ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్….

(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

మత్స్యరాజ విజయలక్ష్మి

ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం మన దేశంలోనే కాకుండా మరికొన్ని దేశాలలో జరుపుకుంటారు. అది 1999వ సంవత్సరం. సెప్టెంబరు 25 ఉపాధ్యాయ దినోత్సవం. నేనప్పుడు బ్రునై దేశంలో ఉన్నాను. ఒక అంతర్జాతీయ పాఠశాలలో పని చేసేదాన్ని. ఆ పాఠశాలలో 32 దేశాల నుండి వచ్చిన విద్యార్థులు దాదాపు అన్ని ఖండాల నుండి  ఉండేవారు.  ఆ రోజు చాలా విచిత్రంగా గడిచింది. నేను ఎప్పటి మాదిరిగానే ఉదయం 7 గంటలకు పాఠశాలకు చేరుకున్నాను. (పాఠశాల సమయం 7.30 నుండి 12.30వరకు) వెళ్లేసరికి నోటీసుబోర్డుమీద వారికిష్టమయిన అధ్యాపకులకు / అధ్యాపికలకు రకరకాల గ్రీటింగ్ కార్డ్సు అతికించారు విద్యార్థులు. దాంట్లో ఒకటి నా దృష్టిని ఆకర్షించింది. ఒక అమ్మాయి ఇలా వ్రాసింది. నేను పెద్దయిన తర్వాత పైలట్ అవుతాను. అప్పుడు నా మొదటి ప్రయాణం నా టీచరుతో చేస్తాను అని.

నాకు చాలా గ్రీటింగ్ కార్డ్సు వచ్చాయి. అన్నీ తీసికొని భద్రపరచుకున్నాను. ఏవో పిల్ల చేష్టలు కాకపోతే ఈ అమ్మాయి పైలట్ అవుతుందా, అయినా నన్ను తీసుకెళుతుందా, అదే నా మీద ప్రేమతో అలా వ్రాసి ఉంటుందిలే అనుకున్నాను. అదే రోజు సాయంత్రం ఉత్సవం జరిగింది. నాకు మోస్ట్ పాపులర్ టీచర్ అవార్డు వచ్చింది. సంతోషం. కాని ఆ మరుసటిరోజు నుండి ఆ అమ్మాయి తన ఇంటిపేరును మార్చేసి దాని బదులు పైలట్ అని వ్రాసుకునేది. నేను నవ్వుకునేదాన్ని. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. నేను, మావారు 2001లో అమెరికా వెళ్ళాము. విజిటింగ్ ప్రొఫెసర్ గా. (3 సంవత్సరాల కోసం) కాలగమనంలో 2022వ సంవత్సరం వచ్చింది. అది కూడా అయిపోవచ్చింది. 2022 డిసెంబరులో ఒకరోజు ఫేస్ బుక్ లో నాకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చంది. ఆ అమ్మాయి ముఖం ఎక్కడో చూసినట్టుంది. పేరు మారిపోయింది. సరే అని ఆక్సెప్ట్ చేసాను. నేను మీ శిష్యురాలిని గుర్తున్నానా అని తన వివరాలు చెప్పింది. అప్పుడు నేనడిగాను, “నువ్వు పైలట్ అని నీ పేరు చివర వ్రాసేదానివి కదా మరింతకీ ఏం చదువుకున్నావు అన్నాను. “ఫేస్ బుక్ (డి.పి)లో నా ఫోటో చూడ లేదా మీరు అని అడిగింది. నేను నిజంగానే పైలట్ అయ్యాను మేడం” అంది. నా ఆనందానికి అవధులు లేవు. 10 ఏళ్ల పాప తను పైలట్ కావాలని నిశ్చయం  చేసికొంది. సాధించింది. ఎలా సాధ్యమయిందని అడిగాను. నేను బ్రునైలో ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు డాక్టరుగా ఉండేవారు. వాళ్లమ్మ చదువుకున్నదే అయినా ఉద్యోగం చేసేది కాదు. పరదా పద్ధతి. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తన పైలట్ చదువుకోసమని తండ్రిని ఒప్పించి 2001లో కుటుంబాన్ని కెనడాకు తరలించింది. స్కూలు తర్వాత ఫ్లయింగ్ స్కూల్ లో చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. “నాకు పెళ్లయింది మేడం. నలుగురు పిల్లలు” అని గర్వంగా చెప్పింది. ఒకవైపు విధి నిర్వహణ, మరొకవైపు కుటుంబ ఆలనాపాలనా. నా కనిపించింది ఔరా! మహిళ తల్చుకుంటే ఏ కార్యమైనా సాధించగలదని. ఇక్కడ ఒక విషయమేమిటంటే కుటుంబ నేపథ్యం పూర్తిగా విరుద్ధమయినా తన ఆశయం సాధించుకుంది. “నాకు మీరెప్పుడూ గుర్తువచ్చేవారు మేడం. కాని మన దేశాలు వేరు కదా ఇన్నేళ్ళ తర్వాత ఫేస్ బుక్ లో మీ ఫోటో చూసి గుర్తించాను. మీరు కెనడా తప్పకుండా రండి. నేను నా ప్రామిస్ పూర్తి చేసికుంటాను” అన్నది.

నేను కెనడా వెళ్లినా, వెళ్ళకపోయినా కూడా ఆ పట్టుదలకు ముచ్చటేసింది. ఇది ఎంత పిల్ల. అప్పుడే దీనికి నలుగురు పిల్లలా అనిపించింది.

అమ్మాయిలూ! కలలు కనండి. కలల్ని సాకారం కూడా చేసికోండి.

మహిళామణులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

అధికార భాషాసంఘ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి గారితో ముఖాముఖి – అరుణధూళిపాళ