనెలా ఎట్ల కడతవ్ రా చిట్టి పైసలు? పొల్ల లగ్గం చేసినవా? పోరగాన్ని సదుపించినవా? తాగి తందనాలాడినావ్ రా … ” బాగా తిట్టిండు బద్రి సైదుల్ని.
కండ్ల నీళ్లు పెట్టుకున్నడు సైదులు.
సైదులు కి వచ్చిన పైసలు ఏమైపోయినయో..ఎట్ల కర్సయ్ పోయినయో సుత అర్థమైతలేదు. గిట్ల శాన మంది ఉంటరు. అసొంటోళ్ళ గురించే ముచ్చట పెడ్దాం ఇయ్యాల.
“ఉన్ననాడు వైకుంఠం, లేనినాడు ఊకుంటం” అనే సామెత ఇసొంటోళ్లను చూసే పుట్టినట్టుంది. కొందరు ఉంటరు నాలుగు పైసలు జేబుల ఆడంగనే ఇగ నవాబుల లెక్కనే ఫీల్ అయితరు. పట్టేటోళ్లు ఉండరిగ వాళ్లను. ‘షేర్ కా దాదాహు…!”
అన్నట్టే తిరుగుతరు. ఇగ పైసల్ కతమైనయో.. పిల్లికూనలే…ఒక మూలకు గూసుంటరు. ఇదేమన్న తెలివైన పనా.!? ఇట్ల చేసుడు కరెక్టాl మీరు గూడ ఇసంటోల్లను చూసిన్రా, లేకపోతే మీరు గిట్ట ఇట్ల చేస్తారా..? ఒక పాలి ఆలోచన చేసి మన జీవనశైలి, అదే లైఫ్ స్టైల్ అంటరు కదా దానిని సరిగ చేసుకోవాలె.
అదే ఇంకొక ముచ్చట ఇనుండి, బద్రి పెండ్లాము అన్సూయ డ్వాక్రా గ్రూపులల్ల 70 వేలు లోను తీస్కొని పిండి గిర్ని పెట్టింది. అండ్ల దోస పిండి, ఇడ్లి పిండి, వడ పిండి గిట్ల అన్నీ మంచిగ గ్రైండు జేసి కిల, అద్ద కిల ప్యాకిట్లు కట్టి అమ్ముతది.మస్తు గిరాకి అయితది ఎర్కనా..! సాఫ్ట్వేరు ఉజ్జోగస్తులైతే ‘ఆంటీ పిండి రెడీ వెట్టు ” అని ఫోన్లు జేసి కొంచవోతరు. సర్కారు లోను సుత తీర్సుస్తుంది. బద్రికి మస్తు ఆసరయితుంది. పిల్లల్ని కేంద్రయ విద్యాలయకు తోల్తుంది. గట్లుండాలి ఇగురం అంటే…! సైదులు లెక్క ఉంటే ఎట్ల?
ఇంక కొంత మంది ఉంటరు. గొప్పలకోసం అవుస్రం ఉన్న, లేకున్నా వస్తువులు కొనుడు, అడిగినోళ్లకు, అడగనోళ్లకు పెట్టుడు జేస్తరు.దానకర్ణుడు వీళ్ళ సుట్టం అన్నట్టే ఉంటది వీల్ల ఏషం. గీ కత ఎట్లుంటదంటే..ఎన్కా ముందు ఆలోచించకుండ ఖర్చు జేసే ప్రతి రూపాయి, భవిష్యత్‌ల కన్నీళ్ల రూపంల సూడాలే.
నిజంగ కష్టంల ఉన్నోల్లకు బుక్కెడు బువ్వ పెట్టు, సదువుకునేటోళ్లకు సాయం జెయ్యాలే. ఆసుపత్రిల ఉన్నోల్లకు ఇంత ఆసర గావాలే.. కానీ బగ్గ తిని బొజ్జ నిండినోళ్లకు అన్నం పెడితే ఎట్లనో, అర్హత లేనోళ్లకు దానం జేసుడు గంతనే. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటయి ఆల్లకు సుత గొప్ప కోసం డొనేషన్లు ఇయ్యొద్దు. సొంచాయించాలే.
ఉన్నయ్ గదా అని దుబారా జేసుడు మబ్బుల నీళ్లు జూసి ముంత ఒల్క పోసుకునుడే అయితది.
సైదులు అప్పటి మందం ఖుషి కోసం పైసల్ ఖర్సు వెట్టిండు, ఇప్పుడేమైంది..!? ఇంట్ల తిననీకి సౌదలు గూడ లేవు. మీదికెల్లి నెల నెలా చిట్టి పైసలు కట్టాలే. రందిల వడ్డడు. ఈయన కత ఇన్నోళ్లకు సాయం గూడ చెయ్యబుద్ది గాదు.
ఆలోచన లేని ఖర్సులు, భవిష్యత్‌ల అప్పులకు బానిసను జేస్తయి… ఏమంటరు చెప్పుండి?!
మనిషి అన్నంక పండుగలు, పబ్బాలు, దావత్లు ఉండాలె. పీస్కం పనులు జెయ్యుమంటలేను తమ్మీ.. జెర సూస్కోవాలే అంటున్న.
ముందుగాల జాగ్రత్తలు తీసుకోకుంటే ఖర్సు జేసిన ప్రతి పైసా, తర్వాత బాధగ మార్తది.
మనకే గాదు, ప్రభుత్వాలకు గూడ ముందు సూపు అవుస్రం. ప్రజలకు ఏమీ జేస్తే మేలైతది అని ఆలోచించి, మంచి పథకాలు తేవాలె. లేదంటే ఖాజానా ఖాళీ అయితది కదా!
పొట్టకు, బట్టకు, సదువుకు, ఆరోగ్యానికి, రోగం వస్తే మందుకు పైసలు ఉండాలె. సంపాదించిన డబ్బులు దీనిమీద ఖర్చు పెట్టాలి. మన తోటోల్లకి కష్టం వస్తే మనం అక్కర అవ్వనీకి గూడ మన దగ్గర పైసలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఖతం బట్టి అడ్క
తినేటోళ్ళ లెక్క ఉండద్దు. అడక తినేటోళ్లు అన్నా అని ఎవర్ని ఇన్సల్ట్ చేసిన అనుకోకుండి. ఎవ్వలమైనా.. సరే దుబారా చేస్తే మన పరిస్థితి గంతే వస్తది అని చెప్తున్న.
ఏదైనా సరే..పెద్దోళ్ళు చెప్పిన మాటలు శానా గొప్పవి. గీ సామెతనే
సూడుండి “ఉన్న నాడు వైకుంఠం, లేనినాడు ఊకుంటం ” ఎంత
మంచిగుంది. ఈ సామెత ఇన్నప్పుడు మనకు హుషారు రావాలె. మన
దిమాఖ్ ల ఆలోచన రావాలి. ఈ కాలంల మనం మోటివేషనల్ టాక్స్ అని ఎంతో అనుకుంటున్నం..కానీ ఒకప్పుడు మన పెద్దోళ్ళు చాలా మంది చదువుకోనోళ్ళు కూడా ఉన్నరు, కానీ ఎంతో గొప్ప మాటలు చెప్పిన్రు. అవి గనక మనము అర్థం చేసుకుంటే మన జీవితము సంతోషంగ, ప్రశాంతంగ ఉంటది.
పెద్ద కలలు కనాలె, వాటిని నెరవేర్చాలంటే దుబారా జెయ్యకుండ డబ్బును, సమయాన్ని గూడ ముందుసూపు తోని మెల్గుదాము.
మన పిల్లలకు గూడ మంచి బాట సూపిద్దాం. “ఉన్ననాడు వైకుంఠం, లేనినాడు ఊకుంటం ” అనకుండా.. “పెద్దల మాట సద్దన్నం మూట అందాము”
ఉంట మరి
పెద్దోళ్ళకి దండాలు,చిన్నోలకి దీవెనలు.
ప్రేమతో
మీ
రమక్క