
“అమ్మా… అమ్మా”
ఎక్కడ నుంచో ఎవరో అమ్మా అమ్మా అని చిన్నగా తట్టుతూ లేపుతునట్లనిపిస్తే భారంగా కళ్ళు తెరిచిందిపంకజం. కొద్ది సేపు తనెక్కడుందో అర్ధం కాలేదు. కొంచం తేరుకొని చూస్తే పెద్దకూతురు శారద గాభరాగా తనను లేపుతోంది. చిన్నగా లేచి కూర్చుంది పంకజం.
“ఏమయిందమ్మా ఎనిమిది అవుతున్నా ఇంకా లేవలేదు?” అని అడిగింది శారద.
“రాత్రంతా కడుపులో నొప్పి. అస్సలు నిద్రపట్టేదు. అయ్యో మీకు బడికి ఆలశ్యం అయ్యిందా?” అని నొచ్చుకుంది.
“కాలేదులే. కడుపు నొప్పి చాలా ఉందామ్మా? నెలరోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు” అడిగింది శారద.
“రాత్రి చాలా అనిపించింది. ఇప్పుడు కాస్త నయమేలే. ఉండు తొందరగా వంట చేస్తాను తిని పోండి” అంది పంకజం స్కూల్ యూనీఫాం లో తయారుగా ఉన్న శారదను చూస్తూ.
“నేనువంట చేసాను. నువ్వు లేచి మొహం కడుక్కో. కాఫీ ఇస్తాను. ఈరోజు వంటకు వెళ్ళకు” అంది శారద.
పంకజం తండ్రి ఓ కాంట్రాక్టర్ దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్ళు. తనకున్నంతలో పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్ళి బాగానే జరిపించాడు. చదువులో చురుకుగా ఉన్న పంకజం ను చదివిద్దామనుకున్నాడు కానీ, రాఘవతల్లి ఎక్కడో పంకజం ను చూసి ఇష్టపడి కోడలిని చేసుకుంటానని కబురుపెట్టింది. పిల్లవాడు బి.యస్.సీ పాస్ అయ్యాడు. ఓ కాట్రాక్టర్ దగ్గర సూపర్వ్వైజర్ గా బాగానే సంపాదిస్తున్నాడు. పంకజంకు సరిపోయేట్టుగా ఈడూజోడూ బాగుంది అని పదవతరగతి చదువుతున్న పంకజం చదువు ఆపేసి రాఘవతో పెళ్ళి చేసాడు. రాఘవమంచివాడే కానీ తండ్రి చిన్ననాడే పోతే తల్లి కష్టపడి పెంచిందని తల్లి మాట జవదాటడు. వాళ్ళకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. తన కూతుళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేయాలన్న కోరికతో పెద్దదానికి శారద, చిన్నదానికి సరస్వతి అని పేర్లు పెట్టుకుంది పంకజం. శారదకు పదిహేను, సరస్వతికి పదమూడు, చంద్రంకు ఎనిమిది సంవత్సరాలు. మొగపిల్లవాడు కావాలని సరస్వతి తరువాత వచ్చిన రెండు గర్భాలను, ఊళ్ళో డాక్టర్ దగ్గర స్కానింగ్ చేయించి, ఆడపిల్ల అని అబార్షన్ చేయించింది పంకజం అత్తగారు దుర్గమ్మ. ఇంతా చేస్తే ఆ డాక్టరమ్మ అసలు డాక్టరే కాదట. పట్నంలో ఓ పెద్ద డాక్టర్ దగ్గర పనిచేసేదిట. ఊళ్ళో దొంగ సర్టిఫికేట్ తో హాస్పిటల్ పెట్టుకొని, ఇలా డబ్బులు సంపాదిస్తోంది. ఆమె గుట్టు బయటపడి పోలీసులు అరెస్ట్ చేసేటప్పటికే పంకజంకు జరగవలసిన నష్టం జరిగిపోయింది. చంద్రం పుట్టినప్పుడు హైదరాబాద్ లోనే ప్రభుత్వ ఆసుపత్రిలో కానుపు చేసిన డాక్టర్, ఇంకోసారి గర్భం వస్తే పంకజంకు ప్రమాదమని, కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేస్తానని అంటే, ఒక్క కొడుకు కొడుకు కాడు, ఇంకో కొడుకు పుట్టనీయని దుర్గమ్మ ఒప్పుకోలేదురాఘవ తల్లి మాట కాదనడు.రాఘవ సంపాదన కు తోడుగా తనూ కాస్త సంపాదిస్తే పిల్లల చదువుకు సహాయంగా ఉంటుందని ఒకరింట్లో వంట చేస్తోంది పంకజం.ఇంకోసారి గర్భం వస్తే తనకు చాలా కష్టం, తను పోతే పిల్లలు ఆగమైపోతారని, అత్తగారికి ఎదురుచెప్పి ఆపరేషన్ చేయించుకునే ధైర్యం లేక, మందుల దుకాణం అతనిని బతిమిలాడుకొని గర్భనిరోధక మాత్రలు తెచ్చుకొని ఈ అయిదేళ్ళుగా వాడుతోంది. నెలరోజులుగా అప్పుడప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి వస్తోంది.
ఇప్పటికే రెండురోజుల నుంచి ఈ నొప్పితో పనికి వెళ్ళలేదని పిల్లలు బడికి, రాఘవపనికి వెళ్ళాక, ఓపిక చేసుకొని వెళ్ళిందిపంకజం. చిన్నగా జానకి ఇంటికి వచ్చింది. వచ్చిందేకానీ ఓపిక లేక అక్కడ బాల్కనీలో నీరసంగా కూర్చుండిపోయింది.
అటుగా వచ్చిన జానకి పంకజం ను చూసి “అదేమిటీ? అంత నీరసంగా ఉన్నావు. మొహం పాలిపోయింది. రెండురోజులు పనిలోకికూడా రాలేదు ఏమయ్యింది?” అడిగింది.
“కడుపులో చాలా నొప్పిగా ఉంది మేడం. ఈ మధ్య అప్పుడప్పుడూ వస్తోంది కానీ మొన్నటి నుంచీ చాలా ఎక్కువగా ఉంది. రాత్రి నొప్పికి తట్టుకోలేకపోయాను” అంది పంకజం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా.
“అయ్యో అదేమిటీ? డాక్టర్ కు చూపించుకోలేదా?” అడిగింది జానకి.
“జీతం వచ్చాక వెళుతానమ్మా” జవాబిచ్చింది చిన్నగా.
“నీ మొహం. ఉండు నేను డబ్బులిస్తాను. వీధి చివర ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకో” అని కోపం చేసింది జానకి.
“వద్దమ్మా. ఇప్పటికే చాలా తీసుకున్నాను” అభిమానంగా అందిపంకజం.
పంకజం వైపోసారి చూసి “సాయిబాబా గుడి దగ్గర కొంతమంది డాక్టర్ లు ఉచితంగాచూసి, చిన్నచిన్న వాటికి మందులిస్తారట. ఇప్పటికైతే అక్కడ చూపించుకొని మందు తెచ్చుకో” అని పనిమనిషి యాదమ్మను తోడిచ్చి, ఆటోలో పంపింది.
నీరసంగా తిరిగి వచ్చిన పంకజం చూసి “చూపించుకున్నావా?” అడిగింది జానకి.
పంకజం ఏమీ మాట్లాడలేదు. తల వంచుకొని నిలబడింది.
“ఇప్పటికి నొప్పి తగ్గటానికి మందులిచ్చారమ్మా. కానీ స్కానింగ్ చేయించుకురమ్మన్నారు” జవాబిచ్చింది యాదమ్మ.
లోపల నుంచి డబ్బు తెచ్చి ఇచ్చి, “విజయా డయాగస్టిక్ కు వెళ్ళి స్కానింగ్ తీయించుకొనిరా. రిపోర్ట్ వచ్చాక ఏమి చేయాలో ఆలోచిద్దాము” అని మళ్ళీ యాదమ్మతో పంపింది.
“గర్భసంచి లో గడ్డ ఉన్నదట, రిపోర్ట్ సాయంకాలం తీసుకొని, పెద్ద డాక్టర్ కు చూపించుకోమన్నారమ్మా” స్కానింగ్ చేయించి తీసుకొచ్చిన యాదమ్మ చెప్పింది.
ఇంటికి వచ్చి, ఇదేమి ఉపద్రవం వచ్చి పడింది అని బాధపడుతూ కూర్చున్న పంకజం, నీరసంగా వచ్చి తన పక్కన కూర్చున్న రాఘవను ఏమయ్యిందనట్లు చూసింది.
“మా కాంట్రాక్టర్ సర్ కు నష్టాలొస్తున్నాయట. పనులు మానేస్తున్నానని రెండు నెలల జీతాలిచ్చి పనిలో నుంచి తీసేసారు” జీతం డబ్బులు పంకజం కు ఇస్తూ దిగులుగా అన్నాడు రాఘవ.
కష్టాలన్నీ కట్టకట్టుకొని వచ్చాయి అని ఆలోచిస్తుంటే ఆ వత్తిడికేమో ఒక్కసారిగా విపరీతమైన కడుపునొప్పి వచ్చి ఉండలు చుట్టుకుపోయింది పంకజం. గాభరాపడిన రాఘవ వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. శారద వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్ తెచ్చింది. అది చూసి గర్భసంచీలో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలనీ, ఇంకా కొన్ని పరీక్షలు రాసి, అప్పటికి నొప్పి ఉపశమనానికి మందులు ఇచ్చింది డాక్టర్. ఆ పరీక్షలకూ, మందులకు, ఆ నెల ఇంటి ఖర్చులకూ రాఘవ జీతం అయిపోయింది. పంకజం నొప్పి చూసి తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే పంకజం కు ఆపరేషన్ చేయించాలి. తెలిసిన వారందరినీ అప్పడిగాడు. అంతా సానుభూతి చూపించారే కాని డబ్బులు సద్దలేకపోయారు.
అమ్మానాన్నల పరిస్థితి చూసి, “అమ్మా నీ బదులు నేను వెళ్ళి వంట చేస్తాను. వాళ్ళు జీతం ఇస్తారుకదా” అంది శారద.
శారదను దగ్గరగా తీసుకొని రాఘవతో “మా సార్ ఏమైనా సహాయం చేస్తారేమో అడగనా? ఇప్పటి వరకూ ఈ ఆలోచన రాలేదు” అంది పంకజం.
జానకి భర్త వీరేన్ సంగతి తెలుసుకొని “మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా?” అడిగాడు.
“లేదు సార్. తీసుకోలేదు” అందిపంకజం.
“నీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కడతానంటే, వద్దు ఆ అయిదువేలు నాకివ్వండి అన్నావు. మరి ఇప్పుడేమి చేద్దాం?” అడిగాడు వీరేన్.
“తనేం చెపుతుంది? ఆ డబ్బు ఉంటే ఇస్తే పిల్లల ఫీజుకూ దానికీ ఉంటుందనుకుంది. కానీ ఇట్లా ముంచుకొస్తుందనుకుందా? మీరే చెప్పండి ఏమి చేయాలో” అంది జానకి.
“ఈ మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా చూస్తున్నారు. అక్కడ చేయించుకోవచ్చు. కానీ, మందులకు, టెస్ట్ లకూ చాలా డబ్బు అవసరము అవుతుంది. రేపొద్దున ముఖ్యమంత్రి ఆఫీస్ కు వెళ్ళి, ఏదైనా సహాయముచేస్తారేమోఅడగండి. మీతో మా అసిస్టెంట్ రవిని పంపుతాను” అన్నాడు వీరేన్ రాఘవతో.
పంకజం పరిస్థితి చూసి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదివేలు ఇచ్చారు.
ముందు చిన్న గడ్డ అనుకున్నారు కానీ గర్భసంచీలో చాలా పెద్దగడ్డ ఉంది. పైగా ఓవరీస్ మీద కూడా గడ్డలు వచ్చాయి. అందుకని గర్భసంచీ, ఓవరీస్ అన్నీ తీసేయాల్సి వచ్చింది. నాటుమందులతో అబార్షన్ లు చేయించుకోవటమూ, వరుసగా అయిదు సంవత్సరాలు గర్భనిరోధక మందులు వేసుకోవటముతో ఈ సమస్య వచ్చిందని చెప్పింది డాక్టర్. అదృష్ఠవసాత్తు అది కాన్సర్ కాలేదు. కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవాలందిడాక్టర్.
ఆపరేషన్ గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా చేసారు. అప్పటికి అవసరమైన మందులు కొన్ని ఇచ్చారు కానీ గర్భసంచీ, ఓవరీస్ తీసేయటముతో హార్మోనల్ ఉత్పత్తి ఉండదు. అందువలన కొన్నిరోజుల పాటు డాక్టర్ పర్యవేక్షణలో హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవాలి. ఇంకా బలమైన ఆహారం, కాల్షియం కోసం పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఎముకలు గుల్లబారి ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉంది అని డాక్టరమ్మ మరీమరీ చెప్పింది. వీటన్నిటికీ, ఇల్లు గడిచేందుకు డబ్బులు కావాలి. ఎంత తిరిగినా చిన్నపాటి ఉద్యోగం కూడా దొరకలేదు. ఏమి చేయాలో తెలియక, పంకజం సలహా మీద వీరేన్ దగ్గరకు వెళ్ళాడు రాఘవ.
“రాఘవా సైనిక్ పురిలోనాకు తెలిసిన ఒక మిలిట్రీ సార్వాళ్ళకు నమ్మకంగా ఇల్లు చూసుకునేవాళ్ళు కావాలని అడిగారు. క్వాటర్ ఇస్తామన్నారు. ఇల్లు, తోట చూసుకోవాలి.పంకజం కోలుకున్నాకమేడం కు వంటలో సహాయము చేసి, సార్ వాళ్ళ అమ్మగారు పెద్దావిడ ఉన్నారు, ఆవిడకు తోడుగా ఉండాలి. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటారు. అందరూ వెళ్ళిపోయాక వక్కర్తే ఉంటుందని తోడుకోసం చూస్తున్నారు. ఆ సార్ కు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర నీకు పని ఇప్పిస్తారు. లేదా నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే ఆ సార్ దగ్గరే చేయవచ్చు.పిల్లలను కూడా అక్కడే స్కూల్ లో చేర్చవచ్చు. మరి నీ ఇష్టం చేస్తానంటే చెప్పు ఆయనకు చెపుతాను” అన్నాడు వీరేన్.
“అంతకన్నా కావలసిందేముంది సర్. వెళుతాము” అన్నాడు రాఘవ.
వీరేన్ కు కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి వచ్చి సంతోషంగా భార్యాపిల్లలకు చెప్పాడు.
విషయము చెప్పిన తండ్రితో “అమ్మకు నయం అయ్యేవరకు మేడం కు నేను వంటలో సహాయం చేస్తాను నాన్నా” అంది శారద.
“అక్కడ తోట ఉందా? నేను చెట్లకు నీళ్ళుపోసి నీకు సహాయం చేస్తాను” అంది సరస్వతి.
“మరి నేనేమి చేయను?” అన్నాడు చంద్రం.
పిల్లలను మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు రాఘవ. వచ్చిన కష్టం కరిగిపోయిందని తమకు సహాయం చేసిన వీరేన్ దంపతులకు, ఆ దేవదేవునికి నమస్కరించుకుంది పంకజం.