గ్రామ పెద్ద, పటేల్, మల్సూరు మొదలైన వాళ్ళంతా కలిసి మరొకసారి ఎక్కువ సమయం చర్చించుకున్నారు. ఎదో ఒక రకంగా డబ్బు దొరుకుతుంది భూక్యా డబ్బు చెల్లించలేక జైలుకు పోవడమనే ప్రశ్నే లేదు. అవగాహన లేని గిరిజనులకు అన్ని విషయాల కంటే పెద్ద భయం జైలుకు పోవడం. దీనికంతటికి సమగ్రంగా ఒక పద్ధతి ఉంటుంది. అయితే అందులో బాధితుల ప్రమేయం ఉండదు. అయినా బాధల అంచునే బతుకుతూ ఉంటారు. గిరిజనులకు శ్రమించడం మాత్రమే తెలుసు. నిరంకుశుడైన భూస్వామి వద్ద వేతనం లేకుండా పనిచేయడానికి పుట్టినట్టు శ్రమపడతారు. ఎవరైనా ఒక వేళ జైలుకు వెళ్ళినట్లయితే అతడు నేరస్తుడిగా ముద్రవేస్తారు. ఆ తర్వాత నేరస్తులకు బహిష్కరణ విధిస్తారు. అతణ్ణి సామాజికంగా ఆర్థికంగా అవిటి వాడ్ని చేస్తుంది కాలం. చట్టం ఒకసారి తన వల పన్నిన తరువాత ఎటువంటి దయ చూపదు. దానికంటే వడ్డీ వ్యాపారి వద్ద, ఒక గోటీగా మారి అప్పు తీసు కోవడం మంచిది.
అందుకని భూక్యా, గ్రామ పెద్ద, పటేల్, సోమ్లా కలిసి షావుకారు ఇంటిముందు చేరారు. అదంతా ఒక సుదీర్ఘ ప్రయాణం. భూక్యాకు అది అంతం లేనిదిగా కనిపించింది. డిసెంబర్ నెల అయినప్పటికీ పగటిపూట ఎండ తీవ్రంగా ఉంది. దారిలో ఒక వాగు వద్ద వారంతా ఆగి, సొరకాయ బుర్ర లో ఉన్న కొర్రల గంజి తాగారు. ఆ తర్వాత అదీ ఇదీ అంటూ ఒక క్రమం లేని సంభాషణ కొనసాగింది. సోమ్లా కూడా అందులో పాల్గొన్నాడు. భూక్యా మాత్రం మౌనంగా ఉన్నాడు. అడవి పావురాలు కూస్తున్నాయి. ఎండిన ఆకులు చెట్ల కొమ్మల నుండి నేల పైకి రాలుతున్నాయి. భూక్యా దేనిని పట్టించుకోవడం లేదు. చివరికి వారంతా షావుకారు ఇంటికి చేరారు. అక్కడ ఏది వివరంగా స్పష్టంగా చెప్పనవసరం లేదు.
అప్పుడు దాదాపు మధ్యాహ్నం దాటి నాలుగుగంటలు అయి ఉంటుంది. పరజజాతి గిరిజనులు దానిని సూర్యాస్తమయానికి ముందు చేతి కర్ర ఎత్తున సూర్యుడు ఉన్నాడని అంటారు. వారి ముందు కాయితాలు పరచ బడ్డాయి. భూక్యా బొటనవేలుకు లాంతరు మసిలో నూనెను కలిపి పూసారు. షావుకారు చెప్పిన చోటల్లా దస్తావేజుల మీద వేలిముద్రలు వేశారు. డబ్బు చేతులు మారింది. భూక్యా తన తండ్రి, తమ్ముడి వలెనే షావుకారు వద్ద గోటీగా మారిపోయాడు.
**** *** *** *** ***
రోజులు గడుస్తున్నాయి. అది ఫాల్గుణ మాసం. ఫిబ్రవరి నెల వసంతం వచ్చేసింది. పొలాలన్నీ పంట నూర్చిన తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఆకాశం ఒక్క మబ్బుతునక కూడా లేకుండా శూన్యంగా ఉంది. కొండ శిఖరాలు అన్నీ దాదాపు బోడిగా ఉన్నాయి. అక్కడక్కడ సన్నటి తీగలకు మెరుస్తున్న ఎర్రని చిగుళ్ళు మొలకెత్తుతున్నాయి.
పంట నూర్చిన తర్వాత పొలాలను తవ్వకం పెట్టే సమయం అది. కఠినమైన రాతినేల గట్టిగా ఎండిపోయి ఉన్నది. దానంతట అది పంటకు సిద్ధం కాదు. మనుషులంతా కష్టపడి వారి చెమటను చిందిస్తూ తవ్వకం పెడుతూ దానిని మృదువుగా చేయడానికి బుజ్జగిస్తున్నారు, మళ్లీ పొలాలు చిరునవ్వు నవ్వడానికి.
ప్రతిరోజు సోమ్లా అతని కొడుకులు సూర్యోదయానికి ముందే పొలాలు తవ్వడం మొదలుపెట్టి, ఆకాశం పడమట దిక్కున ఎర్రటి రంగులో సూర్యాస్తమయం జరిగే వరకు తవ్వుతూనే వున్నారు. మధ్యలో మధ్యాహ్నం గంజి తాగడానికి మాత్రం కొన్ని నిమిషాలు పని ఆపుతారు. వారికి ఆ పనిలో తృప్తి లేదు. వారు తవ్వుతున్న పొలాలన్నీ షావుకారువి. కొండ పక్కన నేలలో ఎడ్లతో దున్నటం కుదరదు. మనిషి తన కండరాలతో తవ్వకం పెట్టాల్సిందే. కానీ షావుకారు వద్ద పుష్కలంగా గోటీలు ఉన్నారు పని చేయడానికి. కొండ పక్క పొలాల్లో పంటలు ఎల్లప్పుడూ సమృద్ధిగా పండి షావుకారు ధాన్యాగారం నిండిపోతుంది. రుణగ్రస్త కార్మికుల శ్రమ ఫలితం అది.
భూక్యా తన చేతిలో గునపాన్ని కింద పడేసి పని ఆపాడు. తన ముఖంపై, చాతి పై పట్టిన చెమటను తుడుచు కోవటానికి. సూర్యాస్తమయానికి ఎదురుగా నిలబడిన అతని శరీరం పెద్ద రాతి బండ వలె మెరుస్తోంది చెమటతో. భూక్యా తనకు తాను గోటీగా తన జీవితాన్ని సర్దుకు పోయాడు, మిగిలిన వారి కంటే సులభంగా. ఎందుకంటే అది అతనికి మాత్రమే తెలిసిన నైపుణ్యం కావచ్చు, తన తండ్రి నుండి ఆ అరుదైన లక్షణాలను పొంద గలిగాడు. అతడికి కలిగిన కష్టం నుండి త్వరగా తేరుకొని, మళ్లీ ఉత్సాహంగా ఉన్నాడు. భూక్యా రేపటి గురించి బాధ పడట్లేదు. తప్పకుండా తనకూ ఒక మంచిరోజు వస్తుందని ఆశ అతనిది. గిరిజనులలో ఉండే సహజ లక్షణం ఆశతో జీవించడం. అయితే అతడు ఆ గాయం నుండి పూర్తిగా కోలుకోలేదు. కోలుకోలేడు కూడా. ఆ కొండ ప్రాంతాల్లో జీవించే వారు అక్కడి శిఖరాలను ద్రోణులను ఎత్తుపల్లాలను తమ అస్తిత్వం కోసం భరించాలి. కంటికి కనిపించే దంతా చదునైన మైదానంలా ఉంటుంది అంతే. వందల సంవత్సరాల నుండి ప్రయత్నంతో పరజ జాతి గిరిజనులు భూమాత వలె సహనాన్ని ఓపికను నేర్చుకున్నారు.
భూక్యా చెట్టు కింద కూర్చున్నాడు, తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ.. కొండ ప్రాంతమంతా చురుకైన వసంతకాలపు పిల్లగాలి కొరడాతో మేఘాల దుమ్ము దులుపుతోంది. అప్పుడు ఘాటైన అడవి మల్లె పూల పరిమళం అతనిని చేరింది. అడవి పావురాలు పక్కనే ఉన్న జోడి చెట్టు పై నుండి మృదువుగా పాడుతున్నాయి. దూరం నుండి కొందరు పశువుల కాచే అబ్బాయిలు వేణువుతో కొండ జాతి సంగీతం పాడుతున్నారు. ప్రతి రాగం ఒక దుఃఖంతో ముగుస్తోంది. భూక్యా ఒక చెట్టు మొదలుకు వీపు ఆనించి కూర్చున్నాడు. ఊహల్లో పరిభ్రమిస్తూ, చాలా దూరం కొండలన్నీ దాటి వెళ్ళాడు. ఇంతకుముందు పరిచితమైన చిత్రాలు తేలాడాయి ఆ ఊహల్లో… ఒక చిన్న ప్రవాహం, ప్రశాంతమైన సరస్సు, అందులో అమ్మాయిలు స్నానం చేసి, మట్టికుండలో నీరు నింపు కుంటున్నారు. పొలాలన్నీ రాగులు , అవిసె పంటలతో ఏటవాలు ప్రాంతమంతా ప్రవాహం ఒడ్డున నిండుగా ఉన్నాయి. ఒకరోజు అక్కడ అతను పని నుండి విశ్రాంతి తీసుకుంటూ మధురమైన పరిమళాలను ఆస్వాదిస్తూ ఉండగా, అక్కడ కమ్లీ కనబడింది. ఆమె తలలో ఎర్రటి పువ్వులు ఉన్నాయి ఆమె చీర మోదుగు పూల రంగులో ఎర్రగా ఉన్నది. ఆమె పెదవులు ఎర్రటి రేగు పళ్ళ వలె ఉన్నాయి. ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం ఇప్పపూల వాసనకంటే పిచ్చెక్కించేస్తోంది. ఆమె నవ్వుతున్నపుడు ఆమె కళ్ళు నవ్వుతూ అతనికి సైగ చేస్తూ, మూతిసాగదీసి వెక్కిరించింది.
ఖాళీగా ఉన్న కొండల పక్కన చాలా సేపటి వరకు భూక్యా చెట్టు కింద కూర్చున్నాడు. తొడలను దగ్గరగా నొక్కుకొని, మోకాళ్ళు గడ్డం కింది వరకు మలచుకొని, వాటి చుట్టూ రెండు చేతులు చుట్టుకొని కూర్చున్నాడు. అతడు చలనం లేకుండా గ్రామం మధ్యలో నిటారుగా ఉన్న స్మారక చిహ్నం వలె కూర్చున్నాడు. కాలం ఆగిపోయింది. అతని కల చెదిరింది. కొండ ప్రాంతమంతా చీకటిగా మారింది. భూక్యా నిశ్శబ్దంగా లేచి భుజంపై పలుగు పార పెట్టుకొని, కాళ్ళీడ్చుకుంటూ షావుకారు ఇంటివైపు నడిచాడు.
ప్రతి రాత్రి షావుకారు తన గోటీలను అందరినీ పిలిచి, వారికి రేపు చేయవలసిన పనులను అప్పగిస్తాడు. అతడికి అరవడం, నస పెట్టడం అంటే ఇష్టం. అలా చేస్తే గోటీలు అతనితో వాదన మొదలుపెడతారు, అది అతనికి ఆనందాన్నిస్తుంది.
సోమ్లానుద్దేశించి “ఓ మూర్ఖుడా ఇటు విను, నువ్వు ఏ పనినైనా సరిగా చేయగలవా” అని అరిచాడు.
” నీవు చెప్పిన పనులన్నీ పూర్తి చేశాను కదా! షావుకారు” అని సోమ్లా గొణిగాడు.
“మంచిది ఎన్ని రోజులు పడుతుంది నీకు, ఆ దాన్యం కొట్టు నిర్మించడానికి” అన్నాడు షావుకారు.
“అది నా తప్పు కాదు, నన్ను ఒక పని నుండి మరొక పనికి తరుముతూనే ఉన్నారు. నాకు ఆ పని పూర్తి చేయడానికి సమయం ఎక్కడ ఇచ్చారని, ఒకరోజు ‘సోమ్లా వరి పొలంలో కలుపు తియ్యి’ అంటారు. మరొక రోజు ‘ సోమ్లా అడవికి పోయి పొయ్యిల కట్టెలు తే’ అంటారు లేదా ‘పొలం దున్ను పో’ అంటారు. ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాను. నాకు సమయం ఇచ్చినట్లయితే, వీలైనంత త్వరగా మీరు కోరుకున్నట్టు ఎత్తయిన ధాన్యపు కొట్టు నిర్మిస్తాను” అన్నాడు సోమ్లా.
“సోమరి ముసలి ఎద్దా! ఎదురు సమాధానం చెప్పబోకు” అంటూ షావుకారు గట్టిగా అరిచాడు. “గోదాము ఈ నెలలో పూర్తి కావాలి. టిక్యా నీవు కూడా ఆ పని దగ్గరికి వెళ్ళు” అన్నాడు.
సోమ్లా సమాధానం చెప్పలేదు.
“నా మంచం తాళ్ళను బిగించ మని చెప్పాను కదా! సోమ్లా నీకు ఏది గుర్తు ఉండదు. ఇంకా ఈ సంవత్సరం చెరుకు పంట వేయబోయే పొలం చుట్టూ కంచె వేయమన్నాను. ఇటువంటి ఉపయోగంలేని ముసలి వాడితో నేనేం పని చేయించగలను. రోజంతా కూర్చుని ఎద్దులా నెమరువేస్తూ, ఆకలితో ఉన్న కుక్కలా గుర్రు మంటాడు” అన్నాడు షావుకారు.
ఆ సమయంలో రుణగ్రస్త కార్మికులందరూ అలిసిపోయి ఉన్నారు. సమాధానం చెప్పదలచుకోలేదు. వారి తలలను చేతుల పై వేలాడేసుకుని, షావుకారి అరుపులను, చెప్తున్న గొప్పలను, తిడుతున్న బూతులు వింటున్నారు.