అంబర రత్నం సూర్యుడు తన కిరణాలతో తూర్పు తలుపు తెరచి ఇలా వస్తాడో లేదో ప్రకృతి కొత్తగా పులకరిస్తుంది. చీకట్లు పారిపోయి కొత్త వెలుగులు వస్తాయి. ప్రతిరోజు అంతే.ఈ పొద్దుపొడుపుతో మనుషులకు,జంతువులకు, పశుపక్ష్యాదుల కూ కొత్త రోజు ప్రారంభం అవుతుంది.
పక్షుల కిలకిల రావాలు ప్రభాతానికి సంతోషించి స్పందనలు తెలియజేస్తున్నట్టుగా ఉంటాయి.సమస్త జంతు జాలమూ సూర్యోదయంతో కొత్త ఉత్సాహంతో దినచర్యను ప్రారంభిస్తాయి. ఇక మనిషి? సమస్త ప్రాణికోటిలో బుద్ధి జీవి కదా మనిషి! అటువంటి బుద్ధి జీవి తనకోసం లభించిన ఆ రోజు ను మరొక కొత్త ఉదయం గా భావించుకుంటూ నూతన ఉత్సాహం తో ఉండాలి.
ప్రతి నిత్యం చేసే పనులకు భిన్నంగా,నిత్యం ఆలోచించే ఆలోచనలకు భిన్నంగా ఏదో …మరేదో ….ఇంకా ఏదో ….మంచి పని చేయాలి అనే ఆలోచనతో ఆ రోజును ప్రారంభించాలి. దాన్నే కొత్త రోజుగా భావిస్తాం.
బ్రతకడం కొరకు తినడం,తినడం కొరకు బ్రతకడం ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించుకొని బ్రతుకును సార్ధకం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సాయపడేలా సమాజానికి మేలు జరిగేలా .
కనీసం నీదైన కుటుంబానికి మంచి జరిగేలా ఉన్నతమైన భావజాలంతో జీవించాలి.
ప్రతిరోజు resolution , రెజల్యూషన్ తీసుకోమని ఎవరూ చెప్పరు.అంటే నిర్ణయం ! జీవితమే ఆశ్చర్యపోయేంతటి నిర్ణయం తీసుకోవాలి అని కాదు.
సామాజికపరంగా గొప్ప కార్యక్రమాలు చేయలేకున్నా కుటుంబ పరంగా నైనా మంచి కార్యక్రమాలు చేసే ఉద్దేశం… ఏదో ఒకటి అనుకోవడం తో కొత్త ఉదయం ప్రారంభమైంది అనుకోవచ్చు.
కుటుంబంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి! ఏ సవాళ్లు ఉండవు కొందరికి!!అయితే నిత్యజీవితంలో మాత్రం కొన్ని పట్టింపులు ఉంటాయి అందరికీ !!!
రోజు చేసే పని కన్నా భిన్నంగా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తప్పకుండా ఏదో ఒక ‘క్లూ’దొరుకుతుంది. ఆడవాళ్ళు అయితే భర్త చేస్తున్నటువంటి పనులలో ఎంతవరకు జోక్యం చేసుకొని అడిగితే బాగుంటుంది సహాయం చేస్తే బాగుంటుంది అనేది కాస్త మనసుపెట్టి శ్రద్ధ వహిస్తే మనసుకు తడుతుంది ఆ చిన్ని చిన్ని సహాయాలే అతని మనసును ఆనంద పరవశం చేయించి మరింత స్నేహభావం పెంపొందింప చేస్తుంది. అట్లాగే పురుషులే అయితే, భార్య చేస్తున్నటువంటి పనులలో తన సహాయం ఇంతవరకు చేయగలను అని అనుకొని అవి అందిస్తూ ఆ రోజు ను ప్రారంభించాలి. ఒకరికొకరు తోడు నీడగా కష్టసుఖాలను పాలుపంచుకుంటూ ఉంటే వాళ్ల జీవితం తప్పకుండ నందనవనమవుతుంది. భార్యకు శరీరంలో కలిగే మార్పుల వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా తల ఎత్తుతున్నాయా గమనించుకొని ఆమె కన్నా ముందే ఆమె సమస్యను తెలుసుకుని సాయపడడమో, తగిన సలహాలు తగు రీతి ఇవ్వడమో చేయాలి.
జీవిత భాగస్వామికి తన వంతుగా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం కన్నా కొత్త అడుగు ఇంకేముంటుంది! ఈ అసలు ఈ విషయాలు పక్కన పెట్టి, అర్థం పర్థం లేకుండా ప్రతి పనిలో తప్పులను వెదకాకుండా ఉంటే చాలు ! ఇదినైతికంగా గొప్ప స్థైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు .ఇదే కుటుంబ ప్రేమలు విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. మనసులో ఆలోచనలు మంచివి రాగానే సరిపోదు నోట్లో నుండి మాటలు కూడా ఆ ఆలోచనకు రూపం ఇచ్చేలాగా మాట్లాడేవాళ్ళ భాష కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడే భార్య మాటలు భర్త అర్థం చేసుకుంటాడు భర్త మాటలు భార్య అర్థం చేసుకుంటుంది. పొరపొచ్చాలు ఉన్నా తొలగిపోతాయి.
అన్ని బాగానే ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి. ఆర్థికంగా వెనుకబడి ఉన్నా తట్టుకోవచ్చు గాని ఆరోగ్యంగా వెనుకబడి ఉంటే తట్టుకోవడం కష్టం. మొగుడు పెళ్ళాల ఇద్దరిలో ఎవరికైనా!
ప్రతికూల పరిస్థితులలోనే కదా సంయమనం పాటించాల్సింది. మరి కొందరికి అయితే దీర్ఘకాలిక వ్యాధులు బాధ పెడుతూ ఉంటాయి. థైరాయిడ్ బిపి షుగర్ వంటివి పెద్ద జబ్బులు కాకున్నా అనారోగ్య సమస్య సృష్టించేవి. వీటినుండి కాస్త ఉపశమనం కలిగించే లా మాటలుంటేచాలు!! వీటికి తోడు పిల్లలు లేకున్నా బాధనే, ఉన్నా కష్టమే! బాధ నుంచి బయటపడడం కంటే కష్టం నుంచి బయటపడడం సులభం .ఈ కష్టాన్ని అధిగమించడం అంటే పిల్లల పెంపకంలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి భార్యాభర్తలు ఇద్దరు చక్కని ప్లాన్ తో నడిస్తే ఏ కష్టాలు ఉండవు. కుటుంబ పాలన విషయంలో కుట్రలు ఉండవు ! కేవలం చిరాకులు కోపతాపాలు ఈసడింపులు ఇలాంటివి మాత్రమే ఉంటాయి అందుకోసం కుట్రలు లేనటువంటి బ్రతుకు కాబట్టి దాటేసుకుంటూ, మానేసుకుంటూ తేలిక చేసుకుని బ్రహ్మాండంగా జీవించవచ్చు.
ఉదయం ఎర్రటి కాంతితో ఆకాశం తూర్పు వైపున కొత్త అందాలను సంతరించుకుంటుంది,మరి కాసేపట్లో సూర్య బింబం కనిపిస్తుందన్నప్పుడు ఆకాశం మరీ అందాలు చిందిస్తుంది. దీన్ని అరుణోదయం అంటాం. బంగారు వర్ణం తో సూర్యుడు మహోజ్వలంగా ఉంటాడు… ఇంత చక్కని సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఆరోజును ప్రారంభించామంటే ఇంక అంతా సంతోషమే! ఇదే కొత్త రోజు!! Welcome to a new day !!
_***__