నిశీధి పీడనంతో వేసారి కష్టాల కొలనులో మునిగితేలి
నిస్తేజంగా మారిన కన్నీటి కలువకు ఓదార్పునిస్తూ కైదండలిచ్చిన కడలివెన్న
ఇందీవర కంటి చెమరింతల్లో
దాగిన నెగళ్ళు తెలిసి కనురెప్పతానైన రజనీకరుడు
వగపు గాయాలతో కుమిలే
నీలి కలువకు
అమృతాంశుడు అద్దిన మంచిగంధపు మాటలమైపూతలు
ఎగసిపడే జ్ఞాపకాల
విష జ్వాలల్లో చిక్కి
కుమిలే కువలయానికి
సితభానుడు కుమ్మరించిన ఊరడింపుల తుహినపు జల్లులు
రగిలే కైరవానికి సాంత్వనగా చలువరాయడు విసిరిన వెన్నెల పూల వింజామరలు
నీరజారి చెలిమితో సేదదీరి నూతనతేజంతో విరిసిన
సరికొత్త కల్హారం
ప్రకృతి కలాపాలలో కలువరేడు
సరికొత్త కవనమాయె !!