యూరోప్ ట్రిప్ – 14 

తేది: 21-8-2024. కిందటి వారం తరువాయి భాగం… 

యూరోప్ లోని పారిస్ కి ప్రయాణం 

మూడు రాత్రులు, రెండురోజులు, మొత్తం డెబ్బై మూడు గంటల మధురమైన అనుభవాన్నిచ్చిన  లండన్ ను వదిలి వెళ్ళాలి అనుకుంటుంటే చాలా బాధ కలిగింది. కానీ చూడబోయే దేశాలను తలచుకుంటూ కొంత ఉత్సాహాన్ని నింపుకుంటూ పొద్దుటే లేచాము. 

ఉదయమే ఏడుకి ఉప్మా మష్రూమ్స్, వాటర్ మిలన్, గుమ్మడి గింజలు, ఎగ్ వేడి నీళ్ళ తో బ్రేక్ఫాస్ట్ చేసి, మా సూట్కేసెస్ అన్నీ పాక్ చేసుకుని హోటల్ రూం ఖాళీ చేసి బస్సు దగ్గరికి వచ్చాము. అప్పటికే అందరి లగేజెస్ ని బస్సులో పెడుతున్నాడు డ్రైవర్. వైదేహి ఎంత ముందుగా చెప్పినా, తొందర పెట్టినా మేమంతా బస్సులో కూచుని బయలు దేరేసరికి తొమ్మిది అయిపోయింది. ఆక్షర్ ని వదిలి వెళుతున్నందుకు ఎలాగో అనిపించింది. అందరం అల్విదా లండన్ అంటూంటే మనసు మూలిగింది. ఆ లండన్ లో తెలుసుకున్న విశేషాలు మరో సారి మనసు మననం చేసుకుంది.  మన ఇండియా లాగా అతి పురాతనమైన చరిత్ర కలది అనుకున్నాను. ప్రణయ్ కూడా అలాగే ఫీల్ అయ్యాడు. కాని, చాలా మందికి తెలియని ఎన్నో విశేషాలున్నాయి. 

అసలు లండన్ పేరుకి మూలం ‘లాండీనియమ్ రోమన్ సిటీ’ నుంచి వచ్చిందని చెబుతారు. ఐరిష్, పోలిష్, బాంగ్లాదేశీయతో పాటు విభిన్న సంస్కృతుల సమ్మేళనం కలిగినది. 300 లకు పైగా భాషలు మాట్లాడుతారట. 597 AD కి సంబంధించిన అతి పురాతనమైన సెంట్ మార్టిన్ చర్చ్, గోస్ట్ స్టేషన్ అని చెప్పుకునే ఆల్డ్విచ్ స్టేషన్ లండన్ లో ఉంది. యుకే లోని 14% జనావళి అంటే సుమారు 8.9 మిలియన్ల ప్రజలు లండన్ లోనే నివసిస్తున్నారట. ప్రపంచంలోని అత్యుత్తమ 40 యూనివర్సిటీస్ లలో నాలుగు ప్రధానమైనవి ఇక్కడ ఉన్నాయి. బ్రిటిష్ లైబ్రరీ 150 మిలియన్ల పుస్తకాలతో ప్రజలకు అందుబాటులో విరాజిల్లుతోంది. లండన్ లోని బకింగ్హమ్ పాలెస్ లో 775 గదులున్నాయట. 

మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టుగా బిగ్బెన్ అఫీషియల్ పేరు ఎలిజబెత్ టవర్. లండన్ ఐ యూరోప్ లోని ఎత్తైన కాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్ అంటే ఆ చక్రం ఒకవేపు మాత్రమే ఇనుప బీమ్ లకు ఫిక్స్ చేయబడి ఉంటుంది. క్రిందటి సంవత్సరం సుమారు 200 సినిమాలను లండన్ లో చిత్రీకరించారట. అతి ముఖ్యమైన ప్రపంచ ప్రసిద్ధి పొందిన పురాతనమైన టెన్నీస్ వింబుల్డన్ టోర్నమెంట్స్ కి ఆతిథ్యం ఇచ్చేది లండన్. అక్కడ 1700 లకు మించి పబ్ లో ఉన్నాయి. ప్రపంచంలో అతిపురాతన మైనది లండన్ మెట్రో అండర్ గ్రౌండ్ రైల్వే. ఆర్కిటెక్ట్ గిల్స్ గిల్బర్ట్ స్కాట్ రూపొందించిన ఎర్ర టెలిఫోన్లు లండన్ ఐకానిక్ గా ప్రపంచ గుర్తింపుపొందాయి. ఎక్కడ చూసినా మనకు ఎర్రటి డబుల్ డెక్కర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కనబడతాయి.  

ప్రపంచంలోని అతి పెద్దదైన అర్బన్ పార్కుల్లో లండన్ లోని హైడ్ పార్క్ ఒకటి. ఎనిమిది మిలియన్ల వృక్షాలతో గ్రీన్ సిటీగా పేరుగాంచినది, ప్రపంచంలోని ప్రసిద్దమైన చాలా మ్యూజియమ్లు గాలరీలు ఉన్నది లండన్ లోనే.  లండన్‌లో ఒక శక్తివంతమైన వీధి కళా దృశ్యం ఉంది, ఇందులో బ్యాంక్సీ మరియు ఇతర ప్రసిద్ధ కళాకారుల రచనలు ఉన్నాయట.  

ఇలా మేము చూసిన, విని అర్థ చేసుకున్న లండన్ గొప్ప విషయాలను నేను ప్రణయ్ మరో సారి గుర్తు చేసుకుంటుండగా, బస్సులో ప్రయాణీకుల గొడవ, మైక్ లో వైదేహి అనౌన్స్ మెంట్  మా ఆలోచనల్లోంచి బయటికి తెచ్చాయి. మొదటి రోజుకంటే ఇప్పుడు ప్రయాణికులంతా పరస్పరం మాట్లాడుకో సాగారు. వైదేహి అందరిని పరిచయం చేసింది. ఎవరికి వారు తమ గురించి చెప్పుకున్నారు. దాదాపు అందరూ పెద్దవారు రిటైర్ అయిన వారు కొందరు, ఒకరిద్దరు జాబ్ హోల్డర్స్ ఉన్నారు.  

జ్యోతి తమ గురించి చెబుతూ తాను వర్కింగ్ లేడీ అని, తన తల్లి కాన్సర్ సర్వైవర్ అని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఆమెకు అన్ని దేశాలు తిరగాలని కోరిక ఉండటం వల్ల ఆమెను తీసుకుని వచ్చానని చెప్పింది. అందరం చప్పట్లతో ఆమెని అభినందించాము.  

ఇంకొక తల్లీ కూతుర్లు కూడా వచ్చారు. అమ్మాయి మిథాలి, బొంబాయి లో సారీస్ బిజినెస్ చేస్తుందట ఆమె తల్లి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ నాలుగేళ్ళ క్రితం  రిటైర్ అయిందట.  

కొత్తెగూడం నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు బిజినెస్ ఉందని భార్యాభర్తలిద్దరూ తమ బిజినెస్ చూసుంటారట. పెద్దబ్బాయి కెనడా లో ఉద్యోగం. చిన్నాడు చదువు పూర్తి చేసి తండ్రి బిజినెస్ నే చూసుకుంటున్నాడట.  

శ్రీవాత్సవ కూడా రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. చాలా గట్టిగట్టి గా మాట్లాడుతూ ఉంటాడు. మాట కొంచెం రఫ్ గా ఉంటుంది. భార్యను అందరితోనూ అవమానించినట్లుగా అరుస్తుంటే మాకు కొంచెం చికాకు తెప్పించింది.   

ఇంకో కుటుంభం మరాఠీ యాస లో మాట్లాడుతున్నారు. తల్లీ తండ్రితో వాళ్ళ అమ్మాయి వచ్చింది. కొద్దిగా ఏజ్డ్ గా ఉన్నారు వాళ్ళిద్దరు. కాని అమ్మాయి  షీల్, పాతిక సంవత్సరాల పిల్లలాగా ఉంది. ఉద్యోగం చేస్తుందట. మరో ఫామిలీ తమీళియన్స్ తల్లీ తండ్రిని తీసుకుని వాళ్ళ అబ్బాయి వచ్చాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాదు. అబ్బాయి కృష్ణ ఇంగ్లీష్ మాట్లాడు తాడు. వాళ్ళకు కూడా చాలా పెద్ద వ్యాపారమే ఉందట తిరుచ్చిలో.  నాకు తమిళ్ కొంచెం వచ్చు కాబట్టి తండ్రి నాతో మాట్లాడే వాడు.  

మరో  నార్త్ ఇండియన్ ఫామిలీ బహుశా తల్లి కూతుర్లు భర్తల తో పాటు వచ్చినట్టున్నారు. మాతో ఎక్కువగా కలవక పోవటంతో అంత డిటేల్స్ తెలియదు.  మరో ఫామిలీ అహమ్మదాబాద్ నుంచి వచ్చారు. తల్లి కూతురు కొడుకు. ఆ అబ్బాయి చిన్నవాడైనా తల్లి చెల్లెలు గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ప్రణయ్ వాళ్ళతో ఎక్కువగా కలిసి ఉండేవాడు.  

వైదేహి మమ్మల్ని పరిచయం చేస్తూ ‘ హియర్ ఈజ్. వండ్రఫుల్, లౌలి ఫామిలీ గ్రానీ విత్ గ్రాండ్ సన్. యస్…మిసెస్ విజయలక్ష్మి అండ్ ప్రణయ్. షి ఈజ్ సీనియర్ మోస్ట్ ఇన్ అవర్ ట్రూప్ అండ్ ప్రణయ్ ఈజ్ జూనియర్ మోస్ట్ టూర్ మెంబర్. వెన్ ఐ స్పోకెన్ టు హర్ డాటర్, ఐ వజ్ లిటిల్ బిట్ వరీడ్. షి ఈజ్ సెవెంటీ వన్. బట్ ఆఫ్టర్ మై టూడేస్ ఎక్స్పీరియన్స్…. మైగాడ్ షి ఈజ్ వెరీ ఆక్టివ్ అండ్ ఎనర్జిటిక్. లవ్లీ… కీపిటప్ మేడమ్. థాంక్స్ ఫర్ కమింగ్.’ అంది. వెంటనే మా ప్రణయ్ మైక్ తీసుకుని…’మై గ్రానీ ఈజ్ స్వీట్ సిక్స్ టీన్. యూ నో.. షి ఈజ్ ఎ రైటర్ అండ్ పోడ్కాస్టర్. షి రోట్ టూ బుక్స్. వన్ ఈజ్ హర్ ఆటో బయోగ్రఫీ.’ అంటూ చెప్పాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే కొంచెం సిగ్గనిపించింది. నేను రిటైర్డ్ అని మాత్రమే నేను పరిచయం చేసుకున్నాను. వాడు మాత్రం తెగ చెప్పేసాడు. వాణ్ణి విసుక్కున్నానుఎందుకు అందరితో చెప్పటం. ఏదో కొద్దిరోజుల పరిచయానికి ఇదంతా అవసరమా అని.  

పిల్లలు అందరూ కలిసి పోయారు. కొత్తగూడెం వాళ్ళు సాయి కిరణ్, తరుణ్, తమిళ అబ్బాయి కృష్ణ, అహమ్మదాబాద్ అబ్బాయి వినోద్, గుజరాతి అమ్మాయి షీల్, ప్రణయ్. ఆరుగురు నా వెనకాల బాక్ సీట్లో కూచుని సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన అందరూ నిద్ర లోకి వెళ్ళి పోయారు.  

లండన్ నుంచి 178 కిలో మీటర్స్ బస్సులో ప్రయాణించి ఇంగ్లీష్ చానల్ ఒడ్డునున్న డోవర్ చేరేసరికి 11.30 పైన పట్టింది. ఇంగ్లాండ్ బార్డర్ నుంచి ఇంగ్లీష్ చానల్ సముద్రం మీద ప్రయాణించాలి. చాలా పెద్ద నావ అది. బస్సు కూడా దాంట్లోకి వెళుతుందట. మేము పైన అంతస్తులోకి వెళ్ళాలి. లంచ్ కూడా అక్కడే చేయొచ్చట.  

అక్కడ ఫ్రాన్స్ సరిహద్దుల్లో దేశం దాటుతున్నాం కాబట్టి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మా పాస్పోర్ట్స్ పట్టుకుని లైన్ లో నిలుచున్నాము. షెన్జెన్ వీసా అంటే యూరోప్ కంట్రీస్ లోకి వెళ్ళటానికి ఒకే వీసాను ఇస్తారు. దాన్ని చెక్ చేసి స్టాంప్ వేస్తారు. అప్పుడు కాని ఆ నావలో ప్రయాణించి ఆవల ఒడ్డున ఉన్న ఫ్రాన్సుకి చేర్తాము. అప్పటికే మా ట్రూప్ మానేజర్ వైదేహి, ఇక్కడ మానెర్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారని, ఫ్రెంచ్ ఎక్కువగా మాట్లాడుతారని చెప్పింది. వెళ్ళగానే గుడ్మార్నింగ్ని “బోన్జోర్ర్” అని అనాలని, స్టాంపింగ్ అవగానే పాస్పోర్ట్ తీసుకుంటూ థాంక్యూని “మెర్సీ అనాలని మాకు వివరించింది. నాకు కొద్దిగా డిగ్రీలో చదివినఫ్రెంచి ఆ మాత్రం జ్ఞాపకం ఉంది. మిగిలినవి మర్చి పోయాననుకోండి. ఆభాషలోప్రతీ దానికి స్త్రీలింగం పుల్లింగాలు మాత్రమే ఉంటాయి. వస్తువులకు కూడా అలాగే వాడుతారు. కొంతెం కష్టమైన భాషే. కానీ నేను చాలా ఇష్టంగా తీసుకుని చదివిన సబ్జెక్ట్. తరువాత ఆభాష పూర్తిగా నేర్చుకోవాలని ఉండింది.ప్చ్…కుదరలేదనుకోండి. 

 మా గ్రూపు అంతా లైన్ లో నిలుచున్నాము. రెండు కౌంటర్లకి రెండువరుసలుగా నిలుచో పెట్టారు. మొదట మాకు వీసా ఇష్యూ చేసినప్పుడే ఇన్స్టక్షన్స్ స్లిప్ ఒకటి పాస్పోర్ట్ లో పెట్టి ఇచ్చారు. ఇన్సురెన్స్ తదితర సరియైన పత్రాలు లేనిదే సెక్యూరిటీ క్లియరెన్స్ చేయరని, ఏమాత్రం సరిగా లేకపోయినా తిప్పి పంపుతారని ఆ స్లిప్ లో ఉంటే నేను మా డాక్యుమెంట్స్ అన్ని హార్డ్ కాపీలుగా కూడా తీసుకెళ్ళాను. చాలా స్ట్రిక్ట్ అని భయపడుతున్నాము. వీసా చెక్ బిల్డింగ్ లాంటిదేమి లేదు అక్కడ. మన దగ్గర టోల్ ఫ్రీ గేట్ లాగా ఉంది. రోడ్డుకు అడ్డంగా వరుసగా రెండు కౌంటర్స్ ఇద్దరు ప్రెంచ్ ఆఫీసర్స్ కూచుని ఉన్నారు. మేము లైన్ గా నిలుచున్నాము. నా కెందుకో ఎడమ వైపున ఉన్న ఆఫీసర్ చాలా బాగా అనిపించాడు. నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వెంటనే నేను లైన్ లోకి మారాను. ప్రణయ్ ఎందుకలా అంటున్నాడు. అతను ఈజీ గోయింగ్ లాగా ఉన్నాడు. పెద్ద ప్రాబ్లమ్ చేసేవాడిలాగ అనిపించడం లేదు అందుకే ఇటువైపు లైన్ కి మారానని చెప్పాను. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆప్ ది బిహేవియర్ అండ్ కారెక్టర్ అంటారు కదా. అందుకేనేమో నాకలా అనిపించింది. మేము వెళ్ళగానే ‘గుడ్ మానింగ్ మామ్. అన్నాడు. ఆయనే ఇంగ్లీష్ లో మాట్లాడుతే నేను ఫ్రెంచ్ లో ఏం చెబుతాను. నేను అలాగే విష్ చేసాను. ఏమీ అడగకుండానే మా పాస్పోర్ట్ తీసుకుని స్టాంప్ వేసి నవ్వుతూ ఇచ్చాడు. నేను రిలీఫ్ గా ఫీలవుతూ. మెర్సీ అని చెబితే నవ్వాడు. మా గేట్ తలుపు తెరచుకుంది. హమ్మయ్య అనుకుంటూ బయట కొచ్చాము. 

 మాలో ఒకతనికి షెన్జెన్ వీసా పాస్పోర్ట్ లో రెండు పేజీల్లో పక్కపక్కనే ఇచ్చారు. అది వీసా ఇచ్చిన వారి తప్పిదం. ఆ ఆఫీసర్ ఏది తీసుకోవాలి అంటూ ప్రెంచిభాష యాసలో ఇంగ్లీషులో గట్టిగా అడుగుతుంటే ఇతను బిక్కచచ్చిపోయాడు. మా థామస్ కుక్ ట్రూప్ మేనేజర్ కల్పించుకుని నచ్చచెప్పి ఫార్మాలిటీని పూర్తి చేయించింది.  

 మాకు లండన్ నుంచి ఫ్రాన్స్ చేరటానికి సముద్రం మీద ఫెరీ లో ప్రయాణించాలి. ఆ నౌక చాలా పెద్దది. మా బస్ తో సహా ఆ నౌకలోకి లెవెల్ 5 లోకి వెళ్ళాము. బస్ దిగి అంతా లెవెల్ ఎనిమిది చేరి అక్కడ ఉన్న రెస్టారెంటులో కూచున్నాము. నౌక బయలు దేరింది. పెద్దగా ఎటువంటి కుదుపులుగాని, భయంగాని కలుగలేదు. కాని నిలుచుంటే కొంచెం తూగుతున్నట్టుగా అనిపించింది. చుట్టూతా సముద్రం, కనుచూపుమేర నీళ్ళే. కొంచెం భయమేసినా చాలా త్రిల్లింగ్ అనిపించింది.  

 పక్కనే ఉన్న డైనింగ్ హాల్లోకి వెళ్ళాము. వాళ్ళే ఫ్రీఫుడ్ కూపన్ ఇచ్చారు. అది తీసుకుని వెళితే పరిమితమైనవి మాత్రమే ఇచ్చారు. ఇంకా ఏమైనా కావాలంటే ఎక్సట్రా పే చేయాలి. మన అలవాటు ప్రకారం ముందుగా ప్లేట్ తీసుకో పోయాము. అక్కడున్న ఒక లేడి వచ్చిరాని ఇంగ్లీష్ లో “దోంత్ తచ్” అని గట్టిగా అరిచింది. వాళ్ళు “డ” ని “ద, త” లాగా పలుకుతారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతుల్ని వెనక్కి తీసుకున్నాము. అవి స్టీమ్తో స్టెర్లైజ్ చేయబడి వేడిగా ఉన్నాయి. ఒకతను ప్లేట్ లో వడ్డించటం మొదలు పెట్టాడు. వాడు ఫ్రెంచిగోల, నాది వెజిటేరియన్ ఫుడ్ కోసం బాధ. ఫింగర్ చిప్స్, ఒక కటోరీలో ఏదో టమాట కూర లాగా ఉంది అది వేశాడు. ఉడికించిన బీన్స్ బఠాణీ ఒక కప్పులో వేసాడు. అన్నం లేదా అని అడిగితే “నో రైస్. యూ థేకెన్ ఫింగర్ చిప్స్.. నో రైస్ అన్నాడు. అంటే చిప్స్ తీసుకున్నందుకు అన్నం లేదన్నమాట. నాలుగు బీన్స్ ముక్కలు ఆలు చిప్స్ టమాట కూరతో కడుపునింపుకోవాలి. కొంచెం ఆకలి అనిపిస్తుంది. మా ప్రణయ్ కేమో నాన్ వెజ్ కావాలి. వాడు ఫిష్ ఫ్రై తో పాటు అన్నం తీసుకో మన్నాను. నేను అన్నం తీసుకుని వాడికి ఆలు ఫింగర్ చిప్స్ ఇచ్చాను.ఆ అన్నం మన కేరళలా వాళ్ళ బియ్యం లాగా లావుగా ఉంది. నేను ఏమి తినలేక పోతున్నాని మాష్ పొటాటో తెస్తానని వెళ్ళాడు. అవంటే నాకు చాలానే ఇష్టం. యూఎస్ లో మా ఉజ్వల ఆడపడుచు అరుంధతి, ఆంటీగా వెళ్ళి నపుడు తినిపించింది. అంతకుముందు నేను అవి ఎప్పుడు తినలేదు. అలాగే ఉంటుందని ఆశగా ఎదురు చూసా. దానికి తొమ్మిది యూరోస్ ఇచ్చి వాడికి ఫిష్ ఫింగర్ చిప్స్ మూడు, ప్లేటు నిండుగా మనం చేసుకునే ముద్దపప్పు ముద్ద ప్లేటు నిండుగా తెచ్చాడు. అదేమిట్రా అని అంటే “ఇదే మాష్ పొటాటో” అన్నాడు. “ఏమిటి ఈ ముద్దపప్పా?” అని అరుంధతి తినిపించిన ఆలు లావుపాటి ముక్కలను డీప్ ఫ్రై చేసిన మాష్ పొటాటో తలుచుకుంటూ ఉసూరుమన్నాను.మెత్తగా ఆలూని ఉడికించి సుబ్బరంగా పేస్టు లాగా ఏదో ముద్దలాగా తయారుచేశాడు. పాపం ఉప్పుకూడా వేసీవేయనంత వేశాననిపించాడు. రూపమెలా ఉన్నా పోనీ తినటానికైనా బాగుంటుందేమో చూడలేక కళ్ళు మూసుకున్నా నాలుక కూడా మొరాయించింది. నోటికి రుచి కూడా కగలలేదు. మూలుక్కుంటూ తిండి అయిందని పించాము. 

కింద కస్టమ్స్ ఫ్రీ ఐటెమ్స్ ఉన్నాయని కావలసిన వాళ్ళు షాపింగ్ చేయొచ్చని అనటంతో సెవెంత్ లెవెల్ కి వెళ్ళి చూసాము. చాలా రకాల సెంట్స్, డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. ఏమి కొనకుండానే బయటకొచ్చాము. ఇంతలో నౌక ఫ్రాంస్ తీరం చేరటంతో బస్సులోకి చేరాము. మళ్ళీ రోడ్డు ప్రయాణం రెండు గంటల తరువాత దావత్ హోటల్లో డిన్నర్ అనగానే అందరూ అభ్యంతరాలు విన్పించాయి. అప్పటికి ఏడున్నర అయినా కూడా మన దగ్గర సాయంత్రం నాలుగైదు గంటల లాగా ఎండ కాస్తోంది. అయినా తప్పలేదు. అందరం భోజనానికి కూచున్నాము. చాలా రుచిగా ఇండియన్ ఫుడ్ దొరికింది. అందరికి నచ్చింది. అరగంట ప్రయాణం చేసి ప్రాన్స్ లోని హోటల్ బిబ్ లో చెకిన్ చేసి రూం చేరేసరికి తొమ్మిది. రూము పెద్దగా రెండు భాగాలుగా ఉంది. స్లీపింగ్ ఏరియాకి ప్రైవసీ ఇచ్చాడు. ముందు రూములో సిటింగ్ అరేంజ్ మెంట్, ఒక దివాన్ లాంటిది ఉంది. ప్రణయ్ తెగ ముచ్చట పడ్డాడు. ‘లండన్ రూమ్ కంటే ఇక్కడ బాగుంది కదా విజయా’ అన్నాడు. వేడివేడి నీళ్ళతో స్నానంచేసి అలసిన శరీరం, నిద్ర మత్తులోకి జారుకోమంటుంది. కాని ఆరోజు విశేషాలు ఫొటోలు ఉజ్వలతో పంచుకోకుండా ఉండలేం కదా. ఎంతో ఆతృత, కంగారుతో ఇంటిదగ్గర ఎదురు చూస్తుంది. ముఖ్యంగా నా ఆరోగ్యం ఎలా ఉంటుందో ననే దిగులు ఎక్కువ. నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకున్న బయట దేశంలోని వాతావరణం, ప్రయాణపు అలసట నన్ను ఎక్కడ బాధకు గురి చేస్తుందేమోనని దాని కంగారు. తల్లితో మాట్లాడకుండా ప్రణయ్ ఉండలేడు, నాతో మాట్లాడకుండా ఉజ్వల ఉండలేదు. వాళ్ళకు ఫోన్ కలిపి మాట్లాడాము. మొదటి మాట విజయ హెల్త్ ఎలా ఉందని ప్రణయ్ ని అడిగితే…’అయ్యో మమ్మీ… షి ఈజ్ సో ఎనర్జిటిక్ అండ్ స్వీట్ సిక్స్టీన్ అని మా బస్సులో వైదేహి చెప్పింది. విజయ కేం.. జబర్దస్త్ గుంది. నేనున్నాను కదా నేను చూసుకుంటా అంటూ ఒకటే పోజులు. హోటల్ రూమ్ లోకి వచ్చాకే అక్కడి వైఫై తో ఫోటోలు ఫార్వర్డ్ చేయమని పవన్ చెప్పాడు. బయట ఉన్నప్పుడు చేస్తే డాటా ఖర్చుతప్ప సరిగా అప్లోడ్ కావు. అవన్ని అయి నిద్ర పోయేసరికి పదకొండు అయింది.  

మరిక ఏంరాస్తాను. వైదేహి రేపు ఎనిమిది కల్లా బ్రేక్ఫాస్ట్ కి రావాలని తొమ్మిదికి బస్ బయలుదేరుతుందని చెప్పింది. రేపటి విశేషాలు మరో వారం చెబుతాను. 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు -15 వ భాగం

ఒంటరితనం