“యుగాంతమా…?”

కథ

సుంక ధరణి

ఇరవై నాలుగు, మార్చి, రెండువేల ఇరవై…… పోలీస్ యాక్షన్ మొదలవడం, జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చి ఈ రోజుకు రెండు రోజులు.

మేము హైదరాబాద్ నగరానా, అరచేతిలో భయాన్ని అణుచుకుని, టి.వి వాల్యూమ్ కాస్త పెంచి వార్తలు చూస్తున్నాము. కరోనా వైరస్ ఇప్పటికే చైనాలోని వూహాన్ నగరంతో పాటు పలు దేశాలను మృత్యు దండనతో  ముంచెత్తి ప్రపంచంలో అన్ని దిక్కులకు వ్యాపించి దాదాపు అన్ని దేశాల్లోకి చొరబడింది. ఇపుడు భారత్ ను కూడా రెండవ దశలోకి నెట్టి అతలాకుతలం చేస్తుంది.పుస్తకాల్లో ప్రపంచ యుద్ధాల గురించి చదివిన అనుభవం ఉందే కానీ, ఇలా దేశాలు కుప్పకూలడం,విపత్కర సంఘటనల సమహారం,అసలు వాటి వెనకున్న హస్తం ఏవిటో ?

వార్తల్లో ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. కరోనాను ముట్టడించే పనిలో ఉన్న వైద్యులకి, వారి పనితనానికి కృతజ్ఞతలు తెలుపుతూ….”కరోనా..!వదలవా ఇకనైనా” అన్న నినాదాలతో హోరెత్తిస్తోంది టి.వి. జనతా కర్ఫ్యూ లో కూడా భాగమై ప్రజలు మద్దతు అందించినా…హైదరాబాద్ నగరంలో మాత్రం యథావిధిగా దుకాణాలు తెరవడం, కొందరు పట్టింపు లేనట్టు వాళ్ల దినచర్యల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనపరచక ఎప్పటిలానే బయటికి వస్తున్నారు. ఇంకా పోలీసులు రంగంలోకి దిగి లాఠీలు ఘులిపించారు.ఇక నగరంలో చెదురుముదురు వాతావరణం చోటు చేసుకున్న పోలీసు చర్యల వల్ల నగరం పగలైనా నిశ్శబ్దపు రంగులు అలుముకుంది.అందరూ ఊపిరి బిగపట్టి ఎవరి ఇండ్లలో వారు ఉండిపోయారు.

ఇంట్లో తాతయ్యతో కలిసి, కుర్చీలో కూర్చుని వార్తలు చూస్తున్నాను. స్వీయ నిర్భంధన(లాక్ డౌన్)ను ఉల్లఘించి రోడ్లపై తిరిగే వాళ్లను పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు.అది చూసి ఇక పోలీస్ యాక్షన్ వల్లనైనా బయటికి రావడానికి భయపడ్తారు అనుకుని తల పై నుండి బరువు తీసినట్లు అనిపించింది.
“అప్పట్లో నిజాం పాలనలో విముక్తి కోసం ఆర్మీ వాళ్లు ఛార్జీ తీసుకున్నపుడు పాటించిన కర్ఫ్యూ,ఇప్పుడు ఈ సూక్ష్మానికి భయపడి గడప దాటకుండా అయిపోయింది” అంటూ  ఆయన వయస్సులో ఉన్నపుడు జరిగిన విషయాలు నాకు వివరిస్తున్నారు తాతయ్య. ఇంతవరకు సరే అనుకుంటున్న సమయానా  మార్చి 31 వరకున్న లాక్ డౌన్ ను కేంద్రం 21 రోజులుగా పొడిగించినట్లు సమాచారం చక్కర్లు కొడుతోంది.

అది విని నాకు విసుగొచ్చి టి.వి ముందు నుండి లేచి నా రూమ్ లోకి వెళ్లాను. రాత్రి తొమ్మిది కావస్తోంది. అమ్మ భోజనానికి రమ్మంటే తినాలని లేదు అని చెప్పి దీర్ఘమైన ఊహాలో మునిగిపోయా..! “అసలు ఈ వైరస్ కు ప్రపంచాన్నే వణికించేంత శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది. ఇది దాని గొప్పతనమా? మన లోపమా?? దాని ముందు మనం నిరాయుధులుగా మారి, దినమొక గండంగా గడుపుతున్నాము. 21 రోజులు ఎక్కడి వ్యవస్థ అక్కడే ఆగిపోతే.. ఇండ్లలోంచి బయటికి రాకుడదు అంటే..??
ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు సర్వాన్ని తన గుప్పిట్లో బందించింది అంటే ఎంతటి మహమ్మారి అయి ఉంటుందో..! ముందు నుండి “కరోనా” అని అంటూంటే ఇంత కల్లోలం సృష్టించే అగాధం అని ఊహించలేదు. ఏం చేస్తుందో మరి…..

నేను తిన్లేదు అని, కాసిన్ని పాలు తీసుకుని నా రూంలోకి వచ్చింది అమ్మ. “ఏంటే..పిచ్చి దానిలా కిటికీ వైపు చూస్తు ఆ దీర్ఘపు ఆలోచనలు… ఈ పాలు తాగైనా పడుకో.”అని చెప్పి వెళ్లిపోయింది. ఇక ఆ పాలు తాగేసి తాతయ్య దగ్గరకి వెళ్లాను. అప్పటికే ఆయన పడుకున్నారు. ముందైతే నిద్ర వచ్చే వరకు కీర్తనలు పాడుతూ వుండేవారు. రెండు రోజుల నుంచి అవి మానుకుని మనసులో ధ్యానిస్తూ పడుకుని ఉండిపోయారు.

నాకు నిద్ర రావడం లేదు.రేపేమవుతుందో  తెలీక, నా భయాన్ని పారతోలటానికి ప్రయత్నిస్తూ….కిటికీ నుండి బయటికి చూస్తూ చడి చప్పుళ్ళు లేని రోడ్లు స్వఛ్ఛమన గాంధర్వ గాలులు ఒక్కసారిగా ఊపిరి పీల్చి  ప్రాణం గాల్లో వదిలేయాలి అనేంత స్వేచ్ఛ.

ఒంటరిగా అరుగు మీదకొచ్చి చూస్తే ప్రపంచాన నేనే ఉండిపోయాను అనేంత భ్రమ. ఈ నిశీధి అలుముకున్న నిశ్శబ్దం… ఈ నగరం పులుముకున్న నిర్ణయం….

రాత్రి పదకొండు గంటలైంది. ఎవరో పిలుస్తున్నట్టనిపించింది. అవతలి నుండి “ఎవరైనా…! ఉన్నారా” అన్న పిలుపు వినిపిచింది.
ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.భయంతో రోమాలు నిక్కపొడిచాయి.గుండెదడ పెరిగిపోయింది.
ఎవరు? ఎవరై ఉంటారు…? ఈ టైం లో ఇళ్లు వదిలి ఎవరు రావట్లేదు. పోనీ పక్కింటి వాళ్లా..? అదీ, ఇంత రాత్రి?
“సార్..!” మళ్లీ పిలుపు.
“ఎవరూ ,” అంటూ హాల్లోకి వెళ్లా, ఆ అరుపులకు ఇంట్లో వాళ్లు లేచారు.
“నాన్న నెమ్మదిగా తలుపు తీసారు” ఎవరదీ అన్నారు.
“సార్ కొన్ని మంచి నీళ్లుంటే  ఇస్తారా” వచ్చింది ఓ కానిస్టేబుల్ ఎంతో ఆసాయంతో కూలబడిపోయి ఉన్నారు.

వెంటనే వెళ్లి మంచి నీళ్లు తెచ్చి ఆయనకి ఇచ్చాను.
గబగబా తాగేసి కృతజ్ఞతలు చెప్పి నిల్చున్నారు.
వెళ్ళడానికి వెనుదిరిగిన ఆయన్నీ “సార్, ఏవైందీ,ఎందుకింత హడావిడిగా వచ్చారు.”అని తాతయ్య అడిగారు.
“ఇళ్లలో ఉండమంటే పోయేకాలం వచ్చినవాళ్లలా బయట తిరుగుతున్నారు గా..అందుకే మాకు రాత్రులు కూడా నిఘా ఉంచమన్నారు. ఇటు వైపుగా నలుగురు కుర్రాళ్లని తరుముతూంటే, ఇదిగోండి ఇక్కడ తప్పించుకున్నారు. క్షమించండి. కంగారు పడుంటారు మిమ్మల్ని ఈ టైంలో పిలిచినందుకు” కానిస్టేబుల్ బదులిచ్చారు.
“పర్వాలేదు సార్! మా కోసం మీరు ఎంతో చేస్తున్నారు.దాని ముందు ఇది ఎంత..” మా మాటలని స్వీకరిస్తూ
“రాష్ట్రంలో పరిస్థితి విషమంగా మారే స్థితి ఉంది.దయచేసి ఇంట్లో నుంచి బయటికి రాకండి.అత్యవసర పరిస్థితుల్లో తప్పించి. మీ గురించి మేము పడే కష్టానికి మాకోసం కాకపోయినా మీ కోసమైనా పాటించండి”అని చెప్తుండగా
“తప్పకుండా సార్..”అని చెప్పి, ఆయన వెళ్లాక అందరం ఇంట్లోకి వెళ్లి పడుకున్నాం.

కానీ నా కంటికి కునుకు రావట్లేదు. లేచి కిటికీ పక్కన నిల్చుని…
“ఇది ఎవరి కథాంతమౌనో.. మనందరి యుగాంతమౌనో..
  ఇంకా దీని విచిత్రాలు ఎన్ని చూడాలో..?
  ఆ భరతమాతే తనని తాను బందించుకుని
  దీన్నీ వెలివేయడానికి నడుం బిగించిందనుకుంటా
  తల్లి ఋణం తీర్చుకొనేందుకు అవకాశం వచ్చిందిగా
  మరి ఇప్పుడు సరైన దారిలో వెళ్లక, రోడ్లపై తిరగడాలేంటీ
  పౌరులుగా పది మందికి మీ జ్ఞానాన్ని అందించడం పోయి,
  పిచ్చి చేష్టల్తో జనాలతో తిట్లు తినడం తప్పి…
  అయినా ఇది విధ్వంసమవునో..విరామం పొందునో..ఏమో…”
నాకు నిద్ర ఎప్పుడు పట్టిందో తెలినేలేదు. పొద్దున్న లేచేసరికి
“ఎంత సేపు పడుకుంటావే..ఆఫీసుకి టైం అవుతుంది లేచి రేడీ అవ్వు.”అంటూ టీ టేబుల్ పై పెట్టి వెళ్లింది అమ్మ.
ఇదేంటీ అనుకుంటూ హాల్లోకి వెళ్లి చూస్తే తాతయ్య పేపర్ చదువుతూ టీ తాగుతున్నారు. “ఏంటీ! ఇదంతా కలా..” అనుకుంటున్నా..
“ఏమైందీ..అమ్మా”అని అడిగారు తాతయ్య.
“ఏం లేదు తాతయ్య” తడుముకుంటూ నా రూంలోకి వెళ్లి  నా డైరీని తీసి…

ఇరవై మూడు, మార్చి ,రెండు వేల ఇరవై ఒకటి….
మళ్లీ అదే కల…
సరగ్గా రేపటితో సంవత్సరం కరోనా గందరగోళానికి…
అంటూ రాయడం మొదలుపెట్టా..
ఆఫీసుకు ఆలస్యం అవుతుంది అంటున్న అమ్మ అరుపుల మధ్య ఎలాగోలా ఆ కటిక అనుభవాల్ని నెమరవేసుకున్నా..

Written by Sunka Dharani

పేరు: సుంక ధరణి
తండ్రి పేరు: సుంక నర్సయ్య
తల్లి పేరు: సుంక లత
వృత్తి: విద్యార్థి (ఎమ్మెస్సీ.బోటనీ-ప్రథమ సంవత్సరం)
కళాశాల: కాకతీయ విశ్వవిద్యాలయం
రాసిన పుస్తకాలు: అరుణిమలు (కవిత్వం)

చిరునామా: ఇం.నెం: 9-7-96/9,
గణేష్ నగర్,
రాజన్న సిరిసిల్ల జిల్లా
505 301
ఫోన్: 8978821932
మెయిల్‌: dharanisunka19@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నవ్విన నాప చేనే పండింది”

ఆరోగ్యమంటే