విశ్వ సాగరంలో అణువులా నేను..
అంటీ అంటనట్లు,
విడిపోతూ కలిసినట్లు,
నిరంతర భౌతిక జీవన తపనల్లో..
ఎదుగుతున్న ఆశల మొలకనై
పల్లవిస్తూనే ఉంటాను ఎప్పుడూ…
కాలానికీ, నాకూ
జన్మ జన్మల బంధమేదో పెనవేసినట్లు..
తప్పని సమాంతర పరుగులు
తనదే గెలుపెప్పుడూ
కానీ …ఆగిపోను నేనెన్నడూ
కళ్లెం లేని గుఱ్ఱమై తానూ,
పట్టుకోవాలని నేనూ..
ఎక్కడిదాకో తెలియదు
ఎంత దూరమో ప్రమాణం లేదు
అయినా…
కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాం
అలవోకగా దాటిస్తుంది
ఏ భావాల తీరాన్నైనా,
అన్నింటినీ గతంలోకి ఒంపుతుంది.
మురిపిస్తుంది, మరపిస్తుంది,
ఆశల సౌధంలో నిలబెడుతుంది,
అగాధంలోకి లాక్కెళుతుంది,
అంతరంగంలో మమేకమై
మత్తులో ముంచేస్తుంది
అందుకే….
తనతో పాటే నేను
నా నీడగా తాను
కలవని దారులైనా వీడని బంధమే
కాలపరిణామంలో కరిగిపోతూ
చివరిదాకా……….