ఈ సృష్టిలో అమ్మ స్థానం ఎంతో విశిష్టమైనది. స్త్రీ తన శక్తి యుక్తుల తో ఎంతో , ఎన్నో గొప్ప పనులు చేస్తుందనడానికి విశ్వం లో … ఆ శూన్యం లో తొమ్మిది నెలల పాటు విహరించి భూమి పై దిగిన సునితా విలియమ్స్ ప్రతిభా పాటవాలను గుర్తు చేసుకుంటూ చైత్ర మాసంలో కొత్త సంవత్సరం లోని విశేషాలను తలచుకుందాం!
పాఠకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.
మానవ ప్రకృతి ఎంత విచిత్రంగా ఉంటుంది అని అనడం పరిపాటి. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర అవసరాలను మార్చుకుంటారు కానీ చిత్తవృత్తులను మార్చుకునేందుకు తొందరగా సమ్మతించరు.
ప్రజలందరూ యుగాది పండగ జరుపుకుంటున్న శుభవేళలో మరిన్ని శుభాలు కలగడానికి మనవంతుగా నిర్వహించాల్సిన కర్తవ్యాలను మననం చేసుకుందాం!
మన తెలుగు రాష్ట్రాలలో సామాజికంగానూ, రాజకీయంగానూ పరిస్థితులే అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాల తరపున పంచాంగ శ్రవణం చేయించడం మన సంస్కృతిని కొనసాగించడం మంచి సంప్రదాయమే! మంచిని బోధించే పంచాంగ పండితులకు సగౌరవ స్థానం ఉంది, ఉండాలి కూడా!
పంచాంగ శ్రవణంతో కేవలం పాలకుల మన్ననలు పొందడమే లక్ష్యం అనుకోకుండా… షష్టగ్రహ కూటమి అనో… శని వక్రగతి నడుస్తున్నదనో… జీవితాలు తారుమారౌతాయని చెప్పక వారికున్న సమస్యలు చాలవన్నట్టుగా మరిన్ని భయాలు వారి మనసుల్లో నాటకుండా… గ్రహగతులు చెబుతూనే సామాజిక కోణంలో వాటి ప్రభావాలు తెలిపి, వాటి గురించి ఎవరికి తగినట్టు వారు ఆలోచించుకునేలా వదిలేసి, వీలైన చోట తగిన పరిష్కార మార్గాలు సూచిస్తూ అన్నింటినీ ఎదుర్కొని ముందుకు నడవగలమనే ధీమాను , ధైర్యాన్ని ప్రజలకు అందించాలి.
ఉగాది పచ్చడిలోని షడ్రుచులలో తీపి,చేదు ఉన్నట్టే మన జీవితంలో కూడా కష్టనష్టాలు ఉండడం సహజం. వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ… ముందుకు సాగాలని ఈ పండుగ మనకు అన్యాపదేశంగా ఇచ్చే సందేశం! కాబట్టి ఆ సందేశాన్ని మనం స్వీకరించి దాన్ని ఆచరిస్తూ అందరీనీ ఆ దిశలో ప్రోత్సహిద్దాం !
ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సమయమే ఇది …. ఎప్రిల్, మే నెలలు . కాబట్టి, పంచాంగ శ్రవణం యువతను మానసిక, సామాజిక వికాసం దిశగా మార్గ నిర్దేశనం చేస్తూ వాళ్ళ లో బాధ్యతను పెంచే విధంగా స్ఫూర్తిని రగిలిస్తూ ఆత్మ విశ్వాసం కలిగించేటట్టుగా చెప్తే బాగుంటుంది.
ఎందుకంటే , అన్ని రంగాలలోనూ విద్యాధికుల అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు బాగా చదువులో రాణిస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది . విద్య తో మంచి నడవడి అలవడుతుంది. సామాజిక రాజకీయ, సాంకేతిక అభివృద్ధి అనేది సరైన నడవడిక తో జీవించే యువత చేతిలోనే ఉంటుందన్న వివేకానందుడు చెప్పిన స్ఫూర్తి మనకు తెలియనిది కాదు. కదా! మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అవే చెప్పాయి.
మనమంతా ఐకమత్యంగా ఉండి మంచి ఆలోచన లోనూ మంచి ఉద్దేశాలను ఏర్పరుచుకోవాలి, ఇవి బాధ్యత తో స్వీకరించి పాటిస్తూ మనుగడ సాగిద్దాం!
మనం మన ఆచారాలను పాటించవచ్చు! ఏ ఆక్షేపణా లేదు! అంతేకానీ మూఢంగా ఆచారాలను వేటిని నమ్మకూడదు!
అవిద్య వల్ల అభద్రతా భావం ఏర్పడుతుంది. సమాజమే ఏదో మంచిది కాదని అనుకుంటుంటారు. దీనితో ద్వేషం ఏర్పడి ఏవో తప్పు పనులు చేస్తుంటారు. కష్టలపాలవుతుంటారు . అవిద్య వల్ల ఆడపిల్లలపై పవిత్ర భావన లేకుండా పోతున్నది. దాంతో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి .అలా జరిగితే మన రాష్ట్రం ప్రతిష్ట, మన మానవతా విలువలు అధః పాతాళానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి దేశం బాగుపడాలంటే రాష్ట్రం విలువలతో సర్వతో ముఖాభివృద్ధి కావాలి! రాష్ట్రం మంచి దిశన నడవాలంటే గ్రామస్థాయిలో కూడా విలువలు రక్షింపబడాలి. అలా కావాలంటే ఈ పండగను ఆ విలువలు పాటించేలా పండుగ జరుపుకోవాలి!
ముఖ్యంగా ఒకరి పట్ల మరొకరు ద్వేష భావం తొలగించుకోవడమే తొలి పండగ జరుపుకునే ఉద్దశ్యంగా సాగాలి! పగ- ప్రతీకారం సర్వనాశనానికి హేతువు అవుతుంది. ఒకసారి వాటిని వదిలితే కుటుంబ పరంగానూ, దేశపరంగానూ శాంతి లభిస్తుంది. ఏం దేశ మైనా ఏ మతమైనా ఇలాగే చెబుతుంది. కొందరు పాటించరు అంతే! అలా అని పెద్దలు చెప్పినప్పుడు అన్ని జాతుల సమ్మేళనము అన్ని మతాల సమ్మేళనము అంటే ఐకమత్యం పొసగక పోవచ్చును. ఐకమత్యానికి కులమత ప్రసక్తే అవసరం లేదు. ఒక మనిషి – మరొక మనిషితో సామరస్యంగా ఉండాలి… అని అనుకోవాలి!
ఈ సామరస్యం మన దేశానికి ఎంతో అవసరం.
కాల ప్రవాహంలో ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకపోయే మనకు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావం ఎందుకు? ఆ ఆలోచనలే రాకుండా మసులుకుంటే సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష తో జరుపుకొనే యుగాది ఫలితం మన సొంతమే అవుతుంది. ఈ ఉగాదిని అలా మార్చుకోవాలంటే మనందరం మానవతా దృక్పథాన్ని పెంచుకోవడమే కర్తవ్యం. మానసిక జడత్వాన్ని విడిచి చైతన్య వంతమైన అడుగులు వేయడమే ఉగాది …..
కొత్త చివుళ్శు తింటూ కుహు కుహు రాగాలు తీస్తున్న కోయిలా వసంతాగమనంతో నవశోభ సంతరించుకునే ప్రకృతీ మనుషులకు ఆదర్శం …
సర్వేజనాః సుఖినో భవంతు!!
– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక , సంపాదకురాలు .