
అవును మనుషులే….
దొర్లుతున్న క్షణాలకి
వేలాడుతూ
వెలసిపోతున్న
రంగు చిత్రాలు
ముంగిట్లో సరదాలని
గొయ్యి తీసి పాతి
నాగరికతని నట్టింట్లోకి
అరువు తెచ్చుకొని
మాటలకు బిరడా బిగించి
నవ్వులను గోడలకు చెక్కేసిన
ఆధునికులు…
వారి మనసులకి భాష కరువై,
యంత్రాలతో పలకరించుకుంటారు
కంటినుండి ఒలికే
భావ సంకేతాల్ని
ఎమోజీలలో చిత్రిస్తారు
ప్రపంచ పటాన్ని చేతబట్టి
దూరాల సరిహద్దుల్ని
గీసుకున్నారో, చెరుపుకున్నారో
జ్ఞానం పెరిగిందో
సోమరితనం మిగిలిందో
వీలులేదు తూకం వేయడానికి..
వారు మనుషులే…
సాంకేతికత ప్రగతిలో
ఆత్మీయతలను యంత్రాల్లో
నియంత్రించి
కళ్ళముందు కనిపిస్తూ
కానరాని తీరాల్లో బతుకుతున్న
మర మనుషులు…!!