గిరిజన పురోహితుడు వచ్చేసరికి నాట్యం మొదలైంది. నిర్దేశించిన ప్రకారం పూజ మొదలై, కొనసాగుతోంది. పెద్ద మంట కోసం పెట్టిన కట్టెల కుప్ప ముందు నల్ల కోడి పుంజును కోసారు. ఆ రక్తాన్ని భూమిలోకి ఇంకిస్తున్నారు. వేడి వేడి తాజా మాహువాపూల(ఇప్పపూల) సారాయిని కూడా రక్తంలో కలిసేట్టు గుమ్మరించారు. అది భూమాతకు చేసే తర్పణము. పూలను సమర్పించారు. తర్వాత రక్తంలో తడిసిన కోడిపుంజు కట్టెల కుప్ప మీద ఆనించి కొన్ని పూలను చల్లారు. కట్టెల మీద ఇంకా కొంచెం సారాయిని పోసి, ఒక్కసారిగా కేకలు డప్పుల మోతలతో కట్టెలు చిటపటలాడుతూ మండుతున్నాయి. డుంగుడుంగావాయిద్యాల మోతలు అధికమయ్యాయి. యువతులంతా ఒకరి చేయి మరొకరు పట్టుకుని పొడవైన గొలుసు వలె అమ్మాయిలు ఆ మంట చుట్టూ మెలికలు తిరుగుతూ మెలికలు తిప్పుతూ గుండ్రంగా తిరుగుతున్నారు. వారు ఆ వెలుతురులో కొత్తగా మెరుస్తున్నారు. వారి ఎర్రని ముఖాలపై వెలుగు ప్రతిబింబిస్తూ ఉన్నది. సంగీతం పెరిగిన స్థాయికి అనుగుణంగా నాట్యం వేగాన్ని అందుకుంటుంది. యువతులు యువకులు పాటకు కోరస్ గా పాడుతున్నారు. ముందు అనుకున్నట్టు ఒక సంకేతంతో ఒక్కసారిగా పాట ఆగిపోయింది. డబ్బులు మరొకసారి తమ కొత్త లయలో మోగిస్తున్నారు మరో బృందం కోరస్ అందుకుంది.
డాంగ్డి! డాంగ్డా!
అమ్మాయిలు అబ్బాయిలు
కలిసి రండి”
డాంగ్డీ డాంఢ్డా , డాంగ్డీ డాంగ్డా అంటూ డోళ్ళు వేగంగా మరింత వేగంగా మోగుతున్నాయి. నిషాలో యువతులు సంతోషంగా పెద్దగా కేకలు పెడుతూ డుంగుడుంగా ఝంకారానికి అనుగుణంగా పాడుతూ ఆ రాత్రంతా నాట్యం చేశారు.
అర్ధరాత్రి సోమ్లా లేచి పరుపు బండ మీద కూర్చున్నాడు. చుట్టు చూసుకున్నాడు దాదాపు మంట ఆరి పోయింది. బూడిదలో మెరుస్తున్న నిప్పు మిణుగురులు మిణుకు మిణుకు మంటున్నాయి. ఎక్కడబడితే అక్కడ గుంపులుగుంపులుగా జనాలు నేల మీద చచ్చేట్టు తాగి పడి ఉన్నారు. ఆ సమయంలో పండుగ నిశ్శబ్దాన్ని చేరుకుంది. కానీ మళ్ళీ వెలిగించ బడతాయి మరొక ఊరిలో మరో కొండ ప్రాంతంలో. పండుగ కొనసాగుతోంది అత్యంత ఆకర్షణీయంగా అనేక దఫాలుగా ఆ నెల పొడుగునా వేడుక జరుగుతుంది. కానీ సోమ్లాకు మాత్రం అంతా అయిపోయింది. ఇంకొక రోజులో అతను తిరిగి షావుకారు వద్దకు వెళ్లాలి.
మరుసటి రోజు వేడుకల బాధ్యత పిల్లలు తీసుకుంటారు. వారు స్వయంగా బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి తిండి గింజలను అడుగుతారు విందు కోసం. ప్రతి పిల్లవాడు ఒక చెంప నల్ల రంగు మరో చెంప తెల్ల రంగు పూసుకుని ఉంటాడు. వారి బట్టలు కాళ్లు చేతులు రకరకాల రంగులు పూసుకుని ఉంటాయి. చేతిలో చిన్న చిన్న కర్రలతో ప్రతి ఇంటి ముందుకు వెళ్లి నేలను కొడుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు.
“చర్ చర్రా చర్ చర్రా
మాకు కొంత డబ్బులు ఇవ్వండి
ఒక కట్ట చొప్ప ఇవ్వండి”
అని పాడుతూంటే ఇంటి యజమాని లేదా అతని భార్య బయటికి వచ్చి చూసి నవ్వుకుంటూ వెళ్లి చేతినిండా బియ్యం లేదా ధాన్యం తెచ్చి వారి వద్ద ఉన్న బాదం గిన్నెలు వేస్తారు. ఆ గుంపు మరో ఇంటి వైపు సాగుతోంది వీధుల్లో.
డోంబ్స్ అంటే వృత్తి సంగీతాన్ని డ్రమ్ములు వాయించడమే వృత్తిగా కలవాళ్ళు. ఇంకా డోలు వాయిస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు ఉన్నట్టుండి యువకుల గుంపు ఊగుతూ నాట్యం చేస్తుంది. మద్యం ఏరులా పారుతుంది. పురుషులంతా ముచ్చట్లు పెడుతూ ఉంటే, స్త్రీలు పాటలు పాడడం నవ్వడం చేస్తుంటారు. అమ్మాయిలు నృత్యాలు చేస్తారు. సాయంత్రం డోళ్ళ శబ్దం వినపడింది. పక్క ఊరు సరసుపదార్ నుంచి మరో రాత్రి వినోదానికి సిద్ధపడతోంది. అప్పుడు వారు ఏమాత్రం పొలాల్లో పని చేయరు. వారికి జీవితం అంటే అంతంలేని వేడుకల సమాహారం.
………
కొద్ది రోజుల ముందే పండుగ మొదలవుతుందని దూరదృష్టితో భూక్యా మద్యం అవసరాన్ని అంచనా వేశాడు. దాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఊరికి దూరంగా లోయల్లో బట్టీలను సిద్ధం చేశాడు. ఆ ప్రదేశం తొంగి చూసినా కనిపించనంత రహస్యంగా ఉంటుంది. సారాయి కాచి అమ్మడమనేది చట్ట విరుద్ధమని అతనికి తెలుసు. కొండ ప్రాంతాల్లో సారా అమ్మాలంటె లైసెన్సులు రెవెన్యూ అధికారులు ఇస్తారని అందరికీ తెలిసిందే. అయినా గిరిజనులు అందరూ సొంతంగా సారాయి కోసం బట్టీలు పెడుతూనే ఉంటారు.
అడవిలో భూక్యాకు ఇష్టమైన ప్రదేశంలో సారా బట్టీలు పెట్టాడు. అక్కడ ఒక లోయ చీకటి గుహగా మారింది. రెండు కొండల మధ్య సన్నని సెలఏరు పారుతూ ఉంటుంది. దాని గుండా రకరకాల అడవి మొక్కలు పెరుగుతాయి. సెలయేటి రెండు గట్ల మధ్య పెద్ద వేర్లతో అల్లుకున్న వల వాగుపైన పరచుకున్నది. ప్రవాహ వేగాన్ని అడ్డుకుంటూ, నీరు వాటిమీద దుముకుతూ పోతోంది అక్కడ. కొండలు తమను రక్షిస్తున్న రాజులు అనుకున్నాడు భూక్యా.
బట్టీలలో సారాయి కాచే పద్ధతి చాలా సులువు . అతి తియ్యని మాహువా పూలను భూక్యా చాలా ఎక్కువగా సేకరించాడు. అడవిలో విస్తారంగా పెరిగే చెట్ల నుండి సేకరించిన ఇప్పపూలను పెద్ద పెద్ద మట్టి బానల్లో మూతపెట్టి అవి మురిగిపోయే వరకు
నానపెట్టాడు. ఆ తర్వాత ఆ కుండను పెద్ద గాడి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించాడు. దాని మీద మరొక మట్టి పాత్రను మూతగా ఉంచాడు. దాని అడుగు భాగంలో ఒక మట్టి గొట్టాన్ని అమర్చాడు. భూక్యా తన బట్టీని సెలయేటి పక్కనే ఏర్పాటు చేశాడు చాలా తెలివిగా.. సెలయేటి చల్లదనం విప్పపూల పానకం ఉడికే ఆవిరిని పట్టేపాత్రను చల్లబరిచేట్టు అమర్చాడు. ఒక ఎదురు బొంగును తీసుకొని ఒక చివర వాగులోకి రెండవ చివర అవిరికుండకు తగిలేట్టు పెట్టాడు. ఉడుకుతున్న మాహువా పానకం ఆవిరి మరొక పాత్రలోకి చేరి సెలయేటి చల్లగాలికి శీతలీకరణ చెంది సారాయిగా మారేది.
గ్రామంలో మిగిలిన వారంతా పండుగ హడావుడిలో ఉండగా, భూక్యా మాత్రం మద్యం బట్టీనికాస్తూ ఉన్నాడు. అతడు రోజంతా కష్టపడుతూనే ఉన్నాడు. ఇంటికి రావడం కూడా చాలా తక్కువ చేశాడు. సమయం వృధా అవుతుందని. ఇప్పుడు అనేక డబ్బాల మద్యం తయారుచేసి లోయలో దాచిపెట్టాడు. పండుగ సమయంలో దానిని అమ్ముతాడు. సంత రోజున దానిని అమ్మడం చాలా సులభం. మద్యం లేకుండా వారి పండుగ తంతు లేవి ముగియవు. గిరిజనులందరికీ మద్యం చాలా అవసరం. కేవలం భగవంతుడి కోసమే కాదు, వారి పేదరికాన్ని, ఆకలిని మర్చిపోవడానికి కూడా. మాహువా పూలతో చేసిన మద్యం శరీరంలోకి చేరగానే ప్రతి గిరిజనుడు. తానే ఆ అడవికి రాజుగా భావించుకుంటాడు. లేదంటే తనకు తాను బలహీన దయనీయ ప్రాణిగా, ఏ అర్హత లేని అధికారులను, వడ్డీ వ్యాపారులను ప్రాధేయ పడుతూ ఉంటారు.
భూక్యా బంగారు నిధిని పొందినట్టు ఆనందం పొందాడు. అతని మట్టి కుండలు వెదురు బొంగు అతనికి కన్యాశుల్కానికి అవసరమైన రూపాయలను ఇవ్వగలవు అనుకున్నాడు. కన్యాశుల్కం చెల్లించి కమిలీని ఇంటికి తెచ్చేందుకు అతడు బట్టి దగ్గర ఉడికిపోతూ, మరికొన్ని విప్పపూల కుండల్లో వేస్తూ కమిలీని గుర్తు చేసుకున్నాడు. అవును ఆమె కోసమే ఇదంతా చేసేది . వీలైనంత త్వరగా డబ్బు రాగానే అతడు ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నాడు. భూక్యా ఆలోచనలు అందరి గిరిజనుల లాగా వసంతోత్సవాన్ని గురించి లేవు. అతని ఆసక్తి ఆలోచనలు కమిలి ఊహలతో మనసంతా నిండిపోయింది.
అడవిలో గిరిజనులకు ఆరువేల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. భూక్యా అంత డబ్బును లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూన్నాడు. దాని కోసం ఇంకా ఇంకా కష్టపడతున్నాడు. ఒక్కసారిగ తానే బట్టిగా మారినట్టు పని చేస్తున్నాడు. తన బట్టి పక్కన నిలబడి చాలా విసుగ్గా సారా కుండల వైపు చూస్తున్నాడు. అతని కళ్ళు పొగతో మండుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ డబ్బును చూడనట్టు ఆరాటపడుతున్నాడు. ఇంతకీ అతడు గతంలో కొంత డబ్బు దాచాడు. కానీ అది ఇద్దరు చెల్లెళ్ళు, దయ్యాలు సాలీ, మాలీలకు చీరలు కొనేందుకు. వారికి చీరలు కొనకపోతే మనశ్శాంతితో ఉండనివ్వరు. చీరలు కొనిస్తానని వారికి ప్రమాణం చేశాడు. ఇంకా కొన్ని కుండల మధ్యం సేకరించినట్టయితే, ఆ గిరిజన ప్రాంతమంతా తాను కాచే మధ్యంతో నిండిపోతుంది. కానీ ఇప్పుడు ఆ పని చాలా నెమ్మదిగా జరుగుతుంది. అతడి పక్కనే మరొక యువకుడు సారా బట్టీని పెట్టాడు. ఇంకొక మూడు బట్టీలు అడవిలో వేరు వేరు చోట్ల వెలిసాయి.
అరువేల రూపాయలలో ఇప్పుడు తన దగ్గర ఎంత ఉన్నది అని లెక్క పెట్టాడు. పదిహేను వందలు ఇంకా అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. అతడు గాలెన్ల కొద్దీ మద్యం అమ్మినాడు ( గాలెన్ అంటే 4.55లీటర్లు). పండుగ రోజు రాత్రంతా పని చేశాడు. అతని వద్ద సహాయకులుగా ఉన్న ఇద్దరు మద్యం కోసం మళ్లీ మళ్లీ అతని వద్దకు పరుగులు పెడుతూనే ఉన్నారు. ఇటువంటి పండుగ మరొకటి ఉండదన్నట్టు ఆనందంగా ఉన్నాడు భూక్యా. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు తన తండ్రి తమ్ముడు టిక్యాలాగా తనకు తెలిసిన చాలామంది లాగా గోటిలుగా మారవలసిన పని లేదు. కానీ ఎట్లా అనుకుంటూ.. “రండి అబ్బాయిలూ.. మళ్ళీ పనిచేద్దాం రండీ..” అని పిలిచాడు.
భూక్యా ఇంతకుముందు ఎప్పుడూ చూడని పది పదకొండు మంది మనుషుల గుంపు ఆ లోయ ప్రాంతపు మసక చీకటిలో పండుగ మరుసటి రోజు వచ్చారు. తన పనిలో నిమగ్నమైన భూక్యా వీపు వారి వైపు ఉన్నది. అప్పుడు తన వద్ద పనిచేస్తున్న అబ్బాయిల ముఖాల్లో భయాన్ని గమనించాడు. వెంటనే వెనక్కు తిరిగాడు అక్కడ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ నలుగురు గార్డులు ఇంకా ముగ్గురు నలుగురు ఇంతకుముందు ఎప్పుడూ చూడని వారు ఉన్నారు. వారితో పాటు భూక్యా గ్రామానికి చెందిన చమన్ డోంబ్ ఉన్నాడు..
*** *** *** *** ***