
పుట్టుకముందే మొదలౌతుంది.
నీతో ప్రయాస
నీవు లేనిదే మనుగడకు లేదు భరోస
ఎందుకు మనిషికి నువ్వంటే అంత ఆశ
వాడికి తెలియదు నీతో ఆడితే రభస
చొక్కా జేబులో నువ్వుంటేనే
వెనకున్న గుండెకి కులాసా
కూడు, గూడు, గుడ్డ నిత్యావసరాలు
నీతోనే గడిప
పేగులుమాడి డొక్కలు ఎండితే లేదు చేతిలో ఆసరా
ఎన్నో జీవితాలకు కన్న తల్లిలా ఊపిరిపోస్తావు
మరెన్నో జీవితాలను విషనాగులా కాటేస్తావు
ఎందరినో ఆదరిస్తావు
మరెందరినో అనాథలను చేస్తావు
ధనవంతుడిని నీవే నిర్ణయించుకుంటావు
బిచ్చగాడికి నీవె కారణమౌతావు
సొంత సోదరులను విడదీస్తావు
కొత్త పరిచయాలను కలుపుతావు
సంతోషానికి కర్తవు
దుఃఖానికి కర్మవు
కర్త, కర్మణీలకు క్రియ రూపానివి
మంచివి నీవే.. చెడువి నీవే
సున్నాతో విలువను పెంచుకుంటూ
మూసలతో విలువను అణుచుకుంటూ
ప్రపంచమంతా విహరిస్తావు
చివరికి ఇనుప పెట్టెలో బందీవవుతావు
ఈ సృష్టినే నీతో నడిపిస్తావు
అందరూ నీ కోసమే అలమటిస్తారు
ప్రశాంతత లేదు నీవు లేకపోతే
కునుకుండదు నీవు కనబడితే
ప్రతి వాడు నీకు కట్టు బానిస
రాజులకే రారాజువు
నీ పాలనలో ముప్పుతిప్పులు పెట్టిస్తావు
ముచ్చెమటలు పట్టిస్తావు
మహాత్ముడిని నీలో నిలుపుకుని
మహాప్రసాదంగా మారిపోయావు
లక్ష్మిదేవి పూర్ణకుంభంలో నుండి జారిపడి
కుభేరుడి ఇంట చొరబడి
గోవిందుడినే అప్పులవాడిని చేసిన
గొప్ప మూల్యానివీ, ధనసంపదవి
విలువిస్తే వెంటుంటావు
ఖర్చు చేస్తే కనుమరుగౌతావు
దాచితే దొరని చేస్తావు
దోచితే దొంగని చేస్తావు
ఎన్నెన్ని గారడిలో
తరచి చూస్తే చిన్న కాగితపు కరెన్సీ నోటువి…