TSWRDC/మహేంద్రహిల్స్,HYD
అది 219 నంబర్ బస్సు….
రోజు లాగే నేను డ్యూటీకి వెళ్లడానికి బస్సు ఎక్కి, ముందు సీట్లో కూర్చున్నాను. పేపర్ చదవడం నా అలవాటు. అలాగే ఆరోజు పేపర్ తీయగానే తాలిబన్ల అకృత్యం.. పసిబాలల ప్రాణాలు… చదువు జీవితాలకు వెలుగు పంచుతుందన్న ఆశలో, అంధకారం మిగిల్చిన తీరు….తల్లిదండ్రుల గర్భశోకం, చదువుతుంటే నా మనసును కలచివేసింది. మానవత్వం లేని మనుషులు– పిల్లలు అని చూడకుండా ఎలాంటి అకృత్యాలకు ఒడిగట్టారు. నా గుండె భారంతో, ఆలోచనలు నిండిన తలపులతో నా ప్రయాణం సాగుతుంది…

కూకట్ పల్లి రాగానే ఒక అతను(అన్నయ్య)వయసు సుమారు 68 సంవత్సరాలు, చెల్లికి 63 సంవత్సరాలు ఉండవచ్చు… బస్సు ఎక్కారు. రద్దీగా ఉంది. నా పక్క సీటు ఖాళీ అయింది. అన్నయ్య చెల్లెలితో ‘నాకు ఒకే కన్ను కనిపిస్తుంది. నిలబడడానికి శక్తి లేదు’, అని నీ అంతట నీవు అడగకపోతే సీటు ఎవరు ఇస్తారు? ఎవరికి తెలుస్తుంది?” అంటూ నా పక్క సీటులో కూర్చోబెట్టాడు. నేను ఒకసారి ఆమె వైపు చూసి, చిరునవ్వు నవ్వాను. ఆమె పలకరింపుగా తిరిగి నవ్వింది. నా అలవాటు ప్రకారం’ అమ్మ !ఎక్కడికి వెళ్లాలి?’ అన్నాను. నా మాతృభావనతో పలకరించిన తీరుకి ఆమె ఆప్యాయంగా ‘లింగంపల్లికి’ అని అంది. మీకు ఏమైంది? ఎలా జరిగింది? అని పలకరించాను. దానికి ఆవిడ “నా కూతురు తొమ్మిది నెలల గర్భిణిగా ఉండగా, పురిటి కోసం వచ్చాను. అప్పుడు ఎక్కడికో వెళ్లడానికి బస్టాండ్లో నిలబడ్డాను. ఒక బండి వాడు వచ్చి, గుద్ది వెళ్ళాడు. ఆ దెబ్బతో నేను క్రింద పడిపోయాను. నా ముక్కు పైన దెబ్బ, మూతి పళ్ళు రాలి రక్తం మడుగులో ఉన్నాను. నా పక్కన ఉన్న కుర్రవాళ్ళు నన్ను చూసి, నా బ్యాగులో ఉన్న ఫోన్ తీసి, నా కూతురికి ఫోన్ చేసి, ‘నేను పడిపోయానని, నన్ను ఆసుపత్రిలో చేరుస్తున్నాము కూతురిని ఆసుపత్రికి రమ్మని ఫోన్ పెట్టేశారు. నాకు ఇదంతా ఏమీ తెలియదు. ఆస్పత్రిలో మూడు రోజుల తర్వాత మేల్కొన్నాను. నా కంటి చూపు (ఒకటి) పోయిందని, నా పళ్ళూడి– కట్టుడు పళ్ళు కట్టారని, ప్రాణాలతో బయటపడ్డానని తెలుసుకున్నాను.తర్వాత నా ప్రాణాలు నిలబెట్టి సహాయం చేసిన కుర్రవాళ్ళ జాడ తెలుసుకొని, ఆచూకీ వెతుక్కొని, నా ఆరోగ్యం కుదుటపడ్డాక వాళ్లను కలిసి బహుమతి అందజేశాను” అని చెప్పింది.అది విని నేను ఆర్ద్రతతో ఉండిపోయాను.
ఇందాకేమో మానవత్వం లేని మనుషులను పేపర్లో చూశాను…
ప్రత్యక్షంగా మానవత్వంతో సహాయం చేసిన మనుషుల జాడ తెలుసుకున్నాను. ఈ రెండు ఎలా ?…..ఇంకా ఈ ప్రపంచంలో కొంతమంచి మిగిలి ఉందని అనిపించింది.
ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి, ఎదగడానికి పుట్టుకనుండే పరిస్థితులు ప్రభావితం చేస్తాయని అనిపించింది. ముద్దలు తినిపిస్తూ బాల్యంలో తల్లి మంచి మాటలను రంగరించి పెడుతుంది.” పాపం చీమను చంపకు….. అది విసరకు,దెబ్బ తాకుతుంది….. తలుపు వేయకు, వేలు చితుకుతుంది…” అంటూ తన వల్ల ఇతరులకు, తనకు జరిగే ప్రమాదాలను హెచ్చరిస్తూ మానవత్వాన్ని నింపుతుంది.
ఇక బడిలో చేర్చగానే ఉపాధ్యాయిని తొలిమెట్టు నుండి మలిమెట్టు వరకు జాగ్రత్తలు చెబుతూనే, జాగ్రత్తతో ఎలా ప్రవర్తించాలో సమాజంలో తోటి వారితో ఎలా మసలుకోవాలో బోధిస్తుంది. దాని ప్రభావం పిల్లల్లో మానసికంగా వికసించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉన్నత విద్యను అభ్యసించేటప్పటికీ విద్యార్థుల్లో తోటి వారి ప్రవర్తన తనపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటప్పుడే ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు కనిపెట్టుకుంటూ ఉండాలి. పాఠ్యాంశాలలోని విలువల్ని వారి మనసుకు హత్తుకునేటట్లు, అవే వారి ప్రగతికి మెట్లు.. చేయి పట్టుకొని ఎక్కించాలి. అది వారి భావి జీవితానికి పునాది. పునాది గట్టిగా ఉంటేనే భవనం చిరకాలం నిలిచినట్లు–వారికి ఆ వయసులోనే మానవత్వం విలువలను రుచి చూపించాలి. అవి జీవితానికి పుష్టిని చేయిస్తాయి దానితోపాటు మంచి మార్గాలను చూపించి వాటి మంచి చెడులను వివరిస్తే విద్యార్థి అది ఎంచుకొని ఆమార్గంలో పయనించి, దేశ అభివృద్ధికి కారకుడు అవుతాడు.
అలా ఎదగని వారు తనతోపాటు, చుట్టూ ఉన్న పరిసరాలకు చీడపురుగులా తయారవుతాడు. ఆ చీడపురుగు చెరచడమే లక్ష్యంగా పెట్టుకొని ఎలాంటి అకృత్యాలకైనా ఒడిగడుతుంది.
కావున ప్రతివారు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే–తోటి వారికి, సమాజానికి మార్గదర్శకులవుతారు.
అందుకే మానవత్వం ఉన్న మనుషులుగా మనం నడుస్తూ, ఇతరులను నడిపిద్దాం. మన సమాజాన్ని ‘మానుష మహిగా’ చూద్దాం….
(17-12-2014-సంఘటన )