వసంతం వచ్చింది మిగిలిన గ్రామాల వలెనే సోమ్లా, భూక్యాల ఊరికి కూడా వచ్చింది. అది చెట్ల ఆకులకు ఎరుపు రంగులద్ది, పూలకు గిలిగింతలు పెట్టి నవ్వించింది. అమ్మాయిలందరూ మామిడి చిగుళ్లను , తెల్లని ‘అడవి నియాలి’ పువ్వులను తమ నల్లని కొప్పుల్లో ధరించారు. వాటి పరిమళాలకు తేనెటీగలు వారి చెవుల వద్ద కూని రాగాలు ఆలపిస్తూ, వారి చుట్టూ ఎగురుతున్నాయి. కొండ ప్రాంతమంతా మరొకసారి ఉల్లాసంగా తమ వైభవాన్ని సంపూర్ణంగా పొందింది.
కమ్లీ ఒంటరిగా సరస్సులో స్నానం చేస్తూన్నది. అన్యమనస్కంగా నీటిని చల్లుకుంటూన్నది. ఆమె ఎర్రచీర దగ్గరలో ఉన్న మామిడి చిగుళ్ళతో కలిసిపోయి
మామిడి చెట్టు నుండి వేలాడుతున్నది. ఆమె వాగులో మునిగినప్పుడు నీటిలో కొట్టుకు వస్తున్న అడవి పూలు ఆమె వెంట్రుకలకు చిక్కుకున్నాయి. తన తలను ఆమె విదిలించడంతో అవి ప్రవాహంలో పడి కొట్టుకు పోయాయి. గుల్మొహర్ చెట్టు కొమ్మలు పొడవైన పూల గుత్తులతో బరువుగా నీటిలోకి ఒంగి బంగారు రంగు నమూనాలను నీటి ప్రవాహంలో సృష్టిస్తున్నాయి. ఆమె నీటిలో కూర్చొని ప్రవాహం యొక్క మధురమైన శబ్దాన్ని వింటున్నది.
కమ్లీ కళ్ళు మత్తుగా బరువెక్కాయి. కానీ విసురుగా వీచిన గాలి చెవుల వద్ద తడిచి చిక్కులబడ్డ వెంట్రుకలకు చేరి ఒక్కసారిగా వణికిపోయింది.
యదా ప్రకారం కమ్లీ తన గురించి తాను ఆలోచించకుంటున్నది. ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఆలోచనలు ఆమెను వదలడం లేదు.. సాయంత్రం నాట్యం సమయంలో, పగలు రోజువారీ పనుల్లో కూడా ఆలోచనలే అల్లుకుంటున్నాయి. సాలీ ఈమధ్య తనతో బయటికి రావడం లేదు. వారిద్దరు కలిసి అడవిలో నడవక చాలా రోజులైంది. పగటి సమయంలో రహస్య కొండ గుహలో కూర్చుని కలలు కనడంలేదు. చానాళ్ళ నుంచి నెమళ్లు నాట్యం చేసే వద్దకు వెళ్లలేదు. కనీసం వారిద్దరూ కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఒకరి వీపు ఒకరు రుద్దుకోలేదు. సాలీ ప్రస్తుతం తన కుటుంబానికి పెద్ద దిక్కు. ఆమె రోజువారీ భుక్తి సంపాదించాలి. ప్రతిరోజు సాలీ అడవికి వెళ్లి తినడానికి వీలైన కంద మూలాలను సేకరించాలి. ఆమెకు ఆడుకునే సమయం లేదిప్పుడు.
సాలీ కజోడితో ఉన్నప్పుడు తరచూ భూక్యా గురించి ఆలోచించేవారు. ఇప్పుడు అతని గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఆ సమయాన్ని హేమ్లా ఆక్రమించుకున్నాడు. వారితో హాస్య మాడుతూ సరసమాడుతూ. అప్పుడప్పుడు సాలీ, కమ్లీ కలిసి ఉన్నప్పుడు, హేమ్లా గురించి మాట్లాడేవారు. అతని పేరు ఉచ్ఛరించగానే అతడు వారి ముందు కనిపించేవాడు. అతడు వారి వెనుక దాచుకుని ఉండేవాడేమో, తన పేరు వినబడడం కోసం ఎదురు చూస్తూ .ఎందుకు అతడు తమను అనుసరించేవాడు ? ప్రతిసారి అతడు వచ్చేది కేవలం సాలీ కోసం మాత్రమే కాదని కమ్లీ భావించింది. అతడు సాలీ ముఖం వైపు తిరగగానే ఆమె ఆనందంగా నవ్వుతూ ఉండేది ఒకటి రెండు సార్లు హేమ్లా కళ్ళు కమ్లీ కోసం వెతకడం ఆమె గమనించింది. సాలీ కోసం వెతుకుతున్నట్లు కనిపించినప్పటికి కూడా. ఆమె కళ్ళు అతని కళ్ళతో కలిసినప్పుడు అవి కోరికతో మండుతూ ఉండేవి. కమ్లీ, సాలీని హేమ్లా ప్రేమ గురించి వెక్కిరించేది. హేమ్లా, సాలీకి చెందినవాడని అనుకున్నప్పుడు ఆమె సంతోషంగా ఉండేది. తరువాత ఆమె ఆలోచనలు అయోమయంగా కల్లోలంగా మారి ఆమెను తడబడేటట్టు చేశాయి. కమ్లీ తనకు తాను హేమ్లా ఆకర్షణకు లోనవుతున్నట్టు గమనించింది.
సాలీతో హేమ్లా సంబంధం గురించి హాస్యమాడేది కమ్లీ. సాలీకి కమ్లీ సరసపు మాటలు కొన్నిసార్లు కచ్చితంగా గుచ్చుకునేవి. సాలీ కూడా తిరిగి చురకలు అంటిస్తూ భూక్యాతో తన సంబంధం గురించి సరసమాడేది. ప్రతిదీ పరిహాసంగా మాట్లాడుకున్నట్టు ఉండేది కానీ కమ్లీ అసౌకర్యంగా అపరాధంగా భావించేది. భూక్యా గురించి ఈ ప్రస్తావన ఒక మృదువైన అలలా తనను తాకేది. కానీ తరువాత తన భావాలను శాంతంగా నిష్పక్షపాతంగా పోల్చుకున్నప్పుడు, భూక్యా నుండి ఆమె ప్రేమను పొందగలిగింది. కానీ, హేమ్లా స్పూర్తి వ్యక్తిత్వం ఆమెను ఎక్కువ ప్రభావితం చేశాయి. ఈ విధంగా ఆలోచించిన తర్వాత కమ్లీకి మనశ్శాంతి కరువైంది. ఆమె దేవుళ్ళనందరిని తనకు మనశ్శాంతి ప్రసాదించమని ప్రార్థించింది. గర్జిస్తున్న జలపాతంలో తనకు తాను ఎండిన చెట్టుమొద్దు వలే కొట్టుకుపోతున్నట్టు భావించింది. అడుగున ఏమున్నదో చూడలేకపోయింది.
తన భూక్యా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తన పైకి అడవి పూలగుత్తులు ఎగరడం లేదు , అదృశ్యంగా ఆమె అడివిలో నడుస్తున్నప్పుడు చెట్లను నరికే గొడ్డళ్ళ చప్పుళ్ళు తమను కోరుకునే స్త్రీల గుండెల్లో ప్రతిధ్వనించడం లేదు. తన అవయవ సంపదను ఛేదిస్తూ వెతికే చూపులు లేవు.
ఆమె ప్రపంచం పాడైపోయింది కమ్లీ తన శరీరాన్ని ఒక లత లాగా భావించింది తనకొక ఆధారం కావాలి. ఆమె తన కళ్ళను మూసుకొని ఊహలలో కొట్టుకుపోయింది. ఒక స్త్రీ హృదయం ఎప్పుడు ఖాళీగా నిదురించదు. కమ్లీ ఆలోచనలో పడింది. హేమ్లా తరుచూ తనను సాలీ ఏది అంటూ అడిగేవాడు. ఒకటి రెండు సార్లు ఆమె అతనిని పరిహాసం చేసింది. కానీ తర్వాత తర్వాత అతనిపై మండిపడింది.
“నేను సాలీకి కాపలా ఉన్నానా ? ఎంత తెలివి తక్కువ ఆలోచన నీది ” అంటూ నవ్వుతూనే కఠినంగా సమాధానం చెప్పింది.
హేమ్లా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయేవాడు. కానీ తరువాత ఆమెలోని స్త్రీ స్వభావం అతనిని గాయపరిచి ఆనందిస్తున్నావని హెచ్చరించింది.
ఆమె ఒంటరిగా కూర్చున్నప్పుడు, కమ్లీకి తను హేమ్లా విషయంలో ఎట్లా ప్రవర్తించింది గుర్తు చేసుకునేది. కానీ హేమ్లా పూర్తిగా సాలీకి చెందిన వాడు. తనకు ఏమీ కాడు. తనకు ఏ సంబంధం లేని మనిషిని ఎందుకు బాధ పెట్టినట్టు. అతడు తనకేమీ నష్టం కలిగించాడు. అతడిని బాధ పెట్టడం వలన పొందిన గౌరవం ఏమిటి ? అని ఆలోచించేది.
కేవలం గల గల పారుతున్న జలపాతాలు, నిశ్శబ్దంగా ఉన్న చెట్లకు మాత్రమే తెలుసు ఆమె పొందుతున్న పరితాపం.
పాపం హేమ్లా ఎంత ఆనందంగా ఉండేవాడు. అతను సంభాషణ మొదలు పెట్టగానే ఆమె ప్రతిఘటించేది. ఆమె హృదయం అతను లేకుండా ఉండలేదు. అతడే ఆమె సర్వస్వం. అటువంటి వాడిని తాను గాయపరిచింది. క్రమంగా ఏ సంబంధం లేదు అనుకున్న మనిషి తన స్పృహను అంతా ఆక్రమించుకున్నాడు.
ఆమె ఆలోచనల్లో జ్ఞాపకాలన్నీ వరదలయ్యాయి. తానున్న ప్రదేశానికి అవతలివైపు ఎవరిదో నీడ నీటిలో కనపడింది. ఫారెస్ట్ అధికారి అడవిలో చాటుకు మాయమైనట్టు అడుగుల చప్పుడు వినబడింది.
సరస్సులో నీటి నుండి లేచి తల తుడుచుకొని బట్టలు కట్టుకొని గట్టుపైకెక్కి ఊరి వైపు దారి పట్టింది కమ్లీ. కొద్ది దూరం నడిచిన తరువాత తను స్నానం చేస్తున్న సమయంలో కొందరు అక్కడ దారిలో భూమాతకు పూజ చేసి దారి మధ్యలో బొమ్మరిల్లు వలె రెండు అడుగుల ఎత్తుతో పూజా స్థలాన్ని ఏర్పాటు చేసి దాని ముందు రకరకాల రంగుల పొడులను చల్లి కోడి గుడ్లను పగలగొట్టి పైన పెట్టారు.
గ్రామంలోని చాలామంది స్త్రీ పురుషులు చాలా వేగంగా వెళ్తున్నారు మంగ్యా తన ఇంటి వరండాలో ఎండలో కూర్చుని ఉండగా, కొత్తగా పెళ్లయిన అతని భార్య అతని తలలో పేలను ఏరుతున్నది. ఊరి మధ్యలో సాధారణంగా అందరూ సమావేశమయ్యే చోట సామ్యా కూతురు, నిశ్చితార్థం జరిగిన అమ్మాయి తన వరుడితో నవ్వుతూ ఒకరినొకరు పట్టుకొని ఉన్నారు. ఆమె వరుని పేరు మిల్కు అతని వద్ద కన్యాశుల్కం గా చెల్లించడానికి డబ్బు లేనందువల్ల మామగారి సమ్మతితో గోటీగా పని చేయడానికి కుదిరాడు. కొన్ని రోజులు పని చేసిన తర్వాత కన్యాశుల్కంగా చెల్లించవలసిన సొమ్ము తీరిపోతుంది. ఆ తర్వాత తన భార్యను తీసుకొని అతడు సంతోషంగా వేరే కాపురానికి సంసిద్ధమవుతాడు.
కుడిమి అనే వ్యక్తి ఇంటిముందు అతని పడుచు భార్య చిరుధాన్యాలను పండించి కర్రతో చేసిన రోటిలో దంచుతూ పిండి చేస్తోంది. ఆమె చేతి గాజులు ముంజేతి కడియాలు అందంగా మెరుస్తున్నాయి. అవును ప్రతి స్త్రీ తనకొక ఇల్లు భర్త కలిగి, ప్రపంచమంతా జంటలు జంటలుగా ఉన్నారు. ఒంటరిగా పెళ్లి కాని వారు మొండి కర్రల వలె శాంతి లేక లక్ష్యం లేకుండా కొట్టుకు పోతున్నారు, అని అనుకుంది కమ్లీ.
గతంలో గ్రామంలోని గిరిజనుల జీవితాలకు సంబంధించిన క్రమత లేని రకరకాల శబ్దాలకు కమ్లీ చిరాకు పడేది. ఏమాత్రం శుభ్రత పట్ల అవగాహన లేని తుంటరి పిల్లలు, కోళ్లు, పందులు. అంతంలేని ముచ్చట్లు. పొద్దున సాయంత్రం పొగతో నిండిన గుడిసెలు. బొత్తిగా ఇష్టం లేని చాకిరి. ఇతరుల గురించి ఏమాత్రం ఆలోచించ లేని జీవితాలు. పొలాల్లో పనిచేస్తున్న కొందరికి పగటి గంజిని మోస్తూ, కొందరి బట్టలను ఉతకడానికి ఉడక పెడుతూ, ప్రతి రాత్రి తాగుబోతు భర్తల కంపుకొట్టే నోళ్ళతో బూతులతో అవమానిస్తూ హింసిస్తూంటే భరిస్తూంటారు. గృహస్తులకు ఉండే ఆశలు కష్టాలు ఇవన్నీ చూస్తూ కమ్లీ పెళ్లి, ఇల్లు కంటే, డార్మిటరీలో ఉండే స్వేచ్ఛ మంచిది అనుకుంది. అక్కడయితే ఏది పొందినా పొందకపోయినా అమ్మాయిలకు తాగుబోతు భర్తలను మామలను సంతోష పరచాల్సిన అవసరం ఉండదు.
*** *** *** *** ***