‘పళ్ళ ప్రహసనం

మాధవపెద్ది ఉషా

అవునండీ మాకున్న ఇద్దరమ్మాయిలూ యు.ఎస్‌.లో ఉన్నారు. ‘ఐతే ఏంటిట..? ఆ మాటకొస్తే ఈ రోజులలో విదేశాల్లో పిల్లలు లేని వాళ్ళెవరు?…అంటున్నారా?’ నిజమే సుమండీ.. ఉన్నమాట చెప్పొద్దూ ఇయ్యాల రేపు దాదాపు అందరి కుటుంబాల్లోనూ కనీసం ఒకరైనా అమెరికాలో గానీ లేక ఇంకో ‘కా’లో గానీ లేనివాళ్ళెవరూ? ఎవరు కాదనగలరు లెండి…? కానీ అక్కడే వస్తుంది చిక్కంతా.

పిల్లలు విదేశాల్లో ఉంటే ఉన్నారు. ఆఫ్ట్రార్‌ పిల్లల బాగే కదా తల్లిదండ్రులు కోరుకునేది. తాము ఒంటరి వారైపోయినా, గుండెరాయి చేసుకుని పిల్లలను నిస్వార్థంగా విదేశాలకు పంపడమే అందుకు నిదర్శనం. అవునా… కాదా? అంతే కాదు కనపడిన ప్రతివారికీ మా పిల్లలు అమెరికాలోనో లేక యూకే లోనో ఉన్నారని ఎంతో గర్వంగా ఫీల్‌ అయిపోతూ చెప్పుకోకపోతే తోచదుకూడ వారికి. వాళ్ళు ఎంత ఒంటరివారైపోయినా, పిలుస్తే పలికే దిక్కు లేకపోయినా (ఈ రోజులలో ఎవరికి వారే, బిజీ అయిపోయిన కారణంగా) పిల్లల గురించి గొప్పలు చెప్పడం మాత్రం మానరు. ఇలాంటి గొప్పలు చెప్పడం ఎంత అనర్థదాయకమో ముందు ముందు ఈ కథ చదివితే మీకే అర్థం అవుతుంది.

అన్నట్లు చెప్పడం మరిచాను ఈ గొప్పల రాయుళ్ళ జాబితాలోకి మావారు కూడ వస్తారండోయ్‌…! నేను మన అమ్మాయిలు అమెరికాలో ఉన్నట్లు, అడిగిన వారికీ అడగనివారికి చెప్పకండి బాబూ మీకు పుణ్యముంటుందని ఎంత మొత్తుకున్నా ఛస్తే మాట వినరు కదా ఆ పెద్ద మనిషి!

మొన్నామధ్య టీ.వీ.లో వస్తున్న ”పళ్ళ” కార్యక్రమం… (పళ్ళంటే తినే ఫ్రూట్స్‌ అనుకునేరు పొరపాటున, కాదు కాదు, మన నోట్లో ఉన్న ముప్పై రెండు పళ్ళండీ బాబూ….) వస్తుంటే చూస్తున్నాం. అందులో భాగంగా ఒక యాంకర్‌ ఒక లేడీ డెంటిస్టుని ఇంటర్వ్యూ చేస్తోంది. కార్యక్రమం చివరలో నాకు నచ్చిన అంశం ఒకటి చెప్పారావిడ. అందేంటంటే, వాళ్ళ సంస్థ టెలిఫోన్‌ నంబర్‌ ఇచ్చి ఎవరైనా దంతాల సమస్యతో బాధపడుతుంటే ఆ నంబరుకి ఫోన్‌ చేసి ఎపాయింట్‌ మెంట్‌ తీసుకుని రమ్మని దాని సారాంశం. అంతే కాదు కన్సల్టేషన్‌ ఫీ, ఇంకా ఎక్స్‌ రేల ఫీ కూడ ఫ్రీ అని కూడ చెప్పింది.

అంతే… ఫ్రీగా వస్తే ఫినాయిల్‌ కూడ త్రాగే టైప్‌ కదా మనం, నేను వెంటనే ఎగిరి గంతేసాను. ఆ ఆనందంలో మావారికి పట్టుకుని ఓ ఊపు ఊపేసాను. ఆ పైన ఇలా అన్నాను,

”ఏమండీ నేను ఎన్నాళ్ళనుంచో నా పళ్ళన్నీ ఒకసారి థోరో చెకప్‌ చేయించుకుందామని అనుకుంటున్నానండీ. పైగా కన్సల్టేషన్‌ ఫీ కూడ లేదంటున్నారు కదా…! ఈ ఛాన్స్‌ మళ్ళీ రాదండీ.. అని మా వారిని బాగా నస పెట్టాను. ఇక మావారు కూడ ఒప్పుకోకపోతే రెండ్రోజులు తిండి ఉండదు ఎందుకొచ్చిన గొడవ అని వెంటనే సరేనన్నారు.

వెంటనే ఓ ఫైన్‌ మార్నింగ్‌ ఫోనులో అపాయింట్‌ మెంట్‌ తీసుకుని మేమిద్దరం ఆ డెంటర్‌ క్లినిక్‌ కి బయలుదేరాం. వెళ్ళే ముందు నేను మా వారికి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాను. మన పిల్లలు అమెరికాలో ఉన్నారని మాత్రం చచ్చిన చెప్పకండని.

”సరే లేవోయ్‌… ఆ మాత్రం నాకు తెలీదేంటి? నువ్వేం చెప్పక్కర్లా..” అన్నారు. అది విని హమ్మయ్య అనుకున్నాను మనసులో.

మొత్తానికి ఆ హాస్పిటల్‌ ఎడ్రస్సు పట్టుకుని లోపలికి వెళ్ళి వెయిట్‌ చేసాం. ఇంతలోనే మా వారు నా చెవిలో చెప్పారు హుషారుగా… ”నేను కూడ చూపించుకుంటానోయ్‌ పనిలో పని” అన్నారు. నేను సరేలెండి, ఎలాగో కన్సల్టేషన్‌ ఫ్రీయే కదా, అలాగే చూపించుకోండి అన్నాను ఎంతో ఉదారంగా. అదే విషయం అక్కడ రిసెప్షన్‌ లో చెప్తే వాళ్లు మా చేత ఫాంలు ఫిల్‌ చేయించి, లోపలికి పంపించారు.

లోపలికి వెళ్లగానే ఒక లేడీ డెంటిస్ట్‌ మమ్మల్ని సాదరంగా విష్‌ చేసి మీ ప్రాబ్లమ్‌ ఏమిటి అని అడిగింది. జస్ట్‌ జనరల్‌ చెక్కప్‌ కోసం వచ్చాం అన్నాను.

మా వారు ఛాన్స్‌ దొరికింది కదా అని మొదలుపెట్టారు. ”నాకేం లేదండీ, రోజుకి నాలుగు సార్లు బ్రష్‌ చేసుకుంటాను. మవుత్‌ వాష్‌ కూడ వాడతాను. మాకిద్దరాడపిల్లలండీ. ఇద్దరూ అమెరికాలో ఉంటారు. ఈ ఆడపిల్లలున్నారు చూడండీ వాళ్ళకి తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమండీ… ఆ ప్రేమకి తట్టుకోలేకపోతున్నామండీ. వాళ్ళ పోరు భరించలేకనే మేము ఈ రోజు మీ దగ్గరికి వచ్చాం అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే నేను మా వారిని డాక్టరుకి కనపడకుండా తొడ మీద గిల్లి ఏం మాట్లాడుతున్నారు, ఆపండిక అనే అర్థం వచ్చేలా ఓ చూపు విసిరాను, మా వారి వంక.

కానీ అప్పటికే జరగకూడని అనర్థం జరిగే పోయింది. ఆ డెంటిస్ట్‌ చాలా స్మార్ట్‌ లాగా ఉంది. ”ఓహో మీ అమ్మాయిలిద్దరూ అమెరికాలో ఉంటారా… ఏం చేస్తూ ఉంటారు?” అనడిగింది కుతూహలంగా. ”ఒకళ్ళు డాక్టరు ఒకళ్ళు ఇంజనీరు” అన్నారు మా వారు దర్పంగా. ”ఓహో అలాగా అని, అవునండీ మా అమ్మాయిలు చెప్పిండి కరెక్టేనండీ! మన ఇండియన్స్‌ పళ్ళని చాలా నిర్లక్ష్యం చేస్తారు అండీ… కొంచెం ఉన్నప్పుడే శ్రద్ధ తీసుకోకుండా బాగా పేర బెట్టుకుని డాక్టరు దగ్గరికి వస్తారు. అప్పుడు ట్రీట్‌ మెంట్‌ కి అయిన బిల్లు చూసి అమ్మో, ఇంత చార్జ్‌ చేసారు, అంత చార్జ్‌ చేసారంటూ హాహాకారలు పెడ్తారు. పళ్ళ విషయంలోనయితే మరీనండి మన వాళ్ళు” అన్నది.

సరే ఇప్పుడు మీ ఇద్దరినీ టెస్ట్‌ చేసి చెప్తాను మీ పళ్ళు ఎంత హెల్తీగా ఉన్నాయో అంటూ ముందు నన్ను టెస్ట్‌ చేసింది. నా నోటిని తెరవమని ఓ ఆధునాతనమైన మిషను ఎదురుగా పెట్టి పరీక్షించింది. అందులో భాగంగా అక్కడే ఉన్న స్క్రీన్‌ లో కనిపిస్తున్న నా పళ్ళని చూడమని చెప్పి ఇలా అంది, ”చూడండి మీ ఎడమ జా క్రింది దంతం ఒకటి పుచ్చి పోయింది. అంటే క్యావిటీ వచ్చిందన్న మాట ! దాని ప్రక్కన ఒక కురుపు కూడ ఉంది పస్‌ తో నిండిపోయి. చూడండి కనపడుతోందా” అని గదమాయించింది. నేను హడలిపోయి ఆఁ కనిపిస్తోంది.. కనిపిస్తోంది అన్నాను హిప్నటైజ్‌ చేయపడ్డ వాళ్ళలాగా. ఇక్కడ మనలో మాట, స్క్రీన్‌ మీద వాళ్ళకు కనబడ్డవన్నీ మనకు కూడ కనపడవని అప్పుడే తెలిసింది. ఇక ఆ పుచ్చిపోయిన దంతానికి రూట్‌ కెనాల్‌ ట్రీట్‌ మెంట్‌ చేయాలన్నది. ఆ కురుపులో ఉన్న పస్‌ అంతా తీయాలన్నది. మొత్తం బిల్లు పదిహేను వేలవుతుందని చావు కబురు చల్లగా చెప్పింది.

ఆ తరువాత మావారికి కూడ చెక్‌ చేసింది. ”మీ ఏజ్‌ కి మీ పళ్ళు స్ట్రాంగ్‌ గానే ఉన్నాయి కానీ గార పట్టి ఉన్నాయి… క్లీనింగ్‌ చేయించుకోవాలి సర్‌ ఆరు నెలలకోసారైనా… అంతే కాదు మీ పళ్ళకి అదేదో నోరు తిరగని పేరు చెప్పి ట్రీట్‌ మెంట్‌ ఇవ్వాలంది. దానికి ఎంతవుతుంది అని మా వారు అడిగారు. ఆవిడ ఏవో లెఖ్ఖలు కట్టి చూసి, క్లీనింగుకి మూడువేలు, ఇంకో ట్రీట్‌ మెంట్‌ కి దాదాపు లక్ష రూపాలయవుతుందని చెప్పింది. అది వినంగానే మా ఇద్దరికీ మూర్ఛ వచ్చినంత పనైంది.

మా వారు మెల్లిగా స్పృహలోకొచ్చి తెలివిగా నేను ఈ రోజు క్రెడిట్‌ కార్డు గానీ, డెబిట్‌ కార్డు గానీ తేవటం మర్చిపోయానండీ, సమయానికి కనీసం క్లీనింగ్‌ చేయించుకుందామన్నా క్యాష్‌ కూడా లేదు. కాబట్టి మేము రేపు వస్తాము, ఫరవాలేదు కదా? అన్నారు.

ఆ డాక్టర్‌, ఎక్కడికి పోతారులే ఈ బకరాలు అని అనుకుందో ఏమో ”సరే రేపు సాయంకాలం నాలుగు గంటలకి ఎపాయింట్‌ మెంట్‌ ఇస్తున్నాను. కరెక్ట్‌ టైముకి వచ్చేయండి.. ఏం?” అని మమ్మల్ని వదలి పెట్టింది. ఆ విధంగా మేము చావుతప్పి కన్ను లొట్టపోయి, బ్రతుకు జీవుడా అనుకుని బయట పడ్డాము. ఆ తరువాత మా వారికి నేను ఇంట్లో పీకిన క్లాస్‌ గురించి వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

ఇకపోతే పరిస్థితిని అలా వదిలేయలేము కాబట్టి సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకుందామని మరో డెంటిస్ట్‌ దగ్గర మర్నాడు అపాయింట్‌ మెంట్‌ తీసుకున్నాము. వెళ్ళే ముందర మా వారిని, ఈసారి మా పిల్లలు అమెరికాలో ఉన్నారంటూ వెధవ బిల్డప్‌ ఇవ్వకండని స్ట్రిక్స్‌ ఆర్డర్స్‌ పాస్‌ చేసాను.

అనుకున్నట్లుగానే ఈ సారి వెళ్ళిన డెంటిస్ట్‌ నా పళ్ళకి అదే ట్రీట్‌ మెంట్‌ ఎడ్వైస్‌ ఇచ్చినా డబ్బులు మాత్రం అంత చార్జ్‌ చేయలేదు. ఓ మూడువేలతో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక మావారి పళ్ళని టెస్ట్‌ చేసి గార పట్టిన పళ్ళకి క్లీనింగ్‌ చేస్తే సరిపోతుందని చెప్పారు. అందుకు గానూ, ఏదో నామినల్‌ గా చార్జ్‌ చేసారు గానీ ఆ డెంటిస్టులు చెప్పినట్లు అంత భయంకరంగా చెప్పలేదు. అందుకు కారణం ఏమిటో తెలుసా… మేము ఈసారి మా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పక పోవడమేనని ఈపాటికి అర్థం అయిపోయిందనుకుంటాను.

చూసారా విదేశాల్లో ముఖ్యంగా యు.ఎస్‌. లో పిల్లలున్న తల్లిదండ్రుల కష్టాలు…!! బహుశా అమెరికాలో పిల్లలున్న తల్లిదండ్రుల ముఖాల మీద చూసేవారికి డాలర్లు, కతకళీ, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేస్తున్నట్లు కనపడతాయేమో కొంపతీసి…! సో విదేశాల్లో పిల్లలున్న తల్లిదండ్రులూ బహుపరాక్‌ …!!

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతుకు చిత్రం లో నేను నా దీపలక్ష్మి

ఎడారి కొలను