తయారై వచ్చిన సౌదామిని నీలాంబరిని చూసి అడిగింది..
” మీరు కచ్చరంలో రావడానికి ఇష్టపడతారు కదా !మరి ఎలా !అక్కడికి వెళ్ళడానికి చాలా ఆలస్యం అవుతుంది మీరు తర్వాత వస్తారా? నేను స్కూటీ మీద వెళ్లి పోతాను” అని అడిగింది.
అప్పటికే తయారై వచ్చిన నీలాంబరి…” సిద్దయ్యకు ఒంట్లో బాగాలేదని ఈరోజు రాలేదు… పోనీ కారులో వెళ్దామంటే ఒకటేమో మామయ్య పట్టణానికి తీసుకెళ్తున్నాడు ..మరొక డ్రైవరు ఈరోజు రానని చెప్పాడు.. సరదాగా నేను కూడా స్కూటీ పైనే వస్తాను” అన్నది నీలాంబరి.
” అవునా! మీరు స్కూటీ మీద వస్తారా నమ్మలేకపోతున్నాను” అన్నది సౌదామిని.
” అమెరికాకి వెళ్లి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను పరిస్థితులకు అనుకూలంగా మసులుకోవాలని తెలుసుకున్నాను.. పద వెళ్దాం” అన్నది నీలాంబరి.
” మీరు టిఫిన్ తిన్నారా” అని అడిగింది సౌదామిని.
” ఆ సంగతి మర్చిపోయాను నువ్వు కూడా తినలేదు కదా !మరి తిందామా”? అని అడిగింది నీలాంబరి.
” ఈరోజు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పోనీ అక్కడే తినేద్దామా ఎలాగో స్టాఫ్ కి కూడా వండుతారు కదా ఆ భోజనం కూడా మనం రుచి చూద్దాం” అన్నది సౌదామినీ
” సరే అక్కడే తిందాం” అన్నది నీలాంబరి.
ఇద్దరు స్కూటీ పైన బయలుదేరారు.. ఎప్పుడు స్కూటీ ఎక్కని నీలాంబరి కి ఆ ప్రయాణం సరదాగా ఉంది. సౌదామినికి కూడా నీలాంబరిని స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్లడం సంతోషంగా ఉంది.. ఊళ్లో అందరూ నీలాంబరిని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎప్పుడూ కచ్చరం దిగని నీలాంబరి ఇలా స్కూటీ మీద వెళుతుందని…
ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.. తెల్లని చుడిదార్లో సౌదామిని మెరిసిపోతుంది.. లావెండర్ కలర్ చీరలో నీలాంబరి ఎంతో అందంగా కనిపిస్తుంది…
ఇద్దరు బాలసదనం చేరుకున్నారు… అక్కడున్న అందరూ వీళ్ళిద్దరిని చూస్తూ అలాగే ఉండిపోయారు అందరి మనసులో ఒకటే మాట “ఎంత చక్కగా ఉన్నారు” అని…
నీలాంబరి లోపలికి వెళ్ళిపోయింది పిల్లలందరినీ చక్కగా పలకరిస్తూ ఇంకా వారికి ఏమైనా సౌకర్యాలు కలిగించాలా అని ఆలోచిస్తూ ఒక్కసారి సదనం అంతా కలియతిరిగింది.
సౌదామిని అక్కడున్న నర్సులతో మరియు తన తోటి డాక్టర్ తో పిల్లల ఆరోగ్యం గురించి చర్చించింది.. కొంతమంది పిల్లలకి ఆహారం అందినా బలహీనంగా ఉన్నారని తెలిసి.. ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమి ఆహారం ఇవ్వాలని ఆలోచించింది.. ఇంచుమించు మిగతా పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు అప్పటికే అక్కడికి వచ్చి వారి సంతృప్తిని వెలిబుచ్చారు…
” దొరసాని గారు మీరు చేసిన ఈ పని వల్ల మేము ఎంతో నిశ్చింతగా మా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము పిల్లల ఆలనా పాలన ఇక్కడ చక్కగా ఉంది పని మీద కూడా ధ్యాస పెట్టగలుగుతున్నాము, అందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము” అని చెప్పారు.
సంతృప్తిగా తల ఊపిన నీలాంబరి..
” ఇలా అందరూ తల్లులు సంతోషంగా ఉండాలని నా కోరిక, దాని గురించే ఆలోచించి ఇలాంటి ఏర్పాటు చేశాను, కానీ! మీకు అందరికీ ఒక మాట చెబుతున్నాను నన్ను ఇక నుండి దొరసాని అని పిలవద్దు.. నా పేరుతో పిలవండి చాలు” అని చేతులు జోడించింది నీలాంబరి.
” కానీ మాకందరికీ అలాగే అలవాటయింది ఆపిలుపే బాగుంది దాని గురించి మీరు ఏమీ అనుకోవద్దు.. తర్వాత మాతరపు నుండి ఒక మాట చెబుతున్నాము మేమందరము ఉద్యోగాలు చేసి అంతో ఎంతో సంపాదించుకుంటున్నాము ఎక్కువ సంపాదన లేని తల్లిదండ్రులు చాలామంది ఉంటారు.. కాబట్టి ప్రతినెలా మాకు ఉన్నదాంట్లో కొంతమేము బాలసదనంకి చెల్లిస్తాము.. మీరు కాదనకూడదు” అని చెప్పారు కొంతమంది తల్లిదండ్రులు.
” మేము అందరికీ ఉచితంగా సదుపాయాలు కలగజేయాలని మా ధ్యేయం కదా మీదగ్గర డబ్బులు తీసుకుంటే మాకు సంతృప్తిగా ఉండదు.. మాకు ఒకవేళ నిజంగా అవసరం పడితే తీసుకుంటాము.. ఇప్పుడైతే అవసరం లేదు” అని సున్నితంగా తిరస్కరించింది నీలాంబరి
ఇదంతా గమనిస్తున్న సౌదామిని “అత్తయ్య సంకల్పం నెరవేరినట్లే.. ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళు కొంత డబ్బు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందంటే అందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతున్నట్లే” అని అనుకుంది.
ఇద్దరూ లోపలికి వెళ్లి పిల్లల భోజనం పరిశీలించారు.. తర్వాత వారిద్దరు కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారు ఆరోజు అటుకులతో పోహా చేశారు ఎంతో రుచికరంగా ఉంది..
దాదాపు మూడు గంటలు అక్కడే గడిపారు తర్వాత నీలాంబరి ఇంటికి వెళ్తానని చెప్పింది…
” అత్తయ్యా! నేను కూడా వస్తాను ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు చేయాల్సిన పని పూర్తి అయ్యింది అయినా మీరు ఒక్కరు ఎలా వెళ్తారు” అని అడిగింది సౌదామిని.
” సరే అయితే ఇద్దరం కలిసి వెళ్లి పోదాం ఇంటికి కూడా మామయ్య వచ్చే టైం అయింది ఈరోజు భోజనం లోకి మహేశ్వరి ఏం చేసిందో తెలియదు నేను ఏమీ చెప్పకుండానే వచ్చేసాను” అన్నది నీలాంబరి.
ఇద్దరూ గడికి చేరుకున్నారు… లోపలికి వెళ్ళగానే భూపతి కనిపించారు…
” అత్త కోడళ్లు ఇద్దరూ బాలసదనంకు వెళ్లారా!” అని అడిగాడు.
” అవునండి మీరు తొందరగానే వచ్చారా!” అని అడిగింది నీలాంబరి.
” నేను పట్నం వెళ్లలేదు.. కొంచెం దూరం వెళ్ళామో లేదో కారు టైర్ పంచర్ అయింది.. అందుకని కార్ ని రిపేర్ కి పంపించి ఇంటికి వచ్చాను” అన్నాడు భూపతి.
” అవునా! మహేశ్వరి లోపల ఉందా వంట చేసిందో లేదో నేను ఏమీ చెప్పకుండా వెళ్ళాను” అన్నది నీలాంబరి.
” పిల్లలకి ఒంట్లో బాగా లేదట మహేశ్వరి ఇంటికి వెళ్ళిపోయింది రాములమ్మ ఉంది కానీ తనకు వంట చేయడం రాదట.. అందుకని నేనే ఒక ఎక్స్పరిమెంట్ చేశాను ఈరోజు వంటిల్లు నాదే నా వంట మీరు కూడా రుచి చూడండి” అన్నాడు భూపతి.
” మీరు వంట చేశారా ఇది చాలా పెద్ద వింత అసలు మీకు తెలుసా వంట చేయడం” అన్నది నీలాంబరి.
” అయితే చాలా తొందరగా భోజనం చేయాల్సిందే” అన్నది సౌదామినీ.
” డైనింగ్ టేబుల్ మీద చక్కగా అన్నీ అరేంజ్ చేశాను.. భోంచేసి ఎలా ఉన్నాయో రేటింగ్ ఇవ్వండి” అన్నాడు భూపతి.
ఇద్దరూ కాళ్లు చేతులు కడుక్కొని టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నారు…
అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి ఆశ్చర్య పోవడం అత్తా కోడళ్ళ వంతయ్యింది.
ఇంకా ఉంది