కళల కాణాచి ఓరుగల్లు

కలికి తురాయి కాళోజీ కళా క్షేత్రం

తెలుగు భాషా ఆహ్వాన నాటకపోటీలు-
23, 24, 25, 26 ఫిబ్రవరి-2025 ( ఆది, సోమ, మంగళ, బుధ వారములు) సాయంత్రం 6-30 ని.లకు కాళోజీ కళా క్షేత్రం, బాలసముద్రం హనుమకొండలో వ్యాఖ్యాతగా వనం లక్ష్మీకాంతారావుగారు తమదైన శైలిలో చక్కని వాక్ప్రవాహంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
23-02-2025 ఆదివారం సాయంత్రం 6-30 తెలుగు భాషా ఆహ్వాన నాటకపోటీల సమారోహణ సభ గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి ( శాసన సభ్యులు) గౌరవనీయులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి( కుడా చైర్మన్, వరంగల్) మొదలైన ఎందరో ప్రముఖుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైనది.
శ్రీ కుందావఝుల వారి సుశ్రావ్యమైన ప్రార్ధనా గీతంతో మొదలై, సదస్యుల సందేశాలతో కొనసాగుతూ, సహృదయ వారిని, వారు చేస్తూన్న సేవలను పరిచయం చేసుకుని, శాటీలతో సత్కరించుకొని, సందర్భం తెలిపే జ్ఞాపికలందచేయడంతో ప్రారంభ సమావేశం తాత్కాలికంగా ముగిసింది.
విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటికి ప్రదర్శన మొదలైంది.
మూలకథ : PS నారాయణ,
నాటకీకరణ : పరమాత్ముని శివరాం.
దర్శకత్వం : B M రెడ్డి గారి సహకారంతో నాటిక ప్రదర్శించారు.

స్వేచ్ఛ- నాటికలో
అవినాష్- శ్వేత
మహి-తల్లి
తండ్రి పాత్ర- మూర్తి
అన్న పాత్ర నటన బాగుంది.
తల్లి పాత్రచివరలో బాగుంది.

నాటిక ముగిసిన వెంటనే
మల్లెల రాజేశ్వర శర్మ- సత్యవతిగారి సృతిలో
శ్రీమతి మల్లెల రవీంద్ర శర్మ- ప్రసూనాంబగారు పారితోషికం దర్శక-రచయితలకు సమర్పించారు.
ప్రతీ నాటకానికి రచయితకు 500/రూ.ల పారితోషికం మాన్యులు పురుషోత్తమరావుగారు అందివ్వడం రచయిత్రిగా నాకు ఆ ప్రోత్సాహం ఎంతో నచ్చింది.

ఉక్కు సంకెళ్ళు – 2 వ ప్రదర్శన!
రచన – సింహ ప్రసాద్ గారు,
దర్శకులు- ఉప్పలూరు సుబ్బరాయ శర్మ ( ప్రసిద్ధ రంగస్థల- బుల్లితెర నటులు, రచయిత….
ఇదివరలో చూసిన సుబ్బ రాయశర్మ గారి ఇతర నాటికలవలె నాకు గొప్పగా అనిపించలేదు కారణం ఏమిటంటే?…..
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత ఈ నాటిక ప్రదర్శించడంలో సమకాలీన సమస్య కాకపోవడమేమో? అంతేకాకుండా తీర ప్రాంతమే లేని తెలంగాణ ప్రజలకు చేపలవేటలోని సాధకబాధకాలర్ధంకాకపోవడమో ఏమో? కథలో కరుణ రసం అంతగా ప్రేక్షకులను చేరక, స్పందించలేదనిపించింది. వారు రాసిన కథా ప్రదేశాలలో రక్తి కట్టేఉంటుంది.
పాత్రధారులంతా తమతమ ప్రతిభా పాటవాలను చక్కగా ప్రదర్శించారు. ముఖ్యంగా…
మున్షి పాత్ర పాత సినిమా హాస్యనటుడు రమణారెడ్డి నటనవలె ఉంది.
ఈ నాటిక ముగిసిన వెంటనే కీ.శే.పాలాయి ఆదిరెడ్డిగారి జ్ఞాపకార్ధం… శ్రీమతి పాలాయి శరత్ కల్యాణ్- శ్రీ పాలాయి సంతోష్ కుమార్ గారు పారితోషిక సమర్పణ చేయడం, అలాగే దర్శక, రచయిత, పాత్రల పరిచయం, సత్కార కార్యక్రమాలతో ఆనాడు ముగిసింది.

24- 02-2025 సోమవారం రోజు ముఖ్య అతిధిగా పుర ప్రముఖులైన వరంగల్ కుడా ప్లానింగ్ అధికారి శ్రీ E అజిత్ గారు, విశిష్ట అతిధిగా రంగరాజు – భాస్కర్ హనుమకొండ ఇంటలిజెన్స్
S P , ఆత్మీయ అతిధులుగా రామమ్ చిట్ ఫండ్స్ చైర్మన్, శ్రీ బన్న సుధాకర్ గారు, అదే చిట్ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ రామోజు గిరిబాబుగారు, విశ్రాంత I S S శ్రీ C H S N మూర్తిగారు A D , M S M E ( హైదరాబాదు)
అందరూ విలువైన తమ తమ సందేశాలందచేసారు.
ఎస్పీ బాస్కర్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రంలో కార్యక్రమాలు తగినంత ప్రచారం లేకపోవడమేమో ? ప్రేక్షకుల సంఖ్య తగ్గిందనీ అభిప్రాయ పడుతూ… పట్టణంలో మూలమూలలో ఆయ కార్యక్రమాలగురించి పోస్టర్ లు అతికించి, ప్రచారం చేయాలని అన్నారు.
అలాగే నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుందనీ కనుక సమకాలీన సమస్యలను ఎత్తిచూపుతూ.. వాటి పరిష్కారాలను సూచిస్తూ యువతకు మేలుకొలుపుగా నాటికలు ఉపయోగపడాలనీ, ముఖ్యంగా ఇతర మీడియాలకు ఆకర్షితులై నాటకం చూసే ఓపికలుండడం లేదనీ, అలా కాకుండా వారికీ ఈ ప్రక్రియలో అవగాహన కల్పించాలనీ, వారినీ భాగస్వామ్యులుగా చేయాలనీ అభిప్రాయ పడ్డారు. SP భాస్కర్ మరియు kUDA సహకారం ఎనలేనిదని చెప్పారు. ముందు రోజు వలెనే అతిధుల విలువైన మాటలు విని, వారిని సత్కరించి, ఆనాటి నాటిక ప్రదర్శించమని కోరారు. ఎప్పటివలెనే విఘ్నేశ్వర స్తుతి, శివ స్తుతితో నాందిపలికారు.

ఇక ఈ రెండవ రోజు ప్రదర్శించిన నాటిక విశేషాలు….
నాటిక – చిగురు మేఘం
అమరావతీ ఆర్ట్స్, గుంటూరు వారి ప్రదర్శన.
రచన : కావూరి సత్యనారాయణ
దర్శకత్వం : వై.హరిబాబు.
మంచి సందేశమున్న నాటకం ఇది!
ఆసుపత్రి పేదవాడి గుడిసెలోకి రావాలి అనే అంతర్లీన సందేశం ఈనాటి అనారోగ్య పరిస్థితులు- వ్యాపార ధోరణిలో సాగుతున్న వైద్య విధానం అనే ఒక సన్నని సుతిమెత్తని మరీ చెప్పాలంటే సేవా భావం మరచి, మానవ విలువలు పట్టించుకోకుండా కాబూలీ వడ్డీ వ్యాపారుల వలె ( అందరూ కాదు) ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరును గర్హించి….
వైద్యుడి గుండె పేదవారి గుడి అనే కావూరి సత్యనారాయణ గారి సందేశం ఒక నినాదం వలె ఎంతో బాగుంది. దర్శకుడి ప్రతిభకూడా అనన్య సామాన్యం. ఈ నాటికకు కీ.శే.తుమ్మూరి పద్మనాభ శర్మగారి జ్ఞాపకార్ధంగా వారి కుమారులు డా.తుమ్మూరి రామ్మోహన్ రావుగారు- వారి సోదరులు పారితోషిక ప్రదానం చేసారు. పాత్రధారుల పరిచయంతో మొదటి నాటకవిశేషాలు ముగిసి, ఎక్కువ విరామం లేకుండానే… మరో ప్రదర్శన మొదలైంది.
సాయి కార్తీ క్రియేషన్స్ కాకినాడ వారి నాటకం…
ఎడారిలో వానచినుకు
రచన : శారదా ప్రసన్న
దర్శకత్వం : C h మహేశ్

ఈ నాటకం వృద్ధుల సమస్యల మీద చక్కని ప్రదర్శన. ఇందులో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వృద్ధాశ్రమ అటెండర్ నటన బాగుంది. దాదాపు ప్రతీ ఇంట్లోని తల్లిదండ్రుల బాధలు చక్కగా ప్రదర్శించారు.
డైరక్షన్ బాగుంది
బండరాళ్ళకైనా కన్నీళ్ళు వస్తాయి.. కానీ కొడుకుల మనసు కరగదు
ప్రతిసారి రాజారావు పాత్ర ప్రవేశం సందర్భోచితంగా బాగుంటుంది….
మనవళ్ళతో మనవరాళ్ళతో ఆడుకున్నట్టు కల వస్తుంది…అనే మాట హృదయవిదారక బాధను వ్యంగంగా చెప్పడం బాగుంది.
సంభాషణలు చమత్కారంగా ఉన్నాయి. రెండూ విషాదాంతంగా ముగిసాయి.
ఈ నాటికకు వీనస్ ITI చైర్మన్ డా.శ్రీ రామోజు సుందర రామమూర్తి గారు స్వయంగా నటులు, దర్శకులు , ప్రయోక్త కనుక వారి ప్రతిభా విశేషాలు గుర్తించి పారితోషికం సమర్పించారు. వారిని ముందే సహృదయ వారు సన్మానించారు. ఆనవాయితీగా రచయిత, దర్శక, పాత్రల పరిచయం, సత్కారాలతో ముగిసింది.

25-02-2025 అప్పా జోస్యుల సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా సభా ప్రారంభం చేసి, తరవాత గిరిజా మనోహర బాబుగారు వారిని పరిచయం చేసి, వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసారనీ, యావత్ భారతంలోనే కాకుండా విదేశాలలోనూ, ముఖ్యంగా అమెరికాలో వారి తెలుగు సాహితీసేవను కొనియాడారు.
గిరిజామనోహర బాబు గారి పరిచయ వాక్యాలతో ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతైంది.
తరువాత ఈ నాటి నాటక పారితోషిక దాతలు ఉపన్యసించారు. బాహ్య అలంకరణలకు కాకుండా కళలను గౌరవించుకోవాలనీ , మనం కళలలను ఆదరిస్తూ… ఆచరిస్తూ… రేపటితరాలకు అందించాలని ప్రముఖ న్యాయవాది మృత్యుంజయ రావు గారి కుమారుడు ( పారితోషిక దాత) వేంకటేశ్వర రావు అభిప్రాయ పడ్డారు.
తల్లిదండ్రులు ఏవైతే రంగాలలో రాణించారో ఆ యా కళల పట్ల ఆదరణ, అభిరుచి, ఎరుక కలిగి ఉండాలని సభాముఖంగా కోరారు.
ఇక ఈనాటి ప్రముఖ అతిథి అప్పా జోస్యుల వారు అద్భుతమైన తమ ప్రసంగంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 24 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కార్యక్రమాలు నడిపారంటే అదో మహా యజ్ఞం అని అన్నారు.
తాము సంస్థ 32 వార్షికోత్సవాలు, 32 ఊర్లలో చేసామనీ, ఏ సంస్థ కైనా అధ్యక్ష- ఉపాధ్యక్ష సేవలు ఎనలేనివనీ, ఇతర సభ్యులు వారి బాట నడుస్తున్నారనీ ప్రశంసించారు. వరంగల్ లో తమ సంస్థ వార్షికోత్సవం ఇదివరలో చేసామనీ, 2010 లో దాశరథి రంగాచార్య గారిని జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేసామని అన్నారు.
అలాగే విజయ సారధి గారిని కూడా సత్కరించామని తెలిపారు.
33 వ వార్షికోత్సవం కూడా హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో జరుపుకుంటామనడం ముదావహం….

తరువాత వదాన్యులనందరినీ సత్కరించారు! అందరికీ కృతజ్ఞతలు తెలుపడంతో మొదటి సెషన్ ముగిసి, నాటక ప్రదర్శన మొదలైంది.
విశిష్ట అతిధులుగా పూర్వ శాసనసభ సభ్యులు శ్రీ వన్నాల శ్రీరాములు గారు, మీరా సంగీత మండలి అధ్యక్షులు శ్రీ పింగిళి వేంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ “బాహ్య అలంకరణలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కళలను గౌరవించుకోవాలనీ , మనం ఆ పద్ధతిని పాటిస్తూ, ఆచరిస్తూ… రేపటితరాలకు అందించాలని, అది జరగాలంటే తల్లిదండ్రులు పిల్లలకు కళల పట్ల అభిరుచి ఏర్పడేలా చేయాలని ప్రముఖ న్యాయవాది మృత్యుంజయ రావు గారి కుమారులు ( దాత) వేంకటేశ్వర రావుగారు అభిప్రాయ పడ్డారు. అందరి సన్మానాలు అయిన తర్వాత సారీ- రాంగ్ నంబర్ నాటిక ప్రదర్శన మొదలుపెట్టారు.
సారీ- రాంగ్ నంబర్
రచన- చింతల మల్లేశ్వరరావు
దర్శకత్వం- మహమ్మదు ఖాజావలి గారు.
భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడితే…ఆ భార్య-తండ్రీ అతనిని ఎలా మార్చుకున్నారో తెలిపే నాటిక ఇది.
వస్తువు కాస్త పాతదే ఐనా కొత్త అందమైన హావభావాలతో నాటకం రక్తి కట్టించారు. కరోనా కాలంలో రాసిన కథ ఈ నాటిక సమయం దాటిన తర్వాత ప్రదర్శింపబడడంతో కరుణ రసం ఆశించినంత పండలేదనిపించింది.. నటీనటులు యధాశక్తి నటించి మెప్పించారు. చేసిన మేలు మరచిన మగాడి చిత్రీకరణ బాగుంది. మామగారి పాత్ర నటన చాలా బాగుంది.
భార్యాభర్తల అనుబంధం… కుటుంబ విలువలు, భారతీయ సంప్రదాయం గురించి చక్కగా సందేశమిచ్చిన ఈ ఏలూరి వారి నాటకం బాగుంది.
రంగాలంకరణ బాగుంది.
నాటిక ముగిసిన తర్వాత శ్రీ బోయినపల్లి పురుషోత్తమరావు గారు వారి సతీమణి జ్ఞాపకార్ధం వారి కుమార్తెలు శ్రీమతి శశిరేఖ; శ్రీమతి జ్యోతిలక్ష్మి గారు పారితోషికం అందించారు.
రెండవ ప్రదర్శన రాత్రి 9 గంటలకు కళాంజలి హైదరాబాద్ వారి వీడేం మగాడండీ బాబూ
రచన- P T మాధవ్
దర్శకత్వం – G S చలపతి.
ఈ నాటికకు ముక్తవరపు శ్రీరాములుగారి జ్ఞాపకార్ధం డాక్టర్.M చక్రధర్ మరియు శ్రీ సుభాష్ చంద్ర స్వామి
పారితోషికం అందించారు. తమ సందేశాలను సదస్యులకు పంచారు.

26-02-2025. బుధవారము అందమైన సాయంకాలం, 6-30 ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర కళాకారుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఆకుల సదానందంగారు, ఆత్మీయ అతిధులు విశ్రాంత ప్రధాన అధ్యాపకులు మరియు సహృదయ సంస్థ కోశాధికారి శ్రీ రాధాకృష్ణ గారు సహృదయ సంస్థ కార్యక్రమాలు, దాని ఆశయం…వదాన్యుల గొప్పదనం చెప్పారు…ఎలా అంటే తామిచ్చిన ధనానికి తగిన కార్యక్రమాలుంటాయనే విశ్వాసంతో… తమ ధనం అపాత్ర దానం కాదనే భరోసా దాతలకు ఉంటుందని అన్నారు. బాలకృష్ణ గారు మాట్లాడుతూ… ఇంత గొప్ప కళా క్షేత్రం ఎక్కడా లేదనీ… దానికీ, స్థాయీ నిర్ణేతగా వ్యవహరించే అదృష్టం కలగడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఆనంద్ కుమార్ గారు సహృదయసంస్థ సభ్యులుగా ఉండడం అదృష్టమని అన్నారు
ఆరోజు మొదటగా 7-30 శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు వారి
జనరల్ బోగీలు
రచన – P T.మాధవ్
దర్శకత్వం- గోపరాజు విజయ్.

శ్రీకాకుళం జిల్లా జయలక్ష్మి గారి జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా మలచబడిన నాటకం…. ఓ కన్నతల్లి ఆవేదన…
జనరల్ బోగీ… కథావస్తువు.
రంగాలంకరణలో భాగంగా చక్కని పోస్టర్ లతో, పోలీస్ స్టేషన్ దృశ్యం బాగుంది
ఫ్రెండ్లీ పోలీస్ కావాలనే సందేశంతో సాగిన నాటకం ఇది
కీ.శే.పరాంకుశం వేంకటేశ్వర్లు, పుష్పలీల గారి స్మృత్యంకంగా చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ హైదరబాద్ వాస్తవ్యులు శ్రీ పరాంకుశం వేంకట కృష్ణ గారు పారితోషికం వితరణ చేసారు.
పారితోషిక వదాన్యులు రేపటి తరానికి కళలపట్ల ఆసక్తి కలిగించాలనే సూచన చేసారు. కొత్తగా నాటకాలు వేసేవారు వారికి సహృదయ సంస్థ తమకిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక రెండవ ప్రదర్శనగా కళానికేతన్ , వీరన్నపాలెం వారి ఋతువు లేని కాలం
రచన- అగస్త్య
దర్శకత్వం- Y B చౌదరి.
మొదట్లో మాటలు స్పష్టంగా వినపడలేదు.
పెటాకుల గ్రంథం రాసిన వాలి , పెళ్ళిళ్ళ పేరయ్య… A to Z సేవలందిస్తాననడం ఈ నాటి సమయ సందర్భం.
బ్యాగేజీ ఉండవద్దని పెళ్ళి పిల్ల అనడం ఈనాటి లోకం పోకడ తెలుపుతున్నది.
ఈ నాటిక సమకాలీన సమస్యలను తెలిపుతూ
మంచి సందేశమిస్తూ,
మానవ సంబంధాల ప్రాధాన్యత తెలిపిన మంచి నాటకం. ఈ నాటిక పారితోషిక దాతలు శ్రీ కళా రాజేశ్వర రావు గారు వీరు సహృదయ సంస్థ సభ్యులు. వీరు కందకట్ల కాంతయ్య – సరస్వతమ్మల జ్ఞాపకార్ధం వితరణ చేసారు.
కళా రాజేశ్వరరావు గారు (ఋతువు) పారితోషిక దాత చక్కని సూచన చేసారు.
మరో పారితోషిక దాత
మల్ల్యాల మనోహర్ రావుగారు. వీరు సహృదయ సాహిత్య కార్యదర్శి మరియు అడ్వొకేట్, వీరు మాట్లాడుతూ…
24 సంవత్సరాల నుండి సహృదయ సంస్థతో తన సాహితీ ప్రయాణం సాగిన వైనం చెబుతూ.. తన రచన క్రాంతి యాత్ర పుస్తక ఆవిష్కరణ ఈ సహృదయ సంస్థ ద్వారా జరిగిందనీ, ఆనాటినుండి నిరాఘాటంగా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయనీ దానికి కార్యకర్తల కృషి చెప్పడానికి మాటలు లేవని, చెప్తూ… తనవంతు సాయంగా తన మామగారైన పెండ్యాల జయసేనరావుగారి స్మృతిగా ఈ నాటక పారితోషికం సమర్పించామనీ… ఎంతో ఎదిగిన ఈ సంస్థ గురించి చాలా చక్కగా చెప్పారు.
కాళోజీ కళా క్షేత్రం స్టేజీ నిర్మాణంలోనూ సలహాలతో.. సంప్రదింపులతో చక్కగా రూపుదిద్దుకున్నదని చెప్పారు
దక్షిణ దేశంలో గొప్ప ఆడిటోరియం అని కొనియాడారు.
29 సంవత్సరాల నుండి జయప్రదంగా కొనసాగడానికి ప్రేక్షకుల పాత్ర గణనీయమని అన్నారు. తర్వాత సన్మానాలు వనం లక్ష్మీకాంతారావుగారిచే జరిగాయి.
నాటిక ప్రారంభం సరిగ్డా 7-30 ప్రారంభంకావడం సహృదయ సంస్థ కున్న సమయపాలన తెలిపినట్లైంది
ఈనాటి వ్యాఖ్యాతగా కుందావఝుల వారు ప్రార్ధనా గీతంతో పాటు, కార్యక్రమాన్ని నడిపారు.
చివరగా సమాపనోత్సవ సభకు మాన్య శ్రీ గిరిజామనోహర బాబుగారు ( సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు) సభాధ్యక్షులుగా , సహృదయ సాంస్కృతిక కార్యదర్శి శ్రీవనం లక్ష్మికాంతారావుగారు కార్యవర్గం- సత్కారాలు జరిగాయి.
ప్రేక్షకులు కూడా వితరణ చేసారు.

దాతలు- గ్రహీతలు ఆహుతులైన ఆ వేదిక మీద గిరిజామనోహరబాబు గారు, సాంస్కృతిక అధ్యక్షులు వనం లక్ష్మీకాంతారావు గారు ఉత్సవ ముగింపు తమ నివేదిక సమర్పణతో సమర్పించి, అద్భుతంగా… యజ్ఞం తో పోల్చి, నేను – నాది అనే భావంతొ ఏకోన్ముఖంగా ఎవరిపనులు వారు చేస్తేనే ఇంత గొప్పగా ఈ నాటకపోటీలు జరిగాయని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ B పురుషోత్తమరావుగారు, డా. A V నరసింహా రావుగారు, డా. K LV ప్రసాద్ రావు గారు తమ ప్రసంగంలో తాను అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి గమనించిన విషయమేమిటంటే మూలస్తంభాల వలె అందరూ అకుంఠిత దీక్షతో కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపిస్తారని అన్నారు. ఆనంద్ కుమార్ గారు సహృదయసంస్థ సభ్యులుగా ఉండడం అదృష్టమని అన్నారు. పెండం రమేష్ గారు కళాక్షేత్రం గురించి ఎన్ని మాధ్యమాలున్నాయో వాటితో ప్రచారం చేస్తున్నామని చెప్పారు.
అందరు వరిష్ట అతిధులంతా పాల్గొని, రంగస్థల పురస్కారాన్ని కాట్రగడ్డ హిమాన్షీ చౌదరి, ఆలయ నృత్య ప్రదర్శకురాలికి డా.V కృష్ణమాచార్యులు, డా. శ్రీదేవి , శ్రీమతి గీతాంజలి గారలు కీ.శే.వేదాంతం నరహరి ఆచార్యులు మరియు కాంతమ్మ గారల స్మృతిలో పురస్కారం అందచేసారు.
హిమాన్షి గారి నృత్య ప్రస్థానం, వారి విజయాలు, అందుకున్న బిరుదులు, పొందిన పురస్కారాలు మొదలైనవన్నీ చక్కగా సన్మాన పత్రంలో అందమైన అక్షరాలతో చెక్కి, ఆదరాభిమానాలనే ఫ్రేం కట్టిన ఆ సన్మానపత్రాన్ని వనం లక్ష్మీకాంతారావుగారు తమదైన గంభీర కంఠంతో ఆ సభలోని రసహృదయులకు వినిపించి, ఆ అమ్మాయి మీద సభ్యులకు ఆదరాభిమానాలు ఇనుమడింప చేసారు. వేదాంతం నరహరి- … కాంతమ్మ హిమాంశు చౌదరికి పురస్కారం అందిస్తున్న సందర్భంగా శుభాకాంక్ష లు తెలిపారు. సంగీత సాహిత్యాలతో మమేకమైన తమ జీవితాలే ఇలా పురస్కారం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందని అన్నారు.. ధన్యవాదాలు తెలిపారు.
ఇలా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, సాహిత్య కార్యదర్శులు ఏకోన్ముఖంగా ఆ సభను రంజింప చేయడమే కాకుండా .. న్యాయ నిర్ణేతల సూచనలతో ఉత్తమ ప్రథమ, ద్వితీయ, బహుమతి పారితోషికాలు ప్రదర్శించిన ప్రతీ నాటికకూ, దర్శక, రచయితలను ప్రోత్సహిస్తూ వారికి శ్రీ కాపా కృష్ణ ప్రసాద్ ప్రముఖ న్యాయవాది, శ్రీ సునీల్ సెంసాని ప్రముఖ న్యాయవాదులు పారితోషికాలు వితరణ చేసారు.
శ్రీ మంగిన పల్లి సదాశివుడు ప్రముఖ న్యాయవాది, శ్రీ ఏరుకొండ జయశంకర్ ప్రముఖ న్యాయవాది ద్వితీయ ప్రదర్శన పారితోషిక దాతలుగా, ప్రదర్శించిన ప్రతి నాటిక దర్శక, రచయితలకు పురుషోత్తమరావుగారు వీరు నాటక విశ్లేషకులు కూడా వారూ పారితోషికం సమర్పించారు.
డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారి జ్ఞాపకంగా వారి సతీమణి నేరెళ్ళ శోభాదేవి గారు 5000/ రూ.లు పారితోషికం సమర్పించుకొని, వారు మాట్లాడుతూ యజ్ఞంలో అందరమూ సమిధలమనీ, ఈ సంస్థ లో అధ్యాపకులుండడమేమో? అలా స్కూల్ లో వలెనే అందరూ క్రమశిక్షణతో పనులు చేస్తారనీ అభినందించారు.
ప్రేక్షకులు టిక్కట్లు తీసుకుని చూస్తే బాగుంటుందని సూచించారు. ఇలా చక్కని ప్రసంగం చేసారు.
హిమాన్సీ చౌదరి కృతజ్ఞతలు తెలుపుకొని శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయించారు.
సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాలను ముగించారు.
ఇలా ఈ నాలుగు రోజులు ఇంత గొప్ప కార్యక్రమాలను అంతకన్నా గొప్పదైన కళలకు కాణాచి ఓరుగల్లు పట్టణ నడిబొడ్డులోని కాళోజీ కళాక్షేత్ర మనే కలికి తురాయిలో నిర్వహించుకునేందుకు ప్రాయోజితులుగా వనం రజనీకాంత్- శ్రీమతి వనం స్పందన USA గారి వదాన్యత మరింత గొప్పగా భావించి, ఆ నాలుగు రోజులూ అన్నీ మరచి మరో లోకంలో విహరించిన నా మనసును రసహృదయులతో పంచుకోవాలని క్లుప్తంగా ఈ నాలుగు మాటలు.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్ – 16 

కనిపించని జాడలు