లేఖనాశిలకు ఊపిరిపోయాలని జ్ఞాపకాల సంగతులను రాశిపోసి
అనుభూతి పరిమళాలద్ది అహరహం తపిస్తూ
ఊహలబొమ్మకు రంగులహంగులు
కలబోయాలనే అభిమతం వారిది
అక్షరాల ఉలిచేతబట్టి
స్వాతిముత్యాల్లాంటి
ఏరికోరిన వర్ణాలతో
కవనాంగనకు జీవకళను
ఇవ్వాలనే ఆరాటం వారిది
పొసగని భావసారూప్యంతో కుదరని కవితాశిల్పాన్నిచూస్తూ
అసంతృప్తిలో మునిగిపోయి విషయ రంధ్రాణ్వేషణలో
చూపుల వలలో చిక్కిన
అక్షరాలను ఒడిసిపట్టి అందమైనరూపాన్నిచ్చేదాకా
తీరని దాహార్తి వారిది
అక్షర రూపసిని ఒళ్ళో
పసిపాపలా పొదివిపట్టి సంభ్రమాశ్చర్యాల మధ్య తాదాత్మ్యం పొందే
నిత్యభావుకత్వం వారిది