సాయంత్రం కావస్తుండగా నీలాంబరి సౌదామినికి ఫోన్ చేసింది. సౌదామిని కూడా నీలాంబరికి ఫోన్ చేయాలని అనుకుంది ఈ అనుకొని సమస్య వల్ల ఆ మాటే మరిచిపోయింది.
” హలో అత్తయ్యా!”అని సౌదామిని అడిగింది.
” ఎలా ఉన్నావు సౌదామిని? అందరూ బాగున్నారా !నువ్వు వెళ్ళినప్పుడు నుండి మనసు కొంచెం ఆందోళనగా ఉంది అక్కడ అంతా సవ్యంగానే ఉంది కదా” అని అడిగింది నీలాంబరి.
” అందరం బాగున్నాము.. ఏమి సమస్యలు లేవు రాగానే చేద్దాము అనుకున్నాను కానీ అమ్మానాన్నలతో మాట్లాడుతూ మరచిపోయాను అత్తయ్యా! సారీ” అని చెప్పింది సౌదామినీ..
” అయ్యో పర్వాలేదమ్మ.. ఇంత మాత్రానికి సారీ ఎందుకు? అందరూ బాగుంటే చాలు ఎప్పుడు వస్తున్నావు నాలుగు రోజులు ఉండి వస్తావా” అని అడిగింది నీలాంబరి.
” ఎల్లుండి వస్తాను అత్తయ్యా! ఈ మధ్యనే ప్రారంభం అయింది కదా మన బాలసదనం ఇప్పుడే నేను ఎక్కువ రోజులు రాకుండా ఉంటే చిన్నపిల్లలకి కష్టమవుతుంది నేను వచ్చేస్తాను” అని చెప్పింది సౌదామిని.
నీలాంబరికి అడగాలని నోటి చివరి వరకు వచ్చింది పెళ్లి గురించి ఏమైనా మాట్లాడారా అని.. కానీ తొందరపడి ఏమి అడగకూడదని మామూలుగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
ఆరోజు రాత్రికి సాగర్ ఫోన్ చేశాడు…
” సౌ ఎలా ఉన్నావ్!” అని అడిగాడు.
” నేను బాగున్నాను సాగర్ నేను మా ఊరికి వచ్చాను ఒక రెండు రోజులు ఉండి పోదామని అనుకున్నాను ఎల్లుండి మళ్ళీ గోపాలపురం వెళ్తాను” అని చెప్పింది.
సాగర్ కి కూడా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అక్కడ పెళ్లి గురించి ఏదైనా మాట్లాడారా అని అనుకున్నాడు కానీ అడిగితే సౌదామిని ఏమనుకుంటుందో అని ఏమీ అడగలేదు.
సౌదామిని సాగర్ దగ్గర విషయం దాచి పెట్ట తలచుకోలేదు… అందుకే జరిగిన విషయం అంతా చెప్పేసింది.
” మరి మీఅమ్మానాన్న ఏమంటున్నారు మన గురించి ఏదైనా చెప్పావా” అని అడిగాడు సాగర్.
” ఇంకా చెప్పలేదు సాగర్ కొంచెం సమయం తీసుకుందామని అనుకుంటున్నాను ఈ రోజే నా సమస్య పరిష్కారం అయ్యింది కదా మళ్ళీ వెంటనే అడిగితే అమ్మానాన్నల మూడ్ ఎలా ఉంటుందో తెలియదు… కొన్ని రోజులు ఆగి చెప్తాను ఈ లోపల నేను బాలసదనంలో నా బాధ్యతలు నిర్వర్తించాలి… నువ్వెలా ఉన్నావ్ నీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి” అని అడిగింది సౌదామిని.
” నేను బాగానే ఉన్నాను నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను ఎప్పటికీ సఫలం అవుతాయో తెలవదు… కానీ రోజూ నువ్వు గుర్తొస్తున్నావు ఇంత తక్కువ పరిచయంలో మన మధ్య ఇంత విడదీయని బంధం ఏర్పడుతుందని అనుకోలేదు.. నిజంగా నువ్వు నమ్ముతావో లేదో తెలియదు ఎంతోమంది అమ్మాయిలని చూసాను కానీ నిన్ను చూసిన మొదటిసారి నాకు ఈ అమ్మాయి నాభార్య అయితే బాగుండు అని అనుకున్నాను నామనసు చాలా స్పందించింది” అన్నాడు సాగర్.
” నిజమా సాగర్ ..నేను కూడా అలాగే అనుకున్నాను చూసిన క్షణంలోనే నీ యొక్క ప్రవర్తన నాకు నచ్చింది మన ఇద్దరి మనసులు ఒకేలాగా ఆలోచించాయి ఇక్కడున్నానన్న మాటే కానీ నామనస్సు ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తుంది.. త్వరగా వచ్చేయి సాగర్” అన్నది సౌదామిని.
” మరి నువ్వు ఇలా అడిగావు అంటే ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఇప్పటికే నా మనసును నిగ్రహించుకోలేకపోతున్నాను.. వీలైనంత తొందరగా రావడానికి ప్రయత్నం చేస్తాను నాగురించి నువ్వు బాధపడకు ఎడబాటుకు కొన్ని రోజులైనా మిగతా రోజులన్నీ కలిసే ఉందాం. సరేనా ఉంటాను కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి నాకు” అన్నాడు సాగర్.
” సరే సాగర్ ఆరోగ్యం జాగ్రత్త సమయానికి భోజనం చెయ్” అని చెప్పి ఫోన్ పెట్టేసింది సౌదామిని.
ఇంతలో స్నేహితురాలు వర్ణ వచ్చింది…
” ఏయ్! ఏంటే సడెన్ సర్ప్రైజ్..నేనొచ్చానని ఎలా తెలుసు ” అంటూ అంటూ స్నేహితురాలిని హత్తుకుంది సౌదామిని.
” నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి.. అయినా నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా పూర్తిగా మరచిపోయావు.. ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంటి” అన్నది వర్ణ.
” నీ మొహం.. సరేగాని మనం పొలం వైపు వెళ్లి కూర్చుందామా కాస్త ఫ్రీగా మాట్లాడుకోవచ్చు” అన్నది సౌదామిని..
” సరే ఒకసారి ఆంటీ అంకుల్ని కలిసి వెళ్దాము” అని రవీంద్ర తో విజయమ్మతో కాసేపు మాట్లాడి ఇద్దరు కలిసి పొలం వైపు వెళ్లారు.
పొలంలో పనిచేస్తున్న శీనయ్యను పిలిచింది సౌదామిని.
” శీనయ్యా! బాగున్నావా” అని అడిగింది.
” చిన్నమ్మ! నేను మంచిగున్న నువ్వెట్లా ఉన్నావ్ అమ్మ” అని అడిగాడు శీనయ్య.
” నేను బాగున్నాను శీనయ్యా! మాకు కొన్ని మక్క కంకులు కాల్చి స్తావా.. నేను నా ఫ్రెండ్ ఇద్దరం తింటాము” అని అడిగింది సౌదామిని.
” ఒక్క నాలుగు దినాలు ముందుగాల వచ్చి ఉంటే మంచి పాల కంకులు దొరికేవి.. ఇప్పుడైనా లెంకి కాల్చిస్త..” అని మక్క కంకుల తోటలోకి వెళ్ళాడు శీనయ్య.
సౌదామిని మరియు వర్ణ పొలం గట్టుమీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు..
సౌదామిని తన ప్రేమ విషయము తర్వాత పరిస్థితులు ఎలా వచ్చాయి అన్ని వివరించింది తన స్నేహితురాలికి.
వర్ణ కూడా తన గురించి చెప్పుకుంది… తాను స్కూల్ టీచర్ గా చేస్తున్నానని ఒక చిన్న ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని… అక్కడ తాను కొన్ని ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది.
అయినా అన్ని పరిస్థితులను ఎదిరించి నిలదొక్కుకోవాలని ఇద్దరూ అనుకున్నారు అలా కబుర్లు చెప్పుకున్న వీళ్ళిద్దరికీ సీనయ్య కంకులను అలాగే పొట్టుతోనే మంటల్లో కాల్చి తెచ్చి ఇచ్చాడు.
” ఇలా తృప్తిగా కంకులు తిని ఎన్నాళ్ళు అయ్యిందో” అన్నది సౌదామిని.
” నిజమేనే మన ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి అనుభూతులను ఎన్నో కోల్పోతున్నాము కానీ మనం మన కోసం కొంత సమయం కేటాయించుకుని తృప్తి తీరా జీవితాన్ని అనుభవించాలి” అన్నది వర్ణ.
ఇంకా ఉంది