*మా అత్తమ్మ(అత్త+అమ్మ)*…అందరికి అమ్మే…….

 

ఇది నా విషయంలో అక్షరాలా నిజమైంది. మా అత్తగారు *శ్రీమతి పిసిపాటి శ్రీలక్ష్మి గారు* .నేను కోడలిగా మెట్టినింటికి వచ్చింది మొదలు నా పట్ల చూపిన ప్రేమాదరాలకు కొదవలేదు. అమ్మ వాళ్ళింట్లో ఎలాంటి ఆత్మీయతను పొందానో, అత్తయ్య దగ్గర అదే పొందాను. శ్రీ లక్ష్మి గారిది(అత్తయ్య) ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఆవిడను ‘అన్నపూర్ణ’ తల్లి అని సంబోధిస్తారు. ఎవరినైనా తన సొంత వాళ్లుగా భావించడము. విశాల హృదయానికి నిలువెత్తు రూపమే  తను .మామగారు *శ్రీ పిసిపాటి శేషాచలం గారు* ఉపాధ్యాయుడిగా, హెడ్మాస్టర్ గా మెదక్ జిల్లా మరియు రాజేంద్రనగర్లో పని చేసే రోజుల్లో ,ఎవరు అధికారులు వచ్చినా వీరింట అతిధి మర్యాదలు పొందాల్సిందే .వారికి కడుపునిండా భోజనం పెట్టి ,తృప్తి పొందేవారు. అంతేకాదు తోటి  కుటుంబాలలో ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి సహకరించేవారు. వంటను కుంపటి మీద చేసినా, విసుగు లేకుండా ఓరిమితో వండి పెట్టి వారి కడుపు నింపే అన్నపూర్ణ అత్తయ్య. ఇరుగుపొరుగుకు తానే బంధువై సహకరించేది. ఎంతమందో తన చేతిలో పెరిగిన మనుమలు, మనుమరాళ్ళు నేటికీ తాను లేకుండా వాళ్ళింట్లో సంబరాలు చేసుకోరు.
బంధువులు అంటే మహాప్రీతి తనకు. పరిచయము ఉన్నవాళ్లే తన బంధువులు. వాళ్లపిల్లల్ని ఇంట్లో ఉంచుకుని వారి అవసరాలు తీర్చి, చదివించి, ప్రయోజకులను చేసి, వారి భవిష్యత్తులను తీర్చిదిద్దిన అమ్మమ్మ/ నానమ్మ  అయింది. అత్తయ్యని చూడగానే నమస్కరించని వారుండరు. ఆవిడలో 30 సంవత్సరాలుగా ఏ రోజు విసుగు,చికాగు నేను చూడలేదు. చిరునవ్వే ఆమెకు పెట్టని ఆభరణం. అలసి వచ్చిన హృదయాలను ఊరట దొరుకుతుంది ఈమె చెంత. ప్రేమఆత్మీయతలు లభిస్తాయి. ఈవిడ మాటల మాధుర్యాల లో. మా కుటుంబానికి పెద్ద దిక్కయి కొడుకులు, కోడళ్లు,మనుమలు, మనవరాళ్లు అత్తయ్య ను చూసి కావలసిన ధైర్యాన్ని పొందుతారు.

నేను చూసిన మరో గొప్ప గుణం బంధువులు దూరప్రాంతం నుండి వచ్చినప్పుడు తృప్తిగా ఉండి, వెళ్లేప్పుడు ప్రయాణంలో ఇబ్బంది పడకుండా సరిపడా భోజనం కట్టిస్తారు. దానికి నిదర్శనం మామినప్పప్పు బస్తా వెట్ గ్రైండర్. అత్తయ్యను మా అమ్మ బాగా గుర్తు చేసేది. మా అమ్మను ‘వదిన గారు’ అంటూ అభిమానంగా వండి పెట్టి, ఇద్దరూ చక్కగా కలిసి ఉండేవారు .ఆత్మీయ వియ్యపురాలు… అమ్మకి. మా పుట్టింటి వాళ్ళందరికి,అత్తయ్య పట్ల వల్లమాలిన అభిమానం. మా ఇల్లు అతిధులు లేని రోజంటూ లేదు. ఇప్పటికి రధసప్తమికి కొడళ్లకు (మాకు)కొత్త కొకలు కొనిపించి దీవిస్తుంది.ఈ ఇంట కోడలుగా అత్తయ్య బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్న.

ఆస్తులు సంపాదించుకో లేకున్నా ఆప్తులను కూడగట్టుకున్నారు అత్తయ్య మామయ్యలు. అలాంటి ఇంటికి కొడలుగా చేరుకోవడం నా పూర్వజన్మ సుకృతం.

ఇలాంటి అత్తగారుంటే  అందరికీ ఆరళ్ళె ఉండవు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్వర్ణ విజయనగర కీర్తి సార్ధకమ్ము

జాతరలు జనజీవన ప్రతీకలు- డాక్టర్ మాడ పుష్పలత