
గోరింట
ఓ మోస్తరు నెచ్చెలి..
సన్న సన్నని
ముళ్ళకొమ్మలు..
చిన్న చిన్న పచ్చలాకులు..
గుత్తులు గుత్తులుగా
ముత్యాల పూలు..
సౌందర్య రాశి
సుగుణాల వాసి
కృష్ణశాస్త్రి హృదయంలోంచి ఉప్పొంగిన అరుణారుణ భావాల ఝరి
వానలను
హరితహస్తాలతో
గోముగా పిలిచే
ఆషాడ శ్రావణాలు
ఒళ్లంతా చిన్న చిన్న కళ్ళతో గట్ల పైన పిల్ల దారుల పక్కన గున్నలుగున్నలుగా
ఒదిగి చూస్తుంటాయి.
పిల్లలను పెద్దలను
సూదంటు రాయిలా ఆకర్షిస్తూ,
మగువల మనసు దోచుకుంటాయి
చర్మ వ్యాధులకు ధన్వంతరి..
చల్లదనానికి హిమగిరి..
చూలింతకు
బాలింతకు ప్రశాంతి
నిచ్చే
మందు గోలీలు ఈ మైదాకు మాత్రలు
గోరింట పండుగ
దినాల్లో..
ఆకులతో ముచ్చట్లు
కలిపి రుప్పిన ముద్దను
అరచేతులు ప్రేమగా హత్తుకునే రాత్రి..
ఆ రాత్రినీ అందంగా
రంగరించిన అద్భుత
జ్ఞాపకం..
పుట్టింటికి వచ్చే
అమ్మవారు..
ఆడబిడ్డల సంబరాలు
గోరింట వాయినాలు
ఆచారాల ఆనందాలు
అరచేతిలో పూసిన మందారాలు
ఇప్పుడు నాకనిపిస్తుంది
లోకమంతా
మమతల
గోరింటలతో..
మందార మనసులై పూస్తే ఎంత బాగుండు!