దొరసాని

ధారావాహికం -62 వ భాగం

నీలాంబరిని చూసిన “భూపతి ఏంటి నీలా !ఇంకా పడుకోలేదా? ఏం చేస్తున్నావ్? ఎందుకునీలో నువ్వే నవ్వుకుంటున్నావ్” అని అడిగాడు.

” ఏం లేదండి మీరేమో నిద్రపోయారు ,నాకు అస్సలు నిద్ర పట్టలేదు ,అందుకని కిటికీలో నుండి వెన్నెలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది, అందులో కార్తీకమాసం కదా! అందుకని నాకు కవిత్వం పుట్టుకొచ్చింది, వెంటనే నాకు తోచినట్లుగా రాసేశాను, చిత్రలేఖనం అయిపోయింది ఇప్పుడు కవిత్వం మొదలుపెడతానేమోనని నవ్వుకున్నాను, కానీ, అది భరించాల్సింది మాత్రం మీరే, విని అభిప్రాయం చెప్పాల్సింది మీరే కదా” అన్నది నవ్వుతూ..

” అవునా ఏం రాసావో చదువు” అన్నాడు భూపతి.

” నిజంగా చదవమంటున్నారా విని తట్టుకుంటారా” అన్నది నవ్వుతూ..

” తట్టుకుంటాను గానీ ముందు చదువు” అన్నాడు భూపతి.

తాను రాసిన కవితను కొంచెం రాగయుక్తంగా చదివి వినిపించింది నీలాంబరి..

అలాగే కళ్ళు మూసుకుని విన్నాడు భూపతి… కవిత చదవడం అయిపోయినా కూడా ఏమీ మాట్లాడని భూపతిని చూసి..

” ఏమిటి నాకవిత్వం విని భయపడ్డారా ఏంటి? సమాధానం ఇవ్వడం లేదు” అన్నది నీలాంబరి..

” నిజం చెప్పమంటావా నీలా! ” అన్నాడు భూపతి.

” నిజమే చెప్పండి.. విని తట్టుకోగల శక్తి నాకుంది” అన్నది నీలాంబరి.

” నీకవిత వెన్నెలంతా చల్లగా మల్లెల పరిమళంలా ఉంది, ఇంకా చెప్పాలంటే అచ్చం నీలాగే ఉంది ,అద్భుతం నీలా! నువ్వు ఏప్రయత్నం చేసినా అందులో విజయమే సాధిస్తావు” అన్నాడు భూపతి.

” నిజమా ఏదో మామూలుగా ప్రయత్నం చేస్తే నిజంగా అంత బాగా వచ్చిందా? అయితే నేను రాయడం మొదలు పెట్టాలా” అన్నది నీలాంబ రి..

” నీకు ఏది ఇష్టముంటే అది చేసుకో, కానీ దాంట్లో లీనమైపోయి మమ్మల్ని మర్చిపోతావేమోనని భయంగా ఉంది” అన్నాడు భూపతి.

ఇద్దరూ కాసేపు నవ్వుకొని పడుకున్నారు.

తెల్లవారి కార్తీక పౌర్ణమి కావడం వల్ల నీలాంబరి ఉదయమే లేచి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకుని శివాలయం వెళ్ళడానికి తయారయింది…

పూల బుట్ట ,ప్రమిదలు, నువ్వుల నూనె ,వత్తులు అంతా సరంజామా ఒక బుట్టలో సర్దుకుని వచ్చిన నీలాంబరికి అక్కడ కూర్చున్న సౌదామినినీ చూసి ఆశ్చర్యపోయింది.

తను కట్టుకునేలాంటి ఎరుపు చీర కట్టుకొని, వాలు జడలో ఒక గులాబీ పెట్టుకొని , ఎర్ర రాయిలాకెట్ ఉన్న చిన్న గొలుసు వేసుకుని, ఎర్రరాళ్లతో ఉన్న కమ్మలు పెట్టుకుని ముస్తాబై కూర్చుని ఉంది.

” సౌదామిని తయారయి కూర్చున్నావు ఎక్కడికి” అని అడిగింది నీలాంబరి.

” ఈరోజు కార్తీక పౌర్ణమి కదా! పొద్దుపొడవకముందే నాకు గుడికి వెళ్లడం అలవాటు అక్కడే దీపాలు వెలిగించుకుంటాను.. నిన్న మహేశ్వరి చెప్పింది మీరు కూడా ఉదయమే గుడికి వెళ్తారని ,అందుకని నేను కూడా లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తయారై కూర్చున్నాను ,మీతో పాటు వెళదామని” అని చెప్పింది సౌదామిని.

అప్పుడే స్నానం చేసి బయటకు వస్తున్న భూపతి…

” అత్తా కోడళ్లు ఇద్దరికీ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయన్నమాట” అన్నాడు నవ్వుతూ…

ఆరోజు నీలాంబరి కూడా ఎరుపు రంగు చీరనే కట్టుకుంది.. కాకపోతే నీలాంబరి కట్టుకున్నది పట్టుచీర ,సౌదామిని కట్టుకున్నది జార్జెట్ చీర.

నీలాంబరిని అలాగే కల్లార్పకుండా చూసింది సౌదామిని.

ఎరుపు రంగు పట్టుచీర, మెడలో కెంపుల గొలుసు, జుట్టును ముడి వేసుకొని చుట్టూ మల్లెపూల దండ పెట్టుకొని నుదుట ఎప్పటిలాగే ఎర్ర కుంకుమ పెట్టుకుని ఉంది…

” ఈవయసులో కూడా ఇంత అందమా” అనుకుంది నీలాంబరి.

” ఏంటి అలా చూస్తున్నావ్ సౌదామినీ” అని అడిగింది నీలాంబరి

” అత్తయ్యా! ఎంత అందంగా ఉన్నారు! అసలు రెండు కళ్ళు చాలడం లేదు మిమ్మల్ని చూడటానికి” అన్నది సౌదామిని.

” ఏంటి తల్లి నేను ఏమైనా చిన్నపిల్లనా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలని నేను అనుకుంటే నువ్వే నాగురించి చెప్తున్నావా” అన్నది నీలాంబరి నవ్వుతూ.

అక్కడికి వచ్చిన భూపతి..

” మీ ఇద్దరూ చెప్పొద్దు నేను చెప్తాను వినండి..

సౌదామినీ! మీ అత్తయ్య పాతిక ఏళ్ల కింద ఎలా ఉందో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావ్ మీ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు.

నీలాంబరి సౌదామిని ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మురిసిపోయారు…

” పదండి గుడికి ఆలస్యం అయిపోతుంది” అన్నాడు భూపతి..

” మీరు ఎలా వస్తారు ?మేం కచరంలో వెళ్తాము కదా” అన్నది నీలాంబరి.

” ముగ్గురం కచ్చరంలోనే వెళదాము” అన్నది సౌదామిని.

” వద్దు వద్దు, ఎద్దులు మన ముగ్గురి బరువును మోయలేవు వాటిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, నేను కార్లో వస్తాను మీరు కచ్చరంలో వెళ్ళండి” అన్నాడు భూపతి.

నీలాంబరి మరియు సౌదామిని సిద్దయ్య కట్టిన కచ్చరంలో ఎక్కారు..

భూపతి కారులో ముందుగానే వెళ్ళిపోయాడు…

శివాలయంకు చేరుకోగానే అక్కడి దృశ్యాన్ని చూసి పరవశం చెందింది సౌదామిని.

గుడి ప్రాంగణం అంతా నూనె దీపాలతో మెరిసిపోతుంది, సాక్షాత్తు పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడనిపిస్తుంది..అంత అద్భుతంగా ఉంది ఆలయం.

భక్తులు పలుకుతున్న “ఓం నమశివాయ” అనే నినాదంతో గుడి అంతా భక్తి భావనతో నిండిపోయింది..

గుడి లోపలికి వెళ్లి ప్రదక్షిణం చేసి… గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర, గుడి ప్రాంగణంలో దీపాలను వెలిగించి గుడిలో శివయ్యను దర్శనం చేసుకుని అక్కడే కూర్చున్నారు..

పూజారి గారు వీరిని పిలిచి అభిషేకం చేయించారు… భక్తిగా అభిషేకం చేసుకొని బిల్వపత్రాలతో పూజించి, విభూతిని అలంకరించి, పూజారిగారు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చి రాధా మాధవ పందిరి కింద కూర్చున్నారు.

అప్పుడే అక్కడికి వచ్చిన ఊరివాళ్లు కొందరు నీలాంబరిని మరియు భూపతిని చూసి గౌరవంగా పలకరించారు వారితో మాట్లాడుతూ ముందుకు వెళ్లి నిలబడ్డారు నీలాంబరి భూపతి.

అక్కడే కూర్చున్న సౌదామిని ఆలయాన్ని చూస్తూ తన్వయత్వం పొందింది… ఇళ్లల్లో ఎన్ని పూజలు చేసుకున్నా ఆలయానికి వచ్చినప్పుడు మనకు ఒక శక్తి లాంటిది వస్తుంది ,మనసు స్వచ్ఛమైపోతుంది… ఆలయ గోపురం దగ్గరికి రాగానే గుడిలోని దైవం అనుగ్రహిస్తాడట.. అక్కడి నుండే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ,అందుకే గుడికి ఎప్పుడు వెళ్లి వచ్చినా ప్రశాంతంగా అనిపిస్తుంది. పురాతనమైన ఆలయాల్లో ప్రశాంతత ఎక్కువగా పొందుతాము ,జనంతో పరిసరాలు రద్దీగా ఉన్నప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ అయితాము ,కానీ ఏవిశేషం లేని రోజున వెళ్ళినప్పుడు మనకు ఆఅనుభవం చాలా విచిత్రంగా ఉంటుంది ,ఇలా ఆలోచిస్తూ కూర్చున్న సౌదామినినీ అలా వెళ్తున్న ఒక అబ్బాయి ఏదో కామెంట్ చేశాడు…
అది విన్న సౌదామినికి చాలా కోపం వచ్చింది కానీ ఆలయంలో తొందర పడకూడదు అనే నిశ్చయానికి వచ్చి ఆ అబ్బాయిని చూసి ఒక చిరునవ్వు నవ్వి అలాగే కూర్చుంది..

అక్కడికి వచ్చిన నీలాంబరి మరియు భూపతిని చూసి “ఇంటికి వెళదామా” అని అడిగింది..

” పద బయలుదేరుదాము” అని ముగ్గురు బయటకు వచ్చారు.

అసభ్యంగా మాట్లాడిన ఆ అబ్బాయి గురించి ఏమీ చెప్పలేదు సౌదామిని.. వయసులో ఉన్న ఆడపిల్లలకు ఇలాంటివి సహజము అలాగని తలవంచుకొని ఊరుకుంటే ఇంకా ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఇలాంటి వారికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పడం సౌదామినికి అలవాటే, కానీ గుడి ప్రాంగణం అని ఊరుకుంది. “సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను” అనుకుంది..

గడికి చేరుకున్నారు నీలాంబరి మరియు సౌదామిని.

భూపతి ఊర్లో ఏదో పని ఉందంటూ వెళ్ళిపోయాడు..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

శ్యామల గారి ఇంటర్వ్యూ