రమక్కతో ముచ్చట్లు -18

బొడ్డు తాడు

అందరికీ శనార్థులు!

ఇయ్యాల మీ అందరితోని తల్లికి మనకు ఉన్న వారధి బొడ్డుతాడు గురించి మాట్లాడాలి అనుకుంటున్న.
అమ్మ అన్న రెండు అక్షరాల కన్న పెద్ద పెద్ద గ్రంథము ఈ భూమి మీద లేదంటరు.
తొమ్మిది నెలలు తల్లి కడుపుల ఉన్న మనము, భూమి మీద్కి వడంగనే కెవ్వుమని ఏడుస్తం. ఎందుకంటే ఆ వెచ్చదనం కెల్లి,ఆ భద్రత కెల్లి బయటపడంగనే బిడ్డ ఆగమైతదంట!
ఏమైనా.. మల్లొక జన్మనే ఆడదానికి తల్లి అవడు అంటే! అందుకే దేవుని కన్న గూడ తల్లి గొప్పది అంటరు.
తల్లి ప్రేమను అర్థం చేసుకునుడు అంటే త్యాగాన్ని, స్వచ్ఛమైన ప్రేమను, నిరంతర సేవను అర్థం చేసుకునుడే! బొడ్డు తాడుతోని మొదలైన ఈ ప్రయాణం, జీవితాంతం తల్లి తన బిడ్డ కోసం జేసే కృషిల, బిడ్డ పట్ల చూపించే ప్రేమల కనిపిస్తుంటది.
కండలు పెరిగినంక గుండెల మీద తన్నేటోళ్లు ఆలోచించాలి.
తల్లినీ, బిడ్డెను తొమ్మిది నెలలు కలిపి పెట్టింది బొడ్డుతాడు. ఆ బొడ్డు తాడే జీవధారయ్యి బిడ్డకి ప్రాణ శక్తిని ఇస్తది.

శాస్త్రపరమైన దృష్టికోణంల సైన్సు ఏమంటదో బొడ్డుతాడు గురించి ముందు తెలుసుకుందం.

గర్భంల బిడ్డ పెరుగుదలకు అవుస్రమైన అన్ని జీవద్రవ్యాలు బొడ్డు తాడు కెంచెల్లి అందుతయి. ప్లాసెంటా అంటరు. దీని నుంచి బిడ్డెకు ఆహారం, ఆక్సిజన్ చేరుడు , వ్యర్థాలు ఎన్కకు పంపుడు అసొంటి పనులన్నీ బొడ్డు తాడు జేస్తది. ఈ తాడు, ఒక లైఫ్ లైన్‌ లెక్క అన్న మాట. బిడ్డెకు ఆరోగ్యం, జీవన శక్తిని అందిస్తది.

బొడ్డు తాడుల మూడు భాగాలుంటయి

ఒకటి అంబిలికల్ వెయిన్, ఇది తల్లి నుంచి బిడ్డెకు ఆక్సిజన్‌తోని ఉన్న రక్తాన్ని చేరుస్తది. రెండోది ధమనులు- అంబిలికల్ ఆర్టీరిస్ : బిడ్డ శరీరంల వ్యర్థ పదార్థాలను ప్లాసెంటాకు వెనక్కి
తీస్కపోతయి.
మూడోది వార్టన్స్ జెల్లి :గీ పదార్థం బొడ్డు తాడును కాపాడుతుంటది, ఇది మెత్తటిదే గానీ, గట్టి బందోబస్త్ ఉంటది.
దేవుని మాయ, దేవుని నిర్మాణం అనాల్నా, సైన్స్ అనాల్నా, ఇగ మీ ఇష్టం!
కడుపులవడ్డ పానంని ఎట్ల రక్షిస్తదో ఈ బొడ్డుతాడు. ఆ సృష్టించింది ఎవరో.. దాని నిర్మాణం ఏందో… ఎంత ఇచ్చెంత్రం కదా!?

శాస్త్రపరంగ సూస్తే, ఇది ఒట్టి ఒక జీవశాస్త్రపరమైన వ్యవస్థలెక్క అనిపిస్తది గానీ దాని నుంచెల్లి ప్రతి కణానికీ చేరే తల్లి ప్రేమ, రక్షణ, సమస్తం జీవితం అంత ఉంటది. ఆ బంధం ఆడికెల్లే మొదలైతది.

జీవితంల ప్రతీ అస్తిత్వానికి మూలం తల్లి. ఆత్మసంబంధం, ప్రేమ, అనురాగం, అటాచ్మెంట్ అన్నీ తల్లితోని ఉన్న అనుబంధంతోనే మొదలయితయి. ఈ అనుబంధాన్ని యాది జేస్తూ, జీవజ్యోతి ఇచ్చే పునాది బొడ్డుతాడు రూపంల మొదలయితది. బొడ్డుతాడు అంటే శారీరక సంబంధానికి గురుతు ఒక్కటే గాదు తమ్మీ.., అది తల్లీ బిడ్డెల నడిమి ఉన్న ప్రేమానుబంధానికి,మానసిక ఆత్మసంబంధానికి కూడా ఒక ప్రతీక.

బొడ్డు తాడు, ఒక నిశ్శబ్ద వారధి. ఇది కేవలం శారీరక సంబంధమే గాదు, తల్లి బిడ్డెల మధ్య ప్రేమానుబంధాన్ని, జీవన క్రమాన్ని, ఆత్మీయతను నిలిపే పెద్ద బ్రిడ్జి. ఇది జీవితంల తొలి అటాచ్మెంట్ – బిడ్డె గర్భంల ఉండంగనే తల్లితోని ఏర్పడే నిత్య సంబంధానికి సాక్ష్యం.

బొడ్డు తాడు తెగడం అంటే శారీరక బంధం ముగిసినట్టే అనిపిస్తది. గానీ, ఇది ఆ బంధానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తది. బిడ్డె పుట్టిన తరువాత గూడ తల్లి బిడ్డెను పోషించుడు, తన సనుబాలు అందించుడు,రక్షించుడు, ప్రేమించుడు జన్మంత జేస్తది. ఈ అనుబంధం రక్తంలనే రాసుకుపోయినట్టు అననీకి బొడ్డు తాడు అత్యుత్తమ సాక్ష్యం!

గర్భంల బిడ్డ పెరుగుతూ తల్లితోని ఒక ప్రాణానికి రెండవ రూపంలెక్క ఉండనీకి బొడ్డు తాడే ఆధారం! అది లేకుంటే ఒట్టిదే ఇగ జీవి లేనట్టే! తల్లి తిన్న అన్నం బొడ్డుతాడు నుంచి పోవుడే గాక తల్లితోని బిడ్డకు రక్తంతో పునాది వేస్తది.
బొడ్డు తాడు తల్లితో ఉన్న శారీరక బంధాన్ని గుర్తుచేస్తది అని ఎర్క గదా! తల్లి గర్భకాలంల 40 వారాల పాటు బిడ్డకు శక్తిని, జీవాన్ని అందించిన ఈ తాడు తెగిపోయిన తరువాత కూడా, అది అనుబంధాన్ని పూర్తి చేయదు. బిడ్డ పుట్టిన తరువాత తల్లీ బిడ్డ మధ్య ఉన్న ఆ మానసిక అటాచ్మెంట్ బొడ్డు తాడును ప్రతిబింబిస్తుంది. ఈ బంధం ప్రపంచంలోని ఏ బంధానికీ సాటిరాదు.

ఇప్పుడు సైన్సు బాగా పెరిగి, బొడ్డుతాడు ‘ ఈ అంబులికల్ కార్డును’ దాచి పెట్టి ఆ స్టెమ్ల కెల్లి ఏమేమో… చేసి ఆ బిడ్డకు జీవితంల ఎప్పుడున్న రోగాలు వస్తే… అండ్ల కెల్లి తయారు చేసిన మందుతోనే ప్రాణం పోస్తున్నరట! దీని సంగతి పూర్తిగా ఇంకోసారి మాట్లాడుకుందాం! ఇప్పుడు స్టెమ్ అని ల్యాబ్లల దాచిపెడుతుండ్రు. మన పెద్దోళ్ళు పూర్వకాలంల, బొడ్డుతాడు ఊసిపోయినంక తాయత్తుల పెడుతుండే! దానిని చూసి అప్పుడు నవ్విన్రు! ఇప్పుడు దానిని ల్యాబ్ల పెడుతుండ్రు ఏమనాలే!

బొడ్డు తాడు తెగగానే బిడ్డ స్వతంత్రంగ శ్వాసించటం మొదలువెట్టినా..తల్లి ప్రేమ ఆత్మగర్భంఅది అట్ల కొనసాగుతనే ఉంటది. ఈ బంధం జీవనాంతం ఉంటది.
బయటికి కనబడకపోయినా.. చూపిచ్చుకోకపోయినా అది అట్లుంటది!
తల్లికి బిడ్డ మీద ఉండే ఆత్మీయతను, బాధ్యతను, త్యాగానికి ఒక నిషాని పసిగట్టే ఈ బొడ్డు తాడు! మన జీవితంల సైన్సు మరియు ఎమోషన్ కలిసి ఒడిసి పట్టిన అద్భుతమైన అటాచ్మెంట్ బొడ్డుతాడు!

బొడ్డు తాడు తల్లి బిడ్డెల శరీరాలను కలిపిన ఆత్మ బంధం! ప్రేమకు మాతృత్వానికి మధ్యల ఉన్న వారధి. ఇది తల్లి ప్రేమకు శాస్త్రపరమైన ఆధారం మాత్రమే కాదు, ఆత్మీయతకు, శాశ్వత అనుబంధానికి ప్రతీక.
“ప్రతి శ్వాసల తల్లి గొంతు, ప్రతి గుండె సప్పుడుల బొడ్డు తాడుల తల్లి ప్రేమ పంచిన అన్నంముద్ద ఉంటది.
బొడ్డు తాడు – తల్లి ప్రేమకు ప్రతీక!
బొడ్డు తాడు ఆధ్యాత్మిక అనుబంధానికి కూడా నిషాని. తల్లితోని ఉన్న బంధాన్ని బలపరచే ఈ తాడు, ప్రేమ, త్యాగం, కట్టుబాటు, ఆత్మీయత అన్నీ కలిపిన ముద్ర. తల్లీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే, బొడ్డు తాడుతో మొదలైన ఈ ఆధ్యాత్మిక అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో అవసరం.
నీ పూర్వ పుణ్యం, నీ తల్లి పూర్వపుణ్యం, ఈ జన్మల తల్లి బిడ్డలుగ మారిన్రు అననీకి నిషాని గూడా ఈ బొడ్డుతాడే!

ఉంట మరి, పైలం!
ప్రేమతో
మీ రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కల

“నేటి భారతీయమ్” (కాలమ్)