
నాణానికి రెండు వైపులా చూడాలి అంటారు ఈమధ్య మనం ఎక్కువగా వింటున్నది మానవ సంబంధాలు బలహీనపడ్డాయి ఇంటికి ఒకప్పుడు ఎంతోమంది బంధువులు అతిథులు వచ్చేవారు ఈమధ్య ఒక మనిషిని కూడా భరించడం ఒక గంటకి కూడా కష్టమైపోతుంది అని చెప్పడం వింటున్నాము.. అంటున్నాము కూడా.. ఒక విషయానికి వద్దాం! ఒకప్పటికీ ఇప్పటికీ పోల్చుకుని చూస్తే చాలా తారతమ్యాలు మనకి కనిపిస్తాయి
అవేంటంటే…..
****
అప్పట్లో బంధువులు సెలవులప్పుడు లేదా ఏవైనా కార్యాలు జరిగినప్పుడు చాలా రోజులు ముందుగానే వచ్చే వాళ్ళు. దగ్గర దగ్గర నెలరోజులైనా ఉండేవాళ్ళు.. వచ్చినప్పటినుండి అన్ని పనులలో చేదోడువాదోడుగా ఉంటూ,ఇంట్లో చేసినదే తింటూ ఇంటి మనుషుల్లా మెలుగు కొనేవారు… అందరికీ సౌకర్యంగా గదులు ఉండేవి కావు. హాల్లోనే అందరూ సర్దుకుని, క్రింద నేల మీద చాపలు, జంపకాణాలు, చెద్దర్లు వేస్తే పడుకునే వాళ్లు. భోజనాల ఖర్చు కూడా ఇప్పటిలా ఆడంబరంగా ఉండేది కాదు. మాటిమాటికి చాయలు కాఫీలు అందులోకి బిస్కెట్లు 9 గంటల వరకే టిఫిన్లు … మధ్యాహ్నం భోజనాలు. మళ్ళీ సాయంత్రం చిరు ఆహారం. మళ్లీ టీ కాఫీలు తర్వాత రాత్రి భోజనాలు.
ఇది అప్పుడు! మరి ఇప్పుడు?…..
ఇక ఈ మధ్యకాలంలో …డైటింగ్ అంటూ రొట్టెలు చపాతీలు ఇవన్నీ సమకూర్చాలి…. వచ్చినవాళ్లు ఏదైనా సహాయం చేస్తారా అంటే ఏమీ ఉండదు. ఏం తక్కువ చేసినా , అక్కడికెళ్తే ఇలాంటి భోజనం పెట్టారు ఇట్లా చేసారు అట్లా చేసారు అని అందరితో చెబుతారు.. ఇలా ఉంటున్నాయి… ఈ రోజులు!
కానీ అప్పటి రోజుల్లో ఒకేసారి చాయ్ అందరికీ ఇచ్చేవాళ్ళు ఇంకా పిల్లలకైతే రాత్రి అన్నము లేదా పొద్దున ఏవైనా అటుకులు లాంటివి పెట్టేవాళ్ళు.. పెద్దవాళ్లు దాదాపు ఉపాహారం (బ్రేక్ ఫాస్ట్)ఎవరు చేసే వాళ్ళు కాదు వచ్చిన వాళ్ళు ఇంటి వాళ్ళు కలిసి ఇంటి ముందుకు వచ్చిన కాయ కూర కొనుక్కుని వాటిని శుభ్రం చేసి తరిగి పెట్టుకుని మడి కట్టుకుని ఒకరు వంట చేస్తే మరో ఇద్దరు సహాయం చేసే వాళ్ళు .అందరికీ ఒకేసారి జరిగేది .వడ్డించే ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం తర్వాత భోజనం చేసే వాళ్ళు. వీళ్ళ కు ఎవరైనా వడ్డించే వాళ్ళు.ఆ తర్వాత శుభ్రం చేసుకోవడం నీటితో శుద్ధి చేయడం ఇవన్నీ పిల్లలు, పెద్దలు కలిసి చేసే వాళ్ళు .తిన్న కంచాలు కూడా అప్పుడే శుభ్రం చేసే వాళ్ళు పిల్లలు… ఇంకా భోజనాలయ్యాక పెద్దవాళ్లు ఓ అరగంట గంట కునుకు తీసి ఆ తర్వాత పక్క వాళ్ళు ఇంకా ఎవరైనా వస్తే ముచ్చట్లు పెట్టుకొంటూ ఉండేవాళ్ళు. అది కూడా వత్తులు చేస్తూనో… లేదా రేపటి కొరకు వండే చిక్కుడు కాయలు లాంటివి వలుచు కోవడమో చేసేవారు .ఇంకా సాయంత్రం చిన్న చిన్న పనులు పిల్లలు చేసే వాళ్ళు వాకిట్లో నీళ్లు చల్లడం సాయంత్రానికి పడకలు ఏర్పాటు చేయడం.. పూలు కోయడం ఇలాంటి పనులు.. రాత్రి భోజనాలు 7 లేదా8 లోపల అయిపోయేవి… ఇంకా పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడుకుంటూ అలా అలసిపోయి నిద్ర పోయే వాళ్ళు .పెద్దవారికి కూడా రాత్రి కొంత విశ్రాంతి దొరికేది…
కాని,
ఈ రోజుల్లో ఎంత రాత్రి అయినా భోజనాలు పని కాదు అందరూ టీవీ చూస్తూనో… మాటలతోనూ కాలక్షేపం చేస్తారు వచ్చిన బంధు వర్గం ..ఇంకా ఇంటి వాళ్లకు మాత్రమే ఏ మాత్రం విశ్రాంతి దొరకదు.పొద్దుపోయి నిద్రపోవడం మళ్లీ పొద్దున్నే లేవడం వచ్చిన వారికి అన్నీ సమకూర్చడం ఇలా ఉంటుంది.అందరి ఇళ్లలోనూ… ఇదే తంతు ప్రస్తుతం. ఇలా అయినప్పుడు ఎవరైనా వస్తున్నారు అంటే నిజంగా భయమే ఉంటుంది కదా! అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి.అయినా పని తీరదు… ఆడంబరాలు ఎక్కువైన కొద్దీ ఇల్లు సర్దడం అందంగా పెట్టుకోవడం శుభ్రం చేసుకోవడం అనే పనులు ఎక్కువ అయ్యాయి.అప్పట్లో ఇళ్ళు తడి గుడ్డ తో రోజు తుడుచుకోవడం దుమ్ము దుమ్ముదులపడం వస్తువులను ఇలాంటివి రోజు ఉండేవి కావు.ఇప్పుడు ఇల్లు మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది … ఒక్కరోజు సర్దకున్న ఇల్లు మొత్తం దుమ్ము పేరుకుంటుంది.వచ్చిన వాళ్ళు అబ్బో వాళ్ళ ఇల్లు ఎంత చండాలంగా ఉందో అని ఒక బిరుదు ఇచ్చేస్తారు.ఇలాంటప్పుడు ప్రతి ఇల్లాలికి అతిధులు వస్తున్నారంటే కొంచెం భయమే ఎంత మంది దీన్ని సానుకూలంగా తీసుకుంటారో మరి! కానీ,నాకు తెలిసి ప్రతి ఇల్లాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఉంటుంది కావచ్చు. అతిథులు వస్తే పెట్టాలని అందరికీ ఉంటుంది. ఉండదా? చేసే పనులు ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.అంతే తప్ప ,ఒకరికి భోజనం పెడితే మన సంపద ఏమైపోతుందో అనే బాధ తో కాదు. లేదంటే మరి ….. నాకు తెలిసి ఉండదు…
అప్పట్లో పిల్లలు అందరూ కలిసి ఆడుకునే వాళ్ళు. బంధువుల పిల్లలు స్నేహితులు కలిసి ఒకే చోట ఉండి. ఏది పెడితే అది తిని చక్కగా ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు అలా ఉంటుందా ! పిల్లలు పెరిగే వాతావరణం మారింది. అన్ని వాళ్ళకి పర్ఫెక్ట్ గా జరగాలి. ఒకరు ఇద్దరు పిల్లలు కాసేపు ఆడుకున్న ఆ తర్వాత కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. కానీ ఇంకా అందరి విషయంలో అలా లేదు. ఇంకా కొన్ని కుటుంబాలు కలిసి ఉంటున్నారు. పిల్లలకి పెద్దలకు మధ్య మంచి సయోధ్య కుటుంబ బంధాలను కాపాడుతున్నారు . కలిసి చేసుకుంటే అందరికీ విశ్రాంతి దొరికి ఎవరు వచ్చినా మనం ఎవరి ఇంటికి వెళ్ళిన ఇబ్బందిగా ఉండదు. మరి మీరంతా ఏమంటారు!