మానవత్వం పరిమళించిన వేళ

కథ

మధుమిత మనస్సు భర్తకు కేర్ టేకర్ని పెట్టినప్పటినుంచీ ఒకటే చికాకుగా ఉంది. పిల్లలు దూరంగా ఉండడం వలన తాము ఉండేది ఇద్దరమే అవడం వల్ల ఇంట్లో థర్డ్ పర్సన్ ఉంటే అసలు అడ్జస్ట్ అవలేకపోతోంది. ఈ మధ్య భర్తకి స్ట్రోక్ రావడంతో ఓ కాలు చేయి పని చేయకుండా అయిపోయింది. దాంతో మొత్తం జీవన గమనమే ఆగిపోయింది. పూర్తి దినచర్యే టాప్సీ టర్వీ అయిపోయింది. ఎంత భర్త కన్నా ఫదేళ్ళు చిన్నైనా తనకీ డెభ్బై దాటాయి. మునపటిలా యాక్టివ్గా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది?
అందునా భర్త దాదాపుగా బెడ్ రిడెన్ అవడం వల్ల ఓ మేల్ కేర్ టేకర్ని పెట్టాల్సి వచ్చింది. దాంతో తనకి అసలు ప్రైవసీ లేకుండా పోయింది. భర్తకి అన్నీ అమర్చడంతో సహా ఇప్పుడు అదనంగా ఈ బంటు సరిగ్గా పని చేస్తున్నాడాలేదానని పర్యవేక్షించడమే కాకుండా అతని అన్నపానాదులగురించి కూడా పట్టించుకోవడం వీటితోనే సతమతం అవుతోంది మధమిత. ఓ రకంగా చెప్పాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. దాంతో ఆ చికాకు అంతా బంటు మీద చూపించసాగింది. అమ్మగారు ఎందుకలా ఉన్నారో అర్థం కాక అతను తనలో తానే అయోమయావస్థలో కొట్టుమిట్టాడ సాగాడు. ఇదిలా ఉండగా మధుమిత ప్రాణ స్నేహితురాలు అంకిత వస్తున్నానని ఫోన్ చేసింది ఓ ఫైన్ మార్నింగ్. ఎలాగూ వస్తున్నావు కదా ఏకంగా లంచ్కి వచ్చేయమని ఆర్డర్ జారీ చేసింది నేస్తానికి. ఓకే డన్ అని ఫోన్ కట్ చేసింది ఆమె.
*

“హాయ్ అంకీ “ అంటూ తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది స్నేహితురాలిని మధు.
“సో సారీయే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిట్లు ఉంది కదూ నా రాక…. ఏమనుకోకే మా ఇంట్లో మన కీర్తన, అల్లుడూ. మనవలూ అమెరికా నుంచి వచ్చారే దాంతో నాకు ఊపిరి ఆడలేదు సుమా! “
ఇంతలో భర్తకు లంచ్ టైమ్ అయిందని స్పృరించడంతో అంకితని కూర్చోబెట్టి ఏవో మాగజైన్లు ఇచ్చి “ నువ్వు చూస్తూ ఉండవే మా వారికి అన్నం పెట్టి వస్తాను” అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. అన్నం బోల్లో కలిపి స్పూన్ తో భర్తకు బంటు పెట్తుంటే తను ఇంకా ఏవో కిచెన్లో చేసేందుకు లోపలికి వెళ్ళింది.
భోజనం అయిపోయాక బంటు భర్త మూతి నీళ్ళతో తుడిచి ప్రక్కనే ఉన్న న్యాప్కిన్తో డ్రై చేస్తుంటే ఓ గావుకేక పెట్టింది మధు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అందరూ అవాక్కయి చూస్తూండగా బంటు మీద విరుచుకుపడింది. “ ఎన్ని సార్లు చెప్పాలి నీకు రోజూ న్యాప్కిన్ని మార్చాలని. ఒకసారి చెప్తే అర్థం కాదా..?”
“సారీ మేడమ్. మర్చిపోయాను.”
గుడ్ల నీరు కుక్కుకుంటూ చెప్పాడు.
“సరే ఇకనుంచీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్ “ అని హుకుం జారీచేసింది.
ఆ తరువాత తను అంకిత కలిసి భోజనం చేసారు. అనంతరం భర్తను బంటు సంరక్షణలో వదిలి స్నేహితురాలితో కబుర్లలో పడ్డది. మెయిన్ టాపిక్ బంటుగురించే…! “ అదికాదే అంకీ నాకు తెలియక అడుగుతాను మేము భోజనం చేస్తుంటే మా వంకే అలా గుడ్లప్పగించి చూస్తాడేంటే కొంచెంకూడ మ్యానర్స్ లేకుండా…?” ఫక్కున నవ్వింది అంకిత. స్నేహితురాలివంక చుర చురా చూసింది మధుమిత. ఇంకా వస్తున్న నవ్వునాపుకుంటూ తిరిగి అంది అంకిత “ అదికాదే నువ్వు మరీను, అతడేమైనా కాన్వెంట్ ఎడ్యుకేటడా మ్యానర్స్ తెలియడానికి…అదే కనుక అయితే అతను మీ ఇంట్లో ఈ పని చేయడానికి ఎందుకు వస్తాడు? కాబట్టి నువ్వే కాస్త సర్దుకు పోవాలి మై డియర్. అతని దగ్గర నుంచి ఇంతకన్నా మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయడం నీదే తప్పు నన్నడుగుతే..! అసలైనా నేనో మాట చెప్పనా..! నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అతనికి ఆకలి వేసి అలా చూస్తున్నాడేమోనే… బహుశా మీరిద్దరూ తిని అతనికి పెట్టేంతవరకూ అతను ఆగలేకపోతున్నాడేమోనే..! నన్నడుగుతే మీరు తినే ముందే అతనికి పెట్టి చూడరాదూ…? “ ఓ ఉచిత సలహా పారేసింది. అందుకు భద్రకాళియే అయింది మధు. “ నీకేమైనా మతి పోయిందా అంకీ యజమాని తినకుండా నౌకరుకి పెట్టడం ఎక్కడైనా ఉందా అసలు..? అలా చేస్తే వాడికి మనం లోకువ అయిపోం…? “
“ అదే అదే నేను చెప్పొచ్చేది. మరి అదే కదే అద్వైతం అంటే సాటి మనిషిని తమతో సమానంగా చూడడమే కదే…అద్వైతమంటే..! అంతటా ఏకాత్మ భావం చూపాలని బోధించిన ఆదిశంకరులవారి లెక్చర్లు వినడానికి పరుగులు పెడతాము కానీ మన ఇంట్లోనే అది ఆచరించటానికి మనకి అవకాశం వస్తుంటే మాత్రం మనకు నచ్చదు. హా హతవిధీ మనలాంటి వాళ్లని ఎవరూ కాపాడలేరే…!” “ఊఁ ఆపు అంతటితో… నువ్వు ఎన్నైనా చెప్పవే… నీతో నేను ఏకీభవించలేనే…!” అన్నది మధుమిత. వాతావరణం హీటెక్కుతున్నట్లు గ్రహించిన అంకిత అంతటితో ఆ టాపిక్కి ఫుల్స్టాప్ పెట్టేసింది. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుని వీడ్కోలు తీసుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ!

**

మానవత్వం పరిమళించిన వేళ P2
——————————**
నాలుగు రోజులు పోయాక మధుమిత ఓ మధ్యాహ్నం వేళ అంకితకి ఫోన్ చేసింది. ఏయ్ మధూ ఏంటే ఏంటి సంగతి అని అడిగితే నిన్ను నేను అర్జెంట్ గా కలవాలే ఎలా అంది? ఫ్రెండ్ స్వరంలో ధ్వనించిన అర్జెన్సీని గమనించిన అంకిత కాసింత ఆందోళనతో “ చెప్పవే ఇప్పుడు రమ్మంటావా నన్ను..?” అడిగింది. “పోనీ ఫోన్లో చెప్పరాదా..?” మళ్ళీ తనే అడిగింది.
“ ఫోన్ లో కుదరదే, నాకెందుకో కాళ్ళు చేతులు ఆడడం లేదే నిన్ను చూస్తే కాస్త ధైర్యం వొస్తుందనిపిస్తోందే….! “ అయితే సరే ఊబర్లో అరగంటలో నీ ముందుంటా.” అని కాల్ కట్ చేసింది.
ఊబర్ లో వస్తూ తన నెచ్చెలికి హటాత్తుగా వచ్చిన ఆపదేమిటో ఊహించసాగింది. కానీ ఊహకి అందుతేగా…! సరే తినబోతూ రుచులెందుకని ఆలోచించడం మానేసి రోడ్డు పై దృష్టి పెట్టింది. ఊబర్ ఆఘమేఘాల మీద మధుమిత ఇంటిముందు ఆగింది. అతనికి మనీ పే చేసి కాలింగ్ బెల్ నొక్కింది. మధుమిత తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. నెచ్చెలితో అంకిత ఏదో అనేలోపల సైగజేసి తన గదిలోకి తీసుకెళ్లింది. అంకితని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె రెండు చేతులు పట్టుకుని చెప్పడం మొదలుపెట్టింది. “ అది కాదే ఈ రోజు ఫది గంటలకి మా కేర్ టేకర్ కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడట, నాకిక్కడ బాగా లేదు. నన్ను ఒక నౌకరులా ట్రీట్ చేస్తున్నారు, నేను ఇక్కడ పని చేయను అని మా మీద కంప్లెయింట్ ఇచ్చాడట. ఆ మేనేజర్ అది కాదు బాబూ అట్లా ఉన్నట్టు ఉండి వెళ్ళిపోతానంటే కుదరదు …వాళ్ళకి వేరే ఇంకొకరిని నీ బదులు ఎప్పాయింట్ చేసేదాకా నువ్వు వెళ్ళటానికి లేదు . కాబట్టి దానికి ఓ నెల టైం పడుతుంది అప్పటిదాకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాడట. అందుకే ఈ వార్త వినంగానే నాకు నువ్వే గుర్తుకొచ్చావ్. ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇనడీడ్’ అన్నట్టు నువ్వే ఇప్పుడు నాకు దిక్కే..! ఇప్పుడు ఏం చేయమంటావ్..?” ఆ మేనేజర్ చెప్పగానే ఆఁ వీడు పోతే పోయాడు…ఇంకోడొస్తాడు అనుకున్నాను గానీ ఓ సారి నిన్ను కనుక్కుని నీ సలహా తీసుకుంటే మంచిది అనిపించి నీకు ఇంతర్జంట్గా పిలిపించాను సారీయే…ఇక పాల ముంచినా నీట ముంచినా నీదేనే భారం “ అని అంకిత వంక చూసింది.
ఆ మాటలకు అంకిత కాసేపు సీరియస్గా ఆలోచించింది. ఆ తరువాత ప్రియ సఖితో ఇలా అంది. “ చూడు మధూ….నేనో మాట చెప్తాను వింటావా..?
ఇప్పుడు అవసరం మనది. ఆ అబ్బాయిది ఏముంది ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. కానీ మనకి అలా కాదే..! నాకు తెలిసినవాళ్ళకు కూడ ఇలాగే జరిగింది. వాళ్ళు కూడా ఇలాగే అనుకుని తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికి ఎంతమందో కేర్ టేకర్స్ మారారు. చివరికి వీళ్ళలోనే ఏదో లోపం ఉంది అని ఆ పాతవాళ్ళు ప్రచారం చేశారు.దాంతో ఎవరూ వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడటం లేదట. దాంతో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నా సలహా ఏంటంటే నువ్వు కొంచెం నీ ఇగో తగ్గించుకుని అతనితో కొంచెం సామరస్యంగా మెలిగావంటే నీ సమస్యకు పరిష్కారం దొరుకినట్టే. మనకి ఇంకా ఓ నెల టైం ఉంది. అంతలో మనం మన కార్యం సాధించుకోవాలన్నదే నా అభిప్రాయం.”
“అది సరేనే ఇక మీ ఉపోద్ఘాతం చాలించి న న్నిప్పుడు తమరు ఏం చేయమంటారో సెలవివ్వండి మహాశయా..” అన్నది మధుమిత. “ “ ఆగుము ఆగుము అంత తొందర అయితే ఎలా బాలా..ఓహ్ నువ్విప్పుడు బాలవి కాదు కదూ, అన్నట్టు మరిచితిని…ఇప్పుడు చెప్పెదను ఆలకింపుము….” అన్నది నాటకీయ ఫక్కీలో.
మధు వస్తున్న నవ్వాపుకుని “ చెప్పవే త్వరగా…” అంది
“ ఏంలేదే నీ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా…కాస్త మానవత్వం చూపించడమేనే…! “
“ అంటే నేనిప్పుడు ఓ రాక్షసిలా బిహేవ్ చేస్తున్నానంటావా..? “
“ అరే కాదు కాదు డోంట్ మిస్టేక్ మి నా ఉద్దేశం అది కాదు రా…!”
“ ఒక్కోసారి మనకి తెలియకుండానే కొన్ని కొన్ని మాటలు మన నోట్లోంచి వచ్చేస్తాయి. అది హైపర్టెన్షన్ వల్ల కావచ్చు, షార్ట్ టెంపర్వల్లా కావచ్చు . కొన్నిసార్లు ఇట్ మే బి బికాజ్ ఆఫ్ ది స్ట్రెస్ యు ఆర్ అండర్గోయింగ్ మై డియర్…! ఆ టైంలో మన విసుగూ కోపం ఎదుటి వ్యక్తి మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో మనం గ్రహించే టప్ప్పటికే జరగ కూడని నష్టం జరిగిపోతుంది. సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్…అదే అన్ని సిటుయేషన్స్లలోనూ సంయమనం పాటించడం. అంతే కాదే నేను ఇందాక అన్నానే మానవత్వం అన్నమాట అది నువ్వు చూపించాల్సిన సమయం వచ్చిందే…! ఎందుకంటే నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తే నీకే అర్ధం అవుతుంది. అదేంటంటే ఆ అబ్బాయి తనవాళ్ళందరినీ వదిలి మీ ఇంట్లో ఊడిగం చేయడానికి ఎందుకు వచ్చాడంటావ్..? తన ఇంట్లో గడవకే కదా ! మరి అటువంటప్పుడు అతని మీద కాస్త దయ, జాలి చూపించడం మన కనీస ధర్మం కాదా..? దీన్నే మానవత్వం అంటారు. నువ్వు మొన్న అతనితో ప్రవర్తించిన తీరు నిజంగా చెప్పాలి అంటే ఏ మాత్రం మానవత్వం అనిపించుకోదే నా దృష్టిలో..! మనిషికి ఓర్పు సహనం పెట్టని ఆభరణాలు అంటారు వినలేదా…!
◦ సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది కూడా అదే..ఆ అబ్బాయి మనకన్నా తక్కువ అన్న భావం తుడిచేసి కాస్త మానవత్వం చూపించమంటున్నాను” అన్నది తాపీగా
◦ “ సరే నా శాయశక్తులా ప్రయత్నిస్తాగానీ నాకు ఈ అబ్బాయి లో నచ్చని ఓ యాంగిల్ ఉందే….అదేంటంటే అతను మా వారిని హాండిల్ చేయడం మొరటుగా ఉంటుందే అది నేను సహించలేక పోతున్నాను…ఇప్పుడు నేను అతని లో సహజంగా లేని సున్నితత్వాన్ని ఎలా తీసుకురానే…?”
◦ “ డసన్ట్ మ్యాటర్ మై డియర్….ఓ విషయం గుర్తు పెట్టుకో నథింగ్ ఈజ్ ఇమ్పాజిబుల్ ఇన్ దిస్ వరల్డ్ యునో ….డోంట్ వర్రీ ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నాడట వెనకటికి ఎవడో…తెలుసా “ అని చెప్పడం ఆపింది ఫ్రెండ్ రియాక్షన్ కోసం చూస్తూ. స్నేహితురాలు శ్రధ్ధగా గా వింటున్నదని నిర్ధారణకొచ్చాక తిరిగి ఇలా ప్రారంభించింది.

“ ఏం లేదే ఇప్పుడు నువ్వో పని చేయాలి..అదేంటంటే ఓ రోజు టైం చూసుకుని అతను ఖాళీగా ఉన్నప్పుడు దగ్గరగా పిలిచి అతని హార్ట్ టచ్ అయేలా ఇలా అను. ‘ చూడు బాబూ నువ్వు బానే మా ఇంట్లో కలిసి పోయావు. కానీ నువ్వు మగవాడివి అవటం మూలాన నీవు ఆడవాళ్ళలాగా సున్నితంగా సార్ని హ్యాండిల్ చేయలేక పోతున్నావు…అందువల్ల సార్ బాధపడుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ని కొంచెం ప్రేమగా చూడటానికి ప్రయత్నించు. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు బాబూ ..! ఇది తప్పమాకు నీ మీద ఏ కంప్లైంట్ లేదు అని కాస్త సెంటీ కొట్టవే..అతనిలో ఎందుకు మార్పు రాదో నేనూ చూస్తాను…” అని ప్రియసఖికి కర్తవ్యం బోధించింది.
నెచ్చెలి మాటలను శ్రద్ధగా విన్న మధుమిత తన పూర్తి అంగీకారం వెలిబుచ్చి తను తలపెట్టిన కార్యం నెరవేరాలి అన్న ఆశావహ దృక్పథంతో అంకితకు సంతోషంగా వీడ్కోలు పలికింది.
*
మధుమితని కలసి వచ్చిన తరువాత అంకితకి కొన్ని అనుకోని పనులవల్ల చాలా బిజీ అయిపోయి పదిహేను రోజుల వరకు అసలు ఊపిరి ఆడలేదు. ఆ తరువాత అంతా సద్దుమణిగాక తన నెచ్చెలి జ్ఞాపకం వచ్చింది. వెంటనే తనకి సడెన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామన్న చిలిపి ఆలోచన వచ్చింది. అంతే ఉన్నపళాన ఊబర్లో బయలుదేరింది దగ్గర దగ్గర పన్నెండవుతుండగా. టాక్సీ ఇల్లు చేరగానే దిగి మధుమిత ఇంటి బెల్ కొట్టింది. తనే తలుపు తెరిచి అంకితని చూసి ఆశ్చర్యం ఆనందం రెండూ ఒక్కసారిగా ఆవహించగా స్నేహితురాలిని ఒక్కసారిగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఇంట్లోకి నడిచారుద్దరూ. లోపల డైనింగ్ కమ్ హాల్లో ఓ చిన్న బల్ల మీద భోజనం చేస్తూ వాళ్ళ కేర్ టేకర్ దర్శనమిచ్చాడు. అది గమనించిన అంకిత మధుమితని అడిగింది. ఇవ్వాళ మీ భోజనాలు అప్పుడే అయిపోయాయా… మీరు రెండింటిగ్గా తినేది? “అంది ఆశ్చర్యపోతూ.
లేదే ఇంకా మా భోజనాలు అవలేదు లేవే. ఇతనిదైనాక మేము తింటాము అంది మర్మ గర్భంగా. తరువాత ఆ అబ్బాయికి ఏం కావాలో కనుక్కుని ఎంతో శ్రద్ధగా వడ్డించింది. ఈ సారి మధు గొంతులో మునుపటిలాగా విసుగూ కోపం అస్సలు కనపడలేదు అంకితకి. ఓ తల్లి కన్న కొడుక్కి వడ్డించినట్లు ప్రేమ కనిపించింది. అంకిత ఆ దృశ్యాన్ని ఓ ఎయిట్త్ వండర్లాగా చూసింది. అనంతరం అంకితని తన గదిలోకి తీసుకెళ్లి అసలు విషయం చెప్పింది మధుమిత. “ ఆ రోజు నుంచి నేను నువ్వు చెప్పినట్లే చేస్తున్నానే. ఇతనికి అది కూడా చెప్పాను…అదే కాస్త సున్నితంగా హ్యాండిల్ చేసే విషయం. నువ్వు చెప్పినట్లే చెప్పాను. అతను కూడా టచ్ అయినట్లే ఉన్నాడు. ఆ రోజు నుంచీ అతను చాలా కేరింగ్ గా చూస్తున్నాడు మీ అన్నయ్య గారిని.” అన్నది.

ఇంతలో మధుమితకి ఎవరో కాల్ చేస్తే రిసీవ్ చేసుకుంది తను.
అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే ఊఁ ఆహా …అలాగా అంటోంది. చివరగా మంచి వార్త చెప్పారండీ థాంక్స్ అండీ “ అని ఫోన్ పెట్టేసి అంకితని అమాంతం వాటేసుకుని ముద్దులతో ముంచేసింది. ఎదురు చూడని ఈ హటాత్సంఘటనకి ఉక్కిరి బిక్కిరి అయింది అంకిత. ఇంతకీ ఏమిటో సంగతి అని అడిగింది? ఇదంతా నీ చలవేనే.. నీ ఋణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాలోనేమోనే…”
“ అరే అసలు విషయం ఏమిటో చెప్పవే అంటూంటే వినదేంటీ ఈమె..? “ సహనం కోల్పోతోంది అంకిత. “ ఏంలేదే ఇప్పుడు ఫోన్ లో మాట్లాడింది ఎవరనుకుంటున్నావ్…? అదేనే మా కేర్ టేకర్ కంపెనీ నుంచే..! ఈ అబ్బాయి మా ఇల్లు వదిలి పెట్టే ఆలోచన మానుకున్నాడుట. ఇక్డడే పని చేస్తానని చెప్పాడట. అదీ సంగతే. నీ మేలు జన్మ జన్మలకీ మరచి పోలేనే…ఇదంతా నీ వల్లే సాధ్యం అయింది. మెనీ మెనీ థాంక్సే నీకు “అంటూ స్నేహితురాలిని మరొక్కసారి హగ్ చేసుకుంది మధు. “సో ఆల్ ఈజ్ వెల్ ధట్ ఎండ్స్ వెల్..” అంటూ కన్నుగీటింది అంకిత ఆనందంగా.

**

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

ప్రియమైన శత్రువు