
అలా హడావుడి పడుతూ వంట కార్యక్రమం మొదలు పెట్టింది ..ముందు రోజు సాయంత్రం తిరిగి పెట్టుకున్న కూరగాయలు ఫ్రిజ్లో నుండి తీసి పాలకూర పప్పు క్యారెట్ శాకంలో పచ్చి కొబ్బరి వేసి చేసింది.. టమాటా చారు చేసి పిల్లలిద్దరి వరకు అన్నం వండేసింది… అన్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది.. అప్పటికే స్నానం పూజ ముగించుకొని వచ్చిన అత్తగారు మామగారు టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు…
” ఏం టిఫిన్ చేసావు భాగ్యం” అన్నారు .
భయం భయంగా “ఉప్మా చేశానండి “అన్నది.
” ఉప్మా చేసావా! ఇడ్లీలో దోశలో చేయొచ్చు కదమ్మా నాకు ఉప్మా ఇష్టం లేదని తెలుసు కదా” అన్నారు మామ గారు.
” టైం సరిపోక తొందరగా అవుతుందని చేశాను” అన్నది లోపల కొంచెం బాధపడుతూ…
” కొంచెం ముందుగా లేవాల్సింది… ఆలస్యంగా లేచి పనులు కాలేదంటే ఎలా? తప్పదు ఏం చేస్తాం పెట్టింది తినాల్సిందే మాకు జరిగే మర్యాద ఇలా ఉంది.. ” అంటూ దండకం మొదలు పెట్టింది అత్తగారు.
ఇద్దరికీ ప్లేట్లలో ఉప్మా పెట్టి కొబ్బరి పచ్చడి కొంచెం ఆవకాయ వేసి టేబుల్ మీద పెట్టింది… అన్ని టేబుల్ మీద పెట్టినా కూడా స్వయంగా వడ్డిస్తేనే తింటారు ..పోనీ అనారోగ్యంగా ఉన్నారా అంటే చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సినిమాలకు షికార్లకు కూడా వెళుతుంటారు కానీ ఇంట్లో మాత్రం ఇటు పుల్ల అటు పక్కకు పెట్టడానికి అత్తగారు అనే అహం మామగారు అనే బింకం అడ్డుస్తుంటాయి వీళ్ళకి..
ఇక్కడ వీళ్ళకి ఇన్ని మర్యాదలు చేస్తుందా! మరి తనకు కోడలు వచ్చింది కదా తనకు అలాంటి మర్యాద దొరుకుతుందా?
వీళ్లకు ఉన్నట్టు తనకు ఇలాంటి మర్యాదలు కావాలని ఏమీ లేదు కొంచెం మనుషిలా గౌరవిస్తే చాలు అనుకుంటుంది… కానీ ఇప్పటికి పిల్ల తీరు ఏమిటో అర్థం కావడం లేదు ప్రేమగానే ఉంటారు ప్రేమగానే మాట్లాడతారు కానీ చేసే పనులు తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థం కావడం లేదు… పొరపాటున ఎవరికైనా కాలు తాకితే సారీ అని చెప్తాము పెద్దవాళ్ళు అయితే కాళ్లకు నమస్కారం చేస్తాము.. కానీ ఒకరోజు సోఫాలో కూర్చున్న కోడలు అలా కాలు ఊపుతుంది.. అత్తగారైన భాగ్యం కింద కూర్చొని ఏవో కూరగాయలు తరుగుతుంది… పైన కూర్చున్న పరవాలేదు అలా కాలు ఊపుతూనే ఉంది అది భాగ్యం భుజంకు వచ్చి తాకింది… కాలుతాకిందని కనీసం నొచ్చుకో లేదు సరి కదా అలా ఏమీ ఎరగనట్లు ఊపుతూనే ఉంది… చాలా బాధేసిన భాగ్యం, తానే పక్కకు జరిగి కూర్చుంది.. ఇంట్లో చూస్తే ఇలా ఉంది…
తయారైన కొడుకు కోడలు టేబుల్ దగ్గరికి వచ్చి చిట్లించిన మొహాలతో ఉప్మా తినేసి బాక్సుల్లో వాళ్లకు కావాల్సిన పెట్టేసుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయారు.
అత్తగారు మామగారు అప్పటికే వాళ్ళ గదిలోకి వెళ్లి టీవీలో ఏదో సీరియల్ పెట్టుకుని దానిమీద డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అది చూసి..” కనీసం ఇంట్లో ఒక్కతే పని చేసుకుంటుంది అనే కనికరం కూడా లేదు.. ఇంకా నయం పని పిల్ల విజయ మంచి అమ్మాయి దొరికింది తన కష్టం తెలుసుకొని ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుంది.” అనీ అనుకొని ఇల్లంతా శుభ్రం చేసి లంచ్ కోసం బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసి తానూ ప్లేట్లో కొంచెం ఉప్మా పెట్టుకుంది… అప్పటికే చల్లారి పోయిన ఉప్మాను మెల్లగా తింటూ… బాల్కనీలో విరగ పూసిన గులాబీలను చూస్తూ అలాగే ఉండిపోయింది… ఎంత చక్కగా ఉంది గులాబీ అలా నేను గులాబీ బాలనైపోయినా బాగుండు.. అలా సూర్యకిరణాలు సోకిన గులాబీలు అందంగా కనిపిస్తున్నాయి.. మొక్కలు అంటే తనకు ఎంతో ఇష్టం ఎన్ని పనులు ఉన్నా ముందుగా మొక్కలకు నీళ్లు పోస్తుంది. బయట నుండి ఎంత అలసిపోయి వచ్చినా ముందుగా మొక్కల గురించి ఆలోచిస్తుంది. టిఫిన్ తిని న్యూస్ పేపర్ తీసుకొని సోఫాలో కూర్చుంది… అలసిపోయిన మేను విశ్రాంతి కోరుతుంది… తనకు ఎంతో ఇష్టమైన సంగీతం తననీ ఊహ జగత్తులోకి తీసుకెళుతుంది.. తనకి ఇష్టమైన సుశీలమ్మ పాట పాడుతూ కూర్చుంది…” రామ నీదయరాదా!” అంటూ చక్కని స్వరాన్ని ఆలపిస్తూ మైమరిచిపోయింది. పెళ్లి కాకముందు నేర్చుకున్న సంగీతం పెళ్లయిన తర్వాత చేదు గుళిక లా తయారయింది.. ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాడిన భాగ్యం పెళ్లయిన తర్వాత ఇంటి వరకే పరిమితం అయింది అది కూడా ఎవరూ లేనప్పుడు పాడుకోవడమే…
సంగీతంలో ఉన్న మాధుర్యం ఎప్పటికప్పుడు తాను అనుభవిస్తూనే ఉంది…
” పాడుతా తీయగా” ప్రోగ్రాం అంటే తనకు ఎంతో ఇష్టం ఎప్పటికప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తూ పాల్గొనే పిల్లలని ఎంతో ఇష్టంగా చూస్తుంది.. అది స్టార్ట్ అయిన కొత్తలో మొదటి సీజన్లో తాను పాల్గొని విజేతగా నిలిచింది ఆరోజులు గుర్తొచ్చాయి భాగ్యానికి..
బాలుగారి చేతి నుండి అందుకున్న ప్రశంసా పత్రము తన జీవితంలో మర్చిపోలేనిది వారితో అన్ని వారాల తన ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..
ఒక సంగీత గంధర్వుడు మానవత్వం ఉన్న మహనీయుడు… అల్లరి చేసే బాలుడు.. అలాంటి బాలు గారు అర్ధాంతరంగా శివైక్యం చెందడం తనని ఎంతో బాధకి గురి చేసింది.. కొన్ని రోజులు టీవీలో బాలు గారి పాటలు వస్తే టీవీ బంద్ చేసి లోపలికి వెళ్లిపోయేది ఎక్కడ బాలు గారి పాట విన్న గుండెలో మెలిక పెట్టినట్టు అయ్యేది…. కానీ వారు లేకుండా వారు పాడిన వందలాది పాటలు ఉన్నాయి… అతనికి మరణం లేదు.. భాగ్యానికి కంటి నుండి రెండు కన్నీటి బొట్లు రాలిపోయాయి…
ఇలా రోజు పనులతో బిజీగా ఉన్న భాగ్యానికి తన మనసు సంగీతం వైపు ఎంత లాగుతుందో అర్థం అవుతూనే ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి… ఇష్టాన్ని చంపుకొని బ్రతుకుతున్నాను అని ఎన్నోసార్లు బాధపడేది…
ఇలా బాధపడుతున్న భాగ్యాన్ని కొడుకు కిషోర్ ఎన్నోసార్లు గమనించాడు “అమ్మ అందరి కోసం ఎంత త్యాగం చేస్తుంది.. కానీ అమ్మ పనులలో యాంత్రికంగా మారిందే తప్ప తన మనసు ఎక్కడో ఉంది తన కోరికలు తీర్చాలి” అని అనుకున్నాడు.
వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మకు ఏమి ఇష్టం అమ్మమ్మ! అమ్మ అన్ని పనులు చేస్తున్న ఏదో పోగొట్టుకున్నట్లు కనిపిస్తుంది” అనీ అడిగాడు..
” మీ అమ్మకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం రా.. ఎన్నో ప్రోగ్రాంలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుచుకుంది మీ నాయనమ్మ వాళ్లకు ఇష్టం లేదని తను అన్నిటినీ వదులుతుంది తన బాధంతా అదే అయి ఉంటుంది” అని చెప్పింది.
ఒకరోజు కిషోర్ తల్లి దగ్గరికి వెళ్లి..” అమ్మ సాయంత్రం రెడీగా ఉండు మనము ఒక చోటికి వెళ్దాం” అన్నాడు.
” ఎక్కడికి రా ఇంట్లో పనులన్నీ కావద్దా మీ నానమ్మ వాళ్లకి సమయానికి అన్నీ అమర్చాలి ఎవరు చేస్తారు ఇవన్నీ” అన్నది.
” అందరం కలిసి వెళ్తున్నాం అమ్మ ఇంట్లో వంట పని ఏం పెట్టుకోకు తర్వాత చూద్దాం” అన్నాడు కిషోర్.
అప్పటికే కొడుకు కోడలు ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు.. అందరికీ ముందుగానే చెప్పాడేమో..
అత్తగారు చక్కని గద్వాల్ చీర కట్టుకొని తలలో మల్లెపూలు ముడుచుకొని అందంగా తయారయింది.. మామగారు తెల్లని దాల్చి పైజామాలో మెరిసిపోతున్నారు…
” ఏంటి వీళ్లంతా ఇంతగా తయారయ్యారు? అసలు ఎక్కడికి వెళ్తున్నామ్” అనుకున్నది.
ఇంతలో శ్రీవారు వచ్చారు “రెడీ అయ్యారా అందరూ” ఆయన కూడా చక్కని డ్రెస్ వేసుకొని వచ్చారు..
” ఏంటి నువ్వు ఇలాగే ఉన్నావు తొందరగా తయారవ్వు” అన్నాడు భర్త.
ఇంతలో కొడుకు కోడలు గదిలో నుండి బయటకు వచ్చారు కోడలు చక్కని చుడిదార్ లో అందంగా కనిపిస్తుంది… కొడుకు జీన్స్ టీషర్టు వేసుకున్నాడు అందరూ ఎంతో అందంగా తయారయ్యారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు…
భాగ్యం కూడా లోపలికి వెళ్లి తనకు ఇష్టమైన లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుంది… పింక్ కలర్ కి ఆకుపచ్చ బార్డర్తోఎంతో అందంగా ఉంది… జడలో చిన్న చేమంతి పువ్వు పెట్టుకుంది… ఎప్పటికన్నా కొంచెం ఎక్కువగానే తయారయ్యింది..
బయటకు వచ్చిన భాగ్యంను అందరూ.. ప్రశంసగా చూశారు…
ఇక అందరూ కలిసి రెండు కార్లలో బయలుదేరారు..
ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాని భాగ్యం అలాగే కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.
కార్లు రవీంద్ర భారతి ముందు ఆపారు…
రవీంద్ర భారతికా! ఎవరి ప్రోగ్రాం జరుగుతుంది? ఎందుకొచ్చాం మనం ఇక్కడికి ?అసలు మన ఇంట్లో ఎవరికీ ఏ ప్రోగ్రామ్స్ ఇష్టం ఉండవు కదా! అసలు ఈ ఆలోచన ఎవరిది? ” ఇలా ప్రశ్నలన్నీ కురిపించింది భాగ్యం.
” కాసేపు ఆగమ్మా నీకే తెలుస్తుంది లోపలికి వెళ్ళాక” అని చెప్పాడు కొడుకు కిషోర్.
అందరూ లోపలికి వెళ్లారు.. ముందు వరుసలో రిజర్వ్ అనే రాసి ఉన్న సీట్లలో వెళ్లి కూర్చున్నారు… భాగ్యంకు ఇదంతా అయోమయంగా ఉంది.. ఇన్నేళ్లయింది రవీంద్రభారతికి వచ్చి తానే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇందులో పార్టిసిపేట్ చేసింది అలాంటిది ఇప్పుడు తనకే కొత్తగా అనిపిస్తుంది” అని అనుకుంది.
చాలామంది ప్రముఖ గాయని గాయకులు పాటలు పాడుతున్నారు. కార్యక్రమం ఎంతో బాగుంది… ఇంతలో నెక్స్ట్ పాల్గొనే గాయనీ మణి మొదటి సీజన్ లో పాడిన కంటెస్టెంట్ ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నది చక్కని గాత్రంతో ఆమె పాటలు ఎంతో అలరిస్తాయి అలాంటిది కొన్ని ఏళ్లుగా ఆమె సంగీత ప్రపంచానికి దూరం అయింది ఇప్పుడు మళ్ళీ పాటల పూదోటలో మళ్లీ విరబూయడానికి వచ్చింది.. ఆమె ఎవరో కాదు శ్రీమతి భాగ్యం గారు.. ఆమెని వేదిక మీదికి వచ్చి ఆమెకు నచ్చిన పాట పాడాల్సిందిగా కోరుతున్నాము” అని అనౌన్స్ చేశారు.
ఎవరో ఆ భాగ్యమని చుట్టూ చూస్తూ కూర్చుంది భాగ్యం.. ఇంతలో కొడుకు కిషోర్ ..
“అమ్మా! నిన్నే పిలుస్తున్నారు వేదిక మీదికి వెళ్ళు” అన్నాడు.
” నన్నా! నన్ను ఎందుకు పిలుస్తున్నారు.. అసలు నేను పాట పాడగలనా ఇన్నేళ్లయింది నా గొంతు మూగబోయి..” చిన్నగా అన్నది .
” నువ్వు పాడగలవమ్మా వెళ్లి నీకు ఇష్టమైన పాట పాడు” అని తల్లి చేయి పట్టుకొని వేదిక వరకు తీసుకెళ్లాడు.
” వణుకుతున్న కాళ్లతో వేదిక పైకెక్కింది.. ఆ సరస్వతీ పీఠం మీదికి వెళ్ళగానే ఎక్కడినుండో ఎంతో శక్తి వచ్చినట్లు అయింది… తన ప్రపంచంలోకి తాను వచ్చినట్లు అనుకుంది… మైకు ముందరికి వెళ్లి..
తనకు ఎంతో ఇష్టమైన” మనసే అందాల బృందావనం” పాటను పాడింది… ఆమె పాడుతుంటే కింద కూర్చున్న ఆమె కుటుంబం అంతా ఎంతో శ్రద్ధగా వింటూ కనిపించారు… పాట పూర్తికాగానే అందరి కరతాళ ధ్వనులు తనని ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్లినట్లు అనిపించింది…
నేను కోరుకున్నది ఇదే అనుకున్నది.. తనకళ్ళు నీటితో నిండిపోయి… కొడుకు వైపు కృతజ్ఞతగా చూసింది… చిరునవ్వుతో కొడుకు అమ్మనే చూస్తూ ఉన్నాడు…
అలా తన చిరకాల కోరిక తీరినందుకు ఎంతో సంతోషంతో ఇంటికి చేరుకుంది.. రెట్టింపు ఉత్సాహంతో అన్ని పనులు చేసుకో సాగింది ఇప్పుడు సూర్యోదయాలు కూడా అందంగా కనిపిస్తున్నాయి… అంతే కదా మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి..