ఒడిపిళ్ళు -15 వ భాగం

ధారావాహికం

అది పండుగ రోజు ఉదయం, జనాలు వేకువనే నిద్ర లేచారు. పళ్ళు కిటకిటలాడే చలిలో వీధిలో కొచ్చారు. సూర్య కిరణాలు ఊరు చుట్టూ కమ్ముకున్న పొగమంచును జల్లెడ పడుతున్నాయి. కానీ అటువంటి చలిలో కూడా మంచు కురిసే ఉదయంలో చాలా ఆశలతో ఉత్సాహంగా ఉన్నారు వారు. పురుషులంతా రాగి అంబలి తిని అడవి నుండి పండుగ మంటకు కావలసిన కట్టెలను తెచ్చేందుకు బయలుదేరుతున్నారు. ఆ మంట రాత్రంతా వెలగాలిసి ఉంది మరి.

యువతులంతా నిద్ర లేవగానే, రంగు రంగుల ముగ్గులు వాకిళ్ళలో, గోడల మీద చిత్రించడంలో మునిగిపోయారు. కనీసం ముఖం కడుక్కోడానికి కూడా ముగ్గులు వేయడం ఆపట్లేదు. తెలుపు పసుపు రంగులతో గోడలన్నీ అలికారు. వరండాలని నలుపు పసుపు రంగులతో. ఉల్లాసం కలిగించే డిజైన్లను చిత్రించారు. వరండాలో

గోడల మీద బియ్యం పిండిని నీటిలో కలిపి రంగులతో ముగ్గులు వేశారు. చివరికి గుడిసె లోపల నేలంతా రంగులతో నింపారు. తలుపులు కిటికీలు దర్వాజాలకు బొగ్గు పొడి నూనెలో కలిపి పూసారు. అక్కడి చిన్న చిన్న గుడిసెలు కూడా నవ వధువుల వలె మెరుస్తున్నాయి.

కొందరు స్త్రీలు బట్టలుతికేందుకు కట్టెల బూడిద కలిపి ఉడికిస్తున్నారు. కొందరు మరింత తెల్లగా అయ్యేందుకు బలంగా బండకేసి బాదుతున్నారు అన్ని మరకలు పోయేందుకు. తర్వాత తమ వంతుగా స్నానం చేసి తలలను అలంకరించుకున్నారు. చివరిగా చేతికున్న భారీ ఇత్తడి గాజులను రుద్ధి రుద్ది మెరుగు పెట్టడం చేశారు. మధ్యాహ్నం అయ్యే లోపు వాటిని మెరిసేలా రుద్ధి తృప్తి పడ్డారు. ఆ తర్వాత అందమైన రంగుల చీరలు మడత పెట్టి, బిగుతుగా నడుము చుట్టూ మోకాళ్ళు దాటకుండా కట్టారు. తర్వాత తాజా పూలను వెతికి కొప్పులో ధరించేందుకు గుంపులుగా అడవిలోకి అదృశ్యమయ్యారు. గిరిజన యువతులు తలలో పూలు లేకుండా నాట్యం చేయరు.

సాలీ మాలీ కమిలీ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కొండ కింది అడవిలో ఇరుకైన వంకరటింకర డొంకల్లో నడుస్తున్నారు సరదాగా. నెమలి పిట్టల్లా గిరిజనులకు మాత్రమే తెలిసిన నడకతో జారుతున్నట్టు నడుస్తున్నారు. గిరిజనేతరులకు మరెవ్వరికీ  ఆ నడక రాదు. వారి కదలికలు కచ్చితంగా స్థిరంగా ఉండి, ఒక రాతి నుండి మరొక దానిపై కాళ్ళు ఆనిస్తూ, ఇరుకు సందుల్లో కొండచరియల మీదనుండి జలపాతం దుమికినట్లు ఉంటుంది ఆ నడక. దారిలో నదీ ప్రవాహం మరీ వెడల్పుగా ఉండి దూకడానికి వీలుగా లేకపోతే, నీటిలోకి దిగి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ వెళ్తారు. మిగిలిన అమ్మాయిలు కూడా అడవిలోకి నడిచారు.. కొందరు వంటరిగా, మరికొందరు గుంపులుగా . వారి అరుపులు నవ్వులు ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక్కసారి వారి బృందగానంతో ఘనీభవించిన నిశ్శబ్దం చల్ల గాలిలో కలిసిపోతుంది. వరి పంటలో ఆఖరి కంకులు వేలాడుతూ.. తలలూపుతూ.. కనిపించని గాలి పాడుతున్న శ్రావ్యమైన పాటకు తిరిగి పాడుకుంటున్నాయి.

కొద్ది దూరంలో ఒక కొండ నిటారుగా ఉంది. కొండ అడుగు నుండి ఒక లోయ చివర, కొండ చరియ అంచున ఒక చేతి కర్ర పై వాలి టిక్యా నిలబడి చీకటికి సహచరుడిలా ఉన్నాడు. నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న సెలయేరు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నది. నీటి గర్జన టిక్యాలోని ఉద్రేకం వలె పైకి కిందికి ఊగుతున్నది. హింసాత్మకంగా గుహలో దట్టమైన చీకటిలా ఎదిగాడు. మృదువుగా గుంతలు పడి ఉండే శరీరం ఇప్పుడు దృఢంగా నిటారుగా మారింది. చేతులు భుజాలు కండరాలతో ఉబ్బి ఉన్నాయి. అతడి మెడ తిప్పినప్పుడు ఆ ప్రాంతంలో నరాలు ఉబ్బి అతని దృఢత్వాన్ని చాటుతున్నాయి. కొత్త కోరికల అవగాహన కలిగేంతగా అతను ఆరోగ్యంగా వయస్సుకొచ్చి ఉన్నాడు.

గ్రామమంతా ఎక్కడ చూసినా పండుగ ఏర్పాట్లలో ఉన్నారు. రాత్రికి జరగబోయే ఉత్సవానికి అందరూ పనుల్లో మునిగి ఉన్నారు. సూర్యాస్తమయం అవుతుండగా, అడవికి వెళ్ళిన మొదటి బృందం స్త్రీ పురుషులు తిరిగి వచ్చారు. రాత్రికి ఆరకుండా మండే మంట కోసంచేతుల నిండా కట్టెలను తీసుకొని వచ్చారు వాళ్ళు. ఏదో కొత్త శక్తి తమను ఆవహించినట్లుఅందరి కళ్ళలో మెరుపు కనపిస్తున్నది. మద్యం గ్లాసులు అంచుల వరకు నింపి ఉన్నాయి. భూక్యా అతని అనుచరులు అడవిలో సారా బట్టీల వద్దే రాత్రి ంబవళ్ళుచాలా కష్టపడుతున్నారు. ఎవరికీ మద్యం కొరతతో గొంతు ఎండి పోవద్దని వారి ప్రయత్నం. అట్లా అయితేనే పండుగ మంట చుట్టూ రాత్రంతా గట్టిగా పాడుతూ ఆడుతూ తిరగ గలరు. కొందరు మగవాళ్ళు పూలు పండ్లతో ఉన్న సన్నని పొడవైన అడ్డాకుల తీగలను చెక్కుచెదరకుండా తెచ్చి ఇంటి ముఖ ద్వారాలు తగిలిస్తున్నారు. ఆ తీగలకు ఏదో మంత్ర శక్తి ఉన్నదనీ.. వారి దురదృష్టాన్ని దుష్టశక్తులను తరిమివేసి వారిని కాపాడుతుందని నమ్ముతారు వారు. ఊరి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో కుప్పగా పేర్చిన కట్టెలతో పండుగ మంటను తయారు చేశారు.

సోమ్లా తన వంతు కట్టెలను పోగు చేశాడు. కానీ అతని మనసు పండుగ వాతావరణంలో లేదు. అతడు ఒక బానిస, అతనికి ఇల్లు లేదు, కుటుంబం లేదు, అన్ని ఆనందాలు పోయాయి. ఈ వేడుకలు చేసుకోవడం, పాటలు పాడడం, వెక్కిరిస్తున్నాయి అతనిని. రోజంతా గుడిసె ముందున్న పరుపు బండ మీద కూర్చుని ఉన్నాడు. ఒకప్పుడు పనిలో అలసిపోయినప్పుడు మాత్రమే అక్కడ విశ్రాంతి తీసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ లేరు తన బాధలను, భావాలను పంచుకునేందుకు. అతని పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు, కష్టసుఖాలు వారికి తెలియవు. ఇప్పుడే నాటిన విత్తనాల వంటి వాళ్లు తన పిల్లలు. వారిని అభివృద్ధి కోసం కృషి చేయాలి, పుష్టిగా పెరిగేందుకు ఆధారం అవసరం వారికి.

సాలీ హేమ్లా గురించి కలలు కంటున్నది. మాలీ ఇంకా ఎవరిని ఎంపిక చేసుకోలేదు. కానీ ఊహలు యువకుల దేహపుష్టి, తన జోడి కోసం ఆలోచింపజేస్తున్నాయి. ఆమె పేరును పదేపదే ఉచ్చరిస్తూ డుంగుడుంగా ధ్వని వెంటాడుతుంది. టిక్యా ఇంకా చిన్నవాడే, కేవలం పురుష లక్షణాలు, నూనూగు మీసాలు కనిపిస్తున్నాయి. భూక్యా మాత్రం వయసుకు మించిన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఏ సాయం అందించే వారు లేక నిర్లక్షానికి లోనవుతున్నాడు.

సోమ్లా తన షావుకారు ఇంటికి వెళ్లేప్పుడు అంతా సవ్యంగా ఉన్నది. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇంటి ముందు చేపల వల అక్కడే పడి ఉన్నది. సగంలో ఆపిన సారా బట్టి పగిలి అట్లనే దొర్లుతుంది. తను ఎట్లా వదిలి వెళ్ళాడు అదే తీరులో అంతా… పాత కర్ర మంచం సరి చేయలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో వంట ఇంటి పెరటి తోట పొడవైన చిక్కుడు కాయలతో నిండి ఉండేది. కానీ ఈసారి తీగలు సగం ఎండిపోయాయి. ఇంకా అద్వానంగా వరి పంట పూర్తిగా కోసి నూర్చలేదు. డిసెంబర్ నెల పూర్తయి పోతున్నా కూడా. భూక్యా పంటను నూర్చాడు కానీ ధాన్యాన్ని సరిగా జాగ్రత్త చేయలేదు. మట్టి పాత్రలు అన్నీ మూతలు తీసి ఉన్నాయి. చిరుధాన్యాలను ఎలుకలు తింటున్నాయి. భూక్యాను చూస్తే అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఏముంది వేడుక చేసుకోవడానికి? అనిపించింది సోమ్లాకి.

సాయంత్రం అవగానే ఒక్కసారిగా “దొంగా దొంగా..” అంటూ వినపడ్డాయి. వేడుక మొదలైందని చెప్పే గుర్తు అన్నమాట. ఆచారం ప్రకారం ఒక యువకుడు ఎవరో ఒకరి ఇరుగుపొరుగు ఇంటి తలుపు పగలగొట్టి ఏదో ఒక వస్తువు తన చేతిలో పట్టేంతది ఎత్తుకు వస్తాడు. ఏదో ఒకటి నీళ్ళ బిందె కానీ పెరటి తోటలు బుట్టెడు కూరగాయలు కానీ ఏదైనా కావచ్చు. ఇదంతా ఒక ఆట తర్వాత రోజు దొంగిలించబడిన వాటిని నామ మాత్రపు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చేస్తారు.

సాయంత్రం భోజనం వండుకొని తిన్నారు అందరూ. ఇప్పుడు పండుగ మంట వెలిగించడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యువకులంతా ‘డుంగుడుంగా’ వాయిద్యాలతో అక్కడికి చేరారు. మొదటి ధ్వని కోరస్ గా వినపడింది. యువతుల అంతా చక్కగా పూలతో గాజులతో అలంకరించుకుని అర్ధచంద్రాకారంలో ఒకరి చేతులు ఒకరు పెనవేసుకొని నిలబడ్డారు. ఎత్తైన యువతి ఆ వరుసలో ఒక చివర ఉన్నది. వారి ముఖాలకు నూనె పసుపు పులుముకొని ఉన్నారు. బిగువైన వారి శరీరాలు లయబద్ధంగా ముందుకు వెనుకకు కదులుతున్నాయి. పండగ మంట వెలుతురుతో యువతుల వేగం పెరిగింది చిన్నచిన్న మంటలు ఒక పెద్ద వృత్తాకారంలో వెలిగించారు. వారి చుట్టూ నాట్యాన్ని చూసేందుకు వీలుగా.

అప్పుడు జోడియ తెగ నాట్యం చేయడం మొదలు పెట్టింది. ఆచారం ప్రకారం యువకులు నాట్యం చేయమని యువతులను ఆహ్వానించాలి. అది వారి ప్రత్యేక హక్కు మరియాదతో విన్నపం పాట రూపంలోనే జరుగుతుంది. అప్పుడు యువకులు “గాజుల ఘర్షణ”గా పిలవబడే నాట్యాన్ని చెయ్యమని యువతులను పాటతో ఆహ్వానించారు..

ఆ పాట

“నీ చేతి గాజులు ఒకదానితో ఒకటి మోగనీ

నీచేతి గాజులను ఘర్షణ పడనీ

ఓ నా ప్రియమైన చిన్నదానా

మనమంతా కలిసి

ఈ ‘గాజుల ఘర్షణ నాట్యం’ చేద్దాం

గతంలో మన తండ్రులు చేశారు

దాన్ని మళ్లీ మనం చేద్దామురా

ఈ పురాతన గ్రామం

నీ చేతి గాజులు శబ్దాలతో

ప్రతి ధ్వనించనీ

మీ ఊరి మామిడి పండు కోసం

మీ ఊరి నేరేడు చెట్టు కోసం

నువ్వు ఏదంటే దానికోసం

మనమంతా ఆడుదాం వేడుకగా

కడుపు నొప్పి వచ్చే వరకు నవ్వుదాం”

అని పాడారు

అప్పుడు యువతులు తమ భారీ ఇత్తడి గాజులు తెచ్చి, ఒకదానితో ఒకటి కొడుతూ, డుంగుడుంగా వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేశారు. అడవి ఆత్మ మేల్కొంటుందప్పుడు, ఆ వాయిద్యాల నాట్యంతో అక్కడి నేల కంపిస్తుంది. జోడి, పరజ తెగవారి తరతరాల నాట్యాలు పునరావృతం కాగా, మరోసారి గతంలో మోగినట్టుగా..  తరతరాలుగా మోగుతున్నట్టుగా  మళ్ళీ ఆ ఉత్సవ సమయం ప్రతిధ్వనిస్తుంది.

“తాజా గాలిలో విషం లేదు

నమ్మకం ఒక్కటే ఉన్నది

ఏ దోమలు మన రక్తాన్ని పీల్చవు

ఏ పాములు మన కాలి మడమలపై

కాటు వేయవు

అపరిచితులు ఎవరైనా అడవిదారి నడిచినా

జోడియా భుజాలపై

వారి బాధ్యతలు తప్ప మరే బరువులు లేవు అంతిమ ఘడియల్లో

తమ నేలపైనే పడి మరణిస్తారు

మరెవ్వరూ మన నేలను ఆక్రమించరు

ఇక్కడి నేలపై కొండలు లోయలు ఈ భూమంతా గిరిజనులదే మరెవరిది కాదు ”

బృందగానం సాగుతోంది..

*** *** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

యూరోప్ ట్రిప్ – 14