అమ్మా….నాన్న….!
ఈ తొలి పలుకులు నేర్పిన
ఆది గురువు తాను..
నా నయనాలు మెరిసే చక్కని రూపం తాను…
గాన మాధుర్యంలో నాదం తాను…
నా కాలాన్ని నడిపించే అక్షర దళం తాను..
వరాలను ప్రసాధించే ప్రత్యక్ష్య దైవం తాను…
నిత్యం ఉదయించే భానుడికి సైతం బద్ధకమొచ్చి అస్తమిస్తాడేమో గానీ…,
అలసటెరుగని గడియారం తాను…!!
ప్రాతః కాలంలో పఠించే స్తోత్రం…
రవ్వంతైనా తిరిగి ఆశించని మనస్తత్వం…
ఈ ఆధునిక యుగంలోని టెక్నాలజీలు
కృత్రిమ యంత్రాలు
జీవితాన్ని వెలిగించునో లేదోగానీ..,
తాను లేని ఈ జగం
నిశీధికి నెలవనడం అసత్యం కాదు!
పుట్టుకతో తోటివారికి సహాయ సహకారాలంకితం…
మేడలో పసుపు తాడు పడగా సర్వం బాధ్యతలకంకితం…
కడుపులో నలుసు పడగా సర్వస్వం ఆ పసికూనకంకితం…
దశలవారిగా జీవుతాన్నే అంకితం చేసిన నీకూ…
లోకంలో చేతులన్నీ జోడించి నమస్కరించినా తక్కువే అనటంలో అతిశయం లేదు…!!
నిదురరాని రాతిరికి నిదురబుచ్చే జోలపాట తాను….
ఆకలిదప్పికలు తీర్చే నిత్యాన్నపూర్ణగానూ
ప్రావీణ్య విద్య లేని వైద్యాధికారిగాను..
కనిపించని వరాలు కురిపించే భగవత్స్వరూపిణిగానూ…
ఓపిక సహనాలకు నిలయంగాను…
నిత్యం నవ్యమార్గాన్ని నిర్దేశించే నాందిగాను…
ఇంకెన్ని చెప్పిన ఆగని ఈ కలాన్ని నడిపించే భావంగాను…
సకల విధాలుగా కీర్తించినా సరితూగని ఔన్నత్యం తాను..
పాలబువ్వ పెట్టి చందమామను చూపినపుడు తెలీదు,
అంతులేని విజయమార్గాల గమనమే తన ఆశయమని..
అశ్రునయనాలతో నా ఈ ప్రతీ చిన్ని పలుకు అంకితం చేస్తూ… ప్రకటిస్తున్నాను…,
మా ఇంటి సామ్రాజ్యానికి మహారాణి తానని…!!!