
ధృతిర్దమో క్షమాస్తేయo
శౌచమింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో
దశకం ధర్మలక్షణం ॥
మానవుల జీవితాలు ఏ వడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోవాలంటే ఒక కట్టుబాటు అవసరం. దానినే ధర్మం అని అంటారు. ఆ ధర్మంలో 10 లక్షణాలుంటాయని అవి ధైర్యము [ బలం, ఉత్సాహం] దమం లేదా తపస్సు, క్షమాగుణం, అస్తేయం= అంటే ఇతరుల వస్తువులను దొంగలించకపోవడం, శౌచం, ఇంద్రియ నిగ్రహం,ధీః లేదా బుద్ధి, విద్య,సత్యం, అక్రోధం లేదా కోపం లేకుండుట… వీటిని దైవీ సంపదలని మంచి [లక్షణాలు] వీటిని ఆచరణలో పెడితే జీవితం హాయిగా జరుగుతుందనీ ధర్మాచరణ వేత్తలు చెప్తారు.
ధైర్యం అంటే ప్రమాదం ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి లేదా నేర్పు ఉండడమే ధైర్యమని అంటారు.. మానసిక ధైర్యమే మనకు కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడుతుంది. అంటే ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యో అర్థం చేసుకుంటాం… సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో చాలా అడ్డంకులు ఏర్పడతాయి వాటిని ధైర్యం ఉంటే దాటగలుగుతాం. అప్పుడే సరైన నిర్ణయం తీసుకొని అనుకున్న పనిని సాధిస్తాం.. అదే మనసు నిండా భయం ఉంటే ఏ పనీ చేయలేము! తన ధైర్యమే తనకు బలాన్నిస్తుంది తనపై తనకు నమ్మకం ఏర్పడుతుంది అంతేకాదు సమాజంలో జరిగే అస్తవ్యస్త పనులను సక్రమంగా జరిగేలా చూడాలంటే ధైర్యం కావాలి .
మన పురాణేతిహాసాలలో ధైర్యంతో రాక్షసవధ చేయించిన ప్రహ్లాదుడి కథ, దృవుడి కథ, గరుడిడి కథలను చదివినా వారి ధైర్యమే భక్తి కంటే బలంగా పని చేసిందని తెలుస్తుంది. ఈ ధైర్యం మనసుకు సంబంధించింది. మనసు అననుకూల పరిస్థితుల్లోనూ విపరీతమైన పరిస్థితులలోనూ ధైర్యం నిలబెడుతుంది… అప్పుడే అమృతత్వ్తం సాధించగలము అమృతత్వ్త సాధన అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు చనిపోవడం సహజమని తెలిసినాఈ చావు పుట్టుకలను జయించాలనే పోరాటం ఎప్పటినుండో మానవుడు చేస్తూనే ఉన్నాడు …అంటే ఆధ్యాత్మిక ప్రస్థానం. మరణం లేకుండా ఉండే స్థితిని పొందుతే అమరత్వం… జన్మ ఎత్తకుండా ఉండే స్థితిని పొందుతే మోక్షం! లేదా జన్మ ఉండే పరిస్థితిని పొందడమని అంటారు. ఫలితం బ్రహ్మత్వం పొందడం! రెండింటిలోనూ ధైర్యము లేదా నిలకడ అవసరం. ఈ కథలో కూడా అమృతత్త్వసిద్ధిని పొందిన విధానం తెలుపుతుంది మహాభారతం. తన తల్లిని దాస్యం నుండి విడిపించడానికి ఎంతో కష్టపడి అమృతం తెచ్చిన దాన్ని అతను అనుభవించకుండా తాను చేయాలనుకున్న పనిని ధైర్యంగా చేసి సేవలో నిలకడ ఎలా ఉండాలని విషయాన్ని చేసి చూపెడతాడు గరుడుడు.
భగవద్గీతలో రెండవఅధ్యాయంలో 15వ శ్లోకంలో కర్మయోగ సాధన చేస్తే ధైర్యాన్ని పొందవచ్చు అని ధీరుల లక్షణాలను కృష్ణుడు చెప్పాడు. ధీరుడు అని అంటే బుద్ధిమంతుడుఅని అర్థం. కష్టాలనుచూసి బాధపడడు …సుఖాలను పొంది పొంగిపోడు!
అప్పుడు అర్జునుడు ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని అడుగుతాడు.
కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ జవాబు మానవజాతికిచ్చిన మంచి సందేశం!
యంహి న వ్యధయంతేతే పురుషం పురుషర్భ!
సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్త్వాయ కల్పతే!!
అమృతత్వ్తం ఉంటుంది అంటే ఒక పరిపక్వత మనసులో కలిగి వికాసం పొందడం లేదా నశించని స్థితి కావాలని కోరుకోవడం… అమృతత్త్వం శరీరానికి కాదు శరీరంలో ఉన్న మనకు…
ఇలా ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ బలం పుంజుకోవాలంటే ధైర్యమే కావాలి !
ధైర్యం లోపించినప్పుడు కామ, క్రోధ , లోభ , మోహ, మద,మాత్సర్యాలు అనే గుణాలు పట్టుకుని పీడిస్తాయి.
ముఖ్యంగా మహిళలకు ధైర్యం ఎంతో అవసరం.
భారతదేశ స్త్రీలు ఎంతో ధైర్యవంతులని ఝాన్సీరాణి, రాణి రుద్రమదేవి ,రాణి శంకరమ్మ మొదలైన వారి జీవిత చరిత్రలు చదివినప్పుడు వారు శారీరకంగా అబలలమని అనుకోలేదు !వారు గుండెల్లో ఉన్న ధైర్యంతో వ్యతిరేక పరిస్థితులను సైతం ఎదుర్కొన్నారు. దేశాలను చక్కగా పరిపాలించింది కత్తి బలంతో కాదు.. కండబలంతో అంతకన్నా కాదు… కేవలం గుండె ధైర్యంతోనే ..
మంచి పనులు కావాలంటే వాటికి వచ్చే అడ్డంకులను ఎదుర్కొని ఆ పనులు చేస్తాననే ధైర్యం ఉండాలి…
* భయమే మరణం* అని వివేకానందుడు అంటారు. భయం దుఃఖానికి మూల కారణం. ధైర్యం లేకుంటే జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోలేము ఆ లక్ష్యాన్ని సాధించలేము అలా సాధించకపోయేసరికి సంతోషంగా ఉండలేము ఇలా ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న విషయం . ధైర్యముంటే అపజయమున్నది లేదు.
ఒద్దిరాజుసోదరులలో చిన్న వారైనా రాఘవ రంగారావు గారు రచించిన ఖడ్గ తిక్కన పద్య కావ్యం లో ఖడ్గ తిక్కన భార్య చానమ్మ ఖడ్గతిక్కనకు యుద్ధం చేయమని అన్యాపదేశంగా ధైర్యం చెప్పిన విధం ఒక మహిళగా ఎంతో గొప్ప ఉపదేశం ఇలా ఇచ్చింది.
చ॥
నాపతి వీరమాన్యుడు, రణంబున వైరుల గెల్చి గానిరా
నోపడు , కానీ నాడఖిల యోధులు మెచ్చగ వీరకేళికా
వ్యావృతి వీర శయ్య దన ప్రాణము నొడ్డి, గడించి, వీరతా
ప్రాపిత వీరనాక సుఖభాక్కగునంచు దలంతు నెప్పుడున్॥
భావం:- నా భర్త వీరులలో చాలా గొప్ప వీరుడు. యుద్ధంలో శత్రువులను ఓడించి గాని ఇంటికి రాడు. ఒకవేళ అలా కాకపోతే వీరులతో వీరోచితంగా పోరాడి వీరస్వర్గం పొందుతాడని నేను అనుకున్నాను. ఇలా యుద్ధభూమి వదిలి ఇంటికి రాడు అని అంటుందా ఇల్లాలు…. ఇంత గొప్ప ధైర్యలక్ష్ములున్న భారతదేశం మనది.
అలాగే కుటుంబ నిర్వహణలో మహిళలదే ముఖ్యపాత్ర. ప్రతీ రంగంలోనూ మహిళలు ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ఆ దిశగా ప్రయాణిస్తున్నా అనుకున్న పనులు సాధించినప్పుడు సంతోషంగానే ఉంటుంది కానీ ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ఎవరూ మద్దతు తెలుపక హేళన చేస్తారు.. అప్పుడు దుఃఖం, చేతగాని తనం వస్తుంది. అప్పుడే మానసిక ధైర్యం కావాలి… ధైర్యం ఒక్కటి ఉంటే చాలు సమస్యలను అర్థం చేసుకొని చక్కగా ఆలోచించి పని పూర్తి చేస్తాము.. అప్పుడే విజయం మన స్వంతమవుతుంది. భయముంటే ఏ పనీచేయలేము! ఒక్క మానసికంగానే కాదు శారీరకంగా కూడా ధైర్యంగా ఉంటే ఎంత పెద్ద పనైనా చేయగలం.
ప్రతీమనిషిలోను ధైర్యం ఉంటుంది. కానీ దాన్ని వాడుకోవడంలోనే తేడాలుంటాయి. నైపుణ్యమున్నా, గొప్ప పనులు చేసే శక్తి ఉన్నా… ఆ పని ఎలా చేయాలనే విషయం తెలిసినా భయం ఉంటే మాత్రం ఆ పని సక్రమంగా కాదు. ఆ భయం పోగొట్టుకోవాలంటే… తాను తలపెట్టిన పనిని కుటుంబ సభ్యులతోకానీ, స్నేహితులతో కానీ చర్చిస్తే భయం కొద్దిగా తొలగిపోతుంది.
కుటుంబం మరియు సమాజం మహిళల నుంచి ఎక్కువ సేవలను ఆశిస్తుంది. అందుకే మహిళలకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అంతేకాక కొత్త కొత్త ఉద్యోగ బాధ్యతల్లో మరీ మరీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడే మహిళలకు ధైర్యం ఉండాలి. ముప్పైమూడు శాతం రిజర్వేషన్ ఉన్న ఇంకా మహిళా వివక్ష పూర్తిగా పోలేదనే చెప్పాలి. ఎంతో పోరాటం, ఆందోళన , తిరుగుబాటు చేస్తే ఈనాటి ఈ పరిస్థితి ఇది! ఒకప్పుడు శ్రమకు తగిన సమాన భృతి కూడా పొందని రోజులున్నాయి. ఐనా మహిళలు సంఘటితంగా ధైర్యంగా పోరాడి, అసమానత్వం పోగొట్టుకొని, పురుషులతో పాటు సమాన వేతనం తీసుకోవడం కోసం ఎంతో శ్రమ పడ్డారు… ఇంకా పడుతున్నారు… ముందుతరాలకు
పోరాటస్ఫూర్తిని అందజేస్తున్నారు. దాని ఫలితంగా ఆస్తులు పురుషులతో పాటు స్త్రీల పేర్లతో పట్టాలు పొందారు. దాంతో గృహహింసను వ్యతిరేకించగలిగారు. అంతేకాదు వరకట్న హత్యలను తగ్గించగలిగారు. అత్యాచారాలను ప్రశ్నించగలుగుతున్నారు. కేవలం ఆడదంటే ఆకలి తీర్చే మరయంత్రమువలె ఉన్న మహిళ సమానత్వం సాధించింది. ఇంకా మహిళల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇంకా మహిళలు రెండో శ్రేణికి చెందినవారుగానే భావిస్తున్నారు… ఆ భావన పోగొట్టాలి. శ్రమ చేసేవారనే భావన పోయి యజమానులుగా పరిగణించడానికి ఎంతో ధైర్యంతో ఎదురుచూస్తున్నారు. తాము చేసే శ్రమను గుర్తించేలా చేయగలుగుతున్నారు. అటు ఆస్తి హక్కులే గాక ఇంటి పని పొలం పనులు చేసినా ఎలాంటి ఆర్థిక వనరులు లేవు. ఫలితంగా దుర్భరమైనజీవితం గడపుతున్నారు. కావాలంటే ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు ప్రశ్నించే తత్త్వం ఏర్పడాలి. శృంగార వీధిలో అంగడి సరుకుగా మారుతున్న అబలల పరిస్థితి తిరిగి పూర్వ మహిళల స్థాయికి పడిపోతుంది ధైర్యంగా లేకపోతే… ఈ అణచివేతను ఎదుర్కోవాలి.
కుటుంబం బాగుపడాలన్నా… దేశం నాగరికత సంతరించుకొని ఎదగాలన్నా మగవారితో సమానంగా కష్టపడుతున్న మహిళ రెండవ శ్రేణికి చెందడం ఒకింత బాధాకరం. అయినా పురుషులతో సమానంగా హోదాను, అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ధైర్య వనితలే ఆదర్శం మనకు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకొనే స్థితి మహిళలకు ఉండాలి [ఇది ఒకప్పటి సమాజంలో ఉండేది కూడా] స్థితి హోదా గౌరవం కనుమరుగైపోయాయి. వివక్షకు గురైంది మహిళా లోకం.
మహిళలకునిర్ణయం తీసుకొనే హక్కు, విద్య, ఆర్థిక స్వతంత్రత ,సమాన స్థాయి పొందాలి.
మానసికకహింస,లైంగిక హింసకు తావివ్వకుండా ధైర్యంగా ఉండాలి. అంతేకాదు ఆరోగ్య విషయంలోనూ అవగాహనతో మెరుగైన వైద్యం పొందాలి. ఇతరుల నుండి వచ్చే ఆపదలను ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలి.
అమ్మమ్మగా, అమ్మగా, బిడ్డగా, అత్తగా, కోడలిగా, ఎన్నో రూపాల్లో మగవారికి, కుటుంబానికి ,అండంగా నిలిచే మహిళ ఏ పని చేయాలన్న ధైర్యంతో ముందడుగు వేయడం, ఆ పనిలో వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, వచ్చిన ఫలితాన్ని పురుషులతో పాటు సమాన స్థాయిలో అనుభవించడం జరగాలంటే ప్రతి అడుగు ధైర్యంగా వేయడమే తప్పనిసరి!