జాతరలు జనజీవన ప్రతీకలు- డాక్టర్ మాడ పుష్పలత 

ప్రజలను మమేకం చేసే అనేక అంశాలలో జాతరలు ముఖ్యమైనవి. అలాంటి జనజీవన ప్రతీకలైన జాతరలపై పరిశోధనలు చేసే వారు చాలా అరుదుగా ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా జాతరలు – ప్రదర్శన కళలు అనే అంశాన్ని పిహెచ్ డి పరిశోధన అంశంగా తీసుకుని కనుమరుగైతున్న సంస్కృతి సంప్రదాయాలను రేపటి తరానికి చాటే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, తెలుగు భాషోపద్యాయిని, గురు బ్రహ్మతో పాటు పలు అవార్డులు, పురస్కారాల గ్రహీత, పలు గ్రంథకర్త, సామాజిక సేవకురాలు డాక్టర్ మాడ పుష్పలత. ఆమె గురించి ఈ వారం తరుణిలో…

డాక్టర్ మాడ పుష్పలత 

పుష్పలత గారు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, కోయిలకొండ మండలం, గార్లపహాడ్ గ్రామ వాస్తవ్యులైన పటేల్ మాడ రాములు – లక్ష్మీదేవి దంపతుల ఏకైక సంతానంగా జన్మించారు.. తండ్రి విశ్రాంత హెడ్ మాస్టారు, తల్లి గృహిణి. ఆమె విధ్యాభ్యాసమంతా మహబూబ్ నగర్ లోనే గడిచింది.. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో , ఇంటర్మీడియట్ B.P.C. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, డిగ్రీ H.P.P. M.V.S ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదివారు.. ఆ తరువాత P.G.M.A. తెలుగు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో పూర్తి చేశారు.   మహబూబ్ నగర్ లోని శారద ఓరియంటల్ కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పొందారు.  ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో పోలేపల్లి ఎల్లమ్మ జాతర – ఒక పరిశీలన అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు నుండి ఎం.పిల్, పట్టా తో పాటు బంగారు పతకం అందుకున్నారు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండే ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో మహబూబ్ నగర్ జిల్లా జాతరలు – ప్రదర్శన కళలు అనే పై పరిశోధన చేసి పీ.హెచ్.డీ. పట్టా పొందారు.   చిన్నప్పుడు మా నాన్నగారు మా కుటుంబంతో కలిసి మన్యంకొండ జాతర, కురుమూర్తి జాతర, గంగాపురం జాతర, పోలేపల్లి ఎల్లమ్మ జాతర సిడి మాను చూసి చాలా ఆశ్చర్య పోయేదాన్ని పెద్దయ్యాక కూడా నాకు జాతరల పట్ల చాలా ఆసక్తి పరిశోధన చేయాలనే ఆకాంక్ష ఉండేది. జాతర్లలో ప్రదర్శించే కళలు చూసి ఆనందపడేదాన్ని అవన్నీ తర్వాతే తరానికి అందాలని నాకు పరిశోధన చేసి ముందు తరాలకు అందు ఇవ్వాలని పుస్తకం కూడా అచ్చు వేయించాను అంటారు పుష్పలత గారు.


2002లో మొదటగా భూత్పూర్ మండలం, కప్పేట గ్రామంలో తెలుగు భాషోపాద్యాయినిగా  ఉద్యోగంలో చేరారు పుష్పలత గారు. తర్వాత యుపిఎస్ షాపు గుట్ట పాఠశాలలో కొన్ని ఏండ్లు పనిచేశారు. ఆ నుంచి బదిలీపై న్యూటన్ హై స్కూల్ ఉర్దూ మీడియం లో తెలుగు పండితులుగా,  ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని   ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేశారు.  ప్రస్తుతము జడ్.పి.హెచ్.ఎస్, కొల్లూరు నవాబుపేట మండలం, మహబూబ్నగర్ జిల్లాలో తెలుగు ఉపాధ్యాయినిగా విద్యార్థులకు మాతృభాషను బోధిస్తున్నారు.
పుష్పలత గారికి విభిన్న అంశాలపై కవితలు వ్రాయడం, పద్యాలు, భక్తి పాటలు వ్రాయడం ఇష్టం.. సమయం కుదిరినప్పుడు మంచి సంగీతము వినడం, జానపదాలు పాడడం ఇష్టం.. స్నేహితులతో సరదాగా టూర్స్ వెళ్ళడం, వారితో కాలక్షేపం చేయడమంటే చాలా ఇష్టం.. యోగ చేయడమే కాకుండా, యోగ శిక్షణ కూడా ఇస్తుంటారు.. సామాజిక సేవకురాలిగా ఎంతోమందికి విద్యార్థులకు పుస్తకాలు నోట్ బుక్కులు పెన్నులు పెన్సిల్ రైటింగ్ ప్యాడ్స్ ఇస్తూ సేవలందిస్తున్నారు. అలాగే బీదల పెళ్లిళ్లకు 11 మందికి మంగళసూత్రాలు, మెట్టెలు అందించి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఎన్నో గుడుల నిర్మాణానికి తోచినంత సహాయాన్ని అందించారు.

 పుష్పలత గారి తండ్రి జానపద పాటలు, పద్యాలు వ్రాసేవారు, చిన్నప్పటి నుండి తండ్రి పాటలు, పద్యాలు విని తెలుగు భాషపై, తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు..  తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో స్ఫూర్తి పొందిన పుష్పలత మొదటగా చిన్న చిన్న కవితలు  వ్రాయడం మొదలుపెట్టి, కాలక్రమేణా కవితలతో పాటు కథలు, పాటలు, లేఖలు, వ్యాసాలు, పద్యాలు రాశారు.

పుష్పలత గారి రచనలు
– పోలేపల్లి ఎల్లమ్మ జాతర – ఒక పరిశీలన (ఎం.పిల్. పరిశోధనా గ్రంథం)
– మహబూబ్ నగర్ జిల్లా జాతరలు – ప్రదర్శన కళలు (పి.హెచ్.డీ పరిశోధనా గ్రంథం)
– పెళ్ళి ముచ్చట్లు
– పెళ్ళి పాటలు
– జోల పాటలు
ఇవి కాకుండా పుష్పలత గారు వ్రాసిన ఎన్నో కథలు వివిధ సంకలనాలలో, పత్రికలలో ప్రచురితమయ్యాయి..

అందుకున్న పురస్కారాలు.. రచయితగా, ఉపాధ్యాయురాలిగా  రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు.  స్త్రీ శక్తి పురస్కారం, ఉగాది పురస్కారం, గురు బ్రహ్మ పురస్కారం, ఉత్తమ కవయిత్రి పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం, ఉత్తమ రచయిత్రి పురస్కారం, గురు దేవో భవ పురస్కారం.  జానపద సాహిత్య కృషికి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి గోల్డ్ మెడల్ , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు. ఇవి కాకుండా వివిధ సాహితీ సంస్థల నుండి పలు పురస్కారాలు సన్మాన సత్కారాలు అందుకున్నారు.

పుష్పలత గారు వ్రాసిన పెళ్ళి పాటలు, పెళ్ళి ముచ్చట్లు, జోల పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.. ప్రస్తుతం అహోబిల దీక్షిత మహోపాద్యాయ మరియు గిరిధర మహోపాద్యాయ లు రచించిన తాళపత్ర గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నారు.. త్వరలో దానిని పుస్తకరూపంలో తీసుకువచ్చే ప్రయత్నంలో వున్నారు..

పుష్పలత గారికి పల్లెలు తెలుసు, పల్లె ముచ్చట్లు,  పల్లె పదాలు, పల్లె పాటలు, పిల్లలను నిద్రపుచ్చే జోల పాటలు, పల్లెల్లో జరిగే జాతరలు బాగా తెలుసు.. జానపదాలు విజ్ఞాన పథాలని, జాతి జీవనరీతికి నిలయాలని నమ్ముతుంది కాబట్టే పల్లె గురించి జానపద పాటలలో, కవితలలో తన బాణి వినిపించి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు పొందారు..
కుటుంబ నేపథ్యం..
పుష్పలత గారికి మహబూబ్ నగర్ జిల్లా, మూసాపేట వాస్తవ్యులు మరియు ఇరిగేషన్ శాఖలో Dy. E.Eగా పనిచేసిన శ్రీ S.R. కిశోర్ గారితో 1983, మే 14న వివాహం జరిగింది.. కిషోర్ గారు 39 సంవత్సరాలు పనిచేసి 2017 లో పదవీ విరమణ పొందారు.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు..

పెద్ద కుమారుడు S.K. సందీప్, M.S., ఆయన భార్య కూడా అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్లు గా పనిచేస్తున్నారు, వారికి ఇద్దరు కూతుళ్లు పేర్లు సహన, సహస్ర..

చిన్న కుమారుడు S.K. దిలీప్ BDS, MDS, ఆయన భార్య గాయత్రి BDS, MDS. వీరిద్దరు కూడా మహబూబ్ నగర్ లో గాయత్రి డెంటల్ హాస్పిటల్ నడిపిస్తున్నారు, వీరికి ఇద్దరు కుమారులు పేర్లు దైవిక్, ధృవిక్..

డాక్టర్ మాడ పుష్పలత గారు వృత్తి రీత్యా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్యంపై మరిన్ని రచనలు చేసి పుస్తకాలుగా వెలువరించాలని ఆశిద్దాం

వంగ యశోద

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*మా అత్తమ్మ(అత్త+అమ్మ)*…అందరికి అమ్మే…….

రైతు సాము