ఈ రోజు తరుణి అభివృద్ధి ని ఓ విహంగ వీక్షణ చేద్దాం…..
సంపాదకీయం అంటే, ఓ నిర్దిష్టమైన అంశంపై సూటి గా అభిప్రాయం వచ్చేలా రాయడం, ఒక సమస్యను తీసుకుని విమర్శనాత్మకంగా క్లుప్తంగా రాయడం. అయితే ఈ జనవరి మూడవ వారం తరుణి సంపాదకీయం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నది. అదేంటంటే.. తరుణి పత్రిక కథనం, ఒక విజన్, ఒక అభిప్రాయ వ్యక్తీకరణ తో కేంద్రం గా! పత్రిక పెట్టడానికి కారణాలు పూర్వాపరాలు ఒక ఎడిటర్ గా వేసిన కొత్త అడుగులకు లభించిన ప్రేరణ, వస్తున్న ఆదరణ, చేస్తున్న నూతన ప్రయాణం ఇవన్నీ పంచుకోవాలన్న ప్రయత్నం.
ఆధునిక దృక్కోణంతో స్త్రీల సాధికారత కోసం women empowerment అనే కాన్సెప్ట్ తో తరుణి పత్రిక ప్రారంభం అయింది. స్త్రీల సమస్యల పట్ల,ప్రధానమైన సంతులనాల పట్ల, జీవితం పైన ఒక అవగాహన కోసం, బాధ్యతాయుతంగా సమరూపాన్ని అర్థం చేయించడం, స్త్రీవాదం లక్ష్య విశ్లేషణ చేయాలని ఉద్దేశంతోనే వస్తున్నది. అంటే బ్యాలెన్స్డ్ గా వెళ్లడం. Equalization కోసం మాట్లాడేటప్పుడు హక్కులను సాధించుకోవడం ఎంత అవసరమో బాధ్యతలను నెరవేర్చడం అంతే అవసరమనే దృక్పథంతో వెళ్లడం. సౌబోల్ న ఏక్ లిఖ్ నా అన్నారు పెద్దలు. చెప్పే విషయం పెద్ద విషయమే అయినా రాసేప్పుడు సూటిగా జాగ్రత్తగా చెప్పాలి.
విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటాయి కానీ , సమకాలీన పరిస్థితుల దృష్ట్యా సంప్రదాయాలను ఆచారాలను కొత్త తరహాలో చెప్పడం, ప్రాపంచిక విషయాలను ప్రాప్యత పద్ధతిలో , అంటే ఏవే విషయాలైతే గ్రహించ వచ్చో అవి ప్రదర్శించడం, వార్తా కథనాలను ఆధారం చేసుకుని రచయిత్రులు కవయిత్రులు వారి అభిప్రాయాలను జోడిస్తూ వ్రాస్తున్న విషయాలను సమాజానికి అందజేయడం. ఈ విషయాలన్నీ పాఠకులతో పంచుకోవడం…
దాదాపు మూడేళ్ల ప్రయాణం.”అంతా కొత్త! ఆలోచించి అడుగెయ్!!” అని చెప్పే నేను.. కొండపల్లి నీహారిణి …ఒక సదుద్దేశంతో 2021 లో “మయూఖ” అంతర్జాల సాహిత్య పత్రిక ప్రారంభించాను. ఈ అనుభవం మరికాస్త ఆలోచనలను ప్రేరేపించి స్త్రీల కొరకు ప్రత్యేకంగా మాస పత్రిక పెడితే బాగుంటుంది అనుకున్నాను. కానీ విస్తృతమైన పరిచయాలు కావాలి . నా పరిధిలో కొంతమంది కవయిత్రులు రచయిత్రులు తెలుసు. కానీ ఇంకా ఎక్కువమంది తెలియాలి!ఎలా ? అని ఆలోచించి తరుణి పత్రిక కొరకు వెబ్ సైట్ లో సైట్ కొని, డిజైన్ చేసి ప్రారంభించేటప్పుడు ప్రతిరోజు పెడుతున్నట్టుగా పంపిస్తేనే నాకు పరిచయాలు అవుతారు అని అనుకున్నాను. అందుకే దినపత్రిక అని ప్రారంభించాను. తర్వాత మార్చవచ్చులే అనుకున్నాను. ప్రతిరోజు ఒక్కటి రెండు మూడు నాలుగు అలా ఎన్ని ఆర్టికల్స్ వస్తే అన్ని ఆర్టికల్స్ పెడుతూ ప్రయాణిస్తున్నాను. ఈ క్రమంలో ఆర్టికల్స్ కి వస్తే ఎక్కువ రావడం మొదలయ్యాయి అప్పుడు ఆలోచించాను ప్రతిరోజు పెట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ పని చేసేది నేను కాదు నేను ఎడిటర్ గా ఆర్టికల్స్ బాధ్యత గా చూస్తాను అప్లోడ్ చేసేది నేను కాదు . ఈ టెక్నాలజీ రాదు. అందుకే ఒక ఉద్యోగిని ఈ పనికి నియమించాము. రోజూ అన్ని ఆర్టికల్స్ పెట్టడం వీలు కాలేదు అలా ప్రతిరోజు పెట్టడం కంటే వారం వారం పెడితే బాగుంటుంది అని అనుకున్నాను. నేను ఎక్కువ శాతం అమెరికాలో ఉండడం ఆదివారం నాడు పెడితే అక్కడ సోమవారం అవుతోంది అందు గురించి శని ఆదివారాలలో పెడితే భారతదేశంలో అమెరికాలో సమానంగా వస్తుంది అని అనుకున్నాను. అలా కొన్నాళ్ల తర్వాత శని ఆదివారాలలో తరుణి పత్రిక పెట్టడం ప్రారంభించాను. మరో విషయం పత్రిక మొదలు పెట్టినప్పుడు పత్రికలో అడ్వర్టైజ్మెంట్ రావాలా వద్దా అనే ఆప్షన్ ఉంటే, అడ్వర్టైజ్మెంట్స్ రావద్దు అనే ఆప్షన్ ను ఎన్నుకున్నాను. ఆసక్తి తో చదువుతుంటే ఏ ఇబ్బంది ఉండవద్దని, పాఠకుల భావాలకు అడ్డులేకుడా నీట్ గా ఉండాలి అని ఆ ఆప్షన్ ఒప్పకోలేదు.
ఈ క్రమంలో ఇంకాస్త మెరుగైన ఫీచర్స్ తో…క్యాలెండర్ పెట్టించడం, articles by category అని విషయ సూచికను ఏర్పరచడం, వ్యూస్ ఎన్ని వస్తున్నాయో కనిపించే లా చేయడం వంటి ప్రయోగాలతో సరికొత్తగా ముందుకు వచ్చింది తరుణి . క్యాలెండర్ క్లిక్ చేస్తే ఆర్కైవ్ స్ వస్తాయి. ఆడియో, ఇంటర్వ్యూ, కళాతరుణి, తరుణి బాలచిత్రం, చిత్ర కవిత,పాఠకుల అభిప్రాయం , ముఖచిత్రం, వీడియో, వ్యాపార, వైజ్ఞానికం, సంపాదకీయం, సామాజికం, సాహిత్యం అంటూ క్యాటగరైజ్ చేసాను. లింక్ క్లిక్ చేస్తే పత్రిక ఓపెన్ కాగానే రచయిత్రి పేరు మీద క్లిక్ చేస్తే ఆ రచయిత్రి వి గతంలో ప్రచురించిన అన్ని ఆర్టికల్స్ ఒకే చోట కనిపించేలా చేయించాం. కామెంట్ బాక్స్ పెట్టాము . ఇలా సవరణలతో వస్తున్నది ప్రస్తుతం. అయితే ఈ సంస్కరణల వలన దాదాపు ఒక సంవత్సరం ఆర్టికల్స్ అంటే ప్రారంభంలో ప్రతిరోజు పెట్టిన ఆర్టికల్స్ ప్రస్తుతం కనిపించడం లేదు ప్రయత్నాలు చేస్తున్నాను,అవి తీసి మళ్లీ పెట్టించడానికి. తప్పకుండా సాధిస్తానన్న నమ్మకం ఉన్నది. ప్రస్తుతం రెండేళ్ల క్రితం నుంచి ఉన్న ఆర్టికల్స్ అన్నీ పాఠకులకు లభిస్తాయి.
స్త్రీల కోసం ప్రముఖులను పరిచయం చేసే ఉద్దేశంతో “మన మహిళామణులు” శీర్షికతో అచ్యుతుని రాజ్యశ్రీ ధారావాహికంగా వ్రాస్తున్నారు. అందరికీ సాధారణంగా కనిపించే స్త్రీలలో ఉన్న ప్రతిభావంతురాలిని గమనించని వాళ్లకు ఈ శీర్షిక ఆలోచనలో పడవస్తుంది. అవునా మన ఇంట్లోనే , మన బంధువులలోనే , మన నైబర్స్ లోనే,ఇంత ఇంటిలిజెంట్స్ ఉన్నారా అనుకుంటారు తప్పక. . ఇవి త్వరలో ఇలాంటి ఫీచర్స్ పైన పుస్తక రూపంలో వెలువర్చాలన్న సంకల్పం ఉన్నది.
ధారవాహిక నవలలు వస్తున్నాయి. ఇప్పటికి రెండు నవలలు ప్రింట్ లో వచ్చాయి. ఎవరు చూడని జీవితాలు సూక్ష్మ దృష్టితో పట్టుకొని రచయితలు రాస్తుంటారు. మన జీవితాలకు ఆవలి జీవితాలు ఎలా ఉంటాయో చూపించే నవల జ్వలిత రచించిన “ఎర్ర రంగు బురద”నవల , కుటుంబాలలో కోపతాపాలు కష్టసుఖాలు వచ్చి పోయే రుతువు లాంటివి అని చెప్పే నవల మాలా కుమార్ రచించిన “నులివెచ్చని గ్రీష్మం” నవల. ఈ నవలలు పుస్తకాలుగా ప్రచురించారు. కట్టెకోల విద్యుల్లత రచించిన “సంకల్పం” నవల పూర్తయింది.ప్రస్తుతం లక్ష్మి మదన్ రచించిన “దొరసాని” నవల లో డబ్బు అధికారం గర్వం తన చాయలకు రాకుండా ఉండే ఎందరో వ్యక్తులు ఉంటారు వాళ్ళని సమాజం గుర్తించదు ఎవరైతే సరిగా ఉండరో వాళ్ళను గురించే పలుమార్లు అనుకుంటారు ఈ నవల ఉన్నత భావాలు గల ఒక వ్యక్తి గురించి చిత్రీకరణ . స్త్రీలకు స్వేచ్ఛ ఉంది స్వాతంత్ర్యం ఉంది మేము వెంకట వాళ్ళ లాగా చూడడం లేదు అని అంటూనే ఏర్పడకుండా చేసే హింసలు ఎలా ఉంటాయో కుటుంబ వ్యవస్థ విధానాన్ని ఆధారం చేసుకొని రచించిన నవల నీలంరాజు పద్మావతి “ఎడారి కొలను” నవల. పోడు వ్యవసాయం చేస్తూ సంచార జీవనాలు చేసే గిరిజనుల జీవిత చిత్రణ తో సాగిన రచన జ్వలిత “ఒడిపిళ్ళు” నవల. ఈ మూడు నవలలు ప్రస్తుతం సీరియల్స్ గా వస్తున్నాయి. ” దొరసాని” నవల పూర్తి కావస్తున్నది. వస్తు వైవిధ్యంతో నవలా రచనకు కావలసిన నడక , శైలీ సంపదతో ఉన్న నవలలు ఇవి.
అలాగే ‘కాలమ్స్’ కూడా తరుణి ప్రత్యేకత తో ఉన్నవే. సమాజం అంటేనే మంచి చెడుల కలయిక. సమాజంలోని సున్నితమైన విషయాలు ఎత్తిచూపుతూ “తరుణీయం”, అనే పేరుతో వేముగంటి శుక్తిమతి , మాధవ పెద్ది ఉష “ఉషోదయం” అనే పేరుతో కాలమ్స్ రాసారు.రెండు కాలమ్స్ సంవత్సరం పాటు వచ్చాయి. ఒక డాక్టర్ గా బోధనా రంగంలో విశేష అనుభవజ్ఞులైన మజ్జి భారతి “నేటి భారతీయమ్” బాలలకు ఉపయుక్తంగా, పెద్దలకు ఆలోచనలు రేకెత్తించేలా రాస్తున్నారు. కవయిత్రిగా రచయిత్రిగా రమాదేవి కులకర్ణి అందరికీ పరిచయమే. ” రమక్కతో ముచ్చట్లు” అంటూ రమాదేవి కులకర్ణి రాస్తున్న కాలమ్ కూడా కనిపించని తప్పులు కనిపించేలా చెబుతూ మాండలిక సొబగులతో హాస్యాన్ని అద్దుతూ వస్తున్నది. ప్రస్తుతం ఈ రెండు సామాజిక నేపథ్యంతో అభ్యుదయ భావాలతో రాస్తున్న ఈ కాలమ్స్ నేటి కాలానికి అవసరం. ఇవే కావు తరుణి పత్రికలో వస్తున్న ప్రతి రచనా ఈ కాలం లో పెడదారి పడుతున్న యువతను ఆలోచింపజేసి మంచి మార్గానికి పయనించేలా చేసే ఉద్దేశం తో వస్తున్నవే. పెద్ద తరం వాళ్లు ఈ తరం వాళ్లు పాత పద్ధతులతో జీవిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం మారాలి ..ఎలా మారాలి అని చెప్పే ఉద్దేశంతో రచయితలు అద్భుతంగా రాస్తున్నారు. గతంలో రాసారు. ఇక, వరిగొండ సురేఖ ” లాయర్ సలహాలు” , సుష్మ నెల్లుట్ల “లాయర్ సలహాలు” పేరుతో కాలం రాస్తున్నారు.
“ఆపాత మధురాలు” పేరుతో మాధవ పెద్ది ఉష గారు విశ్లేషించిన ఆడియో బాగా క్లిక్ అయింది. హిందీ సినిమా పాట పాడి తెలుగులో భావాన్ని చెప్పడం! హిందీ అర్థం కాని వాళ్లకు ఆ సినీ గీతాలలోని పాటల భావం తెలియడం వలన ఆనందిస్తారు . అద్భుతమైన హిందీ సాహిత్యం కూడా అర్థమయ్యేలా విశ్లేషించిన ఈ ఆడియో గొప్ప ప్రయోగం.
“తరుణి ముఖాముఖి” కూడా ప్రత్యేకమైనదే. స్త్రీలు కుటుంబాన్ని సవరిస్తూనే వాళ్లలోనే నైపుణ్యాలను వెలికి తీసుకుంటూ అటు వృత్తికి ఎటు ప్రవృత్తికి ఎట్లా చక్కగా న్యాయం చేస్తారో సభ్యసమాజం గమనించాలి. ఈ ఉద్దేశంతోనే వివిధ రంగాలలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్న స్త్రీల పరిచయము భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని వస్తున్నవే ఇంటర్వ్యూలు . రచయిత్రి,సీనియర్ జర్నలిస్ట్ వంగ యశోద ఇంటర్వ్యూలను చాలా ఉపయోగకరమైనవి.
ట్రావెలాగ్ కూడా తరుణి పత్రికకు మరో ఆకర్షణ. విజయా రంగనాథ్ లండన్ యాత్రా కథనం రాస్తున్నారు.
పత్రిక ప్రారంభించిన సమయంలో సంపాదకీయం బదులు ఒక చిత్రానికి కవిత రాయడం బాగుంటుందనుకున్నాను. అమ్మాయిలు వేసిన చిత్రాలు అవి. తగిన విధంగా కవిత్వం. కానీ కొంతకాలం తర్వాత ఎప్పుడైతే టెక్నికల్ గా మార్పులను తీసుకువచ్చామో అప్పుడే… సంపాదకీయం రాస్తేనే బాగుంటుంది అనుకొని అప్పటినుంచి స్త్రీల కొరకే కాదు, సమాజానికి అవసరమయ్యే ఆలోచనను రేకెత్తించేలా ఈ సంపాదకీయాలు రాస్తున్నాను.
ఇక సినీ గీతాలను విశ్లేషణ చేస్తూ చక్కని వ్యాసాలను రాస్తున్న పద్మశ్రీ చెన్నోజ్వల కవిత్వం కూడా చిక్కనైన కవిత్వం. ప్రపంచ వేదిక మీద ప్రముఖులైన స్త్రీలను పరిచయం చేస్తూ, కవిత్వాన్ని రాస్తూ రాధికా సూరి తరణి రచనలలో భాగస్వామిగా ఉన్నారు. ఆలోచనత్మకమైన కవితలనూ కథలను రాస్తున్న నెల్లుట్ల రమాదేవి, అరుణా ధూళిపాళ, లక్ష్మీ మదన్, రంగరాజు పద్మజ,దేవులపల్లి విజయలక్ష్మి, కందేపి రాణి ప్రసాద్, మాలా కుమార్, జ్యోతిర్మయి రామకృష్ణ పాముల, రాపోలు శ్రీదేవి, అరుణ పరంధాములు, నన్నపురాజు విజయశ్రీ, శ్రీ భాష్యం అనురాధ వంటి రచయిత్రులు పండగలు ముఖ్య విషయాలు ఎన్నో రాస్తూ ఉండగా, పార్వతీ మోహన్,KV.V. N లక్ష్మి, విజయ గోలి, R. రమాదేవి, లక్కరాజు నిర్మల, జ్యోతి, మాధవ పెద్ది నాగలక్ష్మి,Dr. మృదుల, చంద్రకళ దీకొండ, నెల్లుట్ల మాధవి శ్రీనివాస్, S. మంజుల, బండి ఉష, Y. అరుంధతి, నిర్మల భాగవతుల, డాక్టర్ నీలిమ స్వాతి, గిరిజ పైడిమర్రి, జ్యోతి వలబోజు, శ్రీరేఖ బాలరాజు, K. గీత , రాధిక మంగి పూడి, పద్మా త్రిపురారి, శ్రీ శేష కళ్యాణి గుండమరాజు భారతీయ ఋషి పరంపర, మహాభారతంలో గుర్తింపుకు రాని పాత్రలు. వంటి విషయాలను రాస్తున్న నెల్లుట్ల ఉమా , పద్మా త్రిపురారి, చీదెళ్ళ సీతాలక్ష్మి, మాధవి శ్రీనివాస్, విజయ కందాళ, వాడ్రేవు కామేశ్వరి, రమాదేవి,A. అరుణ, ,దేవులపల్లి పద్మజ వంటి రచయిత్రులు సందర్భోచిత వ్యాసాలను రాస్తున్నారు.
కథలు చదివే పాఠకులు ఎక్కువ ఉంటారు. లక్ష్మీ మదన్ ,ఈరంకి ప్రమీల, కట్టెకోల విద్యుల్లత, కె. తేజస్వని, ఉషా మాధవ పెద్ది, లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ , నీలం రాజు పద్మలత, తేజస్వని , వేముగంటి శుక్తిమతి, విజయ రంగనాథ్, మజ్జి భారతి, అరుణా ధూళిపాళ, తాటికోల పద్మావతి, నెల్లుట్ల రమాదేవి రచయితలు కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు ప్రస్తావించిన చాలామంది రచయిత్రులు వ్యాసాలతో పాటు కథలు రాశారు కవయిత్రులు కవిత్వంతో పాటు కథలు రాశారు.
సాహిత్య వ్యాసాలు చాలా ప్రత్యేకమైనవి వస్తున్నాయి. ప్రొఫెసర్ అండమ్మ , తిరునగరి దేవకీదేవి, రంగరాజు పద్మజ,Dr. Y. సుభాషిణి, అన్నమదాసు జ్యోతి, వాసర చెట్ల జయంతి, బండ సరోజన వంటి రచయితలు ప్రామాణికమైన వ్యాసాలను రాస్తున్నారు . పైన చెప్పిన ఇతర రచయిత్రులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్య వ్యాసాలను రాశారు. అవి వాళ్ళ పేరుపైన క్లిక్ చేస్తే కథలు కవిత్వము వ్యాసాలు అన్నీ ఒకే దగ్గర వస్తాయి.
పుస్తక సమీక్షలు కూడా సాహిత్యంలోకే వచ్చే వ్యాసాలు. సమత, కొండెపూడి అనురాధ, పద్మశ్రీ చెన్నోజ్వల, రాధిక సూరి, కట్టెకుల విద్యుల్లత ఈ సమీక్షల విషయము అంతే.
కవిత్వం ఎప్పుడు కొత్త ఉత్తేజాన్నిస్తుంది. చక్కని చిక్కనైన కవిత్వం ఆలోచనత్మకమైన కవిత్వం రాస్తున్న కవయిత్రులలో నెల్లుట్ల రమాదేవి, అరుణ ధోళిపాళ, రాధిక సూరి, పద్మశ్రీ చెన్నోజ్వల, దేవనపల్లి వీణా వాణి, వై సుజాత ప్రసాద్, గడ్డం సులోచన, జ్యోతి పాముల వంటి కవయిత్రులు తరుణికి ఉన్నారు.నల్లాన్ చక్రవర్తుల రోజా వంటి మరి కొందరు
కవయిత్రులు పద్య కవిత్వం తరుణి లో చూడవచ్చు.ఇక…
కవిత్వం లో కొత్త గొంతుకలు వస్తున్నాయి. కొత్త తరహాలో కొత్త ఆలోచనలతో కవిత్వం రాస్తున్న యువ కవయిత్రులు కె. భానూజ, సుష్మ శ్రీనివాస్, k. అనూష, బండి ప్రత్యూష, జుర్కి లావణ్య, మాధురి, విశాల వంటి నవతరం కవయిత్రులు తరుణి కి పరిచయ్యారు.
కళాతరుణిలో రూపా దేవి, R.భాగ్య లక్ష్మి, స్నేహ ప్రియ,బృహతి, రావుల మీనాక్షి, యద్దనపూడి దుర్గా కళావర్ధిని, కె.కె. తాయారు , అనూష మాధవి జోస్యుల, దార ప్రతీక, N. ఉమ, శాన్వి, కేయూర కొండపల్లి, మయూర కొండపల్లి, యశస్విని, లీలాశ్రిత, ఉషా పాల్కివాల, యశస్విని, సి. భవ్య, సీతాకుమారి ఆత్మకూరి, గండేపల్లి సుమలత, రాపోలు శ్రీదేవి హ్యాండ్ మేడ్ టాయ్స్ చిత్రాలు కూడా ఇలా ఇంతమంది చిత్రకారిణుల చిత్రాలు, కళా నిర్మితులు ప్రచురించాం. ఇవన్నీ సృజనాత్మకతకు సంబంధించినవి. సమయము ఉండాలి ప్రోత్సాహము లభించాలి. స్త్రీలకు కొంచెం కష్టమైన పనే. ప్రారంభంలో చాలా వచ్చాయి ,అవన్నీ ఇప్పుడు కొత్తగా తరుణిలోకి చేరాలి. ప్రయత్నం చేస్తున్నాను.
గాత్రకళ లో సంగీత విద్వాంసురాలైన ఆచంట హైమవతి గారు అన్నమయ్య కీర్తనలను పాడిన ఆడియోలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే అద్భుతంగా ఉన్నాయి. ఇక దోర్భల బాల సుజాత గారి మృదు మధురమైన గానామృతం ఉన్న ఆడియోలు ఉన్నాయి . వీరు లలిత సంగీతం పాటలు పాడారు , బాల సరస్వతి గారు పాడిన పాటను పాడారు, ఏరువ ఇందిరా రెడ్డి రచించిన పాటను పాడారు. చకిలం మాధవి, బీరం భాగ్యలక్ష్మి, కూర విశాల వంటి గాయని మండలం పాడిన పాటలతో పాటు విజయ కందాళ గారు ఆడియోలలో ” తరుణీ తరుణం” అనే శీర్షికతో ఎన్నో విశేషాలను వినిపించినవీ ఉన్నాయి. మన పండుగల ప్రాశస్త్యాలను ఆడియోలో వినిపిస్తున్నారు, అలాగే రాస్తున్నారు కూడా భేరి సునీత రామ్మోహన్ రెడ్డి.
కార్టూనిస్టు సువర్ణ భార్గవి ఆలోచనత్మకమైన కార్టూన్స్ వచ్చాయి.
భవ్య ధూళిపాళ, లక్ష్మీ మదన్, వై సుజాత ప్రసాద్ ,రాపోలు శ్రీదేవి వంటి వంటింటి కళలను రచించారు. కూరలు, వివిధ రకాల వంటకాలు చేసే విధానాన్ని ఫోటోలతో సహా ప్రచురించాం.
ఇలా తరుణి సాహిత్య సామాజిక సాంఘిక విలువలకు కట్టుబడి పచ్చగా పయనిస్తూనే ఉంది. అభ్యుదయ భావాలను ప్రోదిచేస్తూ ,ఆచరణీయ విషయాలను చెప్పే రచనలతో ముందుకు సాగుతున్నది. వెయ్యి అడుగులకైనా మొదట్లో ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. అంత పెద్ద కొండను ఎక్కాలంటే కొండ మొదట్లో మొదటి అడుగుతోనే మొదలుపెడతాం. స్త్రీల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించి ధైర్యాన్ని అందించగలిగే రచనలు, జీవితం అందమైనది అందిపుచ్చుకోవాలని చెప్పే రచనలను తరుణి ఆశిస్తున్నది. ప్రపంచీకరణ ప్రభావం చెప్పు చేసే వింత పోకడలూ, ఆధునిక సాంకేతిక విధ్వంసాలు, సమాజ దాష్టీకాలు అన్నింటినీ తట్టుకొని స్త్రీ లు నిలబడగలగాలి. తనదైన అస్తిత్వాన్ని ప్రకటించుకునే స్ఫూర్తిని నింపే రచనలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే మా ధ్యేయాన్ని చేరుకోవాలని ఆశిస్తున్న పయనం ఇది. ఇది మన అందరి తరుణుల తరుణి పత్రిక పయనం.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక ఎడిటర్