దొరసాని

ధారావాహిక నవల – మొదటి భాగం

ప్రముఖ రచయిత్రి లక్ష్మీ మదన్ కలం నుంచి జాలువారిన ‘ దొరసాని‘ నవలను తరుణి పాఠకులకు ధారావాహిక గా వారం వారం అందించబోతున్నాం. చదివి ఆనందించండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను రాయండి
                                                                      – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకురాలు

 

దొరసాని అనే పేరు ఎందుకు పెట్టానంటే…

ఈ రోజుల్లో దొరలు జమీందారీలు లేరు ఇది ఒక నాటి చరిత్ర కాదు… దొరల కుటుంబంలో పుట్టిన ఒక మహిళ తాను సాధారణంగా జీవిస్తూ నలుగురికి సహాయ పడాలని చింతన కలిగిన ఒక ఆదర్శ మహిళ..

అందుకు తోడు ఆమెకు చిత్రలేఖనం అనేది అభిరుచి… ఆ అభిరుచి తనకు ఏ విధంగా తోడ్పడింది ఇంట్లో భర్త ఎలా స్పందించాడు అనేది ఈ సీరియల్ చదివితే అర్థమవుతుంది…మనం రోజు ఎన్నో దృశ్యాలను చూస్తుంటాము కొన్ని మంచివి కొన్ని చెడ్డవి మనం రెండిటిని ఒకే విధంగా తీసుకొని ఆ క్షణం బాధపడడం సంతోషించడము రెండు చేసి ఆ తర్వాత మర్చిపోతాము…కానీ ఇక్కడ దొరసాని అనే నీలాంబరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది ఆమె సున్నితమైన వ్యక్తే కాకుండా ఆదర్శమైన భావాలు కలిగిన దీరవనిత..

ఇంట్లో ఉంటూనే అన్నింటిలో నైపుణ్యం సాధించుకున్న ఒక వీరనారి… ఆమెకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆమె ఏం చేసింది అసలు ఆమె లక్ష్యం ఏమిటి.. దొరసానిగా ఆమె ఆటిట్యూడ్ చూపిస్తుందా లేక అందరికీ ఇష్టమైన మహిళ అవుతుందా!

ఇదంతా తెలియాలంటే మీరంతా దొరసాని సీరియల్ చదవాల్సిందే! తప్పకుండా ఈ సీరియల్ చదివి మీ అభిప్రాయాలు చెప్తారని ఆశిస్తున్నాను..

లక్ష్మి మదన్

లక్ష్మి మదన్

 

నీలాంబరి శివాలయంకి వెళ్లడానికి కచ్చరం సిద్ధం చేయమని నౌకర్ సిద్దయ్యను పిలిచింది…

” సిద్ధయ్యా…”

” దొరసాని ..వచ్చినమ్మా!” అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

” కచ్చరం తీసుకొనిరా !గుడికి బయలుదేరాలి” అని బయటకు వచ్చింది.

ఆమె ఎప్పుడు గుడికి వెళ్ళాలి అన్న కూడా కచ్చరంలోనే వెళుతుంది ఆమె పెళ్లయిన నాటి నుండి ఆమెకు అందమైనఆ కచ్చరం అంటే ఎంతో ఇష్టం.. ఇప్పుడు జమీందారీ దివాణాల్లో కార్లు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఆమె ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా కచ్చరంలో వెళ్తుంది.

దొరవారి పూర్వీకులు కట్టించిన శివాలయం అంటే ఆమెకు ఎంతో ఇష్టం ప్రశాంతమైన వాతావరణం గుడి ఆవరణ చుట్టూ గన్నేరు చెట్లు నందివర్ధనం చెట్లు పారిజాతం చెట్లు ఇలా ఎన్నో పూల చెట్లు ఉన్నాయి విరిసిన పూలతో ఆ ప్రాంగణమంతా ఎంతో ఆహ్లాద కరంగా ఉంటుంది… గర్భగుడి లోపల పెద్ద శివలింగం… గుడిలోని స్తంభాలన్నీ శిల్పాలతో చెక్కబడి కళకళలాడుతున్నాయి…

నాటి జమీందారీ విధానం పోయినా కూడా ఊళ్లో ఆమెకు అప్పటి గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే దొరగారు అందరికీ సహాయం చేసే మంచి మనసున్న మనిషి అలాగే దొరసాని నీలాంబరి కూడా సాటి మనిషిని ప్రేమించగల మనసు ఉంది…

ఇంతలో శివాలయం రానే వచ్చింది నీలాంబరి మెల్లగా కచ్చరంలో నుండి దిగి గుడిలోకి నడవసాగింది..
ఆమె కట్టుకున్న ఎరుపు పట్టు చీర ఎండకు ధగధగా మెరవ సాగింది మెడలో వేసుకున్న చంద్రహారం పగడాలమాల చెవులకు ధరించిన వజ్రపు కమ్మలు నుదుట ఎర్రటి సింధూరం ఎర్రరాళ్ల బేసరీ ముక్కుపుడక ఆమె అందమైన రూపానికి మరింత వన్నె తెచ్చింది… వయసు 50లోకి వస్తున్న కూడా 30 ఏళ్ల లాగా కనిపిస్తుంది.. అప్పట్లో గోషా పద్ధతులు కనుక కచ్చరం చుట్టూ తెరలు వేసుకుని బయటకు వచ్చేది ..ఆమె గుడి దగ్గరికి వచ్చేసరికి ఆమెను చూడటానికి ఎంతో మంది బారులు కట్టినిలబడే వాళ్ళు ఆ ఒక్క రోజే ఆమె అందరికీ దర్శనమిస్తుందని ఊరి ప్రజలకు తెలుసు. అలా ఉండేది ఆనాటి వైభోగం…

కచ్చరం దిగిన నీలాంబరిని పూజారి గారు వచ్చి పలకరించారు.. నీలాంబరి రావడం ముందే సమాచారం అందిన పూజారి గారు గుడిలో పూజకు అన్నీ సిద్ధం చేసి ఎదురుచూస్తున్నారు…

” అమ్మా! బాగున్నారా.? బహుకాల దర్శనం” అన్నారు పూజారి గారు.

” బాగున్నాము పూజారి గారు.. అవును నేను శివయ్య దర్శనంకు వచ్చి చాలా రోజులు అయింది” అని తన చేతిలో ఉన్న పూల సజ్జ పూజారి గారి చేతిలో పెట్టి ” దొరవారి పేరు మీద అర్చన చేయండి” అని చెప్పింది.

” ఈరోజు దొరవారు భూపతి గారి జన్మదిన కదా వారు గుడికి విచ్చేయలేదు?” అని అడిగారు పూజారి.

” వారు ఏదో పనిమీద పట్నం వెళ్లారు సాయంత్రంకు గాని తిరిగి రారు అందుకే నేనే వచ్చాను పూజారి గారు” అని చెప్పి గంట మోగించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి వచ్చి శివుడి దర్శనం చేసుకున్నది. అంతకుముందే శివుడికి అభిషేకం చేసిన పూజారి అక్కడే ఉన్న అమ్మవారు పార్వతి దేవికి కుంకుమార్చన చేసి పువ్వులు కుంకుమ నీలాంబరికి అందించారు…

ప్రశాంత వాతావరణంలో కాసేపు కూర్చొని పూజారి గారు పెట్టిన ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకున్నది..

” ఈపూజారి గారు చేసిన ప్రసాదం లాగా ఎక్కడ ఉండదు. శివయ్యకు ఈయన చేతి పులిహోర ఇష్టమేమో! ” అనుకొని నీలాంబరి పూల సజ్జ తీసుకొని లేచి సిద్దయ్యను పిలిచి కచ్చరం ఎక్కింది…

దివాణం ముందు కచ్చరం ఆగగానే ఇంట్లో పని చేసే మహేశ్వరి వచ్చి చేతిలో నుండి పూలసజ్జ తీసుకొని నీలాంబరి తో పాటుగా లోపలికి వెళ్ళింది…

పెద్ద జమీందారీ కోట .. విశాలమైన హాలు పెద్దపెద్ద గదులు నగిషీలు చెక్కిన దర్వాజాలు… సిమెంటుతో చేసిన నేల తళతళలాడుతుంది.. చక్కని ముగ్గులు.. ప్రతి మూలన పూల కుండీలు.. పూసలతో చేసిన పరదాలు… అక్కడక్కడ మువ్వలతో చేసిన తోరణాలు వేలాడుతున్నాయి గాలికి గల్లు గల్లు మని శబ్దం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంది…

లోపలికి వెళ్ళిన నీలాంబరి ఒకసారి తన బట్టల అల్మారా వైపు చూసింది… వారం రోజుల్లో అమెరికా ప్రయాణం అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పటివరకు తను ఎక్కడికి వెళ్ళింది లేదు తన తండ్రిగారైన రాజా శ్రీపతి గారి ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్లడానికి తను ఇష్టపడలేదు… ఎప్పుడో ఒకసారి దొరవారి బలవంతం మీద పట్నం వెళ్లి రావడం… అంతే తప్ప దివాణం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు…. చిటిక వేస్తే వచ్చి పనులు చేసే చెలికత్తెలు.. ఇంటి నిండా పనివాళ్ళు… ఇప్పటికీ ఆనాటి రాచరికం అనుభవిస్తూనే ఉంది కానీ ఆమెకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం… కుంచ పట్టుకుని ఎన్నో రకాల చిత్రాలను వేసింది.
ఆమె వేసిన చిత్రాలన్నీ ఫ్రేమ్ కట్టించారు దొరవారు అవన్నీ గోడలకు వేలాడుతున్నాయి… ఒక్కొక్క చిత్రం ఆమె మనసును దర్పణం పట్టి చూపిస్తున్నాయి… అంత అందమైన చిత్రాలు ఆమె మానసిక రూపానికి నిదర్శనం.

అమెరికాలో ఉన్న కూతురు పదేపదే రమ్మని చెప్పడం వల్ల కూతురు మీద ఉన్న ప్రేమతో వెళ్లక తప్పలేదు దొరవారికి వీరు కానందువల్ల ఒక్కతే ప్రయాణానికి సిద్ధపడింది…

(ఇంకా ఉంది)

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మౌనలోకం

ఆచార్య దేవోభవః