
నా పేరు ప్రకాశం. ఇది నా స్వీయ కథ. ఇది చదివి నాలాంటి తప్పు చేయకుండా, ఒక్కరు మారినా చాలనే ఈ కథ చెప్తున్నాను.
పార్కులో మూలగా కూర్చుని ఉన్నాను నేను రోజూ లాగానే.. పార్క్ లో ఉన్న చిన్నా పెద్ద, జంటలను చూస్తూ కాలం గడుపుతున్నాను. అది నా దినచర్యలో భాగం అయింది గత రెండు సంవత్సరాలుగా. సంధ్యా సమయం అవగానే వచ్చి పార్కులో కాసేపు వాకింగ్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ మూల బెంచి మీద ఒక గంట సేపు కూర్చుంటాను .ఈరోజు కూడా అలాగే కూర్చుని ఉన్నాను..
ఎందుకో మరి సంధ్య బాగా జ్ఞాపకం వస్తుంది ఈరోజు. మా పెళ్ళి రోజు కదా, అందుకేనేమో. మనిషికి దేని విలువైనా,అది మనతో ఉన్నప్పుడు తెలియదు. అది దూరమైన తర్వాత,దానికోసం వెంపర్లాడతాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. పార్క్ లో,బైట ఎక్కడికి వెళ్ళినా కనిపించే జంటలను చూస్తూ, జీవితంలో ఏం కోల్పోయానో అర్థమౌతోంది నాకు.
అలా ఆలోచన లోకి జారిపోయాను. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగిని. పెద్ద హోదా కాకపోయినా ఫర్లేదు మంచి జీతం, అనుకూలవతి అయిన భార్య, ఒద్దికైన ఇద్దరు ఆడపిల్లలు. మంచి జీవితం, నా ఆదాయానికి సరిపడినట్లుగా పొదుపుగా, పద్ధతిగా ఉండేది నా ఇల్లాలు సంధ్య. ఏనాడూ నన్ను గొంతెమ్మ కోరికలు కాదు కదా నిజానికి అసలు ఏ కోరికలూ కోరలేదనే చెప్పాలి. నా అత్తింటి వారు ప్రతి సంవత్సరం దసరా పండక్కి ఇంటిల్లిపాదికి బట్టలు కొనేవారు. రాఖీ పండుగకు తన చెల్లెలు కోసం చీర కొనేవాడు బావ. కేవలం సంధ్య పుట్టినరోజుకు మాత్రం ఒక మంచి చీర కొనేవాడిని నేను. మధ్యలో ఎప్పుడైనా వాడక చీరలు ఒకటో రెండో కొనేవాడిని అంతే. అయినా ఆమె ఏనాడూ తనను చీరల కోసం, నగల కోసం అడగలేదు. పిల్లల చదువుల గురించే ఎక్కువగా ఆలోచించేది.
అదృష్టవశాత్తు నా కూతుర్లు ఇద్దరు చక్కగా చదువుకున్నారు. ఈ కాలం పిల్లల లాగా అది కావాలి, ఇది కావాలి అంటూ ఎప్పుడూ సతాయించలేదు. ఆ విషయంలో నా కొలీగ్స్ అంతా నన్ను చూసి ఎంతో ఈర్ష పడుతుండేవారు. “నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా ప్రకాశం?” అంటూ. కానీ ఆ అదృష్టం విలువ నిజంగా నాకు తెలియలేదు.
అంత మంచి జీవితాన్ని తన చేజేతులారా నాశనం చేసుకున్నాను. నా అహంకారమే నన్ను ఈ స్థితిలోకి నెట్టేసింది. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు ఆనాడు. ‘ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’ అన్నట్లు ఇప్పుడు ఎంత బాధపడినా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కలుగుతుందా?
గతం లోకి పరుగులు తీసింది మనసు.
“ఏమండీ మీరు ఎందుకు ఆ మాధవికి ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారు?” అడిగింది సంధ్య.
“ నా ఫోన్ ఎందుకు చెక్ చేసావ్? ఎన్ని సార్లు చెప్పాను నీకు నా ఫోన్ ముట్టుకోవద్దని?” అరిచాను.
“ మీరు స్నానం చేస్తుండగా ఫోన్ మోగింది. బంధువుల అమ్మాయి కదా అని ఎత్తాను. కానీ తను, “హలో బావా అంటూ మరో విధంగా మాట్లాడుతోంది. ఏమిటి మీతో అంత చనువు తనకి?” సంధ్య మాటల్లో బాధ తనకు తెలుస్తున్నా ,పురుషున్ని కదా అహంభావం ఒంటి చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది నాకు.
“బంధువులైనా, ఎవరైనా సరే, నా ఫోన్ ఇంకోసారి ముట్టుకుంటే బాగుండదు,”మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్లిపోయాను.
ఒక రెండు రోజులు భార్యాభర్తల మధ్య మౌనం రాజ్యమేలింది. మూడోరోజు నా పుట్టినరోజు కావడంతో పాపం పిచ్చిది భర్త మీద ప్రేమ ఆపుకోలేక తనే మాట్లాడింది, “హ్యాపీ బర్త్డే అండీ,లేవండి మీకోసం మీకు ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా, అల్లం పచ్చడితో చేశాను,” అంటూ.
విజయగర్వం నాకు.తప్పు చేసినా, తనదే పై చేయి అయింది కదా!
ఆ మాధవి నాకు వేలు విడిచిన మరదలు. ఒక ఊరే కావడంతో చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం.ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేసాను . .పెళ్లి, పిల్లలు అలా జీవితం హ్యాపీగా సాగిపోతోంది.
ఏడాది క్రితం బంధువుల ఇంట్లో వివాహం ఎటెండ్ అవడానికి వరంగల్ వెళ్ళాను..అక్కడ కనిపించింది మాధవి. నిజానికి చిన్నప్పుడు బావమరదళ్ళుగా వాళ్ళిద్దరూ ఆడుకునే సమయంలో బంధువులంతా, “దీనిని పెళ్లి చేసుకుంటావా ఏంట్రా?” అంటూ ఆటపట్టించేవారు. ఆ పసి వయసులో ఆ మాటలు ఏదో వింత ఆనందం కలిగించేవి. కానీ వివాహం చేసుకునే వయసులో అతడికి మాధవి జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం వచ్చినా వద్దనుకున్నాడేమో? ఎందుకంటే కొంచెం నల్లగా, పొట్టిగా, సన్నగా ఎండిపోయినట్లుగా ఉండేది మాధవి.
ఆమె కన్నా ఎంతో అందంగా ఉండేది సంధ్య, నా ఇల్లాలు. పచ్చని పసిమి రంగు.నిండైన విగ్రహం. పెళ్లి చూపుల్లో ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు.. కట్నం కూడా బాగానే ముట్ట చెప్పారు ఆమె తల్లిదండ్రులు.
ఇద్దరు పిల్లలు, మరో రెండు అబార్షన్లు వల్ల ఆమె శరీరాకృతి మారిపోయింది. “లావుగా డ్రమ్ములా ఉన్నావు,”అంటూ తనని ఎన్నిసార్లు అన్నాడో! పాపం నవ్వేది కానీ అని మారు మాట్లాడేది కాదు.
“నీ వంశం కోసం పిల్లల్ని కనడం వల్ల,నీ తల్లిదండ్రులను, నిన్ను, నీ పిల్లల్ని చూసుకోవడం వల్ల నా శరీరం మీద నేను శ్రద్ధ పెట్టుకునే సమయం చిక్కడం లేదురా వెధవా! ఇంటిపని సగం నువ్వు చెయ్యి, నేను జిమ్ కు, వాకింగ్ కి వెళ్లి సన్నగా నాజుగ్గా అయి చూపిస్తాను,” అని ఆమె సమాధానం చెప్పి ఉంటే అతను ఏమయ్యేవాడు?
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కలిసిన మాధవి, “బాగున్నావా బావా?” అంటూ పలకరించింది. మరదలు కనుక, చిన్ననాడు ఉన్న చనువు వల్ల,సరదాగా మాట్లాడాడు .ఏవో కారణాల వల్ల ఆమెకు వివాహం జరగలేదు. అతను ఇచ్చిన చనువు ఆమె మరో విధంగా అర్థం చేసుకుంది. ఇంకా దగ్గర అవడానికి ప్రయత్నించింది. ఆడది అవకాశం ఇస్తే అందుకోని మగవాడు ఉండడు కదా! తనూ అందరిలాంటి మగాడే మరి. అందినదే తడవుగా అవకాశాన్ని వాడుకున్నాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. అదేమిటో ఇదివరకు బాలేదు అనిపించిన మాధవి ఇప్పుడు నా కంటికి నచ్చుతోంది.
అలా మాధవితో కలిసే సమయంలో ఒక్కసారి అయినా భార్య, పిల్లలు గుర్తు రాలేదు నాకు ..ఎంత దుర్మార్గుడినో కదా! భార్య సరే కనీసం వయసుకు వచ్చిన ఆడపిల్లలైనా గుర్తు రాలేదే? అంత మాయ పొరలు ఎలా కమ్మేసాయి? అంది వచ్చిన అవకాశం వదులుకోకూడదు అని అనుకున్నాడు కానీ, అందమైన సంసారం నాశనం అవుతుందేమో దీని వల్ల అని ఆలోచించ లేకపోయాడు .
అలాగని నేనేమైనా చిన్న వాడినా? నాకు అప్పటికే 50 సంవత్సరాలు. నా పెద్ద కూతురు ఇంజనీరింగ్ చదువులో ప్రవేశించింది అప్పటికే. అలా నాతో ఉండడం అలవాటు అయిన మాధవి మకాం ఏకంగా హైదరాబాద్ కి మార్చేసింది. తనూ కాదనలేకపోయాడు. ఇక నెమ్మదిగా ఎక్స్ట్రా అవర్స్ ఆఫీస్ డ్యూటీ అంటూ లేటుగా ఇంటికి రావడం మొదలెట్టడంతో సంధ్య కి అనుమానం మొదలైంది. కానీ నోరు తెరిచి అడగలేక పోయింది. ఆరోజు మాధవి ఫోన్ లో మాట్లాడుతున్నది ఎవరో గమనించకుండా నేనే అనుకుని మాట్లాడడంతో సంధ్యకు అనుమానం ఎక్కువైంది.
అప్పుడైనా నేను జాగ్రత్త పడి ఉండాల్సింది. బుద్ధి బురదలోకి ఈడుస్తుంటే, మనసు చెప్పే మంచి మెదడుకు ఎక్కలేదు. ఇంజనీరింగ్ చదువుతున్న నా కూతురు నాకు తెలియకుండా నా ఫోన్లో పెట్టిన నిఘా నన్ను పట్టించింది. అడ్డంగా దొరికిపోయాను. చాలా ఏడ్చింది పాపం సంధ్య. “నేను మీకేం తక్కువ చేసానని ఇలా చేశారు? కనీసం మీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న విషయమైనా గుర్తుకు రాలేదా?” అంటూ.
ఏవో కారణాలు చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నించాను కానీ అప్పటికైనా, “తప్పు జరిగిపోయింది సంధ్యా ,నన్ను క్షమించు. ఇకపై ఇలా జరగదు,” అంటూ నా సంధ్యని బ్రతిమాలి ఉంటే తను నన్ను క్షమించేదేమో. ఏమో, ఏమిటి ఖచ్చితంగా క్షమించేది. అంత పెద్ద మనసు తనది. కానీ నావే పిదప బుద్ధులు. ఆ పని చేయలేదు. పైగా నన్ను నేను సమర్ధించుకోవడానికి ప్రయత్నించాను. ఆరోజున నన్ను వదిలేసి పిల్లలిద్దరినీ తీసుకొని వెళ్ళిపోయింది.
కుటుంబానికి పెద్దమనిషి అయిన మా అమ్మ కూడా ఆనాడు కొడుకు మీద ఉన్న ఎనలేని ప్రేమ వలన నన్నే సమర్థించింది. మగవాడు ఏదైనా చేస్తాడు ఆడదే సర్దుకుపోవాలి అంటూ సంధ్యకే చెప్పడంతో ఆమె హతాషురాలైంది. కన్నతల్లిలా చూసుకున్నది తను మరి అత్తగారిని.
మగాడు ఏది చేసినా భరించగలిగే ఇల్లాలు తన పడకను వేరే ఆడదానితో పంచుకుంటే ఏమాత్రం భరించలేదు అన్న విషయం మా అమ్మకు తెలియదా? తనూ ఆడదేగా! కానీ ఇక్కడ తల్లి, అత్తగారు పాత్రలలో తల్లి పాత్ర డామినేట్ చేసింది. దానివల్ల దీర్ఘకాలంలో నష్టపోయేది తామే అని అప్పుడు ఆమె, నేను కూడా గుర్తించలేదు.
సంధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని నేను ఏమాత్రం ఊహించలేదు. నాతో తగువులాడినా, ఏమైనా నాతో ఉండక తప్పదు తనకి, ఆర్థికంగా నా మీదే ఆధారపడి ఉంది కదా, అనే ఒక చులకన భావం ఏమో? అంతే కాక, పరువు కోసం పాకులాడే వ్యక్తి మా మామగారు. కూతురికి నచ్చజెప్పి, నా దగ్గరకు పంపించేస్తారు అని గట్టిగా నమ్మాను.
కానీ తనకు తన తల్లిదండ్రులు, తోబుట్టువుల ఆదరణ ఉంది. వాళ్ళు తనకి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచారు. నా పిల్లల బాధ్యత నాదే అని చెప్పాను డాంబికంగా. తీసుకున్నాను కూడా.
బంధువులలో, మాధవి వల్లనే మా కుటుంబం విడిపోయిందనే వార్త గుప్పుమనడంతో తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను రెంటికి చెడ్డ రేవడిని అయ్యాను. పౌరుషంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది కానీ పాపం పిచ్చి సంధ్య నన్ను క్షమించలేక, ఆ కోపాన్ని, బాధని, అవమానాన్ని దిగమింగుకోలేక పెరాల్సిస్ వచ్చింది. మా పెద్దమ్మాయి పెళ్లి జరిపించారు వాళ్ళ పుట్టింటి వారు. డబ్బు నేనే పెట్టినా ఒక బంధువులాగా వెళ్లి వచ్చాను. నెమ్మదిగా సంధ్య ఆరోగ్యం క్షీణించింది. ఎవరూ ఊహించని విధంగా ఒక రాత్రి నిద్రలోనే తను దూర తీరాలకి తరలిపోయింది.ఆ వార్త విన్న క్షణం నా మనసులో ఏదో ప్రకంపనలు. తన మరణానికి నేనే కదా కారణం? ఇది ఒక విధంగా హత్యే కదా! మనసు భారమైంది.
ఇది జరిగి ఐదు సంవత్సరాలు అయింది. సర్వీస్ లో ఉన్నన్నాళ్ళూ పెద్దగా తెలియలేదు. రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఒంటరితనం లోని బాధ తనను వేధిస్తోంది. తల్లి అనారోగ్యంతో మంచం చేరింది. ఆమెకి సపర్యలు చేసేందుకు ఒక మనిషిని పెట్టాను.
మా చిన్నమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళ అమ్మను మోసం చేసిన వ్యక్తిని తను క్షమించలేను, భరించలేను, అని నిర్మొహమాటంగా చెప్పేసింది. తను ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటోంది . నా డబ్బు కూడా ముట్టుకోనని చెప్పింది. పెద్దమ్మాయి ఎప్పుడో ఒకసారి పలకరిస్తుంది. అన్నీ ఉండి, అందరూ ఉండి, ఏమీలేని, ఎవ్వరూ లేని అనాధనయ్యాను.
మళ్లీ పెళ్లి చేసుకోమంటూ మా అమ్మ, కొందరు బంధువులు ఒత్తిడి చేస్తున్నా, ఇప్పుడు నా మనసు దానిని వ్యతిరేకిస్తోంది. నా సంధ్యకు నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా ఈ శేష జీవితం ఇలా ఒంటరిగానే గడపాలని, ప్రతి రోజూ ఈ బాధను అనుభవించాలని, అదే నేను ఈ జన్మకు చేసుకోగలిగే నిజమైన పరిహారం అని నిర్ణయించుకున్నాను.
క్షణికమైన సుఖం కోసం, అందమైన కుటుంబ బంధాలను నాశనం చేసుకునే నా వంటి మగాళ్ళు ఎందరో. వారిలో ఒక్కరికైనా నా జీవితం కనువిప్పు కలిగిస్తే అంతే చాలు.