దొరసాని

-53 వ భాగం

విజయమ్మ కూతురి తల నిమురుతూ ధైర్యం చెప్పింది… “విజ్ఞానవంతురాలివి ఇంత చిన్న విషయానికే ఇంత బాధ పడతావా!” అని అన్నది.

” నేను అధైర్యవంతురాలిని కాదమ్మా! నా బాధంతా మీరు నన్ను అడగకుండా పెళ్లి నిర్ణయం చేశారని ..ఎందుకమ్మా ప్రతిదీ నన్ను అడిగి చేసే వాళ్ళు పెళ్లి విషయం మాత్రం మీరే నిర్ణయం తీసుకున్నారు” అని అడిగింది సౌదామిని ఏడుస్తూ ..

” మీనాన్న అక్క కొడుకుకి నిన్నిస్తే సుఖంగా ఉంటావని భావించాడు ..నేను కూడా కమల్ బావ నీకు తెలిసిన వాడే కదా అని ఒప్పుకున్నాను” అన్నది విజయమ్మ.

” అతని ప్రవర్తనే నాకు నచ్చలేదమ్మా !చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాము ..నిజమే కానీ ఈమధ్యకాలంలో అతన్ని నేను చూడలేదు … అతని ప్రవర్తన చాలా అసభ్యంగా ఉంది ,నాకు నచ్చలేదమ్మా!” అని చెప్పింది సౌదామిని.

అప్పుడే లోపలికి వచ్చిన రవీంద్ర..” నేను సౌదామినినీ సారి చెప్పమన్నాను నువ్వు లోపలికి తీసుకుని వచ్చావు ఇది మర్యాదగా ఉంటుందా!” అన్నాడు.

ఈమాట విన్న విజయమ్మకు చాలా కోపం వచ్చింది కోపాన్ని నిగ్రహించుకొని…

” తప్పు లేనిదే సౌదామిని ఎందుకు క్షమాపణ చెప్పాలండి మీకు విషయం తెలియదు కదా! ముందు సౌదామినీతో మాట్లాడండి” అన్నది

“తప్పొప్పుల సంగతి అలా ఉండని ముందైతే సౌదామిని అలా మాట్లాడకూడదు సౌదామిని నీకు సంస్కారం తెలియదా నిన్ను అలాగే పెంచామా వచ్చి బావకు సారీ చెప్పమ్మా” అన్నాడు రవీంద్ర.

రవీంద్ర ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇంచుమించు అన్ని సౌధామిని సలహా మేరకు కొన్నవే చివరికి ఒక మేకు కొట్టాలన్న సౌదామిని చెప్తేనే చేసేవాళ్లు.. ఇంట్లో ప్రతి వస్తువు సౌదామిని అలంకరించిందే తల్లి తండ్రి వేసుకునే బట్టలు కూడా సౌదామినీ సెలెక్ట్ చేసినవే అంతగా సౌదామినికే ప్రాముఖ్యం ఇచ్చారు రవీంద్ర విజయమ్మ.

” సరే నాన్న నీఇష్ట ప్రకారమే నేను వాళ్లకి క్షమాపణ చెప్తాను కానీ ఒక మాట నిన్ను అడుగుతాను దానికి సావధానంగా నువ్వు సమాధానం ఇవ్వు” అని అడిగింది.

” ఏంటో అడుగు” అన్నాడు రవీంద్ర.

ముందుగా అత్తను, బావను కూల్ చేసి వాళ్ళ గదిలోకి పంపించు తర్వాత నేను నీతో మాట్లాడతాను వాళ్ళని హాల్లో కూర్చోబెట్టుకొని మనం మాట్లాడుకుంటే బాగుండదు” అని చెప్పింది సౌదామిని.

” ఏమని చెప్పాలి వాళ్ళిద్దరూ కోపంగానే ఉన్నారు” అన్నాడు రవీంద్ర.

” సరే అయితే నేనే వచ్చి వాళ్లకు సారీ చెబుతాను రా నాన్నా!” అని రవీంద్ర చెయ్యి పట్టుకుని బయటకు వచ్చింది.. అప్పటికి విజయమ్మ పిలుస్తూనే ఉంది “ఏంటి సౌదామిని నువ్వు చేసేది” అంటూ..

” నువ్వు కాసేపు ఆగమ్మా ఇప్పుడే వస్తాను” అని చెప్పి బయటకు వెళ్ళింది రవీంద్ర తో.

హాల్లో ముఖాలు కోపంగా పెట్టుకుని కూర్చున్న దుర్గకి కమల్ కి సారీ చెప్పింది సౌదామిని.

దాంతో మామూలుగా అయిన వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్లిపోయారు.

తర్వాత రవీంద్రని లోపలికి తీసుకొని వచ్చింది.

” అమ్మా! నాన్న మీరిద్దరూ కూర్చోండి” అని చెప్పి తాను కూడా వారి పక్కన కూర్చుంది.

గోడకు ఉన్న పెయింటింగ్స్ ఇంట్లో వేసిన కర్టెన్స్ అరేంజ్ చేసిన బొమ్మలు అన్నిటిని చూపించింది సౌదామిని.

” ఇవన్నీ మీరు ఎవరిని అడిగి కొన్నారు ఎలా అరేంజ్ చేసుకోవాలో ఎవరిని అడిగారు” అని అడిగింది.

” ఇంకెవరిని అడుగుతాం నా బంగారు తల్లివి నువ్వే కదా అన్ని సలహాలు ఇచ్చింది ..నిన్ను అడగకుండా మేము మేకైనా కొట్టామా” అన్నది విజయమ్మ.

” నిజమే కదా సౌదామినీ! నిన్ను అడగకుండా మేము ఏమీ చేయలేదు కదా” అన్నాడు రవీంద్ర.

” నాచదువు గురించి ఎవరు నిర్ణయం తీసుకున్నారు!” అన్నది సౌదామిని.

” నిన్ను అడిగే కదా బైపిసి లో జాయిన్ చేసి తర్వాత మెడిసిన్ చేస్తా అంటే కోచింగ్ ఇప్పించాము” అన్నాడు రవీంద్ర.

” ఇప్పుడు నేను గోపాలపురంలో ఉద్యోగం చేస్తానని అంటే మీరు ఏమన్నారు!” అడిగింది సౌదామిని

” నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉద్యోగం చేయమని చెప్పాము ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు” అన్నాడు రవీంద్ర.

” ఇన్ని అడిగిన వాళ్లు నా పెళ్లి గురించి ఒక మాట అయినా అడిగారా మీరు నిర్ణయం తీసుకొని నన్ను పిలిపించారు పోనీ వచ్చాక అయినా నన్ను అడిగారా నీకు ఈ పెళ్లి ఇష్టమే అని” అన్నది సౌదామని.

” బావకు ఏం తక్కువ తల్లి చదువు ఉంది చూడటానికి బాగున్నాడు అంతకన్నా మించి మనకు దగ్గర వాళ్లు అత్త నిన్ను బాగా చూసుకుంటుంది ..మేము నిశ్చింతగా ఉండగలుగుతాము ఈ పెళ్లి జరిగితే” అన్నాడు రవీంద్ర.

” మీరు నిశ్చింతగా ఉండడానికి నేను ఈ పెళ్లి చేసుకోవాలా! అందం అనేది ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు మనసుకు నచ్చడం కావాలి. పెళ్లి అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం కలగాలి చిన్నప్పటినుంచి నాతో పెరిగిన బావ నాకు సోదర సమానమే కానీ భర్త అనే భావన వస్తుందా? అదీకాక మేనరికపు పెళ్లిళ్లలో ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తెలుసా… అలాగని ఎన్నో ఉదాహరణలు మీరు చెప్పొచ్చు అలా జరగలేదు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని కానీ అదృష్టం బాగా లేకుంటే మనకే అలా జరగవచ్చు ప్రతి మనిషి జీవించేది తన పుట్టబోయే సంతతిని చూసుకుని అలా పిల్లలు ఎలా పుడతారో అని భయంతో బ్రతకడం అవసరమా! అన్నింటికన్నా ముఖ్యంగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి నాకు బావ మీద ఆ భావన లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను .. ఈ విషయం గురించి నేనేమీ మాట్లాడను ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తే అది చేయండి” అని కళ్ళనీళ్ళతో బయటకు వెళ్ళిపోయింది సౌదామిని.

విజయమ్మ మరియు రవీంద్ర సోఫాలో అలాగే కూర్చున్నారు రవీంద్ర మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది “నిజంగా సౌదామినినీ అడగకుండా నేను ఎంత పొరపాటు చేశాను.. ప్రతీ చిన్న విషయాన్ని కూర్చొని చర్చించే నేను ఇంత పెద్ద విషయం గురించి సౌదామినితో నేను మాట్లాడలేదు” అని అన్నాడు రవీంద్ర విజయమ్మతో.

” అవునండి! మనం పొరపాటు చేసాము” అన్నది విజయమ్మ.

“బయట అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం” అని ఇద్దరు బయటకు వచ్చారు.

హాల్లో సౌదామిని కనిపించలేదు పెరట్లోకి వెళ్లి చూశారు అక్కడ కూడా కనిపించలేదు…

ఇద్దరూ కంగారుగా బయటకు వచ్చారు. అక్కడ ఇంట్లో పని చేసే రంగమ్మ కూతురు చంద్రిక తో మాట్లాడుతూ కనిపించింది సౌదామని. ఆ పిల్ల తో మాట్లాడుతూ ఉంటే సౌదామిని కూడా చిన్న పిల్లలా మారిపోయింది… అది చూసిన రవీంద్ర విజయమ్మ అనుకున్నారు “ఇంత స్వచ్ఛమైన మనసున్న సౌదామినినీ అర్థం చేసుకోలేకపోయాము.. ఎందుకు ఇంత తొందర పడ్డాము మనం” అని ఇద్దరు అనుకున్నారు.

ఆతర్వాత సౌదామిని దగ్గరికి వెళ్లి..

” నువ్వు కనపడకపోయేసరికి ఒక్కసారిగా భయం వేసింది సౌదామినీ!” అన్నాడు రవీంద్ర.

” భయం ఎందుకు నాన్న మీ పెంపకంలో నేను చక్కగానే పెరిగాను నా మనసు దృఢంగానే ఉంటుంది నా మనసులోని ఆలోచనలను మీతో చెప్పి మిమ్మల్ని ఒప్పించుకుంటానే తప్ప మీరు భయపడేంత పని నేనేమీ చేయను” అన్నది సౌదామిని.

రవీంద్ర విజయమ్మ సౌదామినినీ దగ్గరికి తీసుకొని “రామ్మా లోపలికి వెళ్దాము” అన్నారు.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు -14

హైడ్రా