“నేటి భారతీయమ్” (కాలమ్)

“భయపెడుతున్న గులియన్ బేరీ సిండ్రోమ్”

మెటాన్యూమో వైరస్ గురించిన వార్తలు చల్లారక ముందే ఇప్పుడు మరో భూతం మన ముందుకొచ్చింది. దాని పేరే గులియన్ బేరీ సిండ్రోమ్ (Guillain-Barre syndrome-GBS/జిబిఎస్). గణాంకాల ప్రకారం, సంవత్సరంలో ప్రతి లక్షమందిలో ఒకటి రెండు కేసులు మాత్రమే కనిపిస్తాయి. అటువంటిది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో, ఒకేసారి (జనవరి 21 వ తేది) ఎక్కువ జిబిఎస్ కేసులను ఐడెంటిఫై చెయ్యడం వలన, వైద్య ఆరోగ్యశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జిబిఎస్ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. ఇది నరాలకు సంబంధించిన ఆటో ఇమ్యునో డిసీజ్. ముందే చెప్పుకున్నట్టు, అరుదుగా వచ్చే ఈ వ్యాధి ఒకేసారి చాలామందిలో కనిపించేటప్పటికి, దానికి కారణమేమై ఉంటుంది? ఏ రకంగా వచ్చి ఉంటుంది? తెలియని కొత్త కారణాలేమైనా ఉన్నాయా? అని కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రత్యేక బృందం పరిశోధించడం మొదలుపెట్టింది.
అసలీ జిబిఎస్ అంటే ఏమిటి? ఏ రకంగా వస్తుంది? దీని లక్షణాలేమిటి? తెలుసుకుందాం ఈ వ్యాసంలో.
జిబిఎస్ అనేదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ (స్వయం పరిరక్షక వ్యాధి). శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు, మన శరీరంలో ప్రవేశించే క్రిముల (ఫారిన్ బాడీస్) పై దాడి చేసే క్రమంలో, ఒక్కోసారి పొరపాటున తన స్వంత కణములపైనే దాడి చేసి, వాటి విధులను అడ్డుకోవడం ద్వారా రోగాన్ని కలిగిస్తుంది. ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కేసులు అక్కడక్కడ కనిపిస్తాయి (స్పోరాడిక్ కేసెస్ అంటాం).
ఇన్ఫెక్షన్స్ (వైరల్ ఇన్ఫెక్షన్స్, క్యాంపైలో బేక్టార్ జెజుని అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్) వచ్చిన రెండు మూడు వారాల తర్వాత, కొన్ని వ్యాక్సిన్లు వేసుకున్న (ముఖ్యంగా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్) తర్వాత యిది రావచ్చు.
GBS లక్షణాలు: కండరాలు శక్తిని కోల్పోయి, కాళ్లు చేతుల్లో బలంలేక పట్టు తప్పడం, చిన్న వస్తువునైనా పట్టుకోలేకపోవడం, అరి పాదాలలో చురుక్కు చురుక్కుమని పొడవడం, కండరాలు శక్తిని కోల్పోవడం, శరీరం క్రింద భాగాల నుండి క్రమంగా, పైభాగాలకు కండరాల బలహీనత వ్యాపించడం, కండరాలలో నొప్పి, గుండె సక్రమంగా కొట్టుకోకపోవడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడం, ముఖ కండరాల బలహీనత వలన మింగలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. ఆపై క్రమంగా పెరాలసిస్ కు దారితీస్తుంది. శ్వాసకోశ కండరాలు బలహీనమైతే, ఊపిరి తీసుకోవడం కష్టమై, 30% కేసుల్లో వెంటిలేటర్ అవసరం పడుతుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కు దారి తీసి మరణాలు సంభవిస్తాయి.
ముఖ్యంగా జ్వరము ఉండదు. జ్వరం ఉన్నట్లయితే జిబిఎస్ అయే అవకాశం తక్కువ.
జనవరి 30వ తేదీకి 130 GBS కేసులుగా అనుమానిస్తే, అందులో 73 కేసులను నిర్ధారించగా రెండు మరణాలు సంభవించాయి. అదే ఫిబ్రవరి 1వ తేదీకి 149 అనుమానిత కేసులు, 124 నిర్ధారిత కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. రచయిత్రి ఈ వ్యాసం రాసే రోజుకు, 163 అనుమానిత కేసులు, 127 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 47 కేసులను డిశ్చార్జ్ చేస్తే, 47 కేసులు ఐసీయూలో, 21 కేసులు వెండిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాయి. రోజు రోజుకూ పెరిగే గణాంకాలను చూస్తుంటే, కామన్ సోర్స్ (మూలము) ఉందనేది అర్థమవుతుంది. అదేమిటనేది, ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.
మొదట్లో కొంతమంది రోగుల మలములో క్యాంపైలో బాక్టార్ జెజుని అనే, మానవ మూత్రంతో అపరిశుభ్రమైన నీటి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియాని కనుగొనడంతో, అదే కారణమై ఉంటుందని తొలుత భావించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా ఇంకా కొత్త కేసులు నమోదు కావడం, వేరే ప్రాంతాల నుండి నుండి కూడా కేసులు రావడంతో, ఇతర కారణాలు కోసం పరిశోధన జరుగుతుంది. ఎపిడెమియాలజిస్టులు అదే పని మీద తల మునకలై ఉన్నారు.
దీనికి చికిత్స గురించి చెప్పుకోవాల్సి వస్తే, ప్రత్యేకమైన మందులు గాని, చికిత్స గాని లేదు. ప్లాస్మా ఫెరెసిస్ లేదా ప్లాస్మా మార్పిడి ద్వారా చికిత్స అందిస్తాం. ఈ రకంగా శరీరంలో ఉండే ఆటో ఏంటీబాడీస్ సంఖ్యను తగ్గిస్తాం. లేకపోతే రోగి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇమ్యునో గ్లోబ్యులిన్సును అందిస్తాం. ఈ రెండు ఖరీదుతో కూడుకున్న చికిత్సలే. కొన్ని ఆసుపత్రులలో మాత్రమే లభ్యమవుతాయి.
చికిత్స అందించడం ద్వారా 80 శాతం మంది, మూడు నుండి ఆరు నెలల కాలంలో స్వస్థత పొందితే, మరణాల రేటు నాలుగు శాతం ఉంటుంది. మిగిలిన 16 శాతం మందిలో నరాలకు సంబంధించిన రోగ లక్షణాలు శాశ్వతంగా ఉండిపోతాయి. ముఖ్యంగా మోటార్ వీక్నెస్ అంటే కండరాల బలహీనత. వీటిని రెసెడ్యువల్ సిక్వెల్స్ అంటారు. దీనివలన జీవన నాణ్యత తగ్గిపోతుంది.
తొందరలోనే ఈ వ్యాధికి కారణాలు కనుగొని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా కొత్త కేసులు నమోదు కాకుండా ఉండాలని, ఇదివరకే ఆసుపత్రిలో చేరిన రోగులు స్వస్థత పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లాలని ఆశిస్తూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మా కుంభమేళా యాత్ర  రెండో భాగం

అర్చన