మధురమైన జ్ఞాపకం

‘9 జులై 2023’ ఈరోజు నా జీవితంలో ఒక సుదినం అని చెప్పాలి.

ఆరోజున నాకు ‘డాక్టర్ కొండపల్లి నీహారిణి’ గారి పరిచయం జరిగింది.

అప్పటికి నేను ప్రతిలిపి అనే ప్లాంట్ ఫాం లో ఏవో కొన్ని కథలు, వ్యాసాలు గట్రా రాస్తున్నాను.

ఇక తరుణి లో కూడా రాయడం మొదలెట్టాను.

నాకు నీహారిణి గారు ఒక రచయిత్రి అని తెలిసినప్పటికీ, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప వ్యక్తి అని తెలియకపోవడం, తెలుసుకోకపోవడం నా అవిజ్ణత.

ఐతే ఆగస్టు 30 2023 న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో 2021 సంవత్సరానికి గాను వివిధ రంగాలలో నిష్ణాతులైన 12 మందికి సత్కారం, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అందులో

డాక్టర్ నీహారిణి గారు ఉత్తమ రచయిత్రి గా ఎన్నిక కావడం, ఆవిడ ఆ పురస్కారం అందుకునేందుకు అమెరికా నుంచి రావడం, ఆ విషయం నాకు మెసేజ్ చేయడం ఇవన్నీ నా పూర్వ జన్మ సుకృతం వల్ల లభించిన వరం అని అనక తప్పదు.

అక్కడే మొదటిసారి ఆవిడను, ఆవిడతో పాటు మిగిలిన 11 మంది కళామతల్లి ముద్దుబిడ్డలను ప్రత్యక్షంగా చూడగలగడం, వారి మాటలు వినగలగడం నా కళ్ళు, చెవులు చేసుకున్న పుణ్యం.

ఆహా ఏమి భాగ్యం! వారంతా వారి వారి రంగాల్లో విశేష కృషి చేసిన మహనీయులే. కానీ దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రం లో పుట్టారు. నిజమే, నిన్న నాకు బాగా అర్థమైన విషయం ఏమిటంటే, మన తెలుగు రాష్ట్రాలలో కళలకు, కళాకారులకు, ఈనాటికీ సరైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని.

కవిత:        శ్రీ గింజల నరసింహారెడ్డి

పరిశోధన:  తేరాల సత్యనారాయణ శర్మ

నృత్యం  :  శ్రీ ఎస్. కుమార్ (మేలట్టూరు)

చిత్రలేఖనం:  శ్రీ బి. నరహరి

శిల్పం:         డా. ఈమని శివనాగిరెడ్డి

సంగీతం:       శ్రీ పి. పూర్ణచందర్

పత్రికా రంగం  . శ్రీ జి.పల్లీశ్వర్

నాటక రంగం : శ్రీ దెంచనాల శ్రీనివాస్

జానపద కళారంగం : శ్రీ వెడ్మ శంకర్

అవధానం:  : డా. ముదిగొండ అమరనాధశర్మ

ఉత్తమ రచయిత్రి: డా. కొండపల్లి నీహారిణి

నవల/కథ:   డా. జి. అమృతలత

వీరిలో ఎందరు మీకు ముందుగా తెలుసో నాకు తెలియదు కానీ సిగ్గుపడుతూ చెప్తున్నాను నాకు వీరెవరి గురించి కూడా ఇంతకుముందు తెలియదని.

ఆ క్షణంలో నాకైతే ఈ సువిశాల కళా, సాహిత్య ప్రపంచం లో నా పరిమాణం ఆవగింజకన్నా చిన్నది అనిపించింది.

ఇక ఈ అవార్డు గ్రహీతలలో చాలా మంది 70+ యంగ్.

వారిలో పెల్లుబుకుతున్న ఉత్సాహం, ఉత్తేజం చూసి ఎంత ముచ్చట పడి పోయానో !

ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టి, ఈ 12 మందిని ఎంపిక చేసిన ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  మరుగున ఉన్న మణిపూసలను వెతికి పట్టుకొని వారిని తెలుగు ప్రపంచానికి పరిచయం చేసారు. హాట్సాఫ్ సర్.

ఇలా ఎందుకు చెప్తున్నానంటే వీరిలో చాలా మంది బైట ప్రపంచం లో ఇప్పటికే ప్రఖ్యాతులు.

ఇక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు మాత్రం ముందుగానే తెలుసు. అంటే, వీరి రచనలు చదివి ఉన్నాను.

ఆయన ప్రసంగిస్తూ డాక్టర్ నీహారిణి గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆవిడ రచనా, కవిత్వ పటిమను మెచ్చుకున్నారు.

మేడం గారు, నాకు ఒదిన అని చెప్పకునేందుకు ఎంతో గర్విస్తున్నాను.

తన రచనల్లో నాకు తెలిసిన ( తెలుసుకున్న) కొన్ని ఇక్కడ చెప్పి తీరాలి.

ఎనిమిదో అడుగు (కవిత)

రాచిప్ప (కథల సంపుటి)

వ్యాస హారిక ( వ్యాసాలు)

అర్ర తలుపులు (కవితలు)

నిర్నిద్ర గాణం.   ( కవితలు)

సృజన రంజని (వ్యాసాలు)

అమెరికా లో ఆరునెలలు ( యాత్రా సాహిత్యం)

తెలంగాణా వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు

( పరిశోధన గ్రంథం)

ఇవి నాకు తెలిసిన కొన్ని. ఇవన్నీ అమెజాన్ లో లభ్యం.

నేను పైన పేర్కొన్న ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కో వ్యాసం రాయాలని ఉంది. తప్పకుండా ప్రయత్నిస్తాను.

నిన్న ఈ కార్యక్రమానికి హాజరైన తరువాత నుంచీ ఈ వ్యాసం రాస్తున్నంత వరకూ, ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల వరకూ నేను ఈ కిక్ ని అనుభవిస్తూనే ఉంటాను.

ఒక 3 గంటల పాటు సత్సంగంలో గడిపిన ఆ అనుభవం ఒక మధురమైన అనుభూతి. అది మీ అందరితో పంచుకోవాలని ఈ ఆరాటం.

 

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బంధాలు – బంధుత్వాలు

ఆయుర్వేద వైద్యం