కొడుకు, మురళి చూపులు ఎక్కడ తచ్చాడుతున్నాయో గమనించిన సత్యవతమ్మ ఏమి ఎరగనట్టు వెళ్లి కిటికీ తలుపులు వేసేసింది “అబ్బా! గాలి వచ్చేలా ఉంది. ధూళి లోపలికి వచ్చేస్తుందంటూ”. కొడుకు శేఖరానికి అమ్మ ఆలోచనలర్థమై ఆమె వైపు దీర్ఘంగా చూసి గది లోపలికి వెళ్ళిపోయాడు. తాను కిటికీతలుపు ఎందుకు మూసివేసిందో కొడుకుకి అర్థమయిందన్న విషయం సత్యవతమ్మకు అర్థమైంది. కొడుకెంత ఇష్టపడినా చూస్తూ చూస్తూ దానినిచ్చి ఎలా పెళ్లి చేస్తుంది? నలుగురి నోళ్ళలోనూ నానిన పిల్ల…. ఆ మంజుల…
వీధి, వీధంతా ఆ కుటుంబాన్ని ఆ రోజునుండి వెలివేశారు. ఇప్పటికి పదేళ్లవుతుందేమో! ఎవరూ వాళ్లతో మాట్లాడరు. మాట్లాడాల్సి వస్తే పొడిపొడి మాటలే.
పదేళ్ల క్రితం ఆ కుటుంబం, ఈ కుటుంబం ఒకే కుటుంబంలా కలిసుండేవి. ఆ రోజు ఆ సంఘటన జరగకపోయుంటే…. మంజుల అలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసి ఎంట్రన్సుకు ప్రిపేరవుతూ ఉంది తన కూతురు షాలినితో పాటే. తెలివైనపిల్ల. బాగా చదువుకునేది. అలావుండాలి ఆడపిల్లంటే అని తమ పిల్లలకు చెప్పేవారు తల్లులందరూ. అటువంటి పిల్ల వాళ్లనాన్న పనిచేసే షావుకారి కొడుకుతో కలిసి లేచిపోయింది.
ఆరోజు ఇప్పటికీ బాగా జ్ఞాపకం… ఆ ముందురోజు రాత్రి “మా మంజు మీ ఇంట్లో ఉందా” అని వాళ్ళమ్మ అడిగితే, ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళుతుందని వాళ్ళ అమ్మతో పాటు తనూ కంగారుపడింది. “ఎవరింట్లోనైనా టైం చూసుకోకుండా చదువుకుంటూ ఉండిపోయిందేమో” అని ధైర్యం కూడా చెప్పింది వాళ్ళమ్మకు.
తెల్లవారి ఇంకా ముఖమైనా కడుక్కోనేలేదు. వీధిలో పెద్ద గలాటా…. ఏమైందని వచ్చి చూస్తే ఇంకేముంది…. మంజుల నాన్న వామనరావు పనిచేసే షాపింగ్ కాంప్లెక్స్ యజమాని, లింగరాజు…. ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. ఊర్లో పెద్ద పలుకుబడి… “నమ్మకస్తుడివని నా వ్యాపారాలు చూసే బాధ్యత అప్పచెప్పాను. మేనేజరుగా ఉద్యోగమిచ్చాను. ఇంత నమ్మకద్రోహం చేస్తావనుకోలేదు. నా కొడుకు అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నీ కూతురిని ఎరగా వేస్తావా? అమాయకురాలిలా కనిపించే నీ కూతురు యింత నీచానికి దిగుతుందనుకోలేదు” పెద్ద గొంతుకతో వామనరావుని నానా మాటలు అంటున్నాడు. వామనరావు ఎంత మంచివాడో అందరికీ తెలిసినా, లింగరాజుని వారించడానికి ఎవరూ ప్రయత్నం చెయ్యలేదు. ఈ అల్లరికి వీధి జనమంతా చేరిపోయారు. తన భర్తకు జరుగుతున్న అవమానానికి కారణమైన కూతురిని చావగొట్టేస్తుంది మంజుల తల్లి సుగుణమ్మ. “బుద్ధిమంతురాలిలా కనిపించి ఎంత పనిచేసిందో చూశారా?” అని అందరూ అనుకోవడమే.
ఆ మంజులతో కలిస్తే తమ పిల్లలూ అలాగే తయారవుతారోమోనన్న భయం…. అందుకే ఆ తర్వాత తమ పిల్లలని మంజులతో మాట్లాడనిచ్చేవారు కాదెవ్వరూ. ఆ కుటుంబంతో మాట్లాడితే ఆ నింద తమమీదా పడుతుందేమోనన్న భయం… అలా ఆ కుటుంబాన్ని ఊరంతా వెలివేసేసారు. ఆ అవమానాన్ని తట్టుకోలేని వామనరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దుఃఖంతో తల్లీకూతుళ్ళు వీధిముఖం కూడా చూసేవారు కాదు. అలా, ఎంట్రన్సులో మంచి ర్యాంకు వస్తుందనుకున్న మంజుల కాలేజీ మెట్లుకూడా ఎక్కలేదు. స్నేహితురాళ్ళందరూ డిగ్రీలు పూర్తిచేసి పెళ్లిళ్లు కూడా చేసుకున్నా, పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయింది మంజుల. జీవితంలో అంత మచ్చపడ్డాక ఆమెనెవరు పెళ్లి చేసుకుంటారు? కాకపోతే ప్రైవేటుగా చదువుకొని, పరీక్షలు రాసి రెండేళ్లక్రితం బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది. ఇప్పుడెంత పద్ధతిగా ఉన్నా పడిన మచ్చ పోదు.
వారంరోజుల క్రిందట బస్టాపులో తన వీధిలో వుంటున్నాయనే… మంజులతో వెకిలిగా మాట్లాడడం తనకళ్ళతో తానే చూసింది. “తెలిసీతెలియని వయసులో, నా పెళ్లి తప్పించుకోవాలని అలా చేశాను. కాని తెలిసీ ఈ వయసులో మీరిలా ప్రవర్తించడం సభ్యతగా లేదు” అని మంజుల ధైర్యంగానే సమాధానం చెప్పింది. అయినా కాని, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే ఇంకెంతమందికి యిలా సమాధానాలు చెప్పుకోవాలో? ఊహూ…. తనొప్పుకోదు. ఈ మాటే, కొడుకుతో చెప్పేసింది.
“ఏం? ఎందుకు చేసుకోకూడదు? తెలియని వయసులో, ఒకసారి పొరపాటు చేస్తే జీవితాంతం శిక్ష వెయ్యాలా? సినిమాలు షికార్లని ఎంట్రన్సులో మంచిర్యాంకు తెచ్చుకోకపోతే లాంగ్ టర్మ్ పెట్టి మన సుధకి మరల అవకాశం ఇవ్వలేదా మనం?” అని ప్రశ్నించాడు.
“అదివేరు. ఇదివేరు. ఇది నైతిక విలువలకు సంబంధించిన విషయం. ఎందులోనైనా ఇంకో అవకాశం ఉంటుందేమో కాని, ఇందులో ఉండదు. అందుకే చిన్నప్పటినుండి క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేసింది.
“ఎంత పెద్దతప్పు చేసినా, ఆఖరుకు హత్యలు చేసినవాళ్లకు కూడా శిక్షాకాలంలో నైతికప్రవర్తన బాగుంటే, ఆ శిక్షను తగ్గించి వాళ్లను విడుదల చేస్తారు. మన న్యాయశాస్త్రంలోనే ఉందది. ఆ అమ్మాయి ప్రవర్తన ఇప్పుడెలా ఉందో చూస్తూనే ఉన్నావు. మరేమిటి నీ అభ్యంతరం?” అన్న కొడుకు ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక, “ఆ అమ్మాయి కావాలనుకుంటే నన్నొదులుకో” అనేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని గురించిన సంభాషణ తమమధ్య రాలేదు. కొడుకు మనసు మార్చుకున్నాడనుకుంది. కాని మార్చుకోలేదని ఇప్పుడర్థమైంది. అందుకేనా! రెండునెలల క్రితం ఏదో సంబంధం గురించి చెప్పబోతే చూద్దాంలే అని దాటవేశాడు. ఇంక లాభం లేదు. కొడుకు మనసు మార్చడానికి ఏమైనా చెయ్యాలి. ఆ రోజంతా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంది సత్యవతమ్మ.
*
ఇంటికి వచ్చి సోఫాలో చేరబడి “అమ్మా! మంచినీళ్లు” అడిగాడు మురళి. మంచి నీళ్లందుకుంటూ తలెత్తి చూస్తే అమ్మ కాదు… ఎవరో అమ్మాయి. భ్రుకుటి ముడిపడింది. “నేను మీకు తెలియదులెండి. సుమఆంటీ వాళ్ళమ్మాయిని. ఆంటీ గుడికెళ్లార”ని చెప్పి తినడానికేవో తెచ్చి చనువుగా ఎదురు సోఫాలో కూర్చుందామె. “ఆహా! అలాగా!” అన్నట్లు ఓ బలవంతపు నవ్వు నవ్వాడు మురళి.
“అయ్యో! నీకిబ్బంది పెట్టేశానమ్మా!” అంది గంటతర్వాత వచ్చిన సత్యవతమ్మ. “పర్వాలేదాంటీ! నాకింట్లో అలవాటే” నవ్వేసింది స్వప్న. తల్లి, ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుకుంటుంటే నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మురళి.
అమ్మ చెప్పినట్లు రెండురోజులు ఆ అమ్మాయిని వూరంతా తిప్పి, మూడోరోజు రైల్వేస్టేషనులో దింపి, అమ్మ ఆ అమ్మాయి గురించి ఏదో చెప్పబోయినా, మాట తుంచేశాడు.
*
శబ్దం విని తలుపు తీసిన మురళికి తలుపవతల ఎవరో అమ్మాయి స్వీట్సు పట్టుకొని…. “రమ్యా! నువ్వా! రా” ఆప్యాయంగా ఆహ్వానించింది బయటకు వచ్చిన సత్యవతమ్మ. “మనకు దూరపు బంధువులురా. ఈ మధ్యనే ఈ వూరు వచ్చారు మురళికి పరిచయం చేసింది.
“అరిసెలు… నాకు చాలా ఇష్టం. మీ అమ్మ చేసిందా?” డబ్బామూత తీసి అరిసెలను చూసడిగింది సత్యవతమ్మ.
“లేదాంటీ! నేనే చేశాను” గర్వంగా చెప్పింది రమ్య.
“అరిసెలు చెయ్యడం చాలా కష్టం. అందరికీ రాదు. ఎవరింట్లో అడుగుపెడతావోగాని వాళ్ళదృష్టవంతులు. ఈ కాలంలో వంట వచ్చిన అమ్మాయి దొరకడం గొప్పే” ప్రశంసాపూర్వకంగా అంది సత్యవతమ్మ.
“నేను చేశానాంటీ” అంటూ రమ్య అప్పుడప్పుడు పిండివంటలు తేవడం అలవాటైపోయింది. స్వప్నను కాకపోయినా రమ్యనైనా మురళి ఇష్టపడితే బాగున్నని సత్యవతమ్మ కోరిక.
*
“మామ్మగారూ! బాగున్నారా?” రెండురోజులు సెలవుపెట్టి ఈరోజే డ్యూటీలో చేరిన కుర్రనర్సు అడిగింది సత్యవతమ్మను.
ఎవరీ కొత్తమ్మాయని చూస్తున్న సత్యవతమ్మతో “నా షిఫ్టులోనే, సీరియస్ కండిషనులో ఆసుపత్రిలో చేరారు మీరు. అప్పటికప్పుడు ఒక ఇంజక్షన్ అర్జెంటుగా కావాలంటే…. పాపం…. మీ వదినగారమ్మాయి ఆ రాత్రంతా తిరిగి ఆ ఇంజక్షన్ తెచ్చింది. ఏభైవేల ఖరీదుంటుందేమో! అన్ని మందులషాపుల్లో ఉండదు మరి. ఆ ఇంజక్షన్ తెస్తే వెంటనే మీకివ్వాలని, అది తెచ్చినవరకూ కూర్చున్నాను. మీ వదినగారు, వాళ్ళమ్మాయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్నారు ఆ రెండురోజులూ. పోనీలెండి ఏ కాంప్లికేషన్స్ లేకుండా స్ట్రోక్ నుండి బయటపడ్డారు” సత్యవతమ్మ కేస్ షీట్లో మందులేమివ్వాలో చూసుకుంటూ అంది ఆ నర్స్.
నర్సు మాటలు విని సత్యవతమ్మ ముఖం వెలిగిపోయింది, రమ్య, వాళ్ళమ్మ వర్ధనిని తలచుకొని. తన కొడుకు క్యాంపు వెళితే ఆ రెండురోజులూ వాళ్ళిద్దరే తనను కనిపెట్టుకొని ఉన్నారన్నమాట. కొడుకు లేడని రమ్యని పడుకోవడానికి రమ్మంది. భోంచేసిన కాస్సేపటికి ఒక కాలు, చెయ్యి చచ్చుబడిపోయినట్లనిపించి క్రింద కూలబడిపోయింది. ఎవరికైనా ఫోన్ చేద్దామననిపించినా కాలు, చెయ్యి సహకరించక బల్లమీద ఫోను అందుకోలేకపోయింది. ఒక ప్రక్క చెమటలు పట్టేస్తున్నాయి. స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. మలమూత్రాలు తన ఆధీనంలో లేనట్లు తెలుస్తుంది. కాని ఒక్కటే ఆశ. రమ్య వచ్చి తనను ఆసుపత్రిలో చేరుస్తుందని.
తను ఆశపడినట్లే రమ్య వచ్చి తనను కాపాడిందన్నమాట. డాక్టరుగారు కూడా చెప్పారు ఆ ఇంజక్షన్ చేయబట్టి తనకు పక్షవాతం రాలేదని. ఇంకొక రెండురోజులు చూసి అంతా బాగుంటే డిశ్చార్జ్ కూడా చేస్తానని చెప్పారు. పాపం… రమ్య. తనకు బట్టల్లో ఒకటి, రెండు అయిపోతే వాటిని శుభ్రంచేసి, ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆ రాత్రంతా ఇంజక్షన్ కోసం తిరిగి తనను మామూలు మనిషిని చేసింది. రోజూ వచ్చి తనను చూసి వెళ్తుంది. ఏమిచ్చి రమ్యరుణం తీర్చుకోగలను, కోడలిగా చేసుకోవడం తప్పించి? కొడుకుకి ఇష్టం లేకపోయినా వొప్పించి, రమ్యను కోడలిగా తెచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది సత్యవతమ్మ.
*
సత్యవతమ్మకు డిస్చార్జ్ కాపీ ఇస్తూ, “మామ్మగారూ బీపీ మందులు క్రమంతప్పక వాడండి. ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే మరలా వచ్చే అవకాశం ఉంది. అందుకని అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి” అంటూ “మీ వదినగారు, వాళ్ళమ్మాయి కనిపించలేదేమి మామ్మగారూ” అడిగింది ఆ నర్స్.
“నువ్వు చూడలేదేమో! ఉదయమే వచ్చి వెళ్లారన్న” సత్యవతమ్మ మాటలకు “మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకువచ్చింది వాళ్లుకాదు మామ్మగారూ” అందా నర్సు మాత్రలు సర్దుకుంటూ. ఇంకెవరని అడుగుదామనుకునేంతలో ఏదో కేసు వచ్చిందని వెళ్లిపోయిందామె.
*
పెళ్లిచూపులకు వెళ్లడానికి సత్యవతమ్మ పిలుపుమేరకు చుట్టాలంతా వచ్చివున్నారు. “మీ అమ్మగారి మనసు కష్టపెట్టే పనులు చెయ్యవద్దు. బీపీ పెరిగి మరలా స్ట్రోక్ వస్తే కష్టం” అన్న డాక్టరుగారి సూచనమేరకు పెళ్లిచూపులకెళ్ళడం ఇష్టంలేకపోయినా మాట్లాడలేదు మురళి. అమ్మాయిని అడగడానికి వెళ్తున్నాము కదా పట్టుకువెళ్దామని, స్వీట్లు, పళ్ళు అన్నీ తెప్పించింది సత్యవతమ్మ.
“ఎవరింటికని” చుట్టాలడిగితే “తినబోతూ రుచులెందుకు? వెళ్తాము కదా!” అని మాట దాటేసింది. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నా అందరి మనసులో రమ్యే ఉంది.
ముహూర్తం చూసుకొని, పదండి అంటూ పక్కింటి గేటు తీసుకొని లోపలకు వెళ్ళింది సత్యవతమ్మ, అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ. అంతవరకు బట్టలు మార్చుకోమంటే ఏం పర్వాలేదన్న మురళి, బట్టలు మార్చుకువస్తానని ఇంట్లోకివెళ్ళాడు, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై.
“అక్కా! నీకేమైనా మతిపోయిందా! తెలిసే వెళ్తున్నావా!” అన్న చెల్లెలిమాటలకి రెండువారాల క్రిందట జరిగిన విషయం గుర్తుతెచ్చుకుంది సత్యవతమ్మ.
తనను ఆసుపత్రిలో ఎవరు అడ్మిట్ చేశారనే విషయం కొడుకు దాటవేసినా, అంతకుముందు “మీ మేనకోడలు మరలా రాలేదేమిటి? ఊర్లో లేదా!” అన్న డాక్టరుగారి మాటలు, తనను అడ్మిట్ చేసింది రమ్యకాదనే అనుమానం రేకెత్తించాయి.
చెకప్పుకు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో ఎంక్వైరీ చేస్తే, కేస్ షీట్లో మంజుల సంతకం ఉంది. అంటే రమ్య యింటికివచ్చినా తన పరిస్థితి చూసి కామ్ గా వెళ్లిపోయిందన్నమాట. అంతేకాదు ఆసుపత్రిలో “నాకింత హెల్ప్ చేశావు నీ రుణం ఎలా తీర్చుకోవాలంటే”, “హెల్ప్ చేసింది నేనుకాదు” అనకుండా “అది నా బాధ్యతాంటీ” అని ఆ క్రెడిట్ కూడా తీసుకుంది.
తనకు పునర్జీవితాన్నిచ్చిన మంజుల ఎప్పటిలాగే తనకంట పడకుండా మసులుకుంటుంది. కొడుకులేనప్పుడు తనకు సాయం చేసింది మంజులేనని తెలిస్తే, తనెక్కడ నొచ్చుకుంటుందోనని కొడుకు కూడా నిజం చెప్పలేదు. ఆ నర్సుపిల్ల, డాక్టరుగారు అడగకపోతే, ఈ నిజం తనకెప్పటికీ తెలిసేది కాదు. కొడుకన్న నైతికవిలువల అర్థమేమిటో తెలిసిందిప్పుడు తనకు. పాతికేళ్ల వయసులో అబద్దాన్ని నిజంగా చూపించి లబ్ధి పొందాలనుకుంది రమ్య. తెలిసి తెలియని వయసులో, చదువుకోవాలనే కోరికతో పెళ్లి తప్పించుకోవడానికి, తనకు తెలిసిన మార్గాన్నెంచుకొని ఆ నిందని ఇప్పటికీ మోస్తుంది మంజుల. మరి వీళ్ళిద్దరిలో నైతికంగా ఎవరు ఉన్నతులు?
ఆలోచనలో మునిగిపోయిన అక్కను మరొక్కసారి అడిగింది సుందరి “ఏమిటిదంతా” అంటూ. తనను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మంజులన్న నిజం చెప్పి, వాళ్ళింటి తలుపు తట్టి, తలుపు తెరిచిన శారదతో “మంజులని నా ఇంటి కోడలిగా చెయ్యమని అడగడానికొచ్చాను” అంది సత్యవతమ్మ.