నేటి భారతీయమ్” (కాలమ్)

“వైద్యులు – వారిపై దాడులు”

డా. మజ్జి భారతి

ప్రపంచవ్యాప్తంగా వైద్యులపై దాడులు నేడు సర్వసాధారణమై పోయాయి. ఏ పరిస్థితుల్లో తెచ్చినా, వైద్యులు రోగి ప్రాణాలను కాపాడాలనే మూర్ఖమైన ఆలోచన ఈ దాడులకు ప్రేరేపిస్తుంది. రోగిని యే పరిస్థితుల్లో తెచ్చారు? తెచ్చేటప్పటికి రోగి బ్రతికే అవకాశాలెంత శాతమున్నాయి? ఆసుపత్రిలో రోగిని సర్వైవ్ చెయ్యడానికి తగిన ఉపకరణాలున్నాయా? స్పెషలిస్ట్ వైద్యులున్నారా అన్నదానితో సంబంధం లేకుండా, ఏ పరిస్థితులలో రోగిని తెచ్చినా రోగి ప్రాణం నిలపాల్సిందే, హెల్త్ ప్రొఫెషనల్ గా మీ బాధ్యత అది అనే ఆలోచనే, వైద్యులపై దాడులకు ప్రేరేపిస్తుంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 8 నుండి 38% మంది వైద్యులు, వారి ఉద్యోగ నిర్వహణ కాలంలో ఏదో ఒక సమయంలో దాడికి గురైన వారే. చైనాలో 85% ఉంటే, ఇండియాలో 75%, అమెరికాలో 47% గా, ఈ దాడులు నమోదవుతున్నాయి.
అంటువ్యాధి వ్యాధుల చట్టం 1897, అంటు వ్యాధుల నివారణకు ఉద్దేశింపబడినది మరియు నివారణ కోసం పనిచేసే మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఆ సేవలనందించే క్రమంలో వారిమీదెవరైనా దాడులు చేస్తే, ఈ చట్టం ప్రకారం వారిని శిక్షించడం జరుగుతుంది.
అలాగే ఐపీసీ సెక్షన్ 320 ప్రకారం, హెల్త్ ప్రొఫెషనల్స్ విధి నిర్వహణలో ఉన్నప్పుడు, వారి మీద దాడి చేస్తే, కనీస శిక్ష ఆరునెలల నుండి జీవితకాల శిక్ష వరకు, అలాగే జరిమానా, లక్షకు తక్కువ కాకుండా ఐదు లక్షల వరకు విధించవచ్చు.
గత కొద్ది సంవత్సరాలలో, ముఖ్యంగా కోవిడ్ సమయం నుండి ఈ దాడులెక్కువగా జరుగుతున్నాయి. కోవిడ్ వలన మరణశాతం ఎక్కువగా ఉండడం, 2020లలో సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్స అందుబాటులో లేకపోవడం వలన, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. దాంతో ఆరోగ్య సంరక్షకులపై దాడులు అధికమయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధి వ్యాధుల చట్టం 1897 ని, ఏప్రిల్ 2020 లో ఒక ప్రకటన చేసి, సెప్టెంబర్ 2020 లో చట్ట సవరణ చేశారు. దాని ప్రకారం హెల్త్ ప్రొఫెషనల్స్ మీద దాడి చేసిన వారికి నాన్ బెయిలబుల్ అరెస్టు చేయవచ్చు. పాత చట్టాన్ని సవరించారు కాని, వైద్యుల మీద దాడి జరుగకుండా, యిప్పటివరకు ప్రత్యేక చట్టాలనైతే కేంద్ర ప్రభుత్వం చెయ్యలేదు.
దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం ప్రకారం వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే, ముందస్తు బెయిల్ కు అవకాశం లేని అరెస్టు, 50 వేల వరకు జరిమానా, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, ఒడిస్సా, ఇంకా మిగిలిన రాష్ట్రాలు కూడా అటువంటి చట్టాలనే చేశాయి. కాని, ఇంతవరకు ఆ చట్టాల ప్రకారం ఎవరికీ శిక్ష పడలేదన్నది గమనార్హం.
గత సంవత్సర కాలంలో వైద్యుల మీద, వైద్య సిబ్బంది మీద, ఎన్నో దాడులు జరిగాయి. ఎంతగా అంటే అత్యవసర కేసుల్ని చూడాలంటేనే వైద్య సిబ్బంది భయపడేంతగా. రోగి బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు, రిస్కు తీసుకోవడం ఎందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ కేసుల్ని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగిని ఎటువంటి పరిస్థితులలోనైనా… బంధువులెవరూ ప్రక్కన లేకపోయినా, రోగి ఎవరో తెలియకపోయినా… రోగి బ్రతికే అవకాశం దాదాపుగా లేకపోయినా… ముందు అడ్మిట్ చేసుకొని, వైద్యాన్ని మొదలు పెట్టాలి. అందుకే రోగి ఎవరో తెలియని కేసులు, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన రోగులను ముందుగా తీసుకువచ్చేది ప్రభుత్వ ఆసుపత్రికే. ఆ తర్వాతెప్పుడో వచ్చిన రోగి బంధువులు, విషయం తెలుసుకోకుండానే వైద్యుల మీద దాడులకు దిగుతున్నారు. దానికి తోడు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం, సెక్యూరిటీ తక్కువగా ఉండడం, దాడులకు ఎక్కువ అవకాశాలనిస్తుంది.
ఈ దాడుల ప్రభావం వైద్యుల మీద ఏ రకంగా ఉంటుందంటే, వైద్యవృత్తి మీద విరక్తి కలిగేలా చేస్తుంది. పేపర్లలో టీవీలలో ఈ దాడులు గురించి చదివిన చాలామంది వైద్యవృత్తి వద్దు, వేరే వృత్తులు చూసుకుందామనుకునే వాళ్ళు కూడా, ఎక్కువ మందుంటున్నారు. ఇదే రకంగా జరిగితే కొన్నాళ్లకు దేశంలో వైద్యుల సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. వైద్యం కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితులొచ్చి, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టి, వైద్యుల మీద దాడి చేసే వారికి స్పెషల్ కోర్టుల ద్వారా త్వరితంగా శిక్షలను విధించే అవకాశముంటే వైద్యుల మనోస్థైర్యం పెరుగుతుంది. దాంతో వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో, వైద్య సేవలను అందించగలరు. వైద్యులే లేకపోతే మనకు ఏదైనా అనారోగ్యమొస్తే యే రకంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకని ప్రజలు కూడా సంయమనం పాటించి వైద్యుల కోణంలో నుండి కూడా ఆలోచించాలి.
ఏ వైద్యుడూ తాను చికిత్స అందిస్తున్న రోగిప్రాణాలు కోల్పోవాలని అనుకోడు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న రోగి గురించి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐతే, చికిత్స అందించే క్రమంలో, కేసు గురించి చాలామంది సీనియర్ల ఒపీనియన్ కూడా తీసుకుని, చికిత్స చేస్తుంటారు. ప్రభుత్వ వైద్యురాలిగా, నా అనుభవమది. ఒక రోగి చనిపోతే దాని ప్రభావం చికిత్స చేసిన వైద్యుని మీద కొంతకాలం ఉంటుంది. ఆ విషయం బయటికి కనిపించదు. నిజంగా వైద్యుని నిర్లక్ష్యం వలన రోగి ప్రాణాలు కోల్పోతే, ఆ వైద్యునికి శిక్ష పడాల్సిందే. దానికి చట్టాలున్నాయి. కానీ రోగిని రక్షించలేని ప్రతిసారీ, వైద్యుల నిర్లక్ష్యమని దాడులు చెయ్యడమనేది అమానవీయం. అటువంటి వారిని శిక్షించి, వైద్యుల మానసిక స్థైర్యాన్ని పెంచడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ర్యాగింగ్

అమ్మ